ఒక పేదరాలికి యిద్దరు కొడుకులు. వాళ్లకు ఏ విధమైన ఆస్కారమూ లేకపోవటంచేత, ఇద్దరిలోనూ ఎవరో ఒకరు కష్టపడి సంపాదించుకువచ్చి, కుటుంబాన్ని పోషించవలసి ఉండేది. ఇలా ఉండగా, వారిలో పెద్దవాడు ఒక రోజున పనికోసం బయల్దేరాడు. దారిలో ఒక వృద్ధుడు అతనికి కనపడి "అబ్బాయీ, ఇలా ఎంతవరకు వెళుతున్నావు?" అని అడిగాడు. అందుకు ఆ కుర్రవాడు "ఏదైనా పని చూచుకొని డబ్బు సంపాదించాలని బయల్దేరాను" అన్నాడు. వృద్ధుడు అతనిని తన గొఱ్ఱెలమందను కాయటానికి పనిలో పెట్టుకున్నాడు. మరునాడు అతనితో వృద్ధుడు "అబ్బాయీ! నీవు ఈ గొఱ్ఱెలవెంట వెళ్లి, మళ్లీ వాటి వెంట ఇంటికి వచ్చేసెయ్యి. అవి ఎక్కడకు పొతే అక్కడికి వెళ్ళటమే గాని, నీ అంతట నీవు వాటిని ఏ ప్రదేశానికీ తోలవద్దుసుమా! అంటూ చెప్పి పంపాడు. ఆ ప్రకారం అతను గొఱ్ఱెలమంద వెంట బయల్దేరాడు. అవి ముందుగా ఒక చక్కటి గొప్ప మైదానం చేరుకున్నాయి. ఆ తరువాత జోరుగా ప్రవహించే ఒక యేరు అడ్డురాగా, గొర్రెలు అవలీలగా ఏరు ఈదుకొని పోయినై. కాని కుర్రవాడు మాత్రం ఏరు దాటలేక, ఆ గట్టునే నిలిచిపోయాడు. పొద్దు గుంకేసరికల్లా మందలో గొర్రెలన్నీ ఏరు దాటుకొని బిలబిలమంటూ వచ్చేసి ఇల్లు చేరుకున్నై. వాటి వెనకనే కుర్రవాడు ఇల్లు చేరుకోగానే, వృద్ధుడు "అబ్బాయీ! గొఱ్ఱెలవెంట నీవు ఎక్కడెక్కడికి పోయివచ్చావు?" అని అడిగాడు. అందుకు కుర్రవాడు "బాబాయ్! అవి ముందుగా ఒక చక్కటి గొప్ప మైదానం చేరుకున్నై. ఆ తరువాత జోరుగా ప్రవహించే యేరు దాటిపోయినై. నేను ఆ యేరు దాటలేక, ఒడ్డునే నిలిచిపోయాను" అని చెప్పేసరికి, ముసలివాడు కోపగించి, "నీవు నా పనిలోకి పనికి రావు. తిరిగి యింటికి పో" అని పంపివేశాడు.
