బాలమిత్ర కథలు - విచిత్ర వ్యక్తి

Telugu Balamitra story of a poor russian man who gave shelter to the servant of death god. Best Balamitra telugu kathalu to read.
రష్యా దేశంలో చెప్పులు కుట్టే ఒక ముసలివాడు, వాని భార్య నివసించేవారు. ముసలివాడు ప్రతిదినం ఉదయమే ఇంటి నుండి బయలుదేరి ఠాణాకు వెళ్లి, అచ్చటనే రాత్రి వరకు చెప్పులు కుట్టి, వచ్చిన సొమ్ముతో కావలసిన సరకులు కొని ఇంటికి తీసుకు వెళ్లేవాడు. చలికాలం వచ్చింది. చలి విపరీతంగా వుంది. ఒక రోజున ముసిలివాడు బాగా చీకటిపడేవరకూ చెప్పులు కుట్టి, ఆ రోజు వచ్చిన సంపాదనతో కావలసిన సరుకులు కొనుక్కుని చలి తెలియకుండా వుండడానికి మత్తు పానీయం సేవించి, ఇంటికి బయలుదేరాడు. దారిలో ఒక చోట ఒక వ్యక్తి బట్టలు లేకుండా చలికి గడ గడ వణుకుతూ కదలలేని స్థితిలో అతనికి కనిపించాడు. ఆ వ్యక్తిని చూసి జాలిపడి తను కప్పుకున్న దుప్పటిని, తొడుక్కున్న కోటును తీసి అతనికిచ్చి ఆ వ్యక్తిని లేవదీసి తనతో ఇంటికి తీసుకువెళ్ళాడు. ముసిలివాడి భార్య తమకి ఠికానా లేని సమయంలో అతిథిని కూడా వెంటబెట్టుకుని వచ్చినందుకు మొదట భర్త మీద మండిపడింది. ఆ వ్యక్తి ఎటువంటి స్థితిలో నుండగా తను తీసుకు వచ్చినదీ చెప్పి, ఆమెను శాంతపర్చాడు ముసిలివాడు. ముసిలిది కూడా జాలిపడి ఆ వ్యక్తికి తమ తిండిలోనే కొంత పెట్టి, ఆ రాత్రికి తమ అతిథిగా వుంచుకున్నారు. మర్నాడు ముసిలివాడు ఆ వ్యక్తిని అతని గురించి వివరాలు అడిగాడు. ఆ వ్యక్తి తనకు ఎవరూ లేరని, ఒంటరివాడినని, ఏం పని చెప్పినా చేస్తానని, తమ ఇంటివద్దనే వుంచుకోమని కోరాడు. కొద్దిసేపు అలోచించి అందుకు ఒప్పుకున్నాడు. ఇంటి యజమాని తను ముసిలివాడై పోయిన కారణం చేత పని ఎక్కువగా చేయలేక పోతున్నాడు. అటువంటి సమయంలో దేముడు పంపినట్లు వచ్చిన ఇతనిని చూచి సంతోషించాడు. ముసిలివాడికి ఆ వ్యక్తి ప్రవర్తన విచిత్రంగా తోచింది. ముసిలివాడు ప్రతిదినం ఆ విచిత్ర వ్యక్తిని తనతో పాటూ ఠాణాకు తీసుకొనివెళ్ళి, అతని చేత కూడా చెప్పులు కుట్టించేవాడు.

