బాలమిత్ర కథలు - వెంట్రుక -వెర్రివాడు

Telugu Balamitra story of a couple and a mad man and how their strange encounters take place. Best Telugu Balamtira kathalu to read.

అనంతవరం గ్రామంలో అన్నయ్య, అన్నమ్మ అనే రైతు దంపతులున్నారు. వారు తమ కాపురమేమో - తామేమో అంతే! మరెవరితో సంబంధం పెట్టుకునేవారు కాదు. వారికి పెద్దలు సంపాదించిన ఆస్తి జీవనానికి సరిపోతుంది. అన్నమ్మ కాపురానికి వచ్చి ఏడేండ్లయినా సంతానం కలుగలేదు. అన్నమ్మ దంపతులకు దాన్ని గూర్చిన విచారంగాని, ఆలోచనగాని లేదు. గంగవరం కాట్రేని జాతర పై వారమని ఊళ్లో వాళ్ళనుకొంటుండగా వారు విన్నారు. కాట్రేని జాతర చూట్టానికి అన్నమ్మ ఆపేక్ష పడింది. అన్నయ్య, అన్నమ్మ జాతరకు పోదామనుకొన్నారు. జాతరకు ముందు నాడు అన్నీ సర్దుకొని, ఆనాటి వుదయం ఎద్దుల బండి కట్టుకొని, వలసిన సామాన్లు పెట్టుకొని, ఇల్లు తాళం వేసి, వారు గంగవరం ప్రయాణమైనారు. అనంతవరానికి గంగవరం ఐదుపరుగుల దూరం. వారు మెల్లగా మధ్యాహ్నానికి మూడు పరుగుల దూరం పోయి,  గండేరు ఒడ్డు చేరుకొన్నారు. ఆ ఏటొడ్డున బండి నిల్పి దిగారు. అన్నయ్య ఎద్దులను విప్పి ఏట్లో నీరు త్రాపి, వాటిని పగ్గాలతో బండి చక్రాలకు కట్టేశాడు. బండిలోని గడ్డి తీసి మేత వేశాడు. 

అంతలో అన్నమ్మ బండిలో కట్టి భద్రపరిచిన అన్నంమూట దించింది. ఆ ఆలుమగలు ఏట్లో నీటి దరికిపోయి, కాళ్లు చేతులు కడుక్కొన్నారు. అక్కడే ఎదురెదురుగా కూర్చుని మూట విప్పి అన్నం తింటున్నారు. మూడు ముద్దలు తిన్నారు. నాలుగో ముద్దలో ఒకేసారి ఇరువురి చేతుల్లోని ముద్దల్లోకి ఒక వెంట్రుక వచ్చింది. దాన్ని చూచి అన్నయ్య "పాడు ముండ! నీ తల వెంట్రుక అన్నంలోకి వచ్చిందే - ఇదో చూడు!" అన్నాడు. "ఛీ! నీ జుట్టు వెంట్రుక అన్నంలోకి వచ్చింది. ఇదో చూడు!" అన్నది అన్నమ్మ. ఆ వెంట్రుక ఇద్దరి చేతుల్లోని అన్నం ముద్దల్లో పొడుగ్గా వున్న ఒకే వెంట్రుక! "ఒసేవ్! తీసేయ్ వెంట్రుక!" అన్నాడు గద్దింపుగా అన్నయ్య. "నీవే తీసేయ్!" అన్నది అధికారంగా అన్నమ్మ. ఆలుమగలకు అధికమైంది కోపం. చేతుల్లో అన్నం ముద్దలు అట్టే పెట్టుకొని వాగ్యుద్ధం చేశారు. ఒకరినొకరు చీదరించుకొన్నారు; కొక్కరించుకొన్నారు. ఒకరి ముఖాన ఒకరు ఉమ్మేసుకొన్నారు. అన్నం ముద్దలు మూటలోకి విసిరికొట్టి, ఇద్దరూ లేచి జుట్లు జుట్లు పట్టుకొన్నారు. "నీకంటే నేనేం తీసిపోయానా?" అని పోట్లాడుకొన్నారు. వారి పోట్లాట ఏటి రాళ్ళతో కొట్టుకొనే స్థితికి వచ్చింది. అంతలో బిగ్గరగా నవ్వుతూన్న శబ్దం విన్పించింది. ఆలుమగలు పోట్లాటమాని అటువైపు చూచారు. చిందరవందర జుట్టుతో చినిగిన బట్టలతో వున్నవాడొకడు అన్నం మూట దగ్గర కూర్చుని ఓ చేత వెంట్రుక పట్టుకొని ఓ చేత అన్నం తింటున్నాడు. మూటలో అన్నం కొంచెం మిగిలిందేమో! అంతా తీసి నోట  కూరుకొని మూటగుడ్డ నీళ్లలోకి విసిరివేశాడు. "ఓరీ! నీ కడుపుకాలా! మా అన్నమంతా బొక్కి, నీ పొట్టనింపుకొన్నావు గదరా!" అంటూ ఆలుమగలు వాని దగ్గరకొచ్చి "ఆ వెంట్రుకతో కూడా దిగమింగావట్రా! పాపిష్టి వాడా! చచ్చేవురా!" అని ఆక్రోశంతో వారు వాని వీపు పై నాలుగు బాదారు. 

