విక్రమ బేతాళ కథలు - ఘోరమైన పరిహారం

Vikram answers Betal on how a warrior thought of kingdom safety even in taking revenge. Best Telugu Vikram Betal stories to read.

విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవం లోని బేతాళుడు, "రాజా, నిన్ను చూస్తే యక్షదత్తుడి పరిహారం చెల్లించటానికి ఘోరమైన పాట్లుపడిన సాలంకులు జ్ఞాపకం వస్తున్నారు. వారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను," అంటూ ఇలా చెప్పసాగాడు: బ్రహ్మదేశపు పశ్చిమ తీరాన గల తారా ద్వీపంలో ఒక దుర్బలుడైన రాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు. ప్రతి ఏడూ దక్షిణ దీవుల నుంచి దస్యరాజు సైనికులు వచ్చి తారాద్వీప వాసులను భయపెట్టి, ఆ దేశంలో ఉండే ప్రతి ఒక్క రోలుకూ, రోకలికీ, చేటకూ, తిరగలికీ, పొయ్యికీ వేరు వేరుగా పన్నులు వేసి, ఆ సొమ్ము పట్టుకుపోతూండేవారు.

పన్నులు చెల్లించకపోతే దస్యులు వచ్చి తారాద్వీపాన్ని కొల్లగొట్టి నానా భీభత్సమూ చేస్తారన్న భయంతో రాజు ఏటా పన్నులు చెల్లించేవాడు. ఈ పన్నుల భారంతో ప్రజలు ఆ యేటి కా యేడు దారిద్య్రంలో కూరుకుపోసాగారు. దస్యులు మహాక్రూరులు,  అనాగరికులు. వారితో యుద్ధం చెయ్యటమంటే సామాన్య ప్రజలకు భయం. అందరి కన్న పిరికివాడు రాజు. ప్రజలలో అసాధారణ శౌర్య పరాక్రమాలు గల వారు లేకపోలేదు. కానీ వారిని కూడగట్టే నాయకుడు లేడు. అందుచేత వారి పరాక్రమం నివురుగప్పిన నిప్పులాగా ఉండిపోయి, ఏ మాత్రమూ రాణించలేదు. ఇలా ఉండగా ఒక యువకుడు తారా ద్వీపానికి కొత్తగా వచ్చాడు. కావటానికతను తారాద్వీప వాసే, కానీ చిన్నతనంలోనే అతన్ని యక్షులు తమ ప్రాంతాలకు తీసుకుపోయి యుక్తవయస్కుడయే దాకా పెంచి, స్వదేశానికి తిప్పి పంపారు. అతను కొన్ని యక్ష విద్యాలతో పాటు "జలతార" అనే నౌకనూ, "అప్రతిహతం" అనే ఖడ్గాన్నీ తీసుకువచ్చాడు. "జలతార" నీటి పైనా, నేల పైనా కూడా దాని నాయకుడి ఇచ్ఛానుసారం, దానంతట అదే నడుస్తుంది. "అప్రతిహతం" దెబ్బకు గండరాళ్ళు సైతం వెన్నలాగా తెగిపోతాయి. ఆ యువకుడి పేరు యక్షదత్తుడు. అతని తండ్రీ, అన్నలూ తారాద్వీపంలో ఉంటున్నారు. వారు విచారంగా ఉండటం చూసి యక్షదత్తుడు కారణం అడిగితే, పన్నులు వసూలు చెయ్యటానికి దస్యులు రాబోతున్నట్టు తెలిసింది. దస్యులను గురించి వినేసరికి యక్షదత్తుడికి భరించరాని ఆగ్రహం వచ్చింది. అతను వెంటనే రాజు వద్దకు వెళ్ళి, "దస్యుల దౌర్జన్యం మితి మీరిపోతున్నది. తారాద్వీప వాసులు తీసుకుంటూ చావటం కంటే దస్యులను చంపి చావటం మేలు. మీరు యుద్ధానికి సన్నాహం చెయ్యండి, లేదా నన్నయినా చెయ్యనివ్వండి," అన్నాడు.

