చందమామ కథలు - నత్కీరుడు

 

Telugu Chandamama Story about why humility wins over talent. Best Chandamama Telugu Stories to read.

ఒక అడవి ఉండి. ఆ అడవిలో ఒక పెద్ద కోనేరు, కోనేటి ఒడ్డున ఒక పెద్ద మఱ్ఱిచెట్టు వుంది. అ చెట్టు క్రిందకు ఒక కుష్ఠు వాడు నడిచివచ్చి, ఆయాసం తీర్చుకోటానికి ఆ నీడను కూర్చున్నాడు. కూర్చుని యథాలాపంగా చెఱువుకేసి చూశాడు. అతడాలా చూస్తోండగానే, అ చెట్టునుంచి ఆకొకటి రాలి చెఱువులోపడింది. పడీ పడ్డంతోటే అది ఒక చెప్పగా మారిపోయి బుడుంగుమని నీటిలో మునిగిపోయింది. ఆకు చేప అయిపోవటంచూచి అతను ఆశ్చర్యపడుతూవుంటే మరో ఆకు రాలింది. ఆ ఆకు నీటిలో కాకుండా గట్టు మీద పడింది. పడీ పడ్డంతోటే అది ఒక పిట్టగా మారిపోయి, తుర్రుమని పైకెగిరిపోయింది! ఇది మరీ ఆశ్చర్యంగా తోచిందతనికి. ఇంతలో ఇంకో ఆకు రాలింది. ఈ మాటు రాలిన ఆకు పూర్తిగా చెఱువులోనూ పడలేదు, పూర్తిగా ఒడ్డునా పడలేదు. సగం నీటిలోనూ, సగం ఒడ్డునా పడింది. నీటిలో పడ్డ సగం చేప అయింది! ఒడ్డున పడ్డ సగం పక్షి అయింది. చేపగా మారిన భాగం నీటిలోకి పారిపోదామని అటు లాగింది. పక్షిగా మారిన భాగం పైకి ఎగిరిపోదామని ఇటువైపు లాగింది. కుష్ఠువాడు, లేచి వెళ్ళి, ఆ చోద్యం చూట్టం మొదలెట్టేవరకు అది ఒక పెద్ద భూతంగా మారిపోయింది. నెత్తి మీద మేకులకు మల్లే నిటాక్కు నిలబడి ఉన్న బిరుసు వెంట్రుకలు, చింత నిప్పులు మల్లే ఎర్రగా కణకణ లాడుతూ వుండే కళ్లూ, వాడి కోరలూ, గూనినడ్డీ, బానకడుపూ గల ఆ భూతం, భయంతో వణికిపోతూ నోట మాటలేకుండా నిలబడ్డ ఆ కుష్ఠువాణ్ణి అమాంతం ఎత్తి భుజంమీద వేసుకుని గబగబా పారిపోయింది. 