వాడా దెబ్బలు లెక్కచేయక గుటుక్కున ముద్దమ్రింగి, తాపీగా ఏట్లో నీళ్లు త్రాగి, వచ్చి పక పక నవ్వుతూ వెంట్రుక మెడకు చుట్టుకొంటూ, అటనుండి ఏరుదాటి, ఆ వైపుకు వెళ్ళాడు. ఆ వెర్రివాణ్ణి చూస్తూ ఆలుమగలు తిట్టుకొంటూ బండి దగ్గరకు వచ్చారు. అన్నయ్య ఎద్దులను బండికి కట్టాడు; అన్నమ్మ బండెక్కి కూర్చుంది. బండి ఏరు దాటి ఆ వైపున గంగవరం దారిపట్టింది. దారిలో ఆలుమగలు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. బండి గంగవరం చేరేప్పటికి రెండు బార్ల ప్రొద్దే మిగిలింది. గంగవరం కాట్రేని జాతర సంబరంతో కోలాహలంగా వుంది. ఆడా మగా మహోత్సాహంతో వున్నారు. ఆ వూరి ప్రక్క పారే గండేరులోని నీళ్ళలో మునిగి వూరి నడుమనున్న కాట్రేణ్ణి దర్శిస్తున్నారు జనం. కొందరు ఆడవారు తడి బట్టల్తో దేవునికెదురుగా బిడ్డలు కావాలనో, పాడిపంటలు కలగాలనో ఏవేవో మ్రొక్కులు మ్రొక్కుతూ బోర్లాపడుకోనున్నారు. కొందరికి దేవుడు మ్రొక్కులు తీర్చాడేమో! ఆ సంగతులు వారు ఉన్నవారికి చెప్పుకొని సంతోషిస్తున్నారు. 

కొందరు తమ విషయం చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నారు. అన్నయ్య ఎడ్లబండిని అక్కడున్న ఓ చెట్టుక్రింద నిల్పాడు. అన్నమ్మ బండి దిగింది. అన్నయ్యకు ఆకలి రగులుకు పోతూందేమో! ఎద్దుల్ను విప్పి మేత బీటికి వదిలి బండ్లోని సామాను దించుకున్నాడు; చెట్టుక్రింద రాళ్ళతో పొయ్యిపెట్టి మంటచేశాడు. కుండతో ఏటి నీళ్ళు తెచ్చి బియ్యం కడిగి కుండలో పోసి పొయ్యిమీద పెట్టాడు. అన్నమైంది. అన్నాన్ని అంగవస్త్రంలో కుమ్మరించుకొని చట్టితో తెచ్చుకొన్న ఊరుగాయ నంజుకొని కడుపు నిండా తిని, వట్టికుండలో నీళ్ళుపోసి కాట్రేని గుడికెళ్లాడు. మగని చర్యచూస్తూ అన్నమ్మ చెట్టుక్రింద అట్టే కూర్చోనుంది. అన్నమ్మకు ఆకలితో పాటు ఆగ్రహం ముంచుకొచ్చింది. విసురుగా లేచి కాట్రేని గుడికెళ్లింది. అప్పటికి బాగా చీకటిపడింది. కాట్రేనికి ఉత్సవం జరుగుతూంది. ప్రభలు ముందు కదుల్తున్నాయి; బాకాలు మ్రోగుతున్నాయి; దివిటీలు వెలుగులు చిమ్ముతున్నాయి. ఆ సందడిలో జనం దేవుని చూడాలని గుంపుగా గుళ్లోకి త్రోసుకొని వచ్చారు. ఆ త్రోపులో అన్నమ్మ వచ్చి మంటపంలో స్తంభానికి చేరబడింది. అంతలో ఎవరు తోశారో! అన్నయ్య వచ్చి ఆమె మీద పడ్డాడు. "పాపిష్ఠోడా! దున్నలాగున్నావురా! మీద పడ్డమా? కళ్లు నెత్తికెక్కాయా?" అంది. అన్నయ్య భార్య గొంతు గుర్తించాడు. "పాపిష్టిదానా! నాకడ్డమొచ్చి పడద్రోశావా? నా మోకాలు బొప్పికట్టిందే ముండా!" అని లేచి, లేవబోయే ఆమెను ఓ త్రోపుతోసి, ఎటో గుంపులో కలిసిపోయాడు. అతని గొంతు విని తన మగడేనని గుర్తించిన అన్నమ్మ ప్రక్కవారిపై పడింది.

