అనగనగా ఒక దేశంలో ఇద్దరు అన్నాదమ్ములు ఉండేవాళ్ళు. అన్న యుక్తిపరుడు, జిత్తులమారిన్ని. తమ్ముడు సాధుశీలుడు, సత్యకాలపువాడున్ను. యుక్తులచేత, మాయోపాయలచేత అన్న కోకొల్లలుగా డబ్బు గడించి, ధనవంతుడైనాడు. ఆ డబ్బుతో అతను ఒక దివ్యభవనం కట్టించాడు. భార్యకు విలువైన నగలు చేయించాడు. మంచి మంచి దుస్తులు కొన్నాడు. సమస్తమైన ఐశ్వర్యాలూ అనుభవిస్తున్నాడు. ఐశ్వర్యంతో పాటే అనేకమంది ఆశ్రితులు చేరుకొని, వందిమాగధులవలె అతన్ని పొగడనారంభించారు. ఈ విధంగా, సిరి పట్టినప్పటినించీ, అతను పట్టిందల్లా బంగారమూ, ముట్టిందల్లా ముత్యమూ కాజొచ్చింది. పొతే, తమ్ముని సంగతంతా తారుమారైంది. పంటలా నాశనమైనాయి. దొమ్మరోగం వచ్చి పశువులు చచ్చినై. ఈయవలసిన బాకీలు తప్పలేదు, రావలసినవి రాలేదు. అందుచేత అప్పులవాళ్ళ పీడ మిక్కుటమైంది. ఏదీ కలిసిరాక, కాసుకు గతిలేక తనూ, భార్యా పిల్లలూ కడుపులో కాలీపెట్టుకుని రోజులకు రోజులు పస్తు పడుకోవలసివచ్చింది. ఈ దరిద్రబాధ పడలేక ఒకనాడు అతని భార్య "మీ అన్నకు బోలెడంత భాగ్యముంది. ఒక్కసారిపోయి, మనస్థితిగతులు చెప్పండి. ఏమైనా సాయంచేస్తాడు. ఎవరినీ ఏమీ అడక్కపోతే ఎలా గడుస్తుంది? అడగందే అమ్మ ఐనా పెట్టదు కదా! ప్రాణాలు నిలవటం లేదు. పోయిరండి" అంటూ పోరుపెట్టింది. ఇలా ఆమె నాలుగైదుసార్లు వేధించేవరకు, "సరే, పోయివద్దం. సోదరుడు ఏమీ సాయంచేయకపోతాడా" అని నమ్మి చిన్నవాడు ఆ రోజే అన్న వద్దకు బయల్దేరి వెళ్ళాడు.
అతని గోడు అంతా విని, "చూడు తమ్ముడూ! రేపు లేదు. ఎల్లుండి గురువారంనాడు నా పుట్టినరోజు పండుగ. మరదలిని పిల్లలనూ వెంటబెట్టుకుని, నీవు తప్పక రావాలి సుమా!" అని ఆప్యాయంగా పిలిచాడు అన్నగారు. తమ్ముడు ఎంతో ఆశతో ఇంటికి వచ్చి, ఈ సంగతి భార్యతో చెప్పేసరికి, ఆమె కూడా సంతోషించింది. గురువారం నాడు అన్నగారు తనకేదో గొప్ప బహుమతులు ఇస్తాడు, ఈ దెబ్బతో కుటుంబ దరిద్రం తీరిపోతుంది అని తమ్ముడు లొట్టలు వేస్తున్నాడు. గురువారం తెల్లవారగట్టే లేచి, తమకు ఉన్న చింకిబట్టలే వేసుకుని, నాలుగామడ నడిచిపోయి, అన్న ఉండే పట్టణం చేరుకున్నారు తమ్ముడూ, కుటుంబమున్నూ. వీళ్ళు పోయేసరికల్లా అన్నగారి భవనం కళకళలాడుతూ వుంది. దేశదేశాలనుంచి లక్షాధికారులూ, కోటీశ్వరులూ వచ్చారు విందుకి. ఆ శ్రీమంతులందరూ చక్కా బారులుతీర్చి కుర్చీలలో కూర్చున్నారు. వారందరకూ మేజాలపైన ఫలహారాలు, పానీయాలూ పొందికగా అమర్చబడి వున్నాయి. తినేవాళ్ళు తింటున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు. పొట్టలు ఉబికేటట్టు దట్టించినప్పటికీ, "మరొక్క లడ్డు వేయించుకోండి, మరికొంచెం పాయసం వేయనీయండి" అంటూ అన్నగారు ఆ శ్రీమంతులందరినీ ఇంకా బలవంత పెట్టసాగాడు. ఇలా వందలూ వేలూ జనం వచ్చి విందు ఆరగించి, గర్రుమని తెనుస్తూ తాంబూలాలు సేవించారు. కాని, ఒక్కళ్లూ తమ్ముని వేపు కన్నెత్తి చూడనేలేదు.