అతి కష్టం మీద రాజు యక్షదత్తుణ్ణి యుద్ధ యత్నాలు చేయనిచ్చాడు. తారాద్వీపంలో ఉండే యోధులనందరినీ పిలవటానికి యక్షదత్తుడు తన తండ్రినీ, అన్నలనూ తలా ఒక దిక్కుకూ పంపాడు. అలా వెళ్లిన యక్షదత్తుడి తండ్రిని సాలంకులనే ముగ్గురు సోదరులు పట్టుకుని చంపేశారు. అందుకు కారణం ఉభయ కుటుంబాల మధ్యా ఉండే పాత పగ. తన తండ్రి చనిపోయిన సమాచారం యక్షదత్తుడికి తెలీదు. అతను యుద్ధ యత్నాలలో చురుకుగా పని చేస్తున్నాడు. కొద్ది రోజులలో పన్నులు వసూలు చెయ్యటానికి దస్య సైనికులు వచ్చారు. యక్షదత్తుడు వారిని చావగొట్టించి పంపేశాడు. దస్యరాజు ఉగ్రుడై తారాద్వీపం మీదికి పెద్ద సేనను పంపాడు. యక్షదత్తుడు దస్యుల పడవలను సముద్రంలో ముంచీ, దస్య సైనికులతో తమ సైనికుల చేత పోరాడించీ, తానే తన అమోఘమైన కత్తితో వందలాది దస్యులను చంపీ గొప్ప విజయం సాధించాడు. యుద్ధంలో సాలంకులు కూడా అద్భుత శౌర్యపరాక్రమాలు చూపారు. యుద్ధం ముగిసిన మరుక్షణం యక్షదత్తుడు తన తండ్రి కోసం వెతికి, జరిగిన సంగతి తెలుసుకున్నాడు. అతని రక్తం ప్రజ్వలించింది. అతను తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజధాని చేరే సరికి రాజు గొప్పగా విజయోత్సవం జరుపుతున్నాడు. యక్షదత్తుడు నిండు సభలో ప్రవేశించి, సందడిగా ఉన్న సభలో నిలబడి రెండు చేతులూ ఎత్తాడు. "మన వీరాధివీరుడేదో చెపుతున్నాడు, వినండి," అన్నాడు రాజు. "మహారాజా, ఎవరైనా మీ తండ్రిగారిని హత్య చేస్తే వారికేమిటి శిక్ష?" అని అడిగాడు యక్షదత్తుడు.

"శిరచ్ఛేదమే! నీకెందుకా సంశయం కలిగింది?" అన్నాడు రాజు. "నా తండ్రిని హత్య చేసిన వారీ సభలో ఉన్నారు. వారిని తగిన విధంగా శిక్షించవలసిందిగా తమరిని వేడుకుంటున్నాను," అన్నాడు యక్షదత్తుడు. "వారెవరో చెబితే, నేర విచారణ జరిపి, హంతకులని రుజువైతే వాళ్ళ తలలు తీయిస్తాను," అన్నాడు రాజు. "నేను వారి తలలు కోరను. నా తండ్రి హత్యకు వారు తగిన పరిహారం చెల్లిస్తే చాలు, నేను తృప్తిపడతాను," అన్నాడు యక్షదత్తుడు. వెంటనే సాలంకులు ముగ్గురూ లేచి నిలబడి, "నీవు కోరే పరిహారం ఏమిటి?" అని అడిగారు. "మూడు వెలగకాయలూ, ఒక తోలు సంచీ, ఒక ఈటే, ఒక కుక్కపిల్లా, ఒక పెనమూ నేను కోరే పరిహారం," అన్నాడు యక్షదత్తుడు. "ఇందులో ఏదో కిటుకున్నది. నీ తండ్రి హత్యకు ఇంత కొద్దిపాటి పరిహారం కోరతావంటే ఎవరు నమ్ముతారు?" అన్నాడు సాలంకులలో పెద్దవాడు. "ఇంకా వివరంగా చెబుతాను. నేను కోరే వెలగకాయలు తూర్పు దీవిలోని ఒక తోటలో ఉన్నాయి. అవి బంగారు రంగులో ఉంటాయి. అవి మనిషితల ప్రమాణంలో ఉంటాయి. వాటి గుజ్జు తేనె రుచి గలిగి, ఎలాటి గాయాలను గాని, రోగాలను గాని నయం చేస్తుంది. యవనద్వీప రాజు వద్ద నేను కోరే తోలుసంచి ఉన్నది. అది కూడా ఎంతేసి గాయాలనూ, వ్యాధులనూ స్పర్శ మాత్రాన నయం చేస్తుంది. నేను కోరే ఈటె ప్రవాళద్వీప రాజు వద్ద ఉన్నది. దాని మొన తాకిన వాళ్ళు నిలువునా భస్మమై పోతారు. అది మామూలుగానే నిప్పులు కక్కుతూ ఉంటుంది. అందుచేత దాని ములికిని ఉత్తప్పుడు నీటి తొట్టెలో ఉంచుతారు.