 వారామెను అటు ఇటు త్రోశారు. ఆమె మరల క్రిందపడి తిట్టుకొంటూ లేచి కూర్చుని, ఆపసోపాలు పడుతూ ఆ సందడి చూస్తుంది అక్కడే! ఉత్సవం ఊళ్లోకి పోయింది. గుడిముందు జనం పల్చబడ్డారు. మండపంలో ఓ స్థంభం చాటున ఓ ముసలవ్వ పండుకోనుంది. తడి తలతో, తడి గుడ్డల్తో టెంకాయ చేతపట్టుకొని ఓ అమ్మాయి ఆ అవ్వదగ్గరకు వచ్చింది. "అత్తా అత్తా!" అంది. ఆ అవ్వ నిద్రలేచి కళ్లు నులుముకొంటూ ఆవలించి, "ఏమే! అప్పుడే వచ్చావు? తెల్లారిందాకా వరపడాల్నే పిచ్చిదానా!" అంది. ఆ అమ్మాయి "నేను వరపడి పడుకోగానే బాగా నిద్ర వచ్చేసిందత్తయ్యా! ఏం చెప్పను దేవతలేమో! అబ్బ వారెంత అందగత్తెలు! వారు నన్ను పూల పల్లకిలో కూర్చోబెట్టుకొని ఆడుతూ, పాడుతూ కాట్రేని దగ్గరికి తీసుకొనిపోయారత్తయ్యా! కాట్రేడు నన్ను చూచి, 'నీవేం తెచ్చావు?' అనడిగాడు. 'స్వామీ! ఈ కొబ్బరికాయ తెచ్చాను' అన్నాను. కాట్రేడు నా చేతిలోని కొబ్బరికాయ తీసికొని, నాకో జామపండిచ్చి 'తిను' అన్నాడు. నేనా పండు తినేశాను. కాట్రేడు ఇంక పో' అన్నాడు. అంతే మెలకువ వచ్చింది. లేచి చూచాను ఇంకా కొందరక్కడే వరపడే వున్నారత్తా!" అన్నది. 