అందుచేత, అందరూ తింటూవుంటే అతనూ కుటుంబమూ చూస్తూ కూర్చోవటమే కానీ, కణమైనా కొరికిన పాపాన పోలేదు. విందు పూర్తికాగానే, బ్రహ్మాండమైన సభ జరిగింది. ఆ సభలో, అన్నగారి వైభవాన్ని గురించీ ఐశ్వర్యాన్ని గురించీ మెచ్చుకొంటూ శ్రీమంతులందరూ ఉపన్యాసాలు చేశారు. కీర్తనలు పాడారు. విందు పూర్తి అయింది. ఎవరి దారిన వాళ్ళు సెలవు తీసుకొని ఇళ్ళకు బయలుదేరారు. అప్పటివరకు కూడా అన్న, తమ్మునివంక చూడనయినాలేదు. తమ్ముడు కుటుంబంతో సహా వచ్చిన సంగతి తనకు తెలియనట్టే అతను ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఇలా అవమానం పొంది తమ్ముడు తన భార్యా పిల్లలతో తిరిగి తన యింటికి వట్టి చేతులతోనే బయలుదేరాడు. దారిలో అతను యధాలాపంగా, విందులో పాడిన పాట పాడుతూ నడవసాగాడు. ఎప్పుడైతే అతను పాడటం మొదలుపెట్టాడో మరో గొంతుకూడా అతని పాటతో పాటు కలిసి పాడుతున్నట్టు వినిపించింది. మొదట అతను ఆ పాడుతున్నది తన భార్యయేనేమో అనుకుని "నీవేనా నాతో కలిసి పాడుతున్నది?" అని ఆమెను అడిగాడు. "నేనేమీ పాడలేదు. అయినా యింత పరాభవం పొందికూడా పాట పాడేటంత సిగ్గుమాలినదాన్ని కాదు." అన్నది. ఇంతలో ఆ ప్రక్కనే చెట్లమరుగులోంచి "నీతోపాటు పాడింది నేనేనయ్యా. నేను దరిద్ర దామోదరుణ్ణి. ఎన్నాళ్లనించో కాచుకుని వున్నాను. ఎవరు దొరుకుతారా స్నేహానికి అని. ఇవాళ నువ్వు దొరికావు నిన్ను వదిలేదిలేదు. నన్ను కూడా నీతో తీసుకుపో" అని వినిపించింది.
