విక్రమ బేతాళ కథలు - సిద్ధుడిచ్చిన పండు

Vikramarka explains Betal who is responsible for the man becoming Ghost. Best Telugu Vikram Betal Stories to read.

విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా స్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీవు తలపెట్టిన ఈ కార్యం మంచిదో చెడ్డదో నాకు తెలియదు గాని, ఒక్కొక్కసారి చెడ్డ పని చేయటానికి కూడా ధర్మ సందేహం అడ్డు తగులుతుంది. అందుకు తార్కాణంగా నీకు సిద్ధవరదుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను," అంటూ ఈ విధంగా చెప్పసాగాడు: పూర్వం భార్గవ శర్మ అనే ధనిక బ్రాహ్మణుడుండేవాడు. ఆయన భార్య పేరు నాగవేణి. వారికి చాలా ఏళ్లుగా సంతాన ప్రాప్తి లేకపోయింది. తనకిన్ని నీళ్లు వదిలి, పుంనామ నరకం నుంచి రక్షించే కొడుకు లేనందుకు భార్గవశర్మ, తన గొడ్రాలితనం పోగొట్టి, తనకు ఆనందం చేకూర్చేటందుకొక నలుసు లేనందుకు నాగవేణి ఎంతో చింతించారు. 

ఇలా ఉండగా ఒక నాడు ఒక సిద్ధుడు వారుండే నగరం గుండా వెళుతూ భార్గవశర్మ కంటపడ్డాడు. అప్పుడు భార్గవశర్మ ఆ సిద్ధుడికి తన స్థితి తెలుపుకుని తనకు సంతాన యోగం ఉందేమో చూడమన్నాడు. సిద్ధుడాయన చెయ్యి చూసి, "నాయనా, సంతానం కోసం ఎందుకలమటిస్తావు? నీకీ జన్మకు సంతాన ప్రాప్తి లేదు. దాన ధర్మాలు చేస్తూ ఈ జీవితం హాయిగా గడిపెయ్యి," అని చెప్పాడు. "స్వామీ, ఘటనా ఘటన సమర్థులైన మీ బోటి వారు తలుచుకుంటే జాతకాలు కూడా మారిపోతాయి. నాకొక్క కొడుకు కలిగే మార్గం చెప్పాలి," అన్నాడు భార్గవశర్మ. సిద్ధుడు సరేనని ఒక మామిడి పండు తెప్పించి, దాన్ని మంత్రించి భార్గవశర్మకిచ్చి, "దీన్ని భుజించిన వారికి సకల సద్గుణ సమన్వితుడైన కొడుకు కలుగుతాడు. నీ భార్యను శుచి అయి దీన్ని ఆరగించమని చెప్పు," అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. భార్గవశర్మ పరమానంద భరితుడై ఆ పండును ఇంటికి తెచ్చి, తన భార్యకిచ్చి, "ఇది తింటే సుపుత్రుడు పుడతాడట. ఒక సిద్ధుడిచ్చాడు. దీన్ని రేపు ఉదయం స్నానం చేసి తిను," అని చెప్పాడు. భార్గవశర్మ తన భార్యకీ మాట చెప్పేటప్పుడు పొరుగింటి ముత్తయిదువ ఆదిలక్ష్మి అనే ఆమె వారింటికి వస్తూ అంతా విన్నది.

భర్త ఇచ్చిన మామిడి పండును నాగవేణి దేవుడి మందిరంలో పెట్టటం కూడా ఆమె చూసింది. తరవాత ఆదిలక్ష్మి తాను వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిపోయేటప్పుడు దేవుడి మందిరంలో ఉన్న పండు కాస్తా తీసి దాచుకొని మరీ వెళ్ళింది. ఆదిలక్ష్మి పండును దొంగిలించటానికి కారణమేమిటంటే, ఆమెకు వరసగా ఏడుగురాడపిల్లలు పుట్టారు. మగబిడ్డను ఎత్తుకోవాలన్న కోరిక ఆమెకు తీరనేలేదు. ఆ మామిడి పండు తింటే సుపుత్రుడు పుడతాడని భార్గవశర్మ తన భార్యతో అనటం ఆమె వినటం చేత, ఆ సుపుత్రుణ్ణి తానే కనాలన్న అభిలాష కొద్దీ ఆమె పండును దొంగిలించింది. ఆమె ఇంటికి వెళుతూనే శుచిగా స్నానం చేసి, ఆ రాత్రే రెండో కంటి వాడికి తెలియకుండా పండు తినేసింది. నాగవేణి మర్నాటి ఉదయం స్నానం చేసి, పండు తిందామని దేవుడి మందిరం లోకి వస్తే పండు లేదు. ఎంత వెతికినా అది కనిపించలేదు. పండు పోయిందన్న దిగులుకు భర్త ఏమైపోతాడో నన్నదిగులు జత అయింది. ఎంతో కష్టపడి తెచ్చిన ఆ పండు పోయిందంటే భార్గవశర్మ గుండె లవిసి చచ్చిపోవచ్చు కూడా. అందుచేత నాగవేణి భర్తతో పండు తినేసినట్టు చెప్పింది. నాగవేణి కష్టాలంతటితో తీరకపోగా, అప్పుడే ఆరంభమయాయి. సిద్ధుడిచ్చిన మామిడి పండు తిన్నాక గర్భవతిగా ఉండాలి, గర్భవతి అయిన మనిషి కనాలి. 

కొద్ది కాలం పోనిచ్చి నాగవేణి తాను గర్భవతిగా ఉన్నట్టు లోకానికి ప్రకటించింది. ఆమె బంధు వర్గమంతా ఎంతో సంతోషించారు. చాలా దూర ప్రాంతం నుంచి ఆమె చెల్లెలు భాగీరథి అనే ఆమె అక్కను చూడ వచ్చింది. భాగీరథి మూడు నెలల గర్భిణీ అని నాగవేణికి తెలిసింది. ఆమె తన చెల్లెలితో తనకు ఏర్పడ్డ సమస్య ఏమిటో రహస్యంగా చెప్పి, "నేనీ చిక్కు నుంచి బయటపడాలంటే నీకు పుట్టబోయే బిడ్డను నాకిచ్చేయాలి. అది కూడా ఎంతో గోప్యంగా జరగాలి," అన్నది. "నా భర్త ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు," అన్నది భాగీరథి. భాగీరథి తన గ్రామానికి బయలుదేరేటప్పుడు నాగవేణి కూడా ఆమె వెంట ప్రయాణమయి, తన భర్తతో, "నాకిక్కడ ఉండటానికి భయంగా ఉన్నది. అనేక పురుళ్ళు పోసుకున్న నా చెల్లెలి వెంట ఉండి, ప్రసవం కాగానే బిడ్డతో సహా తిరిగి వస్తాను," అన్నది. అందుకు భార్గవశర్మ సమ్మతించాడు. 

భాగీరథి నలుగురు పిల్లల తల్లి. ఆమెకు ఆడ పిల్లలూ, మగ పిల్లలూ కూడా ఉన్నారు. అయితే ఆమె భర్త దుర్వ్యసనాలు గల నీచుడు. అతనికి ఖర్చు జాస్తి. తన భార్యకు పుట్టబోయే బిడ్డను తన వదినె గారు కోరే పక్షంలో ఆమె తన ఒంటి మీది నగలన్నీ ఇవ్వవలసి ఉంటుందన్నాడు. విధిలేక నాగవేణి ఒప్పుకున్నది. భాగీరథి సకాలంలో ప్రసవించింది. నాగవేణికి అనుకూలంగా ఆమె మగ బిడ్డనే కన్నది. నాగవేణి ఆ బిడ్డనూ, తన చెల్లెలినీ కూడా తన వెంట తీసుకుని తమ ఊరికి ప్రయాణమయింది. ఆమె ఒంటి పైన గల నగలన్నీ భాగీరథి భర్త తీసుకున్నాడు. తన భార్య ఇంత కాలానికి, సిద్ధుడి దయ వల్ల, ఒక మగ పిల్లవాణ్ణి కని ఇంటికి తిరిగి వచ్చినందుకు భార్గవశర్మ సంతోషించాడు. ఆయన తన కొడుక్కు సిద్ధవరదుడు అని పేరు పెట్టుకున్నాడు. భార్య వంటి మీద ఒక్క నగ కూడా లేక పోవటం చూసి అయన అడిగితే నాగవేణి తాను నగలన్నీ తీసి ఒక చోట మూట గట్టి తలంటు పోసుకుంటుంటే దొంగ లెత్తుకు పోయారన్నది. దాని విషయం అయన అంతగా పట్టించుకోలేదు. వరదుడు భాగీరథి పాలు తాగుతూ పెరిగసాగాడు.

మామిడిపండు తిన్న ఫలితంగా పొరుగింటి ఆదిలక్ష్మికి కూడా ఒక కొడుకు పుట్టాడు. వాడికి మాధవుడని పేరు పెట్టారు. వరదుడూ, మాధవుడూ కలిసే పెరిగారు కానీ వాళ్ళ మనస్తత్వాలలో ఏమీ పోలిక లేదు. ఆ వ్యత్యాసం రాను రాను హెచ్చయింది. మాధవుడు తెలివితేటలూ, వివేకమూ, వినయమూ, సద్వర్తనా కలవాడు. వరదుడు మూర్ఖుడు, గడుగ్గాయి; వాడు దుష్టుడుగా తయారయే లక్షణాలు క్రమంగా బయట పడ్డాయి. భార్గవశర్మకు సిద్ధుడు చెప్పిన సద్గుణాలు పొరుగింటి మాధవుడిలో కనపడ్డాయి గానీ, తన కొడుకు వరదుడిలో కనిపించలేదు. వరదుడు ఇంటి దొంగతనాలతో ప్రారంభించి ఊళ్ళో దొంగతనాలకు ఎగబడ్డాడు. తండ్రి వాణ్ణి సరిచేయ యత్నించిన కొద్దీ వాడి బుద్ధి మరింత వక్రించింది. చివరకు వాడు ఇల్లు విడిచి ఒక చెడ్డ స్త్రీ ఇంట చేరాడు. కొంత కాలమయాక వరదుడు జబ్బు పడ్డాడు. ఆ స్త్రీ వాణ్ణి వెళ్లగొట్టింది. కొద్ది రోజుల పాటు అడవులూ, లోయలూ పట్టి తిరిగి అకాల మరణం పొంది, తీరని కోరికలతో చనిపోయిన కారణంగా పిశాచమయాడు.

వాడు కొత్తగా పిశాచం కావటం చేత ఇతర పిశాచాలు వాణ్ణి తమ నాయకుడి దగ్గరకి తీసుకుపోయారు. పిశాచాల నాయకుడు వాణ్ణి చూసి, "నువ్విలా పిశాచం కావటం అచ్చగా నీ తప్పు కాదు. అందుకు అసలైన కారకులెవరో వారిని పట్టి పీడించు," అన్నాడు. బేతాళుడీ కథ చెప్పి, "రాజా, పిశాచమైన వరదుడు ఎవరిని పట్టి పీడించాలి? ధనాశ చేత తన కన్న కొడుకును తన అక్క కిచ్చేసిన భాగీరథినా? తన కొడుకని చెప్పుకుంటూ వాణ్ణి పెంచి పెద్ద చేసిన నాగవేణినా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో నీ తల బద్దలైపోతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "వరదుడు పిశాచం కావటానికి భాగీరథి కారకురాలు కాదు. ఆమె తన కొడుకును సిరి సంపదలు గల చోట దత్తు ఇచ్చింది. అందులో తప్పేమీ లేదు. పసితనంలో పాలిచ్చి వాణ్ణి పెంచి తన మాతృ ధర్మం కూడా నెరవేర్చుకున్నది. వరదుడు తన ఇంటి వాతావరణంలో పెరగక ధనికుల ఇంట పెరగటం వల్ల అనేక కోరికలతో చచ్చి పిశాచమయినాడు. నాగవేణి పెంపకమే వాణ్ణి అలా చేసింది. కానీ తప్పు నాగవేణిది కూడా కాదు. తన భర్త ఎంతో ఆశతో తెచ్చిన పండు పోయిందంటే తన భర్త ప్రాణాలెగిరిపోతాయన్న భయంతో ఆమె వరదుణ్ణి పెంచింది. వరదుడు పిశాచం కావటానికి మూల కారణం ఆదిలక్ష్మి మామిడి పండును దొంగిలించటం. పిశాచం ఆమెనే పట్టాలి," అన్నాడు. రాజుకీ విధంగా మౌన భంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.

Comments