ఆ అవ్వ సంతోషంతో "ఆ! ఆ! నా బంగారు కోడలా కాట్రేడు నీకు జామపండిచ్చాడు! ఎంత అదృష్టమే నీది? నా చిట్టితల్లివే! ఇంకేమే, నాకు మనుమణ్ణి ఇస్తావే నీవు! కాట్రేని మాట తప్పనే తప్పదు" అని కౌగిలించుకొని కోడల్ని ఆమె బుగ్గలొత్తి, గడ్డం ముద్దాడి, తల నిమిరి, తలపైన మెటికలు విరిచి లేచింది. ఆమె కాట్రేని గుడిగోపురం చూచి చేతులెత్తి, "నా కోడలు కొడుకునెత్తుకుంటే పై యేడు నీ తిరణాలకు ఇలుతీర్థం వస్తాం దేవుడూ!" అని దండం పెట్టింది. కోడల్ని పిల్చుకొని అక్కడినుండి వెళ్లిపోయింది. అన్నమ్మ వారి మాటలు వింటూ, రెప్ప వాల్చకుండా వారిని చూచింది. తటాలున లేచి ఏటికిపోయి నీళ్ళలో మూడు మున్కలు వేసి, తడి బట్టల్తో గుళ్లోకి వచ్చింది. అక్కడ వరపడిన వాళ్లెవరూ లేరు. అన్నమ్మ దేవునికి దండం పెట్టి "నాకో కొడుకునిస్తే ఏటా నీ జాతరకు వస్తాను" అని మ్రొక్కి, ధ్వజ స్తంభం దగ్గర చేతులు జోడిగా చాచి, బోర్లాపడుకోంది. అక్కడున్న కొందరు "ఆమ్మో ఈమెకెంత భక్తి! పుండువంటి చల్లో ఇంత రాత్రిలో ఒకతే వరపడుతూందే!" అని ఆశ్చర్యపడ్డారు. ఉత్సవం ఊళ్లో తిరిగి వచ్చేటప్పటికి తెల్లారింది. ఉత్సవంతో కూడా తిరిగి అన్నయ్య గుడిచేరాడు. ధ్వజస్తంభం దగ్గర వరపడి వున్న భార్యను చూచి అట్టే నిలబడ్డాడు. ఇంతలో వెర్రివాడు వచ్చి, "ఛంభో- ఛంకర! ఛీ ఛీ!" అని వెక్కిరింపుగా అరుస్తూ, ధ్వజస్తంభం చుట్టూ వెంట్రుక పట్టుకొని ఎగురుతున్నాడు. ఆ తిరిగేటప్పుడు వాని పాదం అన్నమ్మ చేతిపై పడింది. "అబ్బా!" అంటూ లేచి, అన్నమ్మ వాణ్ణి అనరాని తిట్లు తిట్టింది. వెర్రివాడు నవ్వుతూ "అమ్మోరికి దణ్ణాలు - అయ్యోరికి దణ్ణాలు, అంతా నాదే - అంతా నాదే" అని పక పక నవ్వాడు. 

అక్కడ వారందరికీ వాని చేష్టలు నవ్వు పుట్టించింది. అన్నమ్మ కోపంతో గిర్రున తిరిగి గుడిదాటి పోయింది. అన్నయ్య భార్య వెంట వెళ్లాడు. అన్నమ్మ బండి దగ్గర రుస రుస లాడుతూంది. ఎద్దులను బండికి కట్టింది. మూట ముల్లె కట్టి బండ్లోకి విసిరేసి ఎక్కి కూచుంది. అన్నయ్య మాటాడక బండి నొగల్లో కూర్చుని ఎద్దులను సెలగోలతో అదిలించాడు. ఎద్దులు అనంతవరం దారిబట్టి బాగా ప్రొద్దుగ్రుంకే వేళకు అన్నయ్య ఇంటి ముందాగాయి. అన్నయ్య బండి నుండి ఎద్దులను విప్పాడు. అన్నమ్మ బండిదిగి మూట చంకపెట్టుకొని ఇంటి వాకిటికి వచ్చి చూచింది. తాళం తీసి తలుపు ఓరగా వేసివుంది. అన్నమ్మ ఆశ్చర్యంతో తలుపు తీసింది. ఇంట్లో చీకటి! మూట క్రిందపెట్టి వెళ్లి, ప్రక్కింటి గూటిలోని దివ్వె తెచ్చి చూచింది. లోపల వెర్రివాడు పడుకోనున్నాడు.  "ఆమ్మో! వెర్రోడు!" అంటూ అరచి, చేతిలోని దివ్వెజారవిడిచింది. అది మూట పైబడి అంటుకొంది. గుప్పున మంటలేచి ఇల్లు అంటుకొంది. "కుయ్యో మొర్రో!" అంటూ అన్నమ్మ వెలుపలకు పరుగెత్తింది. పసులకొట్టంలో ఎద్దులకు మేత వేస్తున్న అన్నయ్య పరుగున వచ్చి చూచాడు. మంటలు నడిమింటికి ప్రాకాయి. ఊళ్లోవారు మంటలార్ప యత్నించారు. "వెర్రివాడు-వెర్రివాడు" అని అన్నమ్మ అరిచింది ఏడుస్తూ. ఆమె మాటలు ఏమో, ఎవరూ పట్టించుకోలేదు. ఇంతలో మంటలతో తలుపు తెరుచుకొంది. వెర్రివాడు పక పక నవ్వుతూ, తాపీగా అంటుకొన్న గుడ్డలు నులుముకొంటూ వెలుపలికి వచ్చి ఎగురుతూ "ఇల్లు కాలితే నాకేమీ? ఇల్లాలు కాలితే నాకేమీ? నా వెంట్రుక వున్నది నాకేమీ? మీరు నా వెంటబడితే నాకేమీ?" అంటూ వెళ్లాడు. ఇల్లంతా కుప్పకూలి బూడిదైంది. జనం ఎవరిండ్లకు వారు వెళ్ళారు. అన్నమ్మ ఇంటిని చూస్తూ ఏడుస్తూంది. అన్నయ్య ఆమెను పలుకరించలేదు. అన్నమ్మ మగణ్ణి కన్నెత్తి చూడలేదు. ఆ రాత్రి ప్రక్కింటి కనకమ్మ అన్నమ్మకు, ఎంకమ్మ అన్నయ్యకు, అన్నం పెట్టి ఆదరించారు. అన్నయ్య తన ఇంటికెదురుగా నున్న రచ్చబండపై పండుకొన్నాడు.   