భూతం అలా వెళ్ళివెళ్ళి ఒక గుహ దగ్గిర ఆగింది. ఆ గుహ ద్వారం ఒక పెద్ద బండరాయితో మూసేసి ఉంది. భూతం ఆ రాయిని సునాయాసంగా పక్కకు ఒత్తిగించి లోపల ప్రవేశించింది. భుజం మీద మోసుకొచ్చిన కుష్ఠువాణ్ణి నేల మీద పడేసి, అక్కడ తానంతకముందు ఇలాగే తెచ్చి పడేసి ఉంచిన మనుష్యులనందరినీ ఒక్క మాటు లెక్క పెట్టుకుంది. కుష్ఠువానితో కలిపి వాళ్లు నూరుమందయారు. అప్పుడా భూతానికి కలిగిన సంతోషం ఏమని చెప్పం? ఎప్పుడు దొరికిన మనిషినప్పుడు తినెయ్యదా భూతం. అలా తినేస్తే దానికి కడుపు నిండినట్టే ఉండదు. నూరుమందయే దాకా ఊరుకుని, ఆ వేళ వాళ్ళనందర్నీ దొంతర పెట్టి తినేసి, అ చెఱువులో ఉన్న నీళ్ళు తాగి, కొన్నాళ్ళ పాటు ఆ గుహలో నిద్రపోతుంది. ఈ వేళ కుష్ఠువానితో నూరుగురయారు గనక కడుపునిండా భోజనం దొరికిందన్న సంతోషంతో ఒక్కమాటు ఎగిరి గంతేసింది. చెఱువుకెళ్లి స్నానంచేసి వచ్చి మింగేద్దామని తలచి బయల్దేరింది. గుహలో అంతకుముందు పడి ఉన్న తొంభై తొమ్మండుగురూ ఆ కుష్ఠువాణ్ణి చూచి, "నాయనా! నీతో నూరుగురం అయాం. నేటితో మనకు నూరేళ్లు నిండాయి." అని గొల్లుమంటూ ఏడవడం మొదలెట్టేరు. "ఈ భూతాన్ని చంపేసే ఉపాయమేమీ లేదా?" అన్నాడు కుష్ఠువాడు. "ఈ భూతాన్ని చంపాలంటే కేవలం ఆ పరమశివుడో లేకపోతే అలాంటి మరో దేవుడో రావలసిందే గాని మనుష్యమాత్రులం మనం ఏం చెయ్యగలం?" అన్నారు వాళ్లు. కుష్ఠువాడు "శివుడికి వినిపించేటట్లు నేను స్తోత్రం చేయగలను గాని, వినిపించి కూడా ఆయన రాడేమో? నేనంటే ఆయనకి కోపం" అన్నాడు. 

"నీ మీద శివునికి కోపం ఎందుకొచ్చింది?" అని వాళ్ళలో ఒకడు అడిగేడు. "ఆ కథ అంతా చెబుతూ కూచుంటే భూతం వచ్చి మనని మింగేస్తుంది. ముందు ఆ భూతాన్ని చంపేమార్గం చూడాలి. భూతం చచ్చిపోయాక ఎన్ని కథలైనా చెప్పుకోవచ్చు" అంటూ కుష్ఠువాడు శివుని కుమారుడైన కుమారస్వామిని భక్తితో స్తోత్రం చేసేవరకు ఆ దేవుడు ప్రత్యక్షమై, "ఎందుకు నన్ను రప్పించావు?" అని అడిగేడు. అప్పటికప్పుడే భూతం స్నానంచేసి గుహకి తిరిగివచ్చింది. కుష్ఠువాడు కుమారస్వామికి మ్రొక్కి, "స్వామీ, మొదట యీ భూతాన్ని చంపేసి మమ్మల్ని కాపాడు" అని కోరేసరికల్లా కుమారస్వామి తన ఆయుధంతో ఆ భూతాన్ని ఒక్క దెబ్బకు నరికిపారేశాడు. కుమారస్వామి కుష్ఠువానివైపు చూసి, "ఏమయ్యా, నువ్వు గొప్ప కవిలాగా ఉన్నవే. కవులు తప్ప ఇంతటి చక్కటి శ్లోకాలు మరెవరు చెప్పగలరు? మరి, నీకీ కుష్ఠు రోగం ఎలా వచ్చింది" అని అడిగేటప్పటికి కుష్ఠువాడు, "స్వామీ, మీ తండ్రి పరమేశ్వరుడి శాపంవల్లనే నాకీ రోగం వచ్చింది అని చెప్పాడు. "భూతం చచ్చిపోయింది గనక ఆ కథంతా ఇప్పుడు సావకాశంగా చెప్పు" అని గుహలో వాళ్ళంతా ఆ కవీశ్వరుణ్ణి కోరేరు. 