అతి త్వరలోనే ఆ విచిత్ర వ్యక్తి జోళ్ళు తయారు చేయడంలో మంచి ప్రావీణ్యతను సంపాదించాడు. విచిత్ర వ్యక్తి ప్రావీణ్యం వలన ముసిలివాడికి నగరంలో గిరాకీ బాగా పెరిగిపోయింది. నగరంలో సంపన్నులు కూడా తమ జోళ్ళను తయారుచేయమని ముసిలివాడి వద్దకే వచ్చేవారు. అచిరకాలంలోనే పేరు పొందిన ముసిలివాడు తన జోళ్ళ దుకాణాన్ని ఇంటివద్దకు మార్చివేసాడు. అందుచేత అందరూ అతని ఇంటికే వచ్చి తమ పనులు చేయించుకునేవారు. కాని ఇంత పేరు ప్రతిష్ఠ తెచ్చిపెట్టిన ఆ విచిత్ర వ్యక్తి మాత్రం ఎప్పుడూ అవసరాన్ని మించి ఎవరితోనూ మాట్లాడేవాడు కాడు. ఎక్కువగా తన కాలాన్ని పనిచేయడంలోనే గడిపేవాడు. తీరిక సమయంలో ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా గడిపేవాడు. ఒకరోజున ఉదయమే జమీందారుగారు తన గుర్రపు బండిలో ముసిలివాడి ఇంటికి వచ్చారు. అయన వచ్చే సమయానికి విచిత్ర వ్యక్తి ఎవరివో జోళ్ళను తయారుచేస్తున్నాడు. విచిత్ర వ్యక్తి గుర్రపు బండిలో నుండి దిగి వస్తున్న జమీందారుగారిని తల ఎత్తి చూచి, చిన్నగా నవ్వి, తిరిగి తలవంచుకుని తన పనిలో నిమగ్నమైపోయాడు. ముసిలివాడు మాత్రం జమీందారుగారు స్వయంగా తన ఇంటికి వచ్చినందుకు సగం ఆనందంతోను, సగం గాభరాతోను హడావుడి పడి, ఆయనకి ఎదురేగి స్వాగతం పలికాడు. జమీందారుగారు ఇంట్లో అడుగుపెట్టేముందు, ముఖద్వారం పొట్టిగా ఉన్నందున తలను బాగా వంచి లోనికివచ్చి ముసిలివాడు చూపించిన ఆసనం పై ఆసీనుడయ్యాడు. ముసిలివాడు చేతులు నులుపుకుంటూ, అయన చెప్పబోయే ఆజ్ఞ కోసం ఆతృతగా ఎదురు చూడసాగాడు. జమీందారుగారు తనతో తీసుకు వచ్చిన మంచి ఖరీదైన, మేలు రకమైన తోలును ముసిలివాడికి ఇచ్చి, దానితో అందమైన పాదరక్షలు తయారుచేసి ఇవ్వమని చెప్పాడు. ఏ మాత్రం లోపం లేకుండా తయారు చేయాలని గట్టిగా ఆదేశించారు. వచ్చిన పని అయిన పిమ్మట అయన తిరిగి వెళ్ళేటప్పుడు ముందులాగా గుమ్మం దగ్గర తలవంచలేదు. ఆ గుమ్మం అయన తలకి బలంగా తగిలింది. అయన బాధతో "అబ్బా!" అంటూ తలపట్టుకుని, అలాగే నడిచి వెళ్లి గుర్రపు బండిలో కూర్చుని వెళ్లిపోయారు. 

