పూర్వమొక నగరంలో బుచామియా అనే సుందర యువకుడుండేవాడు. అతడు చాలా మంచివాడు. ధనవంతుని బిడ్డ. ఔదార్యం దయాగుణం కలిగిన సజ్జనుడు. అతని తల్లిదండ్రులు గతించగా స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నాడు. ఒకనాడతాడు నగరంలో రాజవీధిగుండా పోతుండగా ఒక విపరీత దృశ్యం కనిపించింది. ఒక అందమైన సుందరాంగిని, ముదుసలియైన ఆమె తండ్రిని సంకెళ్ళు వేసి రాజభటులు బందీలుగా తీసుకుపోతున్నారు. వాళ్లు మొరటుగా ఆ సుందరిని లాక్కుపోతుంటే, జనం విరగబడి చూస్తున్నారు. బుచామియా కది చూడరాని దృశ్యమైంది. అందమైన యువతిని రాజవీధిలో అవమానించడం చూడలేకపోయాడతడు. గబగబా రాజభటుల దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లి, వాళ్ల నాయకునితో ఆ సుందరాంగిని, ఆమె తండ్రిని ఆ విధంగా హింస చెయ్యడానికి కారణమేమిటని ప్రశ్నించాడు. అతడు ఇలా చెప్పాడు: "ఆ సుందరి తండ్రి ఒక షావుకారికి ముప్ఫయి వేల దీనారాలు బాకీపడ్డాడు. అందుచేత అతని ఆస్తి అంతా జప్తుచేసి, అతనిని, అతని కుమార్తెను కూడా చెరలో వెయ్యమని న్యాయాధిపతి ఆజ్ఞ అయింది. అందుచేత ఆ సుందరిని, ఆమె తండ్రిని చెరసాలకు తీసుకుపోతున్నాము." ఆ మాటలు వినగానే బుచామియాకు వారి మీద దయ కలిగింది. వెంటనే న్యాయాధిపతి దగ్గరకు వెళ్లి , ఆ సుందరి తండ్రి యివ్వవలసిన ముప్ఫయి వేల దీనారాలు తాను చెల్లించి, ఆమెను, ఆమె తండ్రిని చెరనుండి విడిపించాడు. తండ్రి ఆమె బుచామియాపై కృతజ్ఞులైనారు. అతనిని వారింటికి ఆహ్వానించారు. బుచామియాకు ఆ సుందరిని చూడగా హృదయం వశం తప్పింది. ఆమె అద్భుతమైన సౌందర్యం కలిగినది. పైగా అతని యందు మిక్కిలి కృతజ్ఞతతో వినయ గౌరవాల్ని చూపిస్తున్న యువతి. అతని హృదయంలోని భావాలను ఆ సుందరి గ్రహించింది.
అతడు మహాధనవంతుడు; యౌవనంలో ఉన్నవాడు; సుందరుడు కూడా. ఆమె హృదయం కూడా ప్రతిధ్వనులనిచ్చింది. అన్యోన్యం ప్రేమ తెలుపుకున్నారు వాళ్లు. ఆమె తండ్రితో తమ ప్రేమ వృత్తాంతాన్ని చెప్పాడు. అతడు సంతోషంతో వాళ్లకు పెళ్లిచేశాడు. బుచామియా తన భార్యను ఇంటికి తీసుకువచ్చి సుఖంగా కాలం గడపసాగాడు. ఇట్లా కొన్ని సంవత్సరాలు సుఖంగా గడిచాయి. బుచామియాకు ఒక చిన్న దురలవాటు ఉన్నది. అది వేటకు పోవడం. అతనికి వేటకు వెళ్లడమంటే అమిత సరదా. ఆ వేటకు వెళ్లడంలో అతనికి స్నేహితులున్నారు. అందులో ఒకడు ఆ ఊరి రాజుగారి తమ్ముడు. ఈ రాజసోదరుడు బుచామియాతో కలిసి వేటకు వెళ్లాడు. వేటలో దొరికిన జంతుజాలంలో పాలుపంచుకోవడం ఉన్నది. అప్పుడప్పుడు బుచామియా ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని కూడా స్వీకరిస్తూ ఉండగా, ఒక త్రుటికాలం బుచామియా భార్యను చూడటం తటస్థించింది. ఆమె సౌందర్యం అతని కంటపడగానే అతనికి వెర్రులెత్తినవి. ఏమీ తోచలేదు. హృదయం వశం తప్పిపోయింది. ఇంటికి వెళ్లి ఎట్లాగైనా బుచామియా భార్యను తన స్వాధీనం చేసుకోవాలని ఆలోచనలు చేశాడు. రాజుగారి తమ్ముడు కదా! కావలసినంత ధనం ఉన్నది, కోరినంత