తెల్లారింది. వెర్రివాడు వెంట్రుక చేతపట్టుకొని అన్నయ్య ఇంటి చుట్టూ తిరుగుతూ "పుట్టినవానికి దక్కేదీ వట్టి బూడిదేరా, పుట్టనివానికి దక్కేది గట్టి నూడిదేరా, పట్టుబట్టి దానంతు తేల్చుకోరా, దిట్టవు నీవై పుట్టినచోటికి నీవు చేరుకోరా!" అని పాడుతున్నడు. అన్నయ్య కండ్లు నులుముకుని చూచాడు. వెర్రివాడు ఆ పొడుగాటి వెంట్రుక చుట్టచుట్టి, ఇంటి వాకిట పెట్టి, దోసిళ్ళతో ఆ యింటి బూడిద త్రోసి దానిపై కుప్పపోస్తున్నాడు. అమ్మా, అక్కా, అయ్యా, అన్నలూ, పిల్లా జెల్లా అక్కడ చేరారు. "అక్కరగలవాడు అలావుంటే, అక్కరలేనోడు ఆదుకోవాలంటే" అంటూ ఆ వేడి బూడిదంతా కుప్పపోశాడు వెర్రోడు. వాడు కుప్పచుట్టూ తిరుగుతూ "ఆలుమగలు చేతులు కలిపి అందుకొంటే అందుతుందిలే భూతల స్వర్గం ఈ మాటే" అని పాడి బూడిద కుప్పలో చేతులు పెట్టి, సర్రున పొడుగాటి వెంట్రుక తీసి మెడకు చుట్టుకొని వెళ్లిపోయాడు. అన్నమ్మ, అన్నయ్యలు తమ యింటిని గూర్చి పట్టించుకోలేదు మనకెందుకులే అని. ఇరుగు పొరుగులు వెళ్ళారు. అటూ ఇటూ ప్రొద్దు నడిమింట  చేరుకొంటూంది. ఎదిరింటి ఎంకమ్మ అవ్వ ఊతపొడుచుకొంటూ వచ్చి, "ఏమే అన్నూ! ఆలుమగలు అలా నిల్చున్నారే! ప్రాప్తం లేదులే! బుగ్గేపోయిన ఇల్లు ఎట్లాగో నిలేసుకోండి. తలా ఓ కర్రో, కట్టో సాయం చేస్తార్లే! ఇద్దరూ కలిసి ఆ బూడిద బుగ్గి బొగ్గులు ఎత్తి పోసికొని శుభ్రం చేసికోండి! వాడెవడో వెర్రోడు బూడిద కుప్ప పోసిపోయాడు పుణ్యాత్ముడు. వాడు వెర్రోడు కాడర్రా మహానుభావుడు!" అంటూ తనింట్లోకి వెళ్లి, ఓ చేట  పొరకా తెచ్చి పడేసి, "చూస్తారేమర్రా? ఎత్తండి ఆ బూడిద కుప్ప" అంది.