విచిత్ర వ్యక్తి జమీందారుగారు బాధతో మూలిగినప్పుడు ఒకసారి తలఎత్తి చూచి నవ్వి, తిరిగి తన పనిలో నిమగ్నమైపోయాడు. జమీందారుగారు ఇచ్చిన తోలుతో బూట్లకి బదులుగా చెప్పులు తయారుచేయడం ప్రారంభించాడు. అది గమనించిన ముసిలివాడు తలబాదుకున్నాడు. జమీందారుగారు ఏ మాత్రం పొరపాటు రావడానికి వీలులేదని చెప్పినా, అంతా తారుమారు చేసాడని విచిత్ర వ్యక్తి మీద మండిపడ్డాడు. విచిత్ర వ్యక్తి మాత్రం దీనికి చలించక, తన పని చేసుకుపోసాగాడు. జమీందారుగారి జోళ్లు తయారు చేసేసాడు ఆ కొద్ది సమయంలోనే. జమీందారుగారి చెప్పులు తయారుచేయడం పూర్తి చేసిన కొద్ది నిమిషాలకే అవసరంగా బూట్లకి బదులుగా చెప్పులు తయారుచేసి ఇమ్మని కబురు వచ్చింది. అది విన్న ముసిలివాడు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. విచిత్ర వ్యక్తి మాత్రం ఆశ్చర్యం ప్రకటించక, నౌకరులు అడిగిన వెంటనే, తను తయారు చేసిన జోళ్లు వాళ్లకి ఇచ్చి వేసాడు. ఈ సంఘటనతో ముసిలివాడికి విచిత్ర వ్యక్తి మీద అభిమానంతో పాటు, గౌరవం కూడా కలిగి మరింత ఆదరంగా చూడసాగాడు. అలా కొంతకాలం గడిచింది. ఒక రోజు సాయంత్రం వేళలో ఒక స్త్రీ ఒకే లాంటి కవల ఆడపిల్లలను తీసుకుని ముసిలివాడి ఇంటికి వచ్చింది. విచిత్ర వ్యక్తి ఇంటి ముందు అరుగుమీద కూర్చుని ఆకాశం వైపు చూస్తూ, ఏదో ఆలోచిస్తున్నాడు. వారిని చూడగానే లేచి, తన గదిలోకి వెళ్లిపోయాడు. ఆ వచ్చిన స్త్రీ ముసిలివాడితో, మూడు చెప్పులు ఒకే విధంగాను, ఒక చెప్పు మాత్రం వేరే రకంగాను తయారు చేయమని చెప్పింది. ఆ పిల్లలకు తల్లిలేదని, ఆమె చనిపోయేటప్పుడు ఆ పసిబిడ్డ కాలిమీద పడిపోవడాన్ని, ఆ లేతపాదం విరిగిపోయి, అలా వంకర పోయిందని ఆ పిల్లల గురించి కూడా ఆ ఆయా చెప్పింది. పాపం! ముసిలివాడు కూడా ఆ బిడ్డలను చూచి చాలా జాలిపడ్డాడు. ముసిలివాడు ఆ స్త్రీని, బిడ్డలను పంపి విచిత్ర వ్యక్తి గదిలోకి వచ్చాడు. విచిత్ర వ్యక్తి కిటికీ దగ్గర నిలబడి వెళ్ళిపోతున్న వారిని చూస్తూ కన్నీరు కార్చసాగాడు. ముసిలివాడు అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోయి కారణం అడిగాడు. 

విచిత్ర వ్యక్తి, కన్నీళ్ళు తుడుచుకుని సంబాళించుకుని, ముసిలివాడితో తన వృత్తాంతం ఇలా చెప్పాడు: "తాతా! నేను మానవమాత్రుడిని కాను. ఇన్ని రోజులు మీ దంపతులు నన్ను ఆదరించినందుకు ఎంతైనా ఋణపడి వున్నాను. నేను యమదూతను. కనుక నాకు జమీందారుగారి మరణం సంగతి ముందుగా తెలుసును. ఆయనకు దెబ్బ తగులునట్లు చేసింది నా మిత్రుడే! నా మిత్రుని చూసే నేను నవ్వాను ఆ రోజు! ఇప్పుడు వచ్చిన బిడ్డల తల్లిని ఆమె ప్రసవించగానే తీసుకు వచ్చేయమని మా ధర్మరాజు ఆజ్ఞ ఇచ్చారు. తీసుకు వెళ్ళడానికి వచ్చిన నేను, ఆ తల్లి బిడ్లను ప్రేమతో అక్కున చేర్చుకొని ఆనందించడం చూసి వారిని వేరు చేయలేకపోయాను. నా కర్తవ్యం నెరవేర్చకుండానే తిరిగి వెళ్ళిపోయాను. మా ధర్మరాజు తన ఆజ్ఞను పాటించని అవిశ్వాస పాత్రుడనని, భూమి మీదకు పొమ్మని శపించాడు. నేను కాళ్ళమీదపడి వేడుకోగా, ఎవరినైతే చూచి బాధపడి వదిలేశావో, వారి జోళ్ళు కుట్టి తిరిగి ఇక్కడికి వస్తావని, అప్పటికి నాకు పూర్తిగా శాప విమోచనం కలుగుతుందని అన్నారు. ఈనాటికి నా శాపం విముక్తి అయింది. ఆ కవల పిల్లల జోళ్లను క్రితం దినమే తయారుచేసాను" అని విచిత్ర వ్యక్తి ముందుగా తయారు చేసిన జోళ్లను ముసిలివాడికి ఇచ్చేసి, "ఇంకవస్తా సెలవు!" అంటూ పెద్ద మెరుపుతో మాయమయిపోయాడు.

Comments