కుర్రవాడు విచారంతో ఇంటికి పోయి సంగతులన్నీ చెప్పేటప్పటికి రెండవవాడు "అన్నా, అన్నా! ఆ పనిలో నేను ప్రవేశిస్తాను" అని చెప్పి బయల్దేరి, తన అన్న కలుసుకొన్న వృద్ధుని వద్దనే ఒక ఏడాది పాటు గొర్రెలను కాయటానికి కుదురుకొన్నాడు. మరునాడు వృద్ధుడు "అబ్బాయీ! నీవు ఈ గొర్రెల వెంట వెళ్లి మళ్లీ వాటి వెంట ఇంటికి వచ్చేసేయి. అవి ఎక్కడకు పోతే అక్కడకు వెళ్లటమే గాని, వాటిని ఏ ప్రదేశానికీ నీ అంతట నీవు తొలవద్దు సుమా" అని చెప్పి పంపాడు. గొర్రెలు నెమ్మదిగా నడిచి పోయి, ఒక పచ్చటి గొప్ప మైదానం చేరుకొన్నాయి. కుర్రవాడు అడుగులో అడుగు వేసికొంటూ వాటి వెంబడే వెళ్ళజొచ్చాడు. ఆ తరువాత అవి జోరుగా ప్రవహించే ఏరు దాటినై. కుర్రవాడు ఏటిలో దిగి అవతలిగట్టు చేరుకొనేసరికి, అలిసి మూర్ఛపోయాడు. అప్పుడు ముందుకు పోతున్న గొర్రెలు ఒక్కసారి వెనక్కి తిరిగి, అతని మీద ముక్కులతో వూదేసరికి, ఆ కుర్రవాడు మళ్లీ స్పృహ గలిగి మునుపటికంటే ఎక్కువ శక్తితో గొర్రెల వెంట పోసాగాడు. అటు తరువాత గొర్రెలు మరివక బ్రహ్మాండమైన మైదానం చేరుకున్నాయి. ఇక్కడి గడ్డి చేయెత్తున ఉన్నప్పటికీ, ఈ గడ్డి మేస్తున్న పశువులు మాత్రం గాలి వేస్తే ఎగిరిపోయేలాగ బక్క చిక్కి ఉన్నాయి. అక్కడినించి ఆ గొర్రెలు పోయి ఇంకొక మైదానం చేరుకున్నాయి. ఇక్కడ తినటానికి తగిన పచ్చగడ్డి లేనేలేదు.
అయినప్పటికీ, ఈ ప్రదేశంలో పశువులు వెన్నలాగా నవనవలాడుతూ కనపడినై. ఇక్కడినుంచి గొర్రెలు ఒక గొప్ప తోటలోకి పోయినై. ఈ తోటలో నోటిలోనుంచి మంటలు గక్కుతూవున్న రెండు కుక్కలు భయంకరంగా పోట్లాడుకొంటున్నాయి. అక్కడినించి గొర్రెలు పోయి పోయి, ఒక విశాలమైన సరోవరం వద్ద నిలబడినై. ఆ సరోవరంలో ఒకామె చెంచా చేతపట్టుకొని దేనికోసమో దేవుతున్నది. మరికొంచెం దూరం పోయేసరికి, ఒక అందమైన ఉద్యానవనం కనపడింది. అందులో, రకరకాల పుష్పజాతులు అన్నీ వున్నై. కుర్రవాడు ఒక పువ్వులచెట్టు కింద విశ్రాంతి కోసం కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి ఒక తెల్లటి పావురం రాగా తన వద్దనున్న ఉండిల్లిబద్దతో దానిని కొట్టాడు. ఆ దెబ్బకు దాని ఈక మాత్రం ఒకటి రాలింది, పావురం పారిపోయింది. సరే, ఎందుకైనా మంచిదని, వాడు ఆ యీకను తీసి జాగర్తగా తన సంచీలో వేసుకున్నాడు. అక్కడనించి గొర్రెలు తిరిగి ఇంటి ముఖం పట్టినై. కుర్రవాడు కూడా గొర్రెల వెంట ఇంటికి చేరుకోగానే, వృద్ధుడు "అబ్బాయీ! గొర్రెలు నిన్ను చిక్కుపెట్టలేదుకద?" అని అడిగాడు.
