అనగనగనగా ఒక పట్టణంలో ఒక యువకుడు ఉండేవాడు. అతను పుట్టు పేద, పైగా ముఖంమీద ఒక తెల్లని మచ్చ ఉండటం చేత, తోడివాళ్ళందరూ అతనిని "బొల్లెయ్యా !" అనే పేరుతో పిలిచి, వేళాకోళం చేసేవాళ్ళు. ఆ పట్టపు రాజుకి రూపసి అయిన ఒక కూతురున్నది. ఆమెను పెళ్ళాడుదామని ఎంతో మంది వీరులూ శూరులూ అయిన రాజకుమారులు ఉబలాటపడ్డారు. వాళ్ళతో పాటు బొల్లెయ్య కూడా ఆ రాజకుమారిని పెళ్లాడాలెనని సరదాపడ్డాడు. కాని, అతను రహస్యంగా అద్దంలో చూచుకొన్నప్పుడల్లా, "అయ్యో! నా ముఖం మీద అంత అసహ్యకరమయిన తెల్ల మచ్చ ఉన్నదే, నావంటి అనాకారిని ఆ రాజకుమారి వరిస్తుందా ? అది కేవలమూ కలలో మాట!" అని అనుకొని, నిరాశ చెందేవాడు. ఒకరోజున బొల్లెయ్య రాజుగారి కోట ముందరి నించే పోతూ, రాజకుమారిని చూచాడు. అమె కంటపడగానే, ఏమయితే అయిందని ధైర్యంచేసి, ఆమె ఎదటికిపోయి తన వుద్దేశం వెల్లడి చేశాడు.
దానికి రాజకుమారి, "బొల్లెయ్యా! నువ్వు నన్ను ప్రేమిస్తూ వున్నట్టుగానే నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను. కాని, లాభమేమున్నది? నాకు పెళ్ళి కాకూడదని సూర్యమహారాజు శాపమిచ్చాడు. ఆయన వద్దకు పోయి, శాపం తీసివేయండని కోరుదామంటే, అది సామాన్యుల వల్ల అయే పని కాదు. కనుక, నాకు కలిగిన శాపం తీసి వేయించగల సమర్థుడు దొరికేవరకు ఇలా నేను కన్యగా ఉండిపోవలసిందే" అన్నది. "ఒశ్, ఇదొక ఘన కార్యమా? ఆ సూర్యమహారాజు వద్దకు నేను వెళ్ళివస్తానుండు" అన్నాడు బొల్లెయ్య. "అలాగయితే, ముందుగా నీ ముఖం మీది మచ్చ పోగొట్టమని కోరుకో. నీమచ్చ ఎప్పుడైతే పోతుందో, నా శాపమూ అప్పుడే తొలగిపోతుంది" అంటూ రాజకుమారి సలహా చెప్పింది.
బొల్లెయ్య వెంటనే బయలుదేరి, అడవులు పట్టి, "సూర్యమహారాజు రాజ్యానికి దారి ఏది? అంటూ కనపడిన పక్షులనూ, వృక్షాలనూ, జంతువులనూ, కీటకాలనూ పలకరించి అడిగాడు. ఒక్కళ్ళూ తెలియదన్నారు. చివరకు బొల్లెయ్య, ఒక ఏటిగట్టు చేరుకొన్నాడు. ఆ యేటిలో ఒక అందమయిన తెల్లటి హంస ఈదులాడుతున్నది. దానిని కూడా అడిగాడు బొల్లెయ్య. అందుకు ఆ హంస "నా రెక్కలు పట్టుకొని వీపు పైన కూర్చోవయ్యా, నిమిషంలో నీకు దారి చూపిస్తా" నన్నది. ఆ మాటకు సంతోషించి, బొల్లెయ్య హంస వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. క్షణం సేపటిలో అది అతనిని అవతలి ఒడ్డుకి దిగబెట్టి, సూర్యమండలానికి దారి చూపింది. కొంచెం దూరం పోయేసరికి, బొల్లెయ్యకు ఒక తుప్పలో బాణమూ అమ్ములూ కనపడినయి. తనది కాని వస్తువును తాకడం ఇష్టంలేక, బొల్లెయ్య తన దారిని తను పోతున్నాడు. ఇంతలో ఒక యువకుడు కనపడి "అబ్బాయీ! నా బాణమూ అమ్ములూ కనపడకుండా పోయినయి. వాటిని ఎవళ్ళయినా చేత పట్టుకపోగా చూశావా?" అని అడిగాడు. దానికి బొల్లెయ్య "ఇక్కడికి సరీగా అరవై గజాల దూరాన కుడి చేతివేపు తుప్పలో అవి నాకు కనపడినై, పోయి తెచ్చుకో!" అని చెప్పాడు. "నువు చాలా న్యాయమంతునిలా ఉన్నావు, నిన్ను చూడగా సంతోషమైంది. ఇలా ఎక్కడికి వెళుతున్నావు? ఎందుకు వెళుతున్నావు?" అని ఆ యువకుడు మళ్లీ అడిగే వరకు, బొల్లెయ్య తన సమాచారమంతా ఆ యువకునికి వినికిడి చేశాడు.