కుమారస్వామి కూడా వింటూంటే అతను తన కథ ప్రారంభించాడు: "మాది పాండ్యరాజ్యం. నా పేరు నత్కీరుడు . మధురలో పాండ్యరాజు ఆస్థానంలో రత్నాలపీఠం ఒకటి ఉంది. సరస్వతీదేవితో సమానమైన కవీశ్వరులు కూచోటం కోసమని ఆ పీఠాన్ని అగస్త్యమహాముని పాండ్యరాజుకి ఇచ్చాడు. ఆ పీఠం ఒక్క కవి కూచోటానికి సరిపోతుంది. కాని చిత్రమేమిటంటే గొప్ప కవులెందరొచ్చినా అది విస్తరించి కూచోటానికి చోటిస్తుంది. నేను పాండ్యరాజు సభలోకి వెళ్ళేటప్పటికి ఆ పీఠం అప్పటికప్పుడే పదకొండు గురు మహాకవీశ్వరులకు చోటిచ్చింది. నేను నా కవిత్వంతో అందరనూ మెప్పించాను. చటుక్కున ఆ పీఠం పెరిగి నాకూ చోటు యిచ్చింది. నా తర్వాత కూడా చాలా మంది కవులు పాండ్యరాజు సభకు వచ్చి కవిత్వం చెపుతూండేవారు. వాళ్ళెవరికీ ఆ పీఠం చోటివ్వలేదు. రాజు వాళ్ళనెవళ్ళనీ ఉత్తిచేతులతో పంపేవాడు కాడు. ఆ పీఠం మీద కూర్చుని 'గొప్ప కవులం' అనిపించుకున్న మేము పన్నెండుగురం అక్కడికి వచ్చిన ఒక్కొక్కకవినే పరీక్షచేసి శిఫార్సు చేశాక ఆ శిఫార్సు ప్రకారం కానుకలిచ్చి పంపేవాడు. క్రమక్రమంగా సభకి కవులు రావటం తగ్గిపోయింది. దానికి కారణం ఆ పీఠంలో తమకి చోటు దొరకదని మాటెలా ఉన్నా, వారు మా ముందుకొచ్చి నిలబడడానికే భయపడేవారు. దానితో మాకందరికీ గర్వం, అహంకారం ఎక్కువైపోయినై. ముఖ్యంగా నాకూ మరీను. ఒకనాడు కవినంటూ ఒకడు రాజసభకు వచ్చి, ఒక పద్యం చదివేడు. ఆ పద్యంలో 'ఒక స్త్రీయొక్క జుట్టుముడి సహజమైన సువాసనతో ఉన్న' దంటూ చెప్పేడు. నేను నవ్వుతో 'ఇదేం కవిత్వమయ్యా? ఎక్కడైనా జుట్టుముడికి సహజమైన సువాసన ఉంటుందా? ఏ వాసన నూనో రాసుకుంది కాబోలు!' అని ఎగతాళి చేశాను. దానితో వాడు కిక్కురుమనకుండా సభలోంచి అవతలకు పోయాడు. 'మంచి బాగా చీవాట్లుపెట్టి పంపించేశావయ్యా' నత్కీరా, అని తక్కిన పదకొండుగురూ నన్ను మెచ్చుకున్నారు."