ఆలుమగలు తమ మూతులు చెరోవైపు త్రిప్పుకొన్నారు. "అన్నూ! అలా మూతి ముడుచుకొంటావేమిటే? నీ యిల్లు బంగారంగాను!" అంది. "చాల్లే అవ్వా! ఆయన్నే ఎత్తిపోయమను" అని మూతి విరిచింది అన్నమ్మ. అవ్వ అన్నయ్యతో "ఒరే అన్నా! నీవైనా బూడిద ఎత్తి అందీయరా! అన్ను పారబోస్తుంది. మగాడివి అలా నిల్చున్నవే!" అంది. "ఆ బాగా చెప్పావులే ఆ పాపిష్టి దానికి నేనందీయాలా? అది పోయాలా? దాని కొంప అదే కూర్చుకొంటుందిలే!" అన్నాడు రోషంగా. "ఓహో! మీ ఆలుమగల నడుమ ఏవో వున్నాయే రవ రవలు! నాకెందుకులే నాయనా! ఆలుమగల తగవుల్లో తలదూరిస్తే పోకవత్తి కింది వక్కలా ముక్కలైపోతారు." అంటూ వెళ్ళింది. అంత అన్నమ్మ, "నేను పాపిష్టిదాన్ని, నీవు పుణ్యాత్ముడివి! నీవే ఏలుకోవయ్యా! ఈ బుగ్గి గుగ్గిలం" అని కోపంతో మెటికలు విరిచింది. అన్నయ్య కోపంతో "ఛీ! నోర్ముయ్, వీపు చితక్కొడతాను నీవే ఏలుకో బుగ్గి గుగ్గిలం" అని అన్నమ్మ జుట్టు పట్టుకొని వీపున బాదాడు. అన్నమ్మ అన్నయ్య జుట్టు పట్టుకొని క్రుంగదీసింది. పిల్లా జెల్లా వారిచుట్టూ చేరారు. రోషంతో ఆలుమగలు సిగపట్టు వదలలేదు. అంకమ్మ కొడుకు భీమయ్య వచ్చి ఇద్దరినీ విడిపించబోయాడు. కానీ సాధ్యం కాలేదు. భీమయ్య వారిని బలంగా త్రొశాడు. ఆ త్రోపుతో వారు బూడిద కుప్పలో ముందుకు తూలి ఒకరి చేతులొకరుపట్టుకొని కూరుకొనిపడ్డారు. గుప్పున బూడిద వారిపై క్రమ్మింది. బూడిద విదిలించుకొంటూ, కూరుకున్న చేతులు తీసికొన్నారు. వారి చేతుల్లో ఓ కుండ వుంది. ఓ చేత కండ్లకు క్రమ్ముకొన్న బూడిద తుడుచుకొంటూ కుండ "నాదీ, నాదీ" అని లాగారు. అది జారీ క్రిందపడింది. దాంట్లో నుండి బంగారు కాసులు చెదిరిపడ్డాయి.

అన్నమ్మ, అన్నయ్యలు "ఆమ్మో! బంగారు కాసులే!" అంటూ తొందరగా తమ ఒళ్ళోకి త్రోసికొన్నారు. "ఒసే! అన్నూ! ఇది ఆ వెర్రోడి మహత్తేనే! లేకుంటే బూడిదలో కాసులుంటాయా? ఇకనైనా మీ ఆలుమగళ్లు అన్యోన్యంగా వుండండర్రా! నాలుక్కాసులు ఖర్చు పెట్టి ఇల్లు నిలేసుకోండి!" అని ఎదిరింటి ఎంకమ్మవ్వ బోసినోటితో నవ్వుతూ చెప్పింది. "అట్టేలే" అని ఆలుమగలు ఒక్క మాటగా అన్నారు. వారు నాలుక్కాసులు చేసి, క్రొత్తగా కొయ్యలు తెప్పించి ఇల్లు నిలేసుకొన్నారు. రవ రవలు లేకుండా