అది విని యువకుడు "అయితే నువు నా వెంట వచ్చెయ్యి. మా నాయనగారే సూర్యమహారాజు. నాపేరు ఉదయతార" అని చెప్పాడు. బొల్లెయ్య చెప్పిన ఆనవాలు ప్రకారం ఉదయతార తుప్ప దగ్గరకు పోయి తన బాణమూ, అమ్ములూ తీసుకొన్న తరవాత, నేస్తులిద్దరూ కలిసి పోయి సూర్యమహారాజు రాజ్యం చేరుకొన్నారు. ఉదయతార నేస్తుడయిన బొల్లెయ్యను సూర్యమహారాజు, ఆయనభార్య ఛాయాదేవీ ఎంతో గౌరవించి, "నీకు ఇష్టమొచ్చినంత కాలం ఇక్కడ మాకు అతిథిగా ఉండిపోవలిసింది" అని కోరారు. ఎవరి దర్శనం చేసుకుందామని బొల్లెయ్య ఆత్రంతో బయల్దేరాడో, ఇప్పుడు, అ సూర్యమహారాజే తనను ఈవిధంగా కోరేవరకు బొల్లెయ్యకు అపరిమితానందమైపోయింది. అలా బొల్లెయ్యా, ఉదయతార ప్రాణస్నేహితులుగా వుంటున్నారు. ఒకరోజున, ఉదయతార వేటకు పోయి వస్తామని తల్లితో చెప్పేసరికి, ఆమె "నాయనా ! ఎక్కడికయినా వెళ్లు, కాని, గండకి నది వద్దకు మాత్రం పోబోకుమా! అక్కడ మాయాపక్షుల రూపంలో దుష్టగ్రహాలు తిరుగులాడుతున్నాయట" అని హెచ్చరించింది. ఏవని అయితే వద్దు అంటామో ఆ పనే చేయటం పిల్లల నైజం. అందుచేత ఉదయతార "సరేలే" అంటూ, తల్లి ఎక్కడికయితే వద్దన్నదో సరీగా ఆ గండకి నదికే దారితీశాడు. కొంచెంసేపటికల్లా లెక్కలేనన్ని గ్రహాలు మాయపక్షులుగా వచ్చి ఉదయతారా, బొల్లెయ్యనూ చుట్టేసి, బాధించసాగాయి. సుకుమారుడైన ఉదయతార ఆ బాధకు తట్టుకోలేక, వెంటనే సోలిపోయాడు.
గుండె నిబ్బరం గల బొల్లెయ్య గభీమని బాణం చేతపట్టి, మాయపక్షులన్నిటినీ ముప్పయి ఆమడ దూరం వరకు చెదరగొట్టాడు. కిందపడిన మాయపక్షులను గొంతు మెలిపెట్టి చంపివేశాడు! కొంతసేపటికి ఉదయతార తేరుకొని లేవగానే, ఇద్దరూ కలిసి ఇంకా మిగిలివున్న మరికొన్ని పక్షులను పట్టి చంపివేశారు. తరువాత వాళ్లు ఇంటికి చేరుకొని గండకి నది వద్ద జరిగిన చిత్రాలన్నీ పూస గుచ్చినట్టు రాజుకూ రాణీకి చెప్పారు. బొల్లెయ్య ప్రజ్ఞవల్ల తమ కుమారుడు బతికి బయటపడినందుకు వారు సంతోషించారు. అతని సాహసానికి మెచ్చుకొని సూర్యమహారాజు, ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడు. ఇదే సమయమనుకొని, బొల్లెయ్య తన మనస్సులో వుద్దేశం దాపరికం లేకుండా ఆయనతో చెప్పాడు. సూర్యమహారాజు 'సరే'నని చెప్పి మంత్రోదకం చల్లేసరికి, బొల్లెయ్య ముఖం మీది తెల్లమచ్చ ఒక్క సారిగా మాయమైపోయింది. ఆ మచ్చ పోయిన వెంటనే అతనికి సుందరమైన స్వరూపం వచ్చింది. అప్పడు బొల్లెయ్యకు రాజకుమారి చెప్పిన మాటలోని అంతరార్థం బోధపడింది. ఈవిధంగా తన ప్రజ్ఞవల్ల బొల్లెయ్య ఎవరికీ సాధ్యం కానటువంటి సూర్యమండలానికి పోయి సూర్యమహారాజు వద్ద వరం పొంది, తన మచ్చ పోగొట్టుకొనటమే కాకుండా రాజకుమారి శాపం కూడా విముక్తి చేయగలిగాడు. తరువాత అతను భూలోకానికి దిగివచ్చి, ఆ రాజకుమారిని పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నాడు.
Comments
Post a Comment