ఒక పేదవాడు రోజూ అడవికి పోయి, కలప కొట్టి తెచ్చి, అది పట్టణంలో అమ్ముకొని పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. అతను ఎంత శ్రమపడినా, రోజుకి మూడణాల కంటె ఎక్కువ రాబడి వచ్చేదికాదు. ఆ మూడణాల డబ్బులతో కుటుంబ పోషణ జరగకపోయే వరకు, వానికి విరక్తి తోచింది. చివరకు ఒకనాడు, ఆ స్థలం విడిచిపోవాలని నిశ్చయించి, అతను ఒక నాటు దారి పట్టాడు. పోగాపోగా, కొంత సేపటికి అతనికి ఆకలి వేసింది. కాని చేతిలో పైసా లేకపోతే, ఎవరు ఆదరిస్తారు? మరి కొంతదూరం పోయేసరికి, ఒక మైదానం కనపడింది. ఆ మైదానంలో కొంతమంది సిపాయీలు కవాతు చేస్తూ, "బుధవారం- కాదు, గురువారం. గురువారం - కాదు, బుధవారం. రైట్ - లెఫ్ట్ - రైట్ - లెఫ్ట్" అని అడుగులు వేస్తున్నారు. కట్టెలవాడు వాళ్ళ కవాతు అబ్బురంగా చూస్తూ, నిలబడిపోయాడు. కొంతసేపటికి సిపాయీల కవాతు పూర్తి అయింది. వాళ్లు భోజనాలకు కూర్చున్నారు. కాని ఒకళ్లూ కట్టెలవాణ్ణి రమ్మనలేదు పొమ్మనలేదు. వానికి కడుపులో ఎలికెలు గెంతులేస్తూ వుండటంచేత, తనంత తనే పోయి ఒక విస్తరిము౦దు కూర్చున్నాడు. అతను తిండి తిన్నంత సేపూ సిపాయిలు ఏమీ అనలేదు గాని, తీరా లేచి, పోబోయేవరకు, వాళ్లు "అబ్బాయీ, అలా పోవటానికి వీల్లేదు. మా తిండి తిన్నందుకు సరిపడేటట్టు పనిచేసి మరీ పోవాలి" అన్నారు. అందుచేత వాళ్ళతో పాటు "బుధవారం- కాదు, గురువారం. గురువారం - కాదు, బుధవారం. రైట్ - లెఫ్ట్ - రైట్ - లెఫ్ట్" అంటూ కవాతు ప్రారంభించాడు.
రాత్రిపూట వాళ్ళ మకాములోనే పడుకొని, తెల్లవారగానే మళ్లీ 'పోయివస్తాను' అన్నాడు. ఇప్పుడుకూడా వాళ్లు పోనీయలేదు. "అబ్బాయీ! మా తిండి ఎవరైతే తింటారో, వాళ్లు కనీసం ఐదేళ్లవరకైనా మా సేవ చేస్తూ వుండాలి. ఒక్కొక్కప్పుడు పాతికేళ్ల వరకూకూడా ఉండిపోవలసి వస్తుంది. ఇది మా నియమం." అని చెప్పారు. వాళ్ళ తిండి తిన్నందుకు, చచ్చినట్టూ ఆ కట్టెలవాడు సిపాయిలతో పూర్తిగా అయిదేళ్ల పాటూ ఉండిపోయి, వాళ్ళను సేవించుకొన్నాడు. గడువు తీరటంతోనే, అతను సేనాధిపతి వద్దకు వెళ్లి, సెలవిప్పించుమనెవరకు, సేనాధిపతి అతని సేవకు మెచ్చుకొని, ఒక పటకా, ఒక పిల్లనగ్రోవి, ఒక చొక్కా, ఒక లోహపుకూజా ఈ నాలుగు బహుమతి చేశాడు. వాటితో మళ్లీ తన పూరి గుడిసె చేరుకుని, మునపటి వలెనే కట్టెల వృత్తి సాగించనారంభించాడు. ఒక రోజున తను సంపాయించుకు వచ్చిన బహుమతుల సంగతి జ్ఞాపకం రాగా, వాటిల్లో పటకా తీసి నడుముకి పెట్టుకుని, మామూలుగా అడివికి వెళ్లాడు. ఈ రోజున కూడా ఎప్పటివలె మూడణాలు మాత్రమే రాబడి వచ్చింది. ఇందుకు విచారిస్తూ, ఆ మూడణాలూ పటకా సంచిలో పడవేసుకొని అతను ఇల్లు చేరుకొన్నాడు. తరువాత బజారుకుపోయి, తన పటకా సంచిలో ఉన్న మూడు అణాలలోనూ ఒక అణా దుకాణదారునికి ఇద్దామని తీయబోయాడు. తీరా చూచేసరికి మూడణాలకు బదులు మూడు వరహాలున్నయి. ఈ మార్పుకు నిర్ఘాంతపోయి, మాటాడక చల్లగా ఇంటికి మరలిపోయాడు. మరునాడు యధాప్రకారం, కలప మోపుకి మామూలు మూడణాలే వచ్చింది. పటకా సంచిలో వాటిని పడవేసి, తిరిగి తీసే వరకు, మళ్లీ మూడు వరహాలున్నయి.