మంది సేవకులున్నారు. అంతఃపురంలో దాసీలకు నాయకురాలోకతె మిక్కిలి చాకచక్యం కలది ఉన్నది. దానిని పిలిపించి రాజసోదరుడు ఆలోచన చేశాడు. ఆమె ప్రయత్నించి, బుచామియా భార్యను వశపరచుకుని అతని గృహానికి తీసుకు రాగలనని ఆశ కల్పించింది. ఆ ప్రయత్నం ఫలించడానికి ఎంత ధనం కావలసినా తీసుకోమన్నాడతడు. ఆమె మరునాడే గ్రామస్త్రీ వేషం వేసుకుని బుచామియా ఇంటికి వచ్చి, అతని భార్యతో పరిచయం కల్పించుకుంది. తరువాత ప్రతిదినం వస్తూ ఉండటం సాగించింది. వచ్చినప్పుడల్లా ఆమెకు అపురూపమైన బహుమానాలు తెచ్చి యిస్తూ, ఆమె దగ్గర కొంత నమ్మకం కలిగించుకొన్నది. తరువాత తన చాకచక్యాన్ని ఉపయోగించి, ఆ సుందరాంగి మనస్సులో అవినీతి బీజాలు నాటింది. రాజసోదరునిపై ప్రీతి కలిగేటట్లు చేసింది.
బుచామియా వేటకు వెళ్ళినప్పుడు రాజసోదరుడు ముసుగు వేసుకుని ఘోషాస్త్రీ లాగా బుచామియా ఇంటికి వచ్చి అతని భార్యతో సుఖించడం ప్రారంభమైంది. అతని భార్య ఇక బుచామియా ఇంటిలో ఉండటం దేనికనుకున్నది. రాజుగారి సోదరుని ఇంటికే వెళ్లిపోదామనుకున్నదా కృతఘ్నురాలు. అందుకోసం ఆమె రాజసోదరునితో కలిసి పెద్ద పన్నాగం పన్నింది. ఒకనాటి అర్థరాత్రి బుచామియా అనుమానం లేకుండా నిద్రపోతున్నాడు. ఆమె మెల్లిగా లేచి దొడ్డితలుపు దగ్గరకు వచ్చి వేచి ఉన్నది. ఆమె ప్రియుడు రెండు గుఱ్ఱాలతో అక్కడకు రాగానే చిన్న ఈల వేశాడు. ఆమె తలుపు తీసింది. ఇంటిలో ఉన్న బంగారం, ధనం, నగలు, విలువగల వజ్రాలు, రత్నాలు అన్నీ తీసుకుని వాళ్లు గుఱ్ఱాల మీద వెళ్లిపోతూ, ఇంటికి నాలుగు ప్రక్కలా ఇంటి మధ్యలోనూ నిప్పు అంటించి ప్రజ్వలింపజేశారు. వాళ్లు దూరంగా వేరొక నగరానికి వెళ్లి పోయి, తాము తెచ్చుకున్న ధనంతో భార్యాభర్తల లాగా సుఖంగా కాలక్షేపం చెయ్యసాగారు. మండుతున్న మంటల మూలంగా బుచామియా నిద్రాభంగమై లేచాడు. భార్య కన్పించలేదు. అప్పటికే ఇల్లు చాలా భాగం దహించిపోయింది. భార్య కోసం వెతికాడు. తెల్లవారే దాకా ఇంటి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉన్నాడు. ఇరుగు పొరుగువాళ్లు చేరారు. తెల్లవారింది. ఇల్లు బూడిద రాశిగా ఉన్నది. తన భార్య అందులో మరణించి ఉంటుందని భావించాడు బుచామియా. తనకున్న సర్వస్వం దగ్ధమై పోయిందనుకున్నాడు. ఆ బూడిద రాశిని చూచి చాలాసేపు దుఃఖపడ్డాడు. ఇరుగుపొరుగువాళ్లు ఓదార్చారతనిని. మంటలలో దగ్ధమైపోతే ఎముకలన్నా తన భార్యవి కన్పిస్తాయని బూడిద రాశి అంతా వెతికాడు, కన్పించలేదు. అతనికి ఆశ్చర్యం వేసింది; అనుమానం కలిగింది. తన మిత్రుడు రాజసోదరుడు కొన్నాళ్లుగా తనతో వేటకు రాకపోవడం మొదలైన సందర్భాలను బట్టి అతడే తన భార్యను ఎత్తుకొని పోయి ఉంటాడనీ, తన భార్య ఏమీ చేయలేక వెళ్లి ఉంటుందనీ అనుకున్నాడు. ఏమైనా సరే వాళ్లను వెదకి పట్టుకోవాలనుకున్నాడు. చింపిరి గుడ్డలు కట్టుకుని, ఒంటి నిండా బూడిద పూసుకుని, జుట్టు విరబోసుకుని, నెమలి ఈకల కట్ట పట్టుకుని బిచ్చగాడుగా బిచ్చమెత్తుకుంటూ తిరిగాడు.