కుక్కపిల్ల రాక్షస ద్వీపంలో ఉన్నది. దాన్ని చూసి సింహ వ్యాఘ్రాల వంటి క్రూరమృగాలు సైతం పారిపోతాయి. నేను చెప్పిన పెనం వారుణ ద్వీపంలో ఉన్నది. ఆ ద్వీపం ఎక్కడ ఉన్నదీ తెలుసుకోవటమే అసాధ్యం. అది కావటానికి ద్వీపమే గాని, సముద్రాల పైన ఎక్కడా దాని జాడ కనపడదు. నాకు ఈ పరిహారం చెల్లించినట్టయితే మీకు మరే శిక్షా జరగాలని నేను కోరను," అన్నాడు యక్షదత్తుడు. సాలంకులు ముగ్గురూ కూడ బలుక్కుని యక్షదత్తుడితో, "నీ జలతారను మాకిచ్చినట్టయితే ఇన్ని చోట్లకూ వెళ్ళి నీవు కోరిన వస్తువులు తీసుకువస్తాం," అన్నారు. యక్షదత్తుడు సరే నన్నాడు. సాలంకులు జలతార పైన బయలుదేరారు. యక్షదత్తుడు కోరిన వస్తువులలో ఏది తేవాలన్నా ప్రాణాలతో చెలగాటమే నని వారికి తెలుసు. అయినా వారు అంతులేని ధైర్య సాహసాలు గలవారు కావటం చేత ఈ ప్రయత్నంలో చావటానికి కూడా వారు సిద్ధపడ్డారు. వారు ముందు తూర్పు దీవికి వెళ్ళి అక్కడి బంగారు వెలగపళ్ళ చెట్టును దూరం నుంచి చూశారు. ఆ చెట్టు కింద ముగ్గురు విలుకాళ్లు కాపలా ఉన్నారు. సాలంకులు మూడు డేగలను ఆ చెట్టు దిక్కుగా వదిలారు. చెట్టు కింద కాపలా ఉన్నవాళ్లు వాటిని చూసి బాణాలు ఎక్కు పెట్టేలోపు అవి కొంత దూరంలో ఎగురుతూ అటూ ఇటూ తిరగసాగాయి. కాపలావాళ్ళు వాటిని కొట్టటం కోసం చెట్టు కింది నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో సాలంకులలో ఒకడు చెట్టెక్కి బంగారు వెలగ కాయలను కోసుకుని దిగి వచ్చాడు. ఈ లోపుగా కాపలా వాళ్ళు మోసం గ్రహించి వారిపై బాణాలు విసిరారు గాని, వాటిని తప్పించుకుని సాలంకులు జలతార లో వచ్చి పడ్డారు. 

Vikram answers Betal on how a warrior thought of kingdom safety even in taking revenge. Best Telugu Vikram Betal stories to read.