కుర్రవాడు తాను చూచిన చిత్రాలన్నీ చెప్పాడు. "అబ్బాయీ! నీవు గొర్రెలతో కూడా వెళ్లి మొట్టమొదట చూచిన అద్భుతమైన చక్కటి, పచ్చటి మైదానము ఏమిటో తెలుసా? అది నీవు ఇప్పటివరకూ గడిపిన యౌవన జీవితం. అక్కడనించి పోయి నీ పాపాలను కడిగివేసే 'ప్రాణజలం' ప్రవహించే నదిలో పడినావు. అందులో పడగానే నీ పాపాలన్నీ పరిహారమైనాయి. అవతలి ఒడ్డు చేరుకున్న తరువాత గొర్రెలు నిన్ను ఊదగానే నీ ఆత్మ పవిత్రమైంది. నిన్ను ఊది, పవిత్రం చేసిన గొర్రెలే మోక్షమిచ్చే దేవతలు, నీకు సద్గురువులు. చేయెత్తు గడ్డిగల మైదానంలో మేస్తూ ఉన్నప్పటికీ, బలహీనంగా ఉన్న ఆ పశువులేమిటో తెలుసా? తాము తినలేక, ఒకరికి పెట్టలేక ధనం కూడబెట్టే లోభులు. తిండి పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇటువంటి లోభులు ఆకలి దప్పులతో బాధపడుతూ ఉండవలసిందే. తరువాత నీవు చేరిన మైదానంలో ఏమీ తినటానికి లేకున్నా, అక్కడి పశువులు నవనవలాడుతూ ఆనందంగా ఉన్నాయి కదూ? కలిగినదానిలో కాస్తంత పేదకూ సాదకూ రాల్చే పుణ్యాత్ములు. ఈ జన్మలో ఆనందంగా ఉంటారు. వీళ్ళకు ఉన్నా లేకపోయినా ఒకటే తృప్తి."
"పోతే, ఆస్తులకు, పంపకాలు తెగక కొట్లాడుకునే అన్నాదమ్ములు కుక్కజన్మ ఎత్తి అలా కొట్లాడుకుంటూనే వుంటారు. ఇక సరోవరంలో చెంచా చేతపట్టుకొని వెతుకుతున్న ఆ యిల్లాలు ఎవరనుకున్నావు? పాలలో నీళ్ళు కలిపి వర్తకం చేసిన మనిషి. ఆమె కలిపిన పాలూ నీళ్ళూ విడదీద్దామని అలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాని, ఎప్పటికీ విడదీయలేదు. చిట్టచివర నీవు చూచిన ఉద్యానవనమే స్వర్గం. పుణ్యం చేసుకున్న వాళ్ళే అక్కడికి వెళతారు. నీవు ఆ స్వర్గానికి పోయి వచ్చినట్టుగా ఏదైనా ఆనవాలు చూపించగలవా?" అని అడిగాడు వృద్ధుడు. వెంటనే కుర్రవాడు తన దగ్గరవున్న పావురపు ఈకను తీసి యిచ్చాడు. వృద్ధుడు "ఆ తెల్లపావురాన్ని నేనే, నీవు ఏమి చేస్తావోనని, నీ వెంట ఉండి, నేను కనిపెడుతూనే వున్నాను. దేవుడు కూడా ప్రతి మానవుని వెంట ఉంటూ, ఒక్కొక్కడు చేసే పనులను పరిశీలిస్తూ ఉంటాడు. నీవు పిట్టను కొట్టగా కింద రాలినది ఏమిటనుకొంటున్నావు! నా చేతి చిటికెనవేలు రాలిపోయింది. చూడు" అంటూ తన చేయి చూపించాడు. తర్వాత వృద్ధుడు కుర్రవానితో "జీవితమంటే ఏంటో తెలిసింది కనుక ఇప్పుడు నువ్వు నేర్చుకున్న విషయాలు గుర్తుంచుకుని హాయిగా జీవించు. నీకు ఎటువంటి కష్టాలు రాకుండా దీవిస్తున్నాను" అన్నాడు. కుర్రవాడు వృద్ధునికి నమస్కరించి ఇంటికి చేరుకొని, తల్లినీ అన్ననూ పోషిస్తూ, సుఖంగా ఉన్నాడు.
Comments
Post a Comment