ఈ కీలకమంతా తను ధరించిన పటకాలోనే ఉన్నదని అతను గ్రహించాడు. ఏ రోజు కారోజు అతను పటకాలో పడవేసే మూడణాకాసులూ మూడు వరహాలుగా మారిపోతున్నవాయె! ఇక శ్రీమంతుడు కావటానికి లోటేముంది? అతను కొద్దికాలంలోనే కోటీశ్వరుడైనాడు. కొన్నాళ్ళకు కట్టెలవాడు కాలము చేయగా, అతని కుమారుడు ఈ వృత్తి సాగించుతూ వచ్చాడు. కుర్రవానికి కూడా మోపుకి మూడణాలు మాత్రమే వచ్చేది. వాడు విరక్తితో ఒకనాడు తల్లి వద్దకు వెళ్ళి "అమ్మా! అమ్మా! ఎన్నాళ్ళు శ్రమపడినా మోపుకి మూడణాలకు మించి ఒక్క దమ్మిడి అయినా ఎక్కువ రావటం లేదు. నాయన మాత్రం నేను కొట్టినన్ని కట్టెలే కద కొట్టేవాడు? కాని రాత్రి అయేసరికల్లా అయన వరహాలు కురిపించేవాడే? ఈ కీలకమేదో నాకు చెబితే కాని వీల్లేదు" అంటూ పట్టుపట్టి కూర్చున్నాడు. ఆమె రహస్యం వెల్లడి చేయకుండా తప్పించుకోబోయింది. కాని, అతను లొంగక, "చెబితేనే చెప్పావు. లేకుంటే పీక తెగవేస్తానని" బెదిరించాడు. ఈ బెదిరంపుకు భయపడి, ఆమె తక్షణమే కొడుకును ధనాగారములోకి తీసుకుపోయి, "నాయనా! ఇదుగో, నీ తండ్రి సంపాదించిన ఆస్తి అంతా ఇదే. బాగుపడతావో, చెడిపోతావో ఆ పైన నీ అదృష్టం" అని చెప్పింది. అదంతా ఒక్కసారిగా చూచేవరకు, కుర్రవాని కళ్ళు జిగాలుమని, మనస్సు అనేక విధాల పరుగులెత్తింది. రాజు కుమార్తెను పెళ్లిచేసుకోవాలనుకొని, తన ఉద్దేశం ఆ దేశపు రాజుకి తెలియజేశాడు. ఈ రాయబారం విని, రాజు నవ్వు పట్టలేక పోయాడు.