సుఖంగా వున్నారు. ఓనాడు వెర్రివాడు వెంట్రుక పట్టుకొని, ఏవో పాటలు పాడుకొంటూ వీధిలో పోతున్నాడు. అతని మహాత్మ్యం వల్లనే అన్నమ్మ దంపతులు భాగ్యవంతులయ్యారని ఆ వూళ్ళో ఇరుగుపొరుగు అనుకొన్నారు. ప్రతి ఇంటివారు వెర్రివాణ్ణి పిల్చి ఆకో, అంబలో, అన్నమో పెట్టి తృప్తిపరచాలనుకొన్నారు. దాంతో తమను కూడా భాగ్యవంతులను చేస్తాడనే ఆశతో వెర్రివాణ్ణి వారు పిలిచేవారు. కాని అతడెవ్వరింటికీ పోయేవాడు కాదు. మధ్యాహ్నమైంది.  అతడు పాడుకొంటూ అన్నమ్మ ఇంటికి వెళ్లాడు. అన్నమ్మ అతన్ని అన్నం తినమంది. సరేనని కూర్చున్నాడు. అన్నమ్మ ఆకులో అన్నం వడ్డించి పదార్థాలు వేసింది. వెర్రివాడు మెడకు చుట్టుకొన్న వెంట్రుక తీసి అన్నం చుట్టూ త్రిప్పి "పిల్ల జెల్లా లేనివారు పెట్టే పిడికిలి పట్టనురా! పిల్లలు లేని కొంపల్లో కోకోల్లగా పుట్టేర్రా! అల్లెం బుల్లెం అలుమగలకు మెడ గొళ్లెం, గొళ్లెం గిళ్లెం అందరి కందనిసరిపళ్లెం" అంటూ లేచి ఆకులో అన్నం ఇల్లంతా ఎగజిమ్మాడు. ఓ పిడికెడు మెతుకులు పట్టి పిడిచి, అన్నమ్మ ముఖానికేసి కొట్టాడు. "ఆ!" అని ఆశ్చర్యంగా నోరుతెరచి చూస్తున్న అన్నమ్మ నోట్లో అన్నం ముద్ద కూరుకుంది. అన్నమ్మ ఆ ముద్దను గుటుక్కున మింగేసింది. అది చూచి వెర్రివాడు: "ఔరా!ఔరా! అన్నమ్మా! అన్నం ముద్ద మింగావా? ఔరా!ఔరా! చిన్నమ్మా! చిన్న పాపణ్ణిస్తావా?" అని పాడుకొంటూ గంతులేస్తూ వెళ్లాడు. అంతలో పొలంనుంచి వచ్చిన అన్నయ్య ఇంట్లో అన్నం వెదచల్లి వుండడం చూచి, "ఏమే! పొగరెక్కిందా! దరిద్రగొట్టుదానా! పుట్టరాని అన్నం ఒలకబోసావే!" అని చేతిలోని ములు గర్రెత్తి అన్నమ్మ వీపుపై రెండు పెట్లు పెట్టాడు. అన్నమ్మ ఏడుస్తూ వీధిలోకి పరుగెత్తింది. ములు గర్రెత్తికొట్టే అన్నయ్యకు, ఆమెకు నడుమ తటాలున వెర్రివాడొచ్చి నిలబడ్డాడు. అన్నయ్య విసిరిన ములుగర్ర వెర్రివాని వీపుపై వ్రాలి, పెటిల్లు మన్నది. వెర్రివాణ్ణి కొట్టినందుకు అన్నయ్యను అందరూ తిట్టారు. వెర్రివాడు నవ్వుతూ ములుగర్ర పట్టుకొని, రెండుగా విరిచి, దానికి వెంట్రుక కట్టి విసిరాడు. అది వెంట్రుకను విప్పుకొని బెడిసి అన్నయ్య వీపుపై దెబ్బతీసింది. ఆ దెబ్బ తట్టుకోలేక అన్నయ్య క్రిందపడ్డాడు.

