అనగనగా కిట్టు అని ఒక కుర్రవాడు ఉండేవాడు. వాడు చూపులకు చిన్నవాడే గాని, చేసే పనులన్నీ వింతగా పరిణమించేవి. ఒకప్పుడు అతను మిరపగింజలు పాతిపెట్టాడు. అదేమి చిత్రమోగాని, అవి మిరపకాయలకు బదులు తియ్యటిఫలాలు పండినై. కిట్టూని చూస్తే పిల్లలకూ పెద్దలకూ అందరకూ ఆనందమే. అందుకనే అందరూ అతనిని "కిట్టు మామా! కిట్టు మామా!!" అని పిలిచేవారు. కిట్టుమామకు ఈ పని చేతనవును, ఇది చేతకాదు అన్నమాట లేదు. ఎవరికి ఏపని కావలిసినా, చేసిపెట్టేవాడు. అంత మంచివాడు కిట్టుమామ. ఇన్ని పనులు చక్కబెట్టినా, అతని చేతిలో డబ్బు నిలిచేది కాదు. డబ్బు లేక పోయినా, ఎప్పుడూ సరదాగానే ఉండేవాడు. కిట్టుమామ చుట్టూ, ఎప్పుడు చూచినా పిల్లలు, పిల్లులు, కుక్కలూ మొదలయిన నేస్తాలు గుమిగూడి వుంటారు. అంతేకాని, అతను ఒంటిపాటుగా కనపడడు. ఒకరోజున కిట్టుమామ, కలప నరకడానికి అడవికి వెళ్లాడు. ఒక్కచెట్టు నరికేవరకు మధ్యాహ్నమైపోయి, ఆకలివేసింది. మానుమీద కూర్చుని, కిట్టుమామ ఫలహారం తినటం ప్రారంభించేసరికి, అడవి పక్షులు వచ్చి వాలాయి. చెవులపిల్లులు తొంగి చూచాయి. లేదనకుండా, అన్నింటికీ రొట్టెముక్కలు రాల్చాడు. అవి ఆ ముక్కలు తినేసి, సంతోషంతో వెళిపోయినయి. అవి వెళ్లిపోగానే కిట్టుమామ ఎదుట ఆకస్మికంగా, ఒక అందమైన భవనము, చుట్టూ చక్కటి తోట కనపడినై. భవన ద్వారంమీద నల్లపిల్లి కూర్చునివుంది. ఆశ్చర్యంతో కిట్టుమామ అక్కడికి వెళ్లేవరకు, తలుపు తీసుకొని ఒక వృద్దురాలు ఇవతలకు వచ్చింది.
"అబ్బాయీ, అబ్బాయీ! నీ దగ్గిర మంచి గొడ్డలి ఉన్నట్టుంది. నాకు కాసిన్ని కట్టెలు కొట్టిపెడతావా" అని అడిగింది. దానికి కిట్టు మామ "అలాగే అవ్వా! పెద్దవాళ్లకు సేవ చేయడం కంటే కావలిసిందేముంది" అని చెప్పి, అవ్వ చూపిన కట్టెలన్నీ చకచక కొట్టేసి, ముచ్చటగా వాటిని పేర్చి, ఆ దగ్గిరే వున్న చీపురుతో చుట్టూతా రాలిన ఎండుటాకులు అన్నీ తుడిచి పారబోశాడు. అతని శ్రద్ధకు, భక్తికీ అవ్వ సంతోషించి, "నాయనా, చెప్పిన పని చక్కగా చేసిపెట్టావు. నీ కష్టానికి ఏమి కావాలో కోరుకో" అన్నది. "నేను పడిన కష్టమేమీ లేదు నీ చలవచేతితో గుక్కెడు మంచినీళ్లు ఇస్తే చాలు" అన్నాడు కిట్టుమామ. వృద్ధురాలు కిట్టుని లోపలకు రమ్మంది. అతను మర్యాదకోసం కాలిజోళ్ళు విప్పి బయట వదిలి, లోపలకు వెళ్లేసరికి, లోటాలో తియ్యటి పాలు తెచ్చి ఇచ్చింది. "అబ్బాయీ! నిన్నూ, నీ గుణాలనూ చూడగ నాకు సంతోషమయింది. నిన్ను ఆశీర్వదించి ఒక బహుమతి నీకు ఈయదలచాను. కనుక, ఈ భవనంలో కనపడే వాటిల్లో ఏది కావాలో కోరుకో" అన్నది. నాలుగుదిక్కులూ చూచి, కిట్టు మామ ఒక మూలనున్న పడకకుర్చీ మీద దృష్టి నిగిడించాడు. అవ్వ, అతని మనసులో కుతూహలాన్ని గ్రహించి, "అబ్బాయీ! నేను ఏదైతే నీకు ఇద్దామనుకున్నానో, సరిగా ఆ వస్తువుపైనే నీ దృష్టి పడింది. ఇది మహిమగల కుర్చీ. దీనిని పట్టుకు వెళ్లు. దీనివల్ల నీకు అదృష్టం పడుతుంది, కీర్తి వస్తుంది" అని చెప్పింది. కిట్టు మామ వృద్ధురాలికి నమస్కరించి, కుర్చీ భుజంమీద వేసుకొని, వెనుక వెనుకకు చూచుకొంటూ పోతున్నాడు. కాని, అతను చూస్తూ వుండగానే, ఆ భావనమూ, తోటా అదృశ్యమైపోయినై.
కిట్టుమామ ఇంటికి చేరుకొని, కుర్చీలో హాయిగా కూర్చోవచ్చుకదా అని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఆ కుర్చీని శుభ్రంగా తుడిచి, ఒక మంచి స్థలంలో అమర్చి, సిద్ధం చేసేటంతలో, అతని ప్రాణస్నేహితుడైన శీను వచ్చాడు. కిట్టు ఇంటికి శీను ప్రతి ఆదివారం తప్పకుండా వస్తాడు. అలాగే ఇవాళ కూడా వచ్చాడు. శీను పాపం, గ్రుడ్డివాడు. అతనిని ఎవ్వరూ చేరదీయరు. కాని కిట్టుమాత్రం శీనుని ప్రాణప్రదంగా చూసుకుంటాడు. అందుచేత శీను రాగానే కిట్టు, ఆ రోజున జరిగిన చిత్రాలన్నీ చెప్పి, తను సంపాయించుకువచ్చిన కుర్చీలో అతనిని కూర్చోబెట్టాడు. శీను ఆ కుర్చీలో కూచుని, కొంచెం సేపు అటూ ఇటూ ఊగేవరకు, చిన్నరాగం తీయడం ప్రారంభించాడు. అది క్రమంగా పెద్దదై హెచ్చు స్థాయిలో కృతులు పాడటం మొదలెట్టాడు. ఆ పాటలు అద్భుతంగానూ, హాయిగానూ ఉండటంచేత, కిట్టు మామ అలాగే నిస్చేష్టుడై, వింటూ కూచున్నాడు. మధ్యాహ్నం రెండు జాములయేవరకు, శీను పాడే పాట నిలిచిపోయింది. అతను కుర్చీలోనించి లేచాడు. లేవగానే, శీనుకి కల కాంచినట్టు అనిపించింది. "శీనూ! ఇన్నాళ్లనించి స్నేహంగా ఉంటున్నాం కదా. ఇంత చక్కటి పాట వచ్చునని ఎన్నడూ చెప్పావుకాదుకద!" అని కిట్టు మామ ప్రశ్నించాడు. అందుకు శీను "నిజంగానే నాకు సంగీతం రాదు కిట్టూ! ఇప్పుడు ఎలా పాడగలిగానో నామట్టుకి నాకే ఆశ్చర్యంగా వున్నది" అన్నాడు. ఈ విధంగా ప్రతి ఆదివారము శీను వచ్చి ఆ కుర్చీలో కూచుని, గంధర్వగానాన్ని మించిన సంగీతం పాడేవాడు.
మధ్యాహ్నం రెండుజాములకు ఆ సంగీతం నిలిచిపోయేది. ఈ పద్ధతిలో జరుగుతూ వున్న సంగీతానికి కిట్టుమామ తన్మయుడైనాడు. శీను మీద అభిమానం ఎంతవరకూ పోయిందంటే "ఇది శీను కుర్చీ. దీనిలో అతను తప్ప మరెవ్వరూ కూచోకూడదు. నేనైనా సరే అందులో కూర్చో" నని నియామకం చేసుకొన్నాడు. శీను పాడగలడనే సంగతి అతనికీ కిట్టుకి తప్ప మూడోవాడికి తెలియదు. కుర్చీలో కూర్చున్నప్పుడు గాక, ఇతర సమయాలలో అలాగే పాడుదామని శీను ఎంతో ప్రయ్నతించాడు. ఎంత ప్రయిత్నించినా, వెర్రి మొర్రి కూతలు మాత్రమే కంఠం లోంచి వచ్చేవి. ఇలా వుండగా, ఆ రాజ్యం ఏలే రాజుకి జబ్బుచేసింది. తిండి నోటికిపోవటం లేదు. కంటికి కునుకు రావటం లేదు. ఎప్పుడు చూచినా విచారంగా ఉండేవాడు. దర్బారులో వుండే హాస్యచతురులందరూ వచ్చి, రాజును నవ్వించుదామని శాయశక్తులా ప్రయత్నించారు. కాని, వాళ్ళ వల్ల కాలేదు. ఘన వైద్యులందరూ వచ్చి చూచి, "ఇదేమీ శరీరసంబంధమైన జబ్బు కాదు. వింతవస్తువు ఏదైనా చూపిస్తే, మతి కుదుటబడుతుంది" అన్నారు. వారి సలహా ప్రకారం, కోటలోని పరివారమంతా వింతవస్తువు తేవటానికని దేశాలవెంబడి బయల్దేరారు. ఒకొక్కడు ఒకొక్క అపురూపమైన వస్తువు తీసుకువచ్చారు. కాని అందులో ఒక్కటీ రాజుగారికి పని చేయలేదు. పరివారంలో ఒకడైన 'వేణు' రాజభక్తి పరాయణుడు. వాడు తిరిగి తిరిగి కిట్టుమామ ఇంటి సమీపానికి వచ్చేసరికి, ఆ సమయంలో శీను గానం చేస్తూవున్నాడు.
వేణు నిశ్చేష్టుడై, ఆ గానం వినేసరికి, అతని శరీరంలో బాధలన్నీ తొలగిపోయి, కొత్త ఉత్సాహం ప్రవేశించింది. వెంటనే కోటకు చేరుకుని, ఈ సంగతి రాజుతో చెప్పగానే, ఆ చిత్రమైన పాటగాడెవరో, వాడిని వెంటబెట్టుకు రమ్మని రాజు ఆజ్ఞాపించాడు. వేణు కిట్టుమామ కుటీరానికి వెళ్లి, వాళ్లిద్దరునూ రాజువద్దకు రమ్మని పట్టుపట్టాడు. "మాకు ఏ విధమైన సంగీతము రాదు" అని వారు గోలపెట్టారు. వాళ్ళు సిగ్గుపడుతున్నారనుకుని, వేణు, "మీరు గొప్ప విద్వాంసులై వుండీ, ఎందుకు జంకుతారు? రాజుగారు మీ పాట విని, మెచ్చుకొని, బహుమతులిస్తారు. ఆయనకు సంతోషం కలిగిందంటే మిమ్మల్ని ఆస్థానంలో మంత్రులుగా కూడా పెట్టుకోగలరు" అంటూ ప్రోత్సహించాడు. చివరకు ఎలా అయితేనేం, శీనుని తీసుకుపోయి, రాజు ఎదుట పెట్టాడు. ఒక్క పాట పాడుమని రాజు స్వయంగా శీనుని కోరాడు. శీను గొంతు సవరించుకొని, పాడబోయాడు. కాని, కంఠంలోనించి వెర్రిమొర్రి కూతలు మాత్రమే వచ్చాయి. ఈ విద్వాంసుడు గర్వివలె ఉన్నాడు, తనను చూసి హేళన చేస్తున్నాడు అని తలచి, రాజు అతనిని ఖైదులో వేయించాడు. శీను ఖైదులో పడ్డాడేగాని, రాజు పరిస్థితి ఏమీ మారలేదు. ఏమైనాసరే, వింత వస్తువుకు మళ్లీ పోయి రావాలని చెప్పి, వేణు బయల్దేరాడు. పోయి పోయి అడవి చేరుకునేవరకు, అక్కడ, సరీగా కిట్టు మామ చూచిన మోస్తరుదే భవనమూ, తోటా వేణుకి కనపడినై. వేణు గుమ్మం ఎక్కేసరికి, తలుపు తెరుచుకుని వృద్ధురాలు ఇవతలికి వచ్చింది. అప్పుడు అతను "అవ్వా, అవ్వా! మా రాజు జబ్బు నయం కావటానికి ఏదైనా వింతవస్తువు ఇవ్వగలవా?" అని అడిగాడు.