అయితే తన దుస్తుల్లో పదునైన తన చేతి కత్తి మాత్రం దాచుకొని ఉంచుకున్నాడు. ఇట్లా అనేక గ్రామాలు, పట్టణాలు తన భార్య కోసం, తన కృతఘ్నుడైన మిత్రుని కోసం వెతికాడు. చివరకు వాళ్లు ఉన్న ఊరు వచ్చాడు. ఆ యింట్లోకి తన పూర్వమిత్రుడు వెళ్లడం చూచాడతను. అందుచేత అక్కడనే నిలిచి ఉన్నాడు. బయటకు వచ్చిన దాసీదాని మూలంగా లోపల ఒక స్త్రీ కూడా ఉన్నదని తెలుసుకున్నాడు. ఆమె చేసిన వర్ణన బట్టి లోపల ఉన్న ఆమె తన భార్య అని గ్రహించాడు. ఇంకా తన భార్య తనపై అభిమానంతోనే ఉన్నదనీ పరిస్థితుల బలవంతం వలన తన్ను వదిలిపెట్టి వెళ్లిందనీ అనుకుంటున్నాడతడు. అందుచేత ఆ దాసీ దానిని పిలిచి, ఆమెను చిన్న సహాయం చెయ్యమన్నాడు. ఆమె సరేనన్నది. తాను వచ్చి వాకిట్లో వేచి ఉన్నట్లు తన భార్యతో చెప్పమన్నాడు. దాసీది అట్లాగే చేసింది. లోపల వాళ్లిద్దరూ ఇష్టాగోష్ఠి కబుర్లు చెప్పుకుంటూ, మద్యము త్రాగుతూ ఉండగా, దాసీది వెళ్లి ఆమె చెవులో చెప్పింది. ఆమె భయభ్రాంతురాలై లేచి, కిటికీ లోంచి బయటకు చూచి, బయట ఉన్న భర్తను గుర్తుపట్టింది. వెంటనే తన ప్రియునికి అంతా చెప్పి, ప్రమాదం నుంచి తప్పించుకుందామని చెప్పింది. వెంటనే నౌకర్లతో అతడు రెండు గుఱ్ఱాలు తెప్పించాడు. ఇంట్లో ఉన్న బంగారం, ధనం, ఆభరణాలు, రత్నాలు మూట కట్టుకుని దొడ్డి త్రోవ దగ్గర ఉన్న గుఱ్ఱాల దగ్గరకు చేరారు వాళ్లిద్దరూ. ముందు వాకిట్లో వేచి ఉన్న బుచామియాకు ఏదో అనుమానం వేసింది.
