చందమామ కథలు - బలి కోరిన గంట

 

Telugu Chandamama Story of an young girl sacrificing her life to fulfill his father's work of installing biggest bell in the kingdom.

పూర్వం ఒకప్పుడు  చీనాదేశాన్ని "యంగ్‌లో" అనే చక్రవర్తి పాలిస్తూ ఉండేవాడు. ఆయన పరిపాలనలో "పెకింగ్‌" ముఖ్యపట్టణంగా ఉండేది. పెకింగ్‌లో పెద్దపెద్ద భవనాలెన్నో వెలిశాయి. ఈ భవనాలకు తోడు, ఒక అపురూపమయిన గంట స్తంభం కట్టించాలి అని యంగ్‌లో ఉద్దేశం. ఎంత కర్చు అయినా సరే, తన సంకల్పం నెరవేరవలెనని ఆయన నిశ్చయించుకొన్నాడు. "ఒక గొప్ప స్తంభం కట్టి, అందులో ఒక పెద్ద గంట అమర్చాలి. ఇది ప్రపంచములోని ఇతరదేశాల గంటలన్నిటి కంటె పెద్దదీ నాణ్యయమయినదీ అయి వుండాలి. ఈ గంట మోగిస్తే, ఖంగుమని దాని ధ్వని పట్టణమంతటికీ స్పష్టంగా వినిపించాలి. అటువంటి గంట తయారు చేయగల పనివానిని ప్రపంచంలో ఏమూల ఉన్నా సరే, మనకు ఎంత ధనం కర్చు అయినాసరే, రప్పించవలిసింది" అని చక్రవర్తి ఆజ్ఞాపించాడు. చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం దేశమంతటా చాటింపు వేయించారు. గంట తయారు చేయటానికి 'కువాన్యు' అనే కమ్మరి వచ్చాడు. కువాన్యు చీనాదేశమంతటికీ పేరొందిన కమ్మరి. అతని పేరుప్రఖ్యాతులు ప్రపంచమంతటా అల్లుకుపోయినయి. ఈ పని నెరవేర్చటానికి కువాన్యు వంటి నిపుణుడు దొరికినందుకు చక్రవర్తి కూడా ఎంతగానో సంతోషించాడు. కువాన్యుకు కోరినంత ధనము, అతని కింద పని చేయటానికి కావలసినంత మంది జనము సిద్ధమయింది. తను గడించిన అనుభవాన్నంతటినీ వినియోగించి, అనేక శాస్త్రగ్రంథాలు తిరగవేసి, కువాన్యు రకరకాల లోహాలు మిశ్రమం చేశాడు. వాటిని కరిగించి ఇక మూసలో పోస్తాడనగా చక్రవర్తీ పరివారమూ చూడవచ్చారు.

కాని, దురదృష్టం కొద్దీ సలసల కాగుతున్న లోహం పొసీపోయడంతోనే మూస టపీమని బద్దలైపోయింది. ఈవిధంగా కొన్ని సంవత్సరముల కాలమూ బోలెడంత ధనమూ వ్యర్థమైనందుకు కువాన్యు విచారించాడు. అయితే, చక్రవర్తి మాత్రం విచారించలేదు. 'సిద్ధహస్తుడైన కువాన్యు యేమిటి, ఈపాటి పని నెరవేర్చలేకపోవడమేమిటి? ఇది ఏదో పొరపాటు జరిగివుంటుంది కాని, అతని అసమర్థత ఎంత మాత్రము కాదు" అనుకొని, కువాన్యును మళ్లీ ప్రయత్నించమన్నాడు. అతనికి ఏవిషయంలోనూ లోటు రాకుండా, కోరినంత ధనమూ సిబ్బందీ ఎల్లప్పుడూ సిద్ధంగా వుండే ఏర్పాట్లు చేయించాడు చక్రవర్తి. కువాన్యు ధైర్యం తెచ్చుకొని, అనేక సంవత్సరాల పాటు మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి మూసలో లోహం పోసే సమయానికి చక్రవర్తీ పరివారమూ, ఎంతో మంది జనమూ, విడ్డూరంగా చూడవచ్చారు. ఇప్పుడు మూస బద్దలైపోలేదు గాని, గంట మాత్రం తూట్లు పడి, ఒక తేనెపట్టులాగ తయారయింది. ఈసారి కూడా సంవత్సరాల కాలమూ, బోలెడంత ధనమూ వ్యర్థమయే వరకు, చక్రవర్తికి చికాకు కలిగింది. ఇంకొక్కసారి ప్రయత్నించటానికి అవకాశమిస్తున్నాను. ఈసారి నెరవేరకపోతే తలకొట్టించి, కోటగుమ్మానికి వేలాడదీయిస్తా" మని కువాన్యూను హెచ్చరించారు. కువాన్యు ఇంటికి, పోయి గ్రంథాలన్నీ మళ్లీ ఒకసారి తిరగవేశాడు. కాని, తనకు తెలిసినదాని కంటె కొత్త విషయం ఎక్కడా కనిపించలేదు.