అందుకు ఆమె "పోవోయి పక్షీ! నువ్వూ మీ రాజూ వట్టి శుంఠలు. మీకేం కావాలో మీకే తెలియదు, ఎదుట వున్న వస్తువునే కంటితో చూచి కనుక్కోలేరు; ఫో ఫో" అంటూ కసిరికొట్టి తలుపు మూసుకొన్నది. "ఈ అవ్వ పొగరుబోతులాగా ఉన్నది. లేకపోతే ఇటువంటి మాట లేమిటి?" అని వేణు మనస్సులో అనుకోని, మళ్లీ చూచేసరికి అవ్వాలేదు, భవనమూలేదు. వేణుకి కంగారుపుట్టి కాళ్ళు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి బయల్దేరి పోయాడు. వేణు పోయిపోయి, చివరకు మళ్లీ కిట్టుమామ కుటీరానికి చేరుకొన్నాడు. తన ప్రాణస్నేహితుడైన శీను సంగతి ఏమిటని కిట్టుమామ అడిగేసరికి అతను ఖైదులో వున్నట్టు చెప్పాడు వేణు. కిట్టుమామ చాలా విచారించి, "సరే, అయినదానికి ఏమి చేయగలం? ముందు సంగతి ఆలోచిద్దాం. అలా స్థిమితంగా కూర్చోండి" అంటూ, వేణుని పడకకుర్చీలో కూర్చోబెట్టాడు. కుర్చీలో కూర్చొని ఒక్క నిమిషం అటూ ఇటూ ఊగిన తరువాత, వేణు చిన్న కూనిరాగం ప్రారంభించాడు. క్రమంగా కూనిరాగం పెద్దదై, హెచ్చుస్థాయిలో కృతులు పాడటం మొదలెట్టాడు. ఆ పాట సరీగా తన మిత్రుడు శీను పాడిన పాటే కావడం చేత, వేణు తనను వేళాకోళం చేస్తున్నాడనుకొని, కిట్టు మామ అతనిని జబ్బపట్టుకుని ఇవతలకు లాగివేశాడు. సరిగమలైనా నోటపట్టని తనకు ఇంత చక్కటి పాట చేతనైనందుకు వేణు ఆశ్చర్యపోయాడు. ఈ వింతవల్ల తప్పక తన రాజుకి నయమవుతుందని నిశ్చయం తోచింది. వేణు కోటకు పోబోతూవుండగా, "రాజుతో చెప్పి మా శీనుని విడిపించుకుంటా" నని చెప్పి, కిట్టుమామ కూడా అతని వెంట బయల్దేరాడు.