"ఇంతలో సభలోంచి పోయినవాణ్ణి వెంటబెట్టుకుని మరొకాయన కోపంతో ప్రవేశించి 'ఇతడు నా భక్తుడు. తిండిలేక బాధపడుతోంటే ఒక పద్యం రాసిచ్చి, దాన్ని తీసుకెళ్లి రాజ సభలో చదివి బహుమానం తెచ్చుకోమనగా, ఇతనిక్కడికొచ్చి ఆ పద్యం చదివితే ఎవడో దానిలో తప్పు పట్టేడుట! ఎవడు వాడు?' అని గద్దించి అడిగేడు. 'నేనే' అంటూ మీసం మీద చెయ్యివేసి నిలబడి 'జుట్టుముడికి సహజమైన సువాసన ఉంటుందా ఏ స్త్రీకయినా?' అన్నాను. అందుకాయన 'నీకు తెలియదేమోగాని అలంటి స్త్రీ ఒకామె ఉంది. నా భార్య ఐన పార్వతీదేవి కేశములు సహజ పరిమళం కలవి. తెలియకపోతే తెలియనట్టుగా ఊరుకోవాలిగాని ప్రతీదానికీ తప్పులు వెతకటం సత్కవుల లక్షణం కాదు' అంటూ ఆయన తన నిజరూపంలో సాక్షాత్కరించాడు. 'శివుడు, శివుడు' అంటూ సభలో వాళ్ళంతా నిలబడ్డారు. రత్నపీఠం మీద కూర్చున్న తక్కిన పదకొండుగురు కవులూ లేచి 'వందేశంభుఉమాపతిం' అంటూ స్తోత్రాలు మొదలెట్టేరు. వాదన వచ్చినప్పుడు 'నువ్వా నేనా?' అని ఢీకొనాలేగాని శివుడుకదా అని బెదిరిపోయి స్తోత్రాలు మొదలెట్టడమా? అని నాకూ వళ్ళు మండిపోయింది. ఏమైనా సరే నీ పద్యంలో తప్పు లేకుండా పోతుందా? అని నేను వాదించేసరికి, శివునికి కోపం వచ్చి 'వళ్ళు తెలియకుండా మాట్టాడేవు గనక నీ వళ్లంతా కుష్ఠురోగం వచ్చి అసహ్యంగా కనపడుదువు గాక!' అని శపించాడు. గజగజ వణుకుతో పీఠం మీదనించి దిగి పరుగున శివుని కాళ్ళమీద పడి క్షమించమని ప్రార్థించగా, ఆయనకి జాలికలిగి 'సరే వెళ్లు. కైలాస దర్శనం చేసిరా. అప్పుడు నీ కుష్ఠు రోగం పోతుంది. ఎవడి కవిత్వంలోనైనా సరే మంచి ఉంటే మెచ్చుకో. అంతేగాని తప్పులు పట్టటం పనిగా పెట్టుకోకు'  అని బుద్ధి చెప్పి అంతర్థానం అయిపోయాడు. కైలాసం చూడటానికి వెడుతూ ఈ భూతానికి పట్టుపడి ఇక్కడకొచ్చాను" అని ముగించాడు.

నత్కీరుడిలా తన కథ ముగించాక కుమారస్వామి వెళ్ళిపోతో, "నువ్వెలాగైనా గొప్ప కవివి. గనుక నీకేమైనా వరమిద్దామని ఉంది. కోరుకో. ఇచ్చి వెడతాను" అన్నాడు. నత్కీరుడు, "స్వామీ, నేను కుష్ఠు రోగంతో ఉండలేను. కైలాసాన్ని చూస్తే తప్ప ఈ రోగం పోదు. కైలాసం ఎక్కడో హిమపర్వతాలలో ఉంది. అంతవరకూ నేనీ రోగంతో నడిచి వెళ్ళలేను. నాకు సులభంగా కైలాసదర్శనం చేయించు" అన్నాడు. అప్పుడు కుమారస్వామి ఒక యుక్తి చేశాడు. "కైలాసమంటే శివుడుండే కొండ గదా. ఎక్కడ శివుడుంటే అదే కైలాసం. ప్రస్తుతం శివుడు మీ దక్షిణదేశంలోనే కాళహస్తి అనేచోట వెలిశాడు. అక్కడున్న కొండనే దక్షిణ కైలాశమంటున్నారు. అక్కడ దిగబెడతాను. ఆ కొండ చూచి నీ రోగం పోగొట్టుకో" అన్నాడు. గుహలో వాళ్లందరివద్దా నత్కీరుడు సెలవు పుచ్చుకుని కుమారస్వామితో బయల్దేరి కాళహస్తి వెళ్లి అక్కడున్న కైలాసపర్వతాన్ని దర్శించాడు. కుష్ఠురోగం పోయి అతనికి మామూలు శరీరం వచ్చింది. అప్పుడాకవి శివుని మీద నూఱు పద్యాలు చెప్పి స్తోత్రం చేసి, ఆ దేవుణ్ణి మెప్పించి మోక్షం సంపాదించుకున్నాడు. 


Comments