పూర్వం గంగానది ఒడ్డున ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు గురుభక్తి గల శిష్యుడు ఉండేవాడు. శిష్యుడి మీద గురువుగారికి అమిత వాత్సల్యం ఉండటం చేత ఎంతో శ్రద్ధగా చదువు చెప్పేవాడు. ఒకనాడు ఆ ముని శిష్యుణ్ణి పిలిచి "అబ్బాయీ, నాకు ఈ జన్మ చాలించవలసిన కాలం సమీపించింది" అన్నాడు. ఆమాటకు శిష్యుడు ఉలిక్కిపడి, "ఇదేమిటి మహాత్మా, అప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోతారా? అటైతే మీతోబాటు నాకు కూడా మోక్షం కలిగే ఉపాయం చెప్పండి" అని కోరాడు. దానికి మునీశ్వరుడు "నాయనా, నాకు మోక్షం కలగటంలేదు. నేనీ జన్మలో ఘోరమైన పాపం ఒకటి చేశాను. ఆ మహాపాపానికి ఫలితంగా నేను మళ్లీ జన్మ ఎత్తాలి. జన్మ అంటే మనిషి జన్మ కూడా కాదు. పందినై పుట్టాలి!" అన్నాడు. ఆ మాటలు వినేటప్పటికి శిష్యుడికి నోటమాట రాక, కఱ్ఱలా నిలబడిపోయాడు. అప్పుడు ముని, "నువ్వూ నేనూ విచారించి లాభం లేదు. ఎవరైనా సరే, చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవించి తీరాలి. పంది కడుపున నేను పుట్టక తప్పదు. పుడతాను. కాని ఆ నికృష్టజన్మలో ఒక్క క్షణమైనా ఉండటం నాకు ఇష్టంలేదు. ఆ జన్మ త్వరగా చాలించుకోవాలంటే నువ్వు నాకు సాయపడాలి" అన్నాడు. "తమరేంచెయ్యమంటే అది చేస్తాను" అన్నాడు శిష్యుడు. "ఐతే విను. అదిగో ఆ కనపడే పల్లె ఉంది చూశావా? అక్కడ ఒక ఎఱుకలవాడున్నాడు. వాడి యింట్లో ఒక పంది ఉంది. ఆ పందికి పుట్టబోయే పిల్లలలో నేనొకటై పుడతాను. ఆ పిల్లలలో ఒక దానికి మొహం మీద బొల్లి ఉంటుంది. ఆ బొల్లిపిల్లను నేనే అని నువ్వు పోల్చుకోవాలి. నేను పుట్టీపుట్టడంతోనే నువ్వు ఏ మాత్రం సందేహించకుండా నన్ను చంపెయ్యి. ఈ విధంగా ఆ జన్మ నాకు త్వరలో అంతమై పోతుంది" అని గురువుగారు చెప్పారు.
ఈ కోరిక వినేసరికి శిష్యుని కళ్ల వెంబడి నీళ్లు రాలాయి. "మహాత్మా, ఏ రూపంలో ఉన్న మీరు నాకు గురువులే కదా. మిమ్మల్ని నేను చేతులారా ఎలా చంపగలను? నేను అలా ఎన్నటికీ చెయ్యలేను" అన్నాడు. అందుకు గురువు "అబ్బే నువ్వలా వెనుదీయకూడదు. ఏమంటే ఈ పని నాకు ఉపకారం చెయ్యటం కోసం గనక హింస అనిపించుకోదు" అని చెప్పి శిష్యుణ్ణి ఒప్పించాడు. ఇలా చెప్పి మునీశ్వరుడు ప్రాణాలు విడిచేశాడు. అతడన్నట్లుగానే ఆ యెఱుకలవాడింట్లో ఉన్న పంది కడుపులో ప్రవేశించి పెరుగుతున్నాడు. శిష్యుడు రోజూ ఆ యెఱుకలవాడింటికి వెళ్లి వాణ్ణి దీవించి వస్తూండేవాడు. "బ్రాహ్మణాయన వచ్చి రోజూ నన్ను దీవించిపోతున్నాడెందుకు చెప్మా?" అని వాడు అలోచించి ఒకనాడు, "బాబూ, శ్రమపడి రోజూ మా యింటికి ఎందుకు వస్తున్నారు? మీకు నా వల్ల అయే పనేమైనా ఉందా?" అని అడిగేడు. అడగడమే తడవుగా శిష్యుడు, "నీ వల్ల అయ్యే ఉపకారం తప్పకుండా ఉన్నది! అందుకనే, నేను రోజూ నీ వద్దకు రావటం. ఆ పని యేమిటీ అని అడుగుతావేమో. మీ యింట్లో చూలిపంది ఉన్నది కదా. అది ఈనేవరకూ దానిని మా యింట కట్టెయ్యాలి. దాని పిల్లలలో ఒకదాన్ని నేను పుచ్చుకుని అమ్మవారికి బలిస్తాను. మిగతా పిల్లల్నీ తల్లినీ నీవు తోలి తెచ్చుకోవచ్చును" అన్నాడు.
"ఇంతేకద బాబూ! ఈపాటి పనికే మీరు స్వయంగా మాయింటికి రావాలా? కాకిచేత కబురంపితే, నేనే చేతులుకట్టుకుని మీ దర్శనానికి వద్ధునే!" అని ఎఱుకలాడు అంటూ, పందిని తీసుకువెళ్లి ఆ బ్రహ్మచారి దొడ్లో వదిలేసి చక్కా వచ్చాడు. కొన్నాళ్లు గడిచాక అనుకొన్నట్టుగానే ఆ పంది పిల్లల్ని పెట్టింది. వాటిలో నొసటిపైన తెల్లటి మచ్చగల పోతుపిల్ల భూమి మీద పడ్డంతోటే గురువుగారి ఆజ్ఞ ప్రకారం దానిని మోది చంపెయ్యటం కోసం శిష్యుడు దుడ్డు కఱ్ఱను ఎత్తేడు. కాని నవనవలాడుతూ, ఇంకా కన్ను తెరవని ఆ చిన్నపిల్లని చూచేటప్పటికా బ్రాహ్మణపిల్లవానికి జాలిపుట్టుకొచ్చి "దీన్ని ఎలా చంపటం?" అని మనస్సు వెనుకకు లాగింది. కాస్సేపు అలాగే చూస్తూ నిలబడిపోయాడు. అంతలో "నువ్వు వెనుదీయకూడదు సుమా" అని గురువుగారానాడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి, సంశయం పనికిరాదనుకొని, ఆ పందిపిల్లని బాదబోతూంటే, అది కళ్ళు తెరిచి, "ఆగు, ఆగు, చంపకు" అని మనిషి గొంతుకతో అరిచింది! ఆ వడుగు అట్టే నిలబడిపోయాడు. అప్పుడు ఆ పందిపిల్లరూపంలో ఉన్న గురువు శిష్యునితో "అబ్బాయీ, నేను భూమిమీద పడ్డంతోనే నన్ను నువ్వు చంపివేయక ఆగేవు. నేను కళ్ళు తెరవటంతోనే ఈ శరీరం మీద నాకు అభిమానం కలిగింది. ఈ పంది జన్మలో ఉండి కూడా సుఖాలనుభవించవచ్చునని తోస్తున్నది. కనుక ఈ జన్మ కొన్నాళ్ళు గడుపుతాను. నువ్వు ఆలోచించక నీదారిని నువ్వు పో" అన్నాడు.
ఆ మాటలు వినేటప్పటికి శిష్యునికి చాలా ఆశ్చర్యం వేసింది. "ఈ నీచ జన్మలో ఒక్క క్షణం కూడా ఉండలేన" ని వాపోయిన గురువే ఇప్పుడిలా అంటున్నాడేమిటి? అని తోచి, "స్వామీ, ఈ నీచ జన్మలో మీకు కలిగే సుఖమేమిటి?" అంటూ అడిగేశాడు. ఆ ప్రశ్నకు పందిపిల్ల, "ఇది నీచజన్మ అని ఇదివరకు అనుకున్నానుగాని ఆ ఉద్దేశం ఇప్పుడు మారిపోయింది. మనిషి శరీరంలో ఉన్నా, జంతు శరీరంలో ఉన్నా, పక్షి శరీరంలో ఉన్నా, మరే శరీరంలో ఉన్నా, ప్రాణులన్నింటికీ సుఖదుఃఖాలు సమంగా ఉంటాయి. ఏ జీవికీ కూడా తన జన్మ నీచమైనదనిపించదు. ఎంత అల్పమైన జంతువైనా సరే తన శరీరమంటే అభిమానం కలిగి, ఆ శరీరంతో పొందగలిగిన సౌఖ్యాల కోసమే కృషి చేస్తుంది. ఏ ప్రాణికైనా చావు అంటే భయం కలగటానికి కారణం ఈ దేహాభిమానమే" అని పలికింది. శిష్యుడింకా గురువుగారితో ఏదో మాట్లాడుదా మానుకున్నాడు. ఇంకెక్కడి గురువు? ఆ పందిపిల్లకి మరుక్షణంలోనే తాను పూర్వజన్మలో ఫలానా మునీశ్వరుణ్ణి అనే జ్ఞానం పోయి, ఆ పంది జన్మలో కలిగే కష్టసుఖాల అనుభవం ప్రారంభమైంది. ఆ బొల్లిపిల్ల తక్కిన పిల్లలతో పాటు తల్లిదగ్గరకు పోయి, పాలు తాగడం మొదలెట్టింది. చేసేదిలేక, శిష్యుడు, "కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేర" ని నిశ్చయించుకొని, ఎఱుకలవాణ్ణి రప్పించి, పందినీ పందిపిల్లల్నీ వాని ఇంటికి తోలిపెట్టేశాడు.
Comments
Post a Comment