వేణు కోటకు చేరుకునేసరికి, రాజు మునుపటికంటె ఎక్కువ విచారంగా కనపడ్డాడు. అప్పుడు వేణు "ప్రభూ! నాకిప్పుడు అమరగానం చేయగల శక్తి కలిగింది. ఆ గానం విన్నారంటే మీకున్నటువంటి మనోవిచారం నిమిషంలో తొలగిపోతుంది. చూడండి చిత్రం!" అంటూ, గొంతు సవరించుకొని పాటపాడటం మొదలెట్టాడు. అతను ఎంత ఆరాటపడినా, కంఠంలోంచి వెర్రిమొర్రి కూతలు మాత్రం వెలువడ్డాయి. లోగడ, విద్వాంసుడనుకొని భ్రమపడి రప్పించిన శీను, స్వయంగా రాజు బ్రతిమాలినప్పటికీ వెక్కిరించినట్టు వేళాకోళపు కూతలు కూశాడు. ఇప్పుడు మళ్లీ తనకు నమ్మిన బంటు అయినటువంటి వేణూయే తనను హేళన చేశాడు! ఈ సందర్భాలు రాజుకి ఏమీ అర్థంగాక, "ఈసారి నేను పాడగలను అని చెప్పి ఎవడైనాసరే ఎదుటికి వచ్చి నిలబడనీ, డొక్క చీల్చి డోలు కడతాను" అని రాజు మండిపడుతూ వేణుని హెచ్చరించాడు. ఆ రోజుననే రాజుకి ఒక కల వచ్చింది. వృద్ధురాలి రూపంలో వున్న దేవకన్య కనబడి "ఏమోయి రాజా! గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, పసిపిల్లలు దేవతలకు మిత్రులన్న సంగతి మరిచావా? నిరపరాధి ఐన మా మిత్రుడు శీనుని ఎందుకు నిర్బంధంలో ఉంచావు? నీ సేవకుడు వేణు మా దేవతల మహిమను భగ్నం చేస్తూవుంటే అలా నీవు ఊరుకోవలసిందేనా? నీ తప్పు తెలుసుకో. తెలుసుకొని సవరించుకో..." అని గద్దించి చెప్పి, అదృశ్యమైపోయింది. రాజు వెంటనే శీనుని విడిచిపెట్టి పరివారముతో అడవికి వెళ్లాడు. అక్కడ భవనము, తోట, ద్వారం మీద నల్లపిల్లి కనపడినై.
రాజు సరాసరి భవనంలోపలకు పోయేవరకు, బల్ల మీద ఒక చీటీ ఉన్నది. ఆ చీటిలో "వృద్ధురాలు వెళ్లిపోయింది. మళ్ళీ రేపే దర్శనం" అని వ్రాసి వున్నది. సరే, రేపు మళ్లీ రావచ్చు కదా అనుకోని రాజు ఇంటికి బయల్దేరాడు. దోవలో ఆయనకు కిట్టుమామ కుటీరం తగిలి, అక్కడ అమరగానం హాయిగా వినిపించింది. సరాసరి అయన ఎంతో ఆనందంతో లోపలకు వెళ్లేసరికి, రాజుగారే స్వయంగా తన కుటీరానికి వచ్చారన్న సంతోషంతో కిట్టు మామ రాజుగారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాడు. కూర్చున్న కొంచెంసేపటికి రాజు చిన్న కూనిరాగం ప్రారంభించాడు. క్రమంగా అది పెద్దదై, హెచ్చు స్థాయిలో కృతులు పాడటం మొదలెట్టాడు. ఇప్పుడు ఆయన ఏ బాధా లేక, హాయిగా కనబడ్డాడు. ఆమట్టున కిట్టుమామ ఉత్సాహంతో ఎగిరి గంతేసి, "శీనూ! నువ్వు పాడావు, వేణు పాడాడు. అదే పాట ఇప్పుడు రాజుగారు పాడుతూవున్నారు. ఈ గమ్మత్తంతా కుర్చీలోనే వున్నది. నాకు ఆ వృద్ధురాలు దీనిని ఇచ్చినప్పుడే "ఇది మహిమగల కుర్చీ అని చెప్పింది" అన్నాడు. అప్పుడు ఆకాశవాణి "ఈపాటిరహస్యం తెలుసుకోవటానికి ఇంతకాలం పట్టిందా?" అంటూ పకపక నవ్వింది. "సరి. సరి. నా తప్పు నేను తెలుసుకొన్నాను" అన్నాడు రాజు. మహిమగల ఆ సంగీతపు కుర్చీని, దానితో పాటు శీనుని, కిట్టు మామను రాజు తన వెంట తీసుకుపోయాడు. కుర్చీని కోటలో మంచి చోట అమర్చి, నాటినించీ శీను, కిట్టులను ఆయన తన ఆస్థానమంత్రులుగా నియమించుకున్నాడు.
Comments
Post a Comment