వెర్రివాడు "అన్నా! అన్నా! అలకెందుకురా? సున్నా సున్నా ఇలకందదురా!" అని వెంట్రుక మెడకు చుట్టుకొని పాడుకొంటూ వెళ్ళాడు. మరలా ఆలుమగల నడుమ ఉఫ్ అంటే భగ్గుమని మంటల్లేస్తున్నాయి. ఎడ మొగం పెడమొగంగా సంసారం సాగిస్తున్నారు. ఇలా రెండు నెలలు గడువగా ఓనాడు అన్నమ్మ వాంతి చేసికొని, క్రింద వ్రాలిపోయింది. పరుగున వెళ్లి తన భార్య పడడం గూర్చి అన్నయ్య ఎదురింటి ఎంకమ్మతో చెప్పాడు. ఆమె ఊతపొడుచుకొంటూ వచ్చి, అన్నమ్మను పరామర్శించి చూచి, ముఖాన నీళ్లుచల్లి సేద తీర్చింది. అన్నమ్మ లేచి తన ఇంటిపనిలో నిమగ్నమైంది. అన్నయ్య వీధి అరుగుపై కూర్చుని నారతో త్రాళ్లు పేనుకొంటున్నాడు. "ఓ అన్నమ్మ మగడా! నీ ఇల్లాలు చూలాలైంది. ఏడ్నెల్లకు పిల్లాడి నెత్తుకొంటావులే!" అంటూ బోసి నవ్వు అన్నయ్యపై విసిరి వెళ్లింది ఎంకమ్మ. అన్నయ్య అట్టే ఎంకమ్మను చూస్తూ త్రాడుపేనడం మనుకొన్నాడు. అన్నమ్మ చూలాలన్నమాట ఆ అమ్మ, ఈ అమ్మ నోట ప్రాకింది. కొందరు అది వెర్రోని మహత్తులే అనుకొన్నారు. వెర్రోడు గిర్రోడు లేదు ప్రాప్తముంటే అదే వస్తుంది అన్నారు కొందరు. అంతా ఆ గంగవరం కాట్రేని చలవే! అనుకొన్నారు మరికొందరు. అన్నమ్మకు తొమ్మిదినెలలు నిండి చక్కని మగబిడ్డను కన్నది. బిడ్డని చూచి ఆడంగులు "అబ్బ! ఎంత ముచ్చటగా వున్నాడే! అన్నమ్మ కడుపున పుట్టవలసినవాడు కాదే! ఏ మహారాణికో పుట్టవలసినవాడే!" అని అబ్బురంగా అనుకొన్నారు. బిడ్డను చూచిన అన్నయ్య అన్నమ్మ పై ఆక్రోశం అడచుకొని, ఆదరంతో వున్నాడు. అన్నమ్మ బిడ్డని అల్లారుముద్దుగా పెంచింది. బిడ్డకు అన్నమ్మ 'కాట్రేడు' అని పేరు పెట్టుకొంది.

బిడ్డకు మూడేండ్లు నిండింది. ప్రతి యేటా తన మాట ప్రకారం గంగవరం కాట్రేని జాతరకు పోయి మ్రొక్కు చెల్లించి వస్తూంది. ఓనాడు కాట్రేడు వీధి గుమ్మంలో కూర్చుని ఆడుకొంటున్నాడు. వెర్రివాడు ఏవో పాడుకొంటూ వచ్చి, కాట్రేన్ని ఎత్తుకొని ఆడిస్తున్నాడు. బిడ్డడు వెర్రివాణ్ణి బిక్కిరిగా చూస్తున్నాడు. అన్నయ్య, అన్నమ్మలు చూస్తూ గుమ్మంలో నిల్చున్నారు. వెర్రివాడు బిడ్డనెత్తుకొని అటునుండి వీధి దారిబట్టి పోతున్నాడు. ఆ ఆలుమగలు "మా బిడ్డ! మా బిడ్డ!" అంటూ అతని వెంటపడ్డారు. జనం ప్రోగైనారు. అన్నమ్మ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూంది. జనం బలవంతంగా బిడ్డని తీసికోబోయారు. వెర్రివాడు పక పక నవ్వుతూ, తన మెడకు చుట్టుకొన్న వెంట్రుక తీసి వారికి చూపించాడు. అదేమో! అందరూ ఎక్కడివారక్కడ నిస్చేష్టులై బొమ్మలవలె నిలిచిపోయారు. వెర్రివాడు "అమ్మలారా! ఎవరిది ఎవరికో! అయ్యలారా! ఎవరికి ఎవరిదో! నీవు నేను ఎవరికి ఎవరో! నేను నీవు వారికి వారే!" అని పాడుకొంటూ ఆ ఊరుదాటి వెళ్ళిపోయాడు. కంగారుపడకండి వెర్రోడు బిడ్డని తిరిగి ఇచ్చేశాడు. ఆలుమగలు ఎంత కొట్టుకున్న తన్నుకున్న చివరికి కలిసిపోతారని వెర్రోడి సందేశం.

Comments