ఆ మరుక్షణమే ఒక మరుగుజ్జు వాళ్ళ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. తమ్ముడూ, కుటుంబమూ, దరిద్ర దామోదరుడూ కలిసి, వాళ్ళ ఇంటికి చేరుకొన్నారు. ఇంటికి చేరుకున్న తరువాత దరిద్రదామోదరుడు "తమ్ముడూ! తాగివచ్చి తందనాలాడుదాము. ఎప్పుడూ విచారంగా ఉంటావేమిటి? పోదాం, పద" అని ప్రోత్సహించాడు. "నాకు డబ్బులేదు" అన్నాడు తమ్ముడు. "డబ్బు లేకపోవడమేమిటి? నీ పై మీది చొక్కా ఉండగా మనకు ఏం తక్కువ? అమ్మివేదాం పద" అంటూ అతన్ని తీసుకుపోయాడు. ఈ విధంగా దరిద్ర దామోదరుని ప్రోద్బలం వల్ల, రోజుకొకటి చొప్పున ఇంట్లో వుండే సరకూ సప్పరా పట్టుకపోయి అమ్మి తమ్ముడు తాగివేశాడు. చివరకు తమ్ముని భార్యకు ఒంటిమీద రెండు చింకి చీరలు మాత్రం మిగిలినై. "నీ భార్యకు రెండు చీరలెందుకయ్యా? అందులో ఒకటి తీసుకురా?" అని దరిద్ర దామోదరుడు తమ్ముణ్ణి ఉసికొలిపి తీసుకపోయినాడు. అది కూడా అమ్ముకొని తాగివేసేవరకు ఇంట్లో ఏమీ మిగలలేదు. తరువాత, దామోదరుని మాయావల్ల తమ్ముడు, పొరుగున ఉండే ఒక ధనికుని వద్దకు పోయి, "అయ్యా! మీ బండీ ఎద్దులూ ఒకసారి నాకు యిప్పించండి. మళ్ళీ రేపు తీసుకవచ్చి ఒప్పగించివేస్తాను" అని కోరగా, ధనికుడు లేదనకుండా ఇచ్చాడు. బండి ఇంటికి రాగానే, దరిద్ర దామోదరుడు "తమ్ముడూ! ఇక్కడికి తూర్పుదిక్కున నాలుగామడ దూరంలో, తాటితోపు పక్కన ఉండే నల్లపాషాణం ఎరుగుదువా?" అని అడిగాడు.
"ఓస్ నాకేమిటి. నల్లపాషాణం తెలియకపోవడమేమిటి?" అంటూ సగర్వంగా ఎదురు ప్రశ్న వేశాడు తమ్ముడు. "మరైతే, బండి అక్కడికి తోలుకు పద!" అన్నాడు దామోదరుడు. దామోదరుని మహిమ వల్ల తమ్ముడు ఆ బ్రహ్మానందమైన నల్ల పాషాణం ఎత్తేటప్పటికి, ఒక రంధ్రం అగుపించింది. ఆ రంధ్రం ద్వారా పోయి, తళతళలాడే బంగారపు ముక్కలూ, మిలమిల మెరిసే నవరత్నాలూ, ఒక్కటీ వదిలిపెట్టకుండా పట్టుకువచ్చి బండిలో ఎక్కించమన్నాడు దామోదరుడు. అతను చెప్పినట్టల్లా శ్రమపడి చేస్తూనేవున్నాడు తమ్ముడు, మంచి మనస్సుతో. ఎంత చురుకుగా పని చేస్తూవున్నా, దామోదరుడు "రా, రా, తాగటానికి వేళ మించిపోతూంది" అంటూ కంగారుపెట్టసాగాడు. "ఈ దుర్మార్గుడు ఇంతవరకు నన్ను క్షవరంచేసి వదిలాడు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని తాగుడు మానితే తప్ప ఇక బాగుపడే మార్గం కనపడదు. కానైతే ఇప్పుడింకా 'తాగుడుకు పోదాం, ర' మ్మని తొందరచేస్తూనే వున్నాడు. కనుక ఏదైనా ఉపాయం చేత వీని పీడ వదిలించుకోవాలి" అని నిశ్చయించుకున్నాడు, తమ్ముడు. ఈ ఉద్దేశంతో అతను దరిద్ర దామోదరునితో "ఓయి, అన్నా! ఇంతా కష్టపడి వచ్చి, ధనం వదిలేస్తే సార్థకమేమున్నది? నీవుపోయి ఒక్కటీ మిగలకుండా ఒక్కసారి చూచిరా" అనేవరకు దామోదరుడు గోతిలో జర్రున జారాడు. వెంటనే తమ్ముడు టపీమని నల్లపాషాణం దొర్లించి రంధ్రం మూసివేశాడు. చేసేదిలేక, దామోదరుడు దేముడా అంటూ గోతిలో కప్పడిపోయాడు.
దరిద్ర దామోదరుణ్ణి బిలంలో బంధించి వేశాక తమ్ముడు బంగారము, నవరత్నాలు నింపుకున్న బండితో ఇల్లు చేరుకున్నాడు. బదులుతెచ్చిన బండీ ఎద్దులూ ధనికునికి ఇచ్చేశాడు. రాజుగారి కోటను మించిన ఒక సుందరమైన భవనం కట్టించుకొన్నాడు. భార్యకు కోరినన్ని నగలు చేయించాడు. పాడిపంటలకూ, సిరిసంపదలకూ కాస్తంతైనా లోటు లేకుండా అన్న కంటె ఎక్కువ వైభవంతో వెలిగిపోతున్నాడు. ఇలా ఉండగా తమ్ముని పుట్టినరోజు వచ్చింది. మునుపంటే దరిద్రుడు గనుక ఇంట్లో కథా, కార్యమూ తలపెట్టటానికి తాహతు లేకపోయింది. కానీ, యిప్పుడతనికేం లోటు? అతను తలుచుకుంటే కొండ మీది కోతి దిగివస్తుందన్నమాట. అందుచేత అన్నగారివలెనే తను కూడా పుట్టినరోజు పండగ చేసుకోవాలని కుతూహలం కలిగింది తమ్మునికి. తమ్ముడు వెళ్ళి అందరితో పాటు అన్నగారినీ కుటుంబాన్నీ ఫలానారోజున రమ్మని పిలిచాడు. అమిత ఆశ్చర్యంతో అన్న ఆ రోజున బయల్దేరి వెళ్ళేవరకు, మామూలు చోట తమ్ముని పూరిగుడిసె తనబడలేదు. అతన్ని గురించీ భోగట్టా చేయగా, ఆ వూరివారు తమ్ముడు ఉండే దివ్యభవనానికి దారి చూపించారు. తనను మించిన తమ్ముని ఐశ్వర్యం చూచి అన్నగారూ, కుటుంబమూ 'ఔరా, ఇంతలో వీడికి ఇంత సిరి ఎలా పట్టిందా' అని ముక్కు మీద వేలు వేసుకొన్నారు. ఆ రోజున తమ్ముని ఇంటికి దేశదేశాల నుంచి అతిథులు వచ్చారు. అపూర్వమైన విందు జరిగింది. తమ్ముని కీర్తి మోగిపోయింది. ఇదంతా చూడగా, అన్నగారికి పట్టరాని అసూయ బయల్దేరింది. అతను ఎలాగో సాయంత్రంవరకూ ఉండి అందరూ వెళ్ళిపోయినతరువాత తమ్ముణ్ణి అనేకవిధాల పొగడి, "ఈ సంపద అంతా ఎలా వచ్చింది తమ్ముడూ?" అని ఆత్రంతో అడిగాడు.
తమ్ముడు తనను దరిద్ర దామోదరుడు ఆవహించటం, తాటితోపు దగ్గర నల్ల పాషాణంకింద వున్న ధనం తన బండిలో వేయించటం, మొదలైన సంగతులన్నీ మాయా మర్మం లేకుండా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఈ రహస్యం తెలియగానే అన్న ఒక్క క్షణమైనా నిలువక, "సరే ఉండు, నీ పని పట్టిస్తాను. నాకంటె ఎక్కువ సిరితో తులతూగడం ఏమిటో చూస్తాను" అని మనస్సులో అనుకుని తమ్ముడి దగ్గర సెలవు తీసుకుని తిరిగి యింటికి చేరుకున్నాడు. నల్లపాషాణంకింద ధనం ఉన్నట్టు తెలుసుకున్న అన్నగారు మరునాడు ఉదయానే బయల్దేరి తాటితోపువద్దకు చేరుకొని, మెల్లిగా పాషాణం ఎత్తి నిజమో కాదోనని తొంగి చూడబోయినాడు. ఎంత యత్నించినా దానిని ఎత్తటానికి అతని వల్లకాలేదు. కాని, కొంచెం తెరిచేసరికల్లా ఉగ్రుడైవున్న దరిద్ర దామోదరుడు ఆ సందులోనుంచి చేయిదూర్చి అతని పీక పట్టుకొని నులిమి వేయజొచ్చాడు. అప్పుడు అన్న ఉక్కిరిబిక్కిరి ఐపోయి, "దామోదరా! దామోదరా!! నేనెవరిననుకొంటున్నావో! నిన్ను ఈ గండిలో బంధించినవాడు నా తమ్ముడు కానీ నేను కాదుసుమా! ఇద్దరమూ ఒకే పోలికగా ఉండటం చేత నన్ను చూచి వాడే అనుకుంటున్నావు కాబోలు. నను విడిచి పెట్టి వెసెయ్యి" అంటూ గోలపెట్టాడు. "పోవోయ్ మోసగాడా! ఇదివరకు చేసింది చాలక ఇంకా ఇప్పుడు కూడా దగా చేయటానికని వచ్చావా? నీ దొంగ మాటలు ఎవరు నమ్ముతారనుకున్నావు?" అని గద్దించాడు దరిద్ర దామోదరుడు.
"నిజానికి నేనిప్పుడు నిన్ను ఈ బంధం నుంచి విడిపించటానికే వచ్చాను. నా మాట నమ్ము దామోదరా!" అని కాళ్ళా వెళ్ళా పడేవరకు, దామోదరుడు "సరే, పద. ఇంటికి పోదాం" అంటూ అతని జుట్టు కళ్లెంగా పట్టుకుని భుజాలమీద ఎక్కికూర్చుని, ఇంటికి చేరుకొన్నాడు. ఇంటికి వెళ్ళినప్పటినించీ దరిద్ర దామోదరుడు తన మామూలు మాటలను అన్నపైన ప్రయోగించి, అతనికి తాగుడు మప్పి తమ్మునివలెనే ఫకీరుచేసి వదిలాడు. తను ఇంత దరిద్రస్థితికి వచ్చినా దామోదరుని పీడ వదిలే మార్గం కనపడలేదు. అప్పుడు అన్న దాగుడుమూతలాడుకుందాం అని మిష పెట్టి మెల్లగా ఒక బండిచక్రపుఖాళీలో వాడు ఇరుక్కునేటట్టు యుక్తి చేసి, మళ్ళీ ఎన్నడూ ఇవతలకు రాలేకుండా కొయ్యలు బిగించి బంధించి వేశాడు. అంతేకాదు. ఆ చక్రాన్ని అతను దేముడా అంటూ మూసుకుపోయి, దూరాన ఉండే ఒక నదిలో వదిలిపెట్టడు. ఆ చక్రం నదిమీద అలా అలా కొట్టుకుపోయి, నడిసముద్రం చేరుకొన్నది. సముద్రంలో తేలి ఆడుతూవున్న ఆ బండి చక్రాన్ని అలా ఉండనిస్తే బాగుండిపోను. దరిద్ర దామోదరుడికి తిండి తిప్పలు లేక పస్తుండి చచ్చిపోతే ప్రపంచానికి వాడి పీడ విరగడైపోను. కానీ, ఎవడో ఆశపోతు రాముడు ఒకనాడు ఆ చక్రాన్ని చూచాడట. తేరగా దొరికిందికదా అని తలిచి, శ్రమపడి దాన్ని ఒడ్డుకి లాక్కుని వచ్చి, అన్న దిగగొట్టిన శీలలు విడకొట్టేవరకు దరిద్ర దామోదరుడు మళ్ళీ భూలోకంలో ప్రవేశించి, ఇష్టం వచ్చినట్టు ప్రజలనందరినీ పీడిస్తున్నాడు.
Comments
Post a Comment