ఇంటి వెనుక ప్రక్క చూదామని అటు ప్రక్కకు వచ్చాడు. అప్పటికి రాజసోదరుడు గుఱ్ఱాన్ని ఎక్కి ఉన్నాడు. ధనం మూట ఉన్న గుఱ్ఱం మీద ఆమె ఎక్కబోతున్నది; సేవకుడు సహాయం చేస్తున్నాడు. బుచామియా అకస్మాత్తుగా సేవకుని మీద పడి వాడిని కత్తితో పొడిచాడు. ఆమె ఎక్కబోతున్న గుఱ్ఱాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ హడావుడిలో ద్రోహియైన అతడు మాత్రం గుఱ్ఱమెక్కి ఉన్నాడు కాబట్టి ఉడాయించాడు. బుచామియా తన భార్యను, ధనం మూటను, ఆమె ఎక్కబోతున్న గుఱ్ఱాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇంకా ఆమె మీద అతనికి పూర్తిగా క్రోధం రాలేదు. ఆమెను తన ఊరు తీసుకువచ్చి తండ్రికి అప్పగిద్దామనుకున్నాడు. ఆమెను తీసుకుని తన ఊరుకి ప్రయాణం సాగించాడు. ప్రయాణం మజిలీలు మజిలీలుగా సాగింది. గుఱ్ఱము మీద నెక్కి పారిపోయిన ద్రోహి కూడా అవకాశం దొరికితే దెబ్బ తీద్దామని అతని వెనుకనే ప్రయాణం సాగిస్తూ వచ్చాడు. ఒకనాటి మిట్టమధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండగా ఒక పెద్ద చెట్టు నీడను బుచామియా మజిలీ చేశాడు. గుఱ్ఱాన్ని చెట్టుకు కట్టివేశాడు. ఒక పెద్ద చాపవేసి నేలమీద పడుకున్నాడు. అతని భార్య కూడా అక్కడనే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది. బుచామియా నిద్రిస్తుండగా ఆ ద్రోహి అక్కడకు వచ్చాడు. ఆమె మేలుకొనే ఉన్నది కదా! ఇద్దరు మాటాడుకున్నారు. అతడు బుచామియాను కత్తితో పొడిచి చంపుతానన్నాడు. ఆమె 'వద్దు, వీడికి అంత కంటే పెద్ద శిక్ష వెయ్యాలి. ముందు త్రాళ్లతో బంధించు.' అన్నది.
అతడు బుచామియాను త్రాళ్లతో బిగించి లేవతీసి చెట్టుకు కట్టాడు. బుచామియా నిద్రమేల్కొని పరిస్థితులు గ్రహించి, భగవంతుడు తనకీవిధంగా వ్యతిరేక స్థితులు ఎందుకు కల్పించుతున్నాడో నని బాధపడుతూ ఉన్నాడు. ఆ టక్కులాడి తన ప్రియుడితో సరసాలాడి, మద్యాన్ని సేవించి బుచామియాతో "ఓరి నిర్భాగ్యుడా!" అని దూషణలు పలుకుతూ అతని ఎదురుగానే ప్రియునితో సుఖించడం సాగించి, "ఇదే వీనికి ముందు శిక్ష" అన్నది. తరువాత వాళ్లిద్దరూ మళ్లీ మద్యాన్ని త్రాగి సొమ్మసిల్లి పడుకున్నారు. అప్పుడు చెట్టు తొఱ్ఱలోనుంచి ఒక పెద్ద త్రాచు పాము బయటకు వచ్చి చెట్టుకి కట్టబడి ఉన్న బుచామియా శరీరం చుట్టూ చుట్టుకున్నది. బుచామియా భయంతో తల్లడిల్లిపోతూ భగవంతుణ్ణి ప్రార్థించాడు. అంతలో ఆ పాము ద్రోహి శిరస్సు మీదికి పోయింది. కాటు వేసింది. అతడు నిద్రలోనే మరణించాడు. ఆ ప్రక్కనే ఉన్న మద్యం పాత్రలో పాము విషం కక్కి మళ్లీ చెట్టునెక్కి తన తొఱ్ఱలోకి వెళ్ళిపోయింది. ఇదంతా చెట్టుకి కట్టబడి ఉన్న బుచామియా చూస్తూనే ఉన్నాడు. ఇంతలో ఆమె నిద్రలేచింది. మద్యం పాత్రలో కొంచెం మద్యం పోసుకు త్రాగింది. తరువాత తన ప్రియుణ్ణి నిద్రలేపసాగింది. అతడు లేవలేదు. కొంతసేపటికి అతడు చనిపోయాడని తెలుసుకుంది. బుచామియా మీద క్రోధం పెంచుకుని అతడిని పొడిచి చంపుదామని కత్తి తీసుకుని అతనిని సమీపించింది. ఆమె త్రాగిన విషం ఆమె తలకెక్కి నురుగులు క్రక్కుకుంటూ చచ్చిపోయింది. ఇంతలో ఆ ప్రక్కగా బాటసారుల గుంపు వచ్చింది. వాళ్లు వచ్చి చెట్టుకి కట్టబడిన బుచామియా కట్లను ఊడతీశారు. బుచామియా జరిగిన కథ అంతా వాళ్లకు చెప్పాడు. వాళ్ళు చచ్చిపోయిన ఇద్దరి శవాలను అక్కడనే పూడ్చిపెట్టి, బుచామియాను ధన మూటలతో అతని ఊరుకు తీసుకు వెళ్ళారు.
Comments
Post a Comment