"సరే. రాజకుమారిని ఇస్తాము. ఒక వంద బస్తాలనిండా వరహాలు జాగర్త పెట్టు" అని వేళాకోళంగా జవాబు పంపించాడు. రాజు పంపిన వార్తకు కుర్రవాడు, "ఓస్, ఇంతేనా మహారాజు కోరిక! ఇంకా ఏమో అనుకొన్నాను," అని తలచి, గదిలోని ధనమంతా బస్తాలలోకి ఎక్కించాడు. ఆ ధనంతో పూర్తిగా తొంభైతొమ్మిది బస్తాలు నిండినై, నూరవ బస్తా పూర్తి కాలేదు. అప్పుడు కుర్రవాడు తల్లితో "తొంభైతొమ్మిది బస్తాల ధనం సంపాదించగలిగిన నా తండ్రి అంతటితో ఊరుకుంటాడా? ఇంకా ధనం ఉండివుండాలి. ఎక్కడ దాచావో చెప్పు" అన్నాడు. తల్లి ఎంత చెప్పినా లాభం లేకపోయేవరకు, ఆమె కుర్రవానికి భర్త సంపాదించినా పటకా ఇచ్చి, దాని రహస్యం వెల్లడించింది. ఈ రహస్యం తెలిసిన కొద్ది రోజులకే కుర్రవాడు ధనం పోగుజేసి, నూరో బస్తా పూర్తి చేసి, రాజుగారికి పంపించాడు. నూరు బస్తాల వరహాలు అందుకోగానే రాజు ఆశ్చర్యపడి, కుర్రవాడిని రమ్మని కబురుచేశారు. "ఓయి అబ్బాయీ! నీ ప్రజ్ఞకు చాలా సంతోషించాము, షరతు నెరవేర్చావు గనక మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయటానికి ఏమీ అభ్యంతరము లేదు. కానైతే, ఇంత త్వరలో మేము కోరిన ధనమంతా ఎలా సమకూర్చగలిగావో మేము తెలుసుకోవాలి. మా అభిలాష తీర్చావంటే, పెళ్లి సన్నాహాలు చేయిస్తాము," అని రాజు అతన్ని లాలన చేశాడు. రాజు పలికిన పలుకులన్నీ యదార్థమే అనుకొని, కుర్రవాడు పటకాను గురించిన కీలకం వెల్లడించివేశాడు. ఈ రహస్యం తెలియగానే, రాజు "ఓరి దౌర్భాగ్యుడా! ఇదంతా నీ ప్రజ్ఞ ఏమో అనుకొన్నాను. ఇంతాజేసి ఈ పటకా సహాయంతోనా ఇంత గమ్మత్తు చేశావు. ఇటువంటి పటకా ప్రభువులదగ్గర ఉండాలిగాని నీ వద్ద ఉండవచ్చునా" అంటూ గర్జించాడు.
అంతలో భటులువచ్చి అతన్ని చితక మోది, పటకా ఊడదీసి లాక్కొన్నారు. ఇక యిప్పుడు చేసేదేముంది? దేవుడా అంటూ ఇంటికి మరలి, తనకు కలిగిన పరాభవాన్ని గురించి తల్లితో చెప్పుకొని ఏడిచాడు. కుర్రవాని గోల భరించలేక ఆమె, భర్త దాచివుంచిన వస్తువులలో పిల్లనగ్రోవి పట్టుకువచ్చి, "నాయనా! ఈ పగిలిపోయిన పిల్లనగ్రోవి మాత్రమే మనకు మిగిలిఉన్న ఆస్తి. ఇది తీసుకుపో. బాగుపడినా, చెడిపోయినా నీ అదృష్టం," అని చెప్పింది. దీని మహిమ ఏమిటో చూదామని అతను నోటిలో పెట్టుకుని ఒక్కసారి ఊదేవరకు, ఒక సిపాయివచ్చి, ఎదట నిలబడ్డాడు. మళ్ళీ ఊదినప్పుడల్లా ఒక్కొక సిపాయి ప్రత్యక్షమవుతూ వుండేసరికి ఈ మహిమ చూచి అతను సంతోషించాడు. ఇలా ఆ కుర్రవాడు అనేకమంది సిపాయిలను సృష్టించేవరకు, రాజ్యమంతా సైన్యంతో నిండిపోయింది. ఈ వార్త రాజుకి తెలిసి, కట్టెలవాని కొడుకుకు కబురుపెట్టాడు. "అబ్బాయీ! నువు ఇంత గొప్పవాడివని మాకు తెలియకపోయింది. ఈసారి మా అమ్మాయిని నీకు తప్పకుండా పెళ్లి చేస్తాము. అయితే, నీకు ఈ సేన ఎలా సమకూడిందో ఆ కీలకం మాకు చెప్పాలి" అని పొగిడేసరికి, కుర్రవాడు ఉబ్బిపోయి, పిల్లనగ్రోవిని గురించిన రహస్యం వెల్లడి చేసివేశాడు. ఈ రహస్యం తెలియగానే రాజు మునపటివలెనే కుర్రవాణ్ణి గద్దించి, వానిని మెత్తగా తన్నించి, పిల్లనగ్రోవిని లాక్కున్నాడు.
