చందమామ కథలు - కపిరాజు

 

Telugu Chandamama story of a monkey prince who turned to a handsome young man. Best Chandamama telugu stories to read.

ఒకానొక రాజుకి ఏడుగురు భార్యలు. ఆయనకు అన్నీ ఉన్నయికాని, సంతతి మాత్రం లేదు. ఇలా వుండగా ఒక యతీశ్వరుడు కనబడి మంత్ర మహిమ గల ఆరు అరటి పళ్లు రాజుకు ఇచ్చాడు. రాజు సంతోషించాడు కాని, తీరా చూస్తే పళ్లు ఆరు మాత్రమే ఉన్నయి. వీటిని ఏడుగురు భార్యలకూ ఎలా పంచడం ? అదృష్టవశాత్తు ఆ సమయాన కోటలో ఆరుగురు రాణీలు మాత్రమే ఉన్నారు. చిన్న రాణి చుట్టాలింటికి చూడబోయింది. ఆమె వస్తే చూచుకోవచ్చునని చెప్పి ఆ ఆరుగురకూ ఆరు పళ్లూ ఇచ్చాడు. ఇంతలో చిన్నరాణీ వచ్చి, తను లేకుండా వాళ్లు ఇలా చేస్తారా అనే కోపంతో వాళ్లు పార వేసిన తొక్కలు తినివేసింది. ఆమెను చూచి అక్కలు "ఏమిటి, కోతిలాగ తొక్కలు తింటున్నది! దీనికి కోతిపిల్లే పుడుతుంది" అని గేలిచేశారు. అన్నట్టుగానే ఆరుగురు రాణీలకూ చక్కటి బిడ్డలు పుట్టారు. చిన్నరాణీకి కోతిపిల్ల పుట్టింది. ఒకనాడు కొడుకులు ఆరుగురూ తండ్రి వద్దకు వెళ్లి ఓడ ప్రయాణం చేసి, ప్రపంచం చుట్టి వస్తామనగా, రాజు సరేనన్నాడు. కపిరాజు కూడా వస్తానంటే వాళ్లు వీలులేదని చెప్పి కసరికొట్టేశారు. అప్పుడు కపిరాజు వాళ్లకు తెలియకుండా ముందే పోయి, ఓడలో ఒక మూల నక్కి కూర్చున్నాడు. తరువాత ఈ సంగతి తెలిసి అన్నలు అశ్చర్యపోయారు. ఓడ పోయిపోయి వారం రోజులకు ఒక తీరం చేరుకొన్నది. ఆ రాజ్యంలో గొప్ప కోలాహలంగా ఉన్నది. అది ఏమిటీ అంటే, "తన సింహాసనానికి ఎదుట వున్న రాతిని ఎవరైతే ఎత్తగలరో వారికి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తా" నని ఆ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు.

ఆ ప్రకటన చూచి, ఆరుగురు అన్నదమ్ములూ పోయి రాయి ఎత్తబోయారు, కాని కదపలేక తెల్లముఖాలు వేశారు. అప్పుడు కపిరాజు దర్బారుకు వెళ్లి ఆ బ్రహ్మాండమైన రాతిని అవలీలగా పైకి ఎత్తే వరకూ అందరూ మెచ్చుకొన్నారు. కపిరాజును పెళ్ళాడటం రాజకుమారికి ఇష్టం లేకపోయింది. కాని తను చేసిన ప్రకటన తప్పకూడదని రాజు కూతురును ఒప్పించగా, పెళ్లి జరిగింది. తరువాత కపిరాజు భార్యతో సహా వాళ్ల దేశానికి బయల్దేరాడు. ఓడ వెళ్లివెళ్లి ఒక ద్వీపం చేరుకొన్నది. కపిరాజుకి ఆ ద్వీపాన్ని ఏలే రాజుకూతురు కనబడింది. అమె సౌందర్యవతి మాత్రమే గాక మంత్ర విద్యలో ప్రవీణురాలు. ఆ కపిరాజు సుందరుడనీ శాపవశాన ఇలా ఉన్నాడనీ గ్రహించి, అతనిని పెళ్లాడటానికి అమె నిశ్చయించుకొన్నది. ఆమె తన వుద్దేశాన్ని కపిరాజుకి తెలిపే వరకు అతను సమ్మతించాడు. పెళ్లి అయిపోయింది. ఈమెను వెంట బెట్టుకొని కపిరాజు ఓడ వద్దకు పోయేసరికి పెద్ద భార్య విచారంగా ఉండటం చూచి, రెండవ భార్య "అక్కా ! నీ విచారానికి కారణమేమిటి? నీ భర్త కురూపిగా ఉన్నాడనేనా లేక మరేదైనానా ?" అని అడిగింది. "అంత
కంటే ఏమి అవ్వాల" ని పెద్దభార్య అనే సరికి, కపిరాజు జన్మను గురించిన రహస్యం చెప్పి ధైర్యంగా ఉండమన్నది. చిన్న భార్య మంత్ర బలంవల్ల కపిరాజు కోతిచర్మం ఊడి కింద పడిపోయింది. అతను అపురూప సౌందర్యంతో ప్రకాశించే రాజకుమారునిగా మారిపోయాడు. ఈ మార్పుకి భార్యలిద్దరూ సంతోషించి, ఆ రాజకుమారుణ్ణి భక్తితో సేవిస్తూ అన్యోన్యంగా ఉన్నారు.


Comments