ఈసారయినా తనకు జయం కలిగించుమని ముక్కోటి దేవతలకు మొక్కుకొన్నాడు. పని నెరవేరకపోయినట్టయితే తనకు ఏమి గతి పట్టబోతుందో, తన ప్రియమైన కుమార్తె 'కోవాయ్‌'తో చెప్పలేక చెప్పలేక చెప్పాడు. కోవాయ్‌ అందాల బరిణె, శీలవతి. తండ్రిపైన ఆమెకు అమితభక్తి. అందుచేత, తండ్రి చెప్పిన మాటలు విన్న వెంటనే కోవాయ్‌, కొండలలో వుండే సాధువు వద్దకు వెళ్లి సంగతి సందర్భాలన్నీ విప్పి చెప్పింది. అప్పుడు సాధువు ఆమె పైన జాలి దలిచి, "అమ్మాయీ ! మీ నాయన తయారుచేసే గంటకు లోహవు పాళ్లు అన్నీ సరిగానే వున్నాయి. వాటిలో పొరపాటు గాని లెక్కతప్పు కాని ఏమీ లేదు. అయితే, ఇటువంటి ఘనకార్యం చేసేటప్పుడు బలి ఇవ్వకపోతే పని జరగదు. ఇప్పుడు ఈ గంటకు శీలవతి అయిన ఒక కన్య యొక్క రక్తం కలిసినట్టయితే, మరి ఏ ప్రయత్నమూ అక్కరలేకుండా సరిగా వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి" అని సలహా చెప్పాడు. కోవాయ్‌ ఉత్సాహంతో ఇంటికి వచ్చి, "నాయనా! నీవు ఎంతమాత్రమూ విచారించవలిసిన పనిలేదు. ఈసారి ప్రయత్నించు. తప్పకుండా గంట చక్కబడుతుంది. నీకు మాటా మాణిక్యమూ దక్కుతుంది. కీర్తి వస్తుంది. నీ ప్రజ్ఞకు రాజు సంతోషిస్తాడు" అని ధైర్యం చెప్పింది. కోవాయ్‌ ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నదో పాపం తండ్రికి ఏమీ తెలియదు. ఆమె సాధువు వద్దకు వెళ్లటం కాని, ఆయన సలహా పాందటం గాని కువాన్యు ఎరగడు. అయినా కూతురు మాట పైనుండే నమ్మకం చేత ఆమె చెప్పినట్టుగా కువాన్యు మూడవసారి ప్రయత్నించాడు. మళ్లీ కొన్ని సంవత్సరాలపాటు పరిశ్రమ చేయగా పని అంతా పూర్తి ఐంది. 

కువాన్యు ఇక లోహం మూసలో పోత పోస్తాడనగా చక్రవర్తితో కూడా ఊరంతా వచ్చి విరగబడ్డారు. లోహం కరిగించి కువాన్యు మూసలో పోస్తూ వుండగా జనంలో పెద్ధ గోల బయలుదేరింది. ఏమీ?...."నాన్నా ! నాన్నా!!" అంటూ అతని ముద్దులకూతురు కోవాయ్‌ సలసల కాగే ఆ లోహంలోకి ఉరికి బలి అయిపోయింది! ఇలా ఆమె నిప్పులోకి ఉరకటానికి కారణం ఏమైవుంటుందో ఎవ్వరూ ఊహించలేకపోయాడు. కూతురును రక్షించుకుందామని కువాన్యు శాయశక్తులా యత్నించాడు. కాని శరీరమంతా ఆ లోహానికి ఆహుతి అయిపోయి, ఆమె కాలిజోడు మాత్రం అతని చేతిలో చిక్కుకొన్నది. తరవాత మూస విప్పిచూచారు. అద్భుతమైన గంట, సరిగా చక్రవర్తి మనసులో ఉద్దేశం ప్రకారం తయారైంది. చక్రవర్తి అపరిమితంగా సంతోషించాడు. అనుకొన్న ప్రకారము బ్రహ్మాండమయిన గంట స్తంభమూ కట్టించాడు. అతని కోరిక అక్షరాలా నెరవేరింది. కాని, గంటకి బలి అయిన తన కూతురుతో పాటు కువాన్యు జీవితమే నాశనమైపోయింది. నాటికీ నేటికీ ఆ గంట వాయించినప్పుడల్లా 'షేఁ! షేఁ!!' అని పలుకుతుందట. 'షేఁ' అంటే చీనాభాషలో 'జోడు' అని అర్థం. కనుక బలి ఐపోయిన కోవాయ్ ఆ ధ్వని వల్ల తన జోడు తనకు కావాలని అడుగుతున్నదని ఆ దేశపు ప్రజలు ఈనాటికి కూడా అనుకొంటూ వుంటారు. శాశ్వతంగా ఉండిపోయే ఇటువంటి గొప్ప పని కోసం కోవాయ్ తన ప్రాణాలనైనా లెక్కచేయక తండ్రి కీర్తిని నిలబెట్టింది!

Comments