మళ్లీ కుర్రవాడు ఏడుస్తూ తల్లి వద్దకు వచ్చి వలపోసికోగా, ఆమె జాలిదలచి, భర్త విడిచిపోయిన బహుమతి వస్తువులలో మూడవది అయిన చింకిచొక్కా ఇచ్చి, "ఇదే ఉన్నది నాయనా! నీ అదృష్టం ఎలా ఉంటుందో చూచుకో" అన్నది. ఈ చింకిచొక్కా చిత్రమేమిటో, చూతామని కుర్రవాడు తొడుగుకొనేసరికల్లా తన మనసులోని ఉద్దేశం ప్రకారం రాజుగారి కోటలో ఉన్నాడు. కోటలోకి వెళ్లి చొక్కా తీసివేసేసరికల్లా ఇంటిలో వున్నాడు! మళ్లీ చొక్కా వేసుకొన్నాడు. తక్షణమే కోటలో ప్రత్యక్షమైనాడు. ఈ కీలకం తెలిసిన తరువాత ఇక ఆలస్యం చేయకూడదని తలచి చరచర రాజకుమారి అంతఃపురంలోకి పోయి, ఆమెను పలుకరించబోయాడు. ఇలా రోజూ అతను ఆమె వద్దకు వస్తూ పోతూ ఉండేవరకు, రాజకుమారి భయపడి ఒకనాడు ఈ సంగతి తండ్రితో వెల్లడించింది. అప్పుడు రాజు, ఈ మహిమగల చొక్కాను కాజేయటానికి ఒక సేవకుని నియమించాడు. ఆ సేవకుడు కన్నముగల ఒక పెట్టెను రాజకుమారి గదిలో పెట్టించి, అందులో తను దూరి కూర్చున్నాడు. ఈసారి కుర్రవాడు వచ్చి, చొక్కా విప్పి అక్కడ పెట్టగానే యుక్తిగా వాడు ఆ చొక్కాను కాజేసాడు. ఇంతలో రాజకుమారి గోల చేసే వరకు, కోటలోని పరివారము అతనిని చుట్టుముట్టి, మునుపటికంటె ఎక్కువగా తన్ని వదిలిపెట్టారు. అతను చచ్చి చెడి తప్పించుకొని సిగ్గుతో తల్లివద్దకు వచ్చి 'బుద్ధి వచ్చింది, క్షమించు' మంటూ ప్రాధేయపడ్డాడు. కుమారుని అవస్థ చూచి, ఆమెకు కడుపు కరిగిపోయింది. తన భర్త సంపాయించిన బహుమతులలో చివరకు మిగిలిన కూజా కొడుకు చేతిలో పెట్టి, "నాయనా! మన ఆస్తిలో ఇదే కడాపటిది. నీ గీత ఎలా ఉంటుందో చూచుకో" అన్నది.