తరవాత సాలంకులు తమ పడవలో యవనద్వీపాన్ని చేరుకుని అక్కడి రాజు వద్దకు భట్రాజుల వేషాలు ధరించి వెళ్ళి, ఆయన పైన స్తోత్ర పాఠాలు చదివి, పద్యాలు చెప్పారు. రాజు ఏం బహుమానం కావాలో కోరుకోమన్నాడు. సాలంకులు ఆయన వద్ద ఉండే తోలుసంచీ అడిగారు. దాన్ని దేవుడడిగినా ఇవ్వను, కావలిస్తే దాని నిండా బంగారం కొలిచి ఇస్తాను పట్టుకు పొమ్మన్నాడు యవనరాజు. రాజుగారి భటుడు తోలుసంచిని బంగారంతో నింపుతుండగా సాలంకులలో పెద్దవాడు ఆ సంచీని లాగేసుకున్నాడు. రెండోవాడు భటుణ్ణి కత్తితో పొడిచాడు. దారిలో తమను అటకాయించిన వారినందరినీ చంపేస్తూ, ఆ ముగ్గురూ తమ పడవను చేరుకుని ప్రయాణమయ్యారు. అక్కడి నుంచి వారు ప్రవాళద్వీపానికి వెళ్ళి, పండితుల వేషాలు ధరించి రాజ దర్శనం చేసి, తాము తారాద్వీప ఆస్థాన పండితులమనీ, లోక సంచారం చేస్తున్నామనీ చెప్పారు. రాజు సంతోషించి, వారిని సత్కరించి, తన వద్ద ఉన్న వింతలతో బాటు నిప్పులు కక్కే ఈటెను కూడా చూపాడు. సాలంకులలో ఒకడు ఈటెను అమాయకంగా నీళ్ల తొట్టె నుంచి పైకి తీసే సరికి దాని మొన నుంచి నిప్పురవ్వలూ, పొగలూ చిమ్మాయి. రాజు దాన్ని తాక వద్దని కేకలు పెట్టాడు. గందరగోళం జరిగింది. ఆ గందరగోళంలో సాలంకులు పారిపోజూచారు. కానీ రాజు మోసం గ్రహించి, తన భటులను కేకపెడుతూ, కత్తి దూసి సాలంకుల పై కలియబడ్డాడు. సాలంకులు రాజును చంపి, రాజభటులతో చాలాసేపు ఘోరంగా పోరాడి, అందరినీ చంపి, తాము గాయపడి, ఎలాగో పడవను చేరుకున్నారు. 

ఇంక రాక్షస ద్వీపానికి వెళ్ళి కుక్క పిల్లను తేవాలి. పోయిన కొద్దీ తమకు ప్రాణాపాయం హెచ్చుతున్నదని తెలిసి కూడా, వారు యక్షదత్తుడు కోరిన పరిహారం చెల్లించటానికే నిశ్చయించారు. అయితే, రాక్షస రాజు వాళ్ళను చూస్తూనే, "మీరు సాలంకులు కారా? నా వల్ల మీకేం సహాయం కావాలి?" అని అడిగాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి, "సింహ శార్దూలాలను భయపెట్టే కుక్కపిల్ల ఉన్నదట. అది కావాలి," అన్నారు. "తీసుకుపోండి. మీ సాహసకృత్యాలు మాకు తెలియ వచ్చాయి. నేనీ కుక్క పిల్లనివ్వనంటే మీరు తీసుకోకుండా ఉంటారా? అందుచేత స్నేహపూర్వకంగానే తీసుకోండి," అన్నాడు రాక్షస రాజు. సాలంకులు అతనికి కృతజ్ఞత తెలిపి, "మీకెప్పుడు ఏ యుద్ధాలలో మా సహాయం కావాలన్నా కాకి చేత కబురు పంపితే  మేం వచ్చి వాలుతాం," అని రాక్షసరాజు వద్ద సెలవు పుచ్చుకున్నారు. ఇంక వాళ్ళు వారుణద్వీపం నుంచి ఒక పెనం తీసుకు రావలసి ఉన్నది. కానీ ఆ వారుణద్వీపం ఎక్కడ ఉన్నదీ వాళ్లకు అంతు చిక్కలేదు. అది తూర్పు సముద్రంలోనే ఏ ప్రాంతాలలోనో నీటి మట్టానికి నూరు నిలువుల లోతున ఉంటుందని రాక్షసరాజు వాళ్లకు చెప్పాడు.

అక్కడ బహుక్రూరులూ, మహాబలులూ అయిన జలరాక్షసులుంటారట. సాలంకులు తమలో తాము కూడబలుక్కుని వారుణద్వీపానికి వెళ్లకుండా తిన్నగా తారాద్వీపానికి వెళ్ళి, తాము సాధించి తెచ్చిన వాటితో యక్షదత్తుడు తృప్తిపడతాడేమో చూతామనుకున్నారు. ఎందుకంటే మిగిలిన వస్తువుల మహిమలు చెప్పాడు గాని, యక్షదత్తుడు ