చందమామ కథలు - పిల్లి సహాయం

 

Chandamama Telugu Story of a Clever Cat who makes his master king. Best Telugu Chandamama Stories to Read.

అనగనగా ఒక వూళ్ళో ఒక వర్తకుడు. అతనికి ముగ్గురు కొడుకులు. ఒక రోజున అతను ముగ్గురినీ పిలిచి, తన ఆస్తిని ఈ విధంగా పంచిపెట్టాడు: వ్యాపారం అంతా మొదటివాడికి, రెండవవాడికి గాడిదను, మూడవవాడికి పిల్లినీ. పెద్దవాడూ, రెండోవాడూ మాటాడలేదు కాని, కడపటివాడు మాత్రం తన వంతుకు ఎందుకూ పనికిరాని పిల్లి వచ్చింది కదా అని చాలా విచారించాడు. అతని విచారం చూసి, "ఓయి పిచ్చివాడా! నన్ను గురించి అంత తేలికగా ఆలోచిస్తున్నావేమిటి? నాకొక బూట్లు జత, ఒక సంచీ కొనిపెట్టు. నీ అన్న లిద్దరికంటే నువ్వే అదృష్టవంతుడవని అనిపిస్తాను," అని పిల్లి ధైర్యం చెప్పింది. పిల్లి చెప్పిన మాటలకు అతను సంతోషించి ఒక చక్కటి బూట్లుజత, అందమైన సంచీ కొని యిచ్చాడు. అప్పుడు పిల్లి షోకుగా బూట్లుజత తొడుగుకొని, సంచీ బుజానవేసుకుని కుందేళ్ళుతిరిగే స్థలం చేరుకుంది. సంచీలో కొంచెం తవుడు పోసిపెట్టి, తను ఆ దగ్గిరనే ఉలుకూపలుకూ లేకుండా పడుకొన్నది. తవుడు వాసన తగలగానే ఒక కుందేలు గబ గబా వచ్చి సంచిలో దూరింది. ఆమట్టున బూట్లు తొడుక్కున్న పిల్లి సంచి కట్టివేసి, బుజాన వేసుకుని, రాజుగారి దగ్గరకు ప్రయాణమై వెళ్లింది. రాజుగారిని చూడగానే సలాము చేసి, "మహారాజా! మా కందారాజులుంగారు ఏలినవారి దీనిని కానుక సమర్పించుకున్నారు!!" అని చెప్పి, సంచిలో కుందేలును రాజుగారి ముందు పెట్టింది. ఆయన పిల్లితెచ్చిన కానుక పుచ్చుకొని, "మీ కందారాజులుంగారితో మేము సంతోషించామని చెప్పు" అని పిల్లిని పంపించివేశారు. 

భేష్, బాగున్నదనుకొని బూట్లు తొడిగిన పిల్లి మరునాడు ఉదయం కొంగలు ఉండే దిక్కుకి పోయింది. అక్కడ కొన్ని కొంగలను సంచీలో చిక్కించుకుని మళ్లీ రాజుగారికి వాటిని బహుమతి చేసింది. రాజా వారు సంతోషించి, "పిల్లీ, పిల్లీ! నేనూ, మా రాణీ, మా అమ్మాయీ మీ కందారాజులుంగారిని చూడవస్తాము" అన్నారు. మహారాజులుంగారి ఏనుగు అంబారీ బయలుదేరే లోపల, బూట్లు తొడుక్కున్న పిల్లి పరుగు పరుగున పోయి యజమానిని కలుసుకుంది. "బాబాయ్, నువు నేను చెప్పినట్టల్లా చేస్తూవుండు. ముందు చొక్కా విడిచి చెరువులో దిగు" అని చెప్పింది. పిల్లి చెప్పిన ప్రకారం అతను చొక్కా విడిచి చెరువులో పీకలోతువరకూ దిగి నుంచున్నాడు. ఇంతలో రాజావారి అంబారీ ఆ దారిన వచ్చేసింది. పిల్లి వెళ్లి "మహారాజా! మా ప్రభువుగారు స్నానానికని చెరువులో దిగడం చూసి, వారి వస్త్రాలు దొంగలెత్తుకుపోయారు. పాపం, ఆయన నానిపోతున్నారు" అని చెప్పింది. వెంటనే రాజావారు మంచి మంచి బట్టలు తెప్పించారు. అవి ధరించేటప్పటికి అతనికి ఎక్కడలేని అందమూ వచ్చేసింది. అతన్ని చూచి రాజూ రాణీ ముచ్చటపడ్డారు. రాజకుమార్తె మనసులో సంతోషించి, సిగ్గుపడింది కూడా. అది కనిపెట్టి ఆమె తల్లిదండ్రులు, "ఈ కుర్రవాడు మనకు అల్లుడయితే బాగుండును!" అనుకొని, అతన్ని కూడా అంబారీలో ఎక్కించుకున్నారు. ఇంతలో బూట్లు తొడుక్కున్న పిల్లి మరొక గమ్మత్తు చేసింది. ఒక రాక్షసుడు నివసించే పెద్దభవనం చేరుకొని, "ఓయి రాక్షసరాజా! ఇప్పుడు మన మహారాజా వారు అంబారిమీద ఇక్కడికి దయచేస్తున్నారు. వారిని సంతోషపెట్టటానికి నువు వినోదాలేమైనా చేయగలవా?" అంది. 


"ఏమైనా చేయగలను" అన్నాడు రాక్షసుడు. "మరయితే ఒక జంతువయిపో చూతాం," అని పిల్లి అన్నది. రాక్షసుడు సింహం రూపంలో కనపడ్డాడు. "అబ్బే, ఇటువంటివి అందరు రాక్షసులూ చేస్తారు. చిన్న జంతువుగా మారటమే గొప్ప. చేతనయితే చుంచుగా మారి చూపించు" అని వాడిని పిల్లి ఉసుకొలిపేసరికి, ఉబ్బిపోయి రాక్షసుడు చుంచుగా మారిపోయాడు. చుంచురూపంతో వున్న రాక్షసుణ్ణి పిల్లి గుటుక్కున మింగివేసింది. అప్పుడు పిల్లి ఖాళీగా వున్న ఆ పెద్ద భవనంలో చక్కటి ఏర్పాటులన్నీ చేసి, మహారాజావారినీ, పరివారాన్నీ అందులో ప్రవేశపెట్టింది. "ఇదే మా కందారాజులుంగారి భవనం, చూడండి!" అని చెప్పి పంచభక్ష్య పరమాన్నాలతో గొప్ప విందు జరపటానికి కూడా తగిన ఏర్పాటుచేసింది. విందుభోజనాలైన తరువాత, తాంబూలాలు వేసుకొనే సమయంలో మహారాజావారు "పిల్లీ, పిల్లీ! మీ కందారాజులుంగారిని చూచి మేమంతా చాలా సంతోషించాము. మరి, ఆయనకు యింకా పెళ్లికాలేదని చెప్పావు కదా, మా అమ్మాయి నిచ్చి పెళ్లి చేస్తాము, ఏమంటావు?" అన్నారు. "తప్పకుండా అలాగే చేయండి. ఐతే వారిచేత వప్పించినందుకు నాకు మాత్రం కొత్త బూట్లు జత కొనిపెట్టాలి" అన్నది. ఈ మాటకు అక్కడివాళ్లంతా నవ్వుకున్నారు. మరికొద్ది రోజులకే మంచి ముహూర్తాన అతనికి ఆ పెద్దభవనంలోనే వైభవంగా పెళ్లి జరిగింది. పెత్తనమంతా పిల్లిదే. పెళ్లిలో మహారాజాగారు పిల్లికి కొత్త బూట్లు బహుమానమిచ్చారు.

Comments