ఆ కూజా పట్టుకుని అతను రివ్వున పొలాలలోకి పారిపోయాడు. పోయి పోయి తన కూజా పక్కని పెట్టుకుని ఒక పర్వతం దిగువ కూర్చున్నాడు. వెంటనే ఒక దివ్యమైనటువంటి తోట కనపడింది. ఆ తోట రకరకముల ఫలజాతులతో నిండి వున్నది. ఆ చెట్ల పళ్లు చేతికి అందుతూ వున్నయి. తన దగ్గరగా వుండే ఒక చెట్టును నుంచి ఒక రేగుపండు తుంచి, తినబోయాడు. అది గొంతు దిగిందో లేదో, అతని తల మీద రెండు గొఱ్ఱెకొమ్ములవంటివి మొలవ నారంభించాయి. ఏమీ తోచక అతను చేయి చాపి, మరొక చెట్టునుంచి జామపండువంటిది తీసుకుని తినబోయాడు. అది నోటికి తగలడంతోనే అతను ఒక గాడిద స్వరూపం పొంది గాడిద అరుపులు అరవటం ప్రారంభించాడు. గాడిద రూపంలో ఉన్న కట్టెలవాని కొడుకు ఆ దగ్గరనే ఒక బంజరులో గడ్డి మేయబోగా, ఆ గడ్డి కొరికిన తక్షణమే అతను తిరుగా మామూలు మనిషి అయిపోయాడు. ఈ విధంగా మార్పులు కలిగిన తరవాత, అతను ఆ ఫలాలూ ఆ గడ్డీ ఆనవాలు పెట్టుకొని, రకానికి కొంచెం తీసుకొని, జేబులు నింపుకొన్నాడు. ఒక యోగివేషంతో దైవ ప్రార్థనలు చేసుకొంటూ అతను పోతూ వుండగా, పదిమందీ కలసి ఆ యతీశ్వరుని వద్ద ఏమైనా మహత్తు ఉన్నదేమో, తెలుసుకొని మేలు పొందుదామనే ఆశతో గుమికూడారు. ఒక చెట్టుకింద యతి బస ఏర్పరచుకొని, వాళ్లకు ఉపదేశం చేయ నారంభించాడు.
ఆ శిష్యులలో తనను హింసించిన రాజభటులుకూడా ఉన్నారు. వాళ్ళకు తనపైన నమ్మకం కుదిరినట్టు కనిపెట్టి, ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క రేగిపండు ఇచ్చి తినమన్నాడు. వాళ్ళు ఆ పండ్లు తినగానే తలలపైన గొర్రెకొమ్ములు మొలవనారంభించాయి. ఆ శిష్యులు పదిమందీ యతీశ్వరుని కాళ్ళపైన పడి, "మహాత్మా! ఏ పాపమూ ఎరుగని మాకు ఇటువంటి కఠిన శిక్ష విధించారేమిటి? దయవుంచి, ఈ కొమ్ములు పోగొట్టండి," అంటూ బతిమాలాడారు. "అయితే మీరు నన్ను కొట్టి, నా వద్ద నుంచి లాగికొన్న పటకా, పిల్లనగ్రోవి, చింకిచొక్కా నాకు పట్టుకువచ్చి ఇయ్యండి. రాజు వాగ్దానం ప్రకారం, రాజకుమారికి నాకూ పెళ్లి ఏర్పాటు చేయండి" అన్నాడు. అప్పుడు వారు, "ఓహో, ఈ యతీశ్వరుడు ఫలానా కదా" అని చెప్పి గుర్తించారు. గత్యంతరం లేక, ఆ పరిచారకులు వెంటనే కోటకు పోయి, రాజుతో దెబ్బలాడి, కట్టెలవాని కొడుకు వద్ద అన్యాయంగా లాగికొన్న మూడువస్తువులూ తిరిగి పట్టుకువచ్చి, అతనికి ఇచ్చివేశారు. అప్పుడు అతను వాళ్లచేత గడ్డి తినిపించి, కొమ్ములు పోగొట్టేవరకు, వాళ్లు బతుకుజీవుడా అనుకొని, ఎంతో సంతోషించారు. అతని మహత్తు తెలుసుకొన్న ఆ పరిచారకులు రాజునూ గద్దె మీదినించి తొలగించి, కట్టెలవాని కొడుకునకే పట్టం కట్టారు. రాజకుమారిని అతనికి పెళ్లిచేశారు. అంతగా తనను పరాభవించిన రాజుకి మాయాజామపండు ఇచ్చి తినుమనేసరికి, పాపం రాజు గాడిదగా మారిపోయి, బ్రతికి ఉన్నంతకాలము బేబే అని అరుస్తూ వుండిపోయాడు. ఈ విధంగా రాజు, తను చేసిన పాపాలకు ఫలితం అనుభవించాడు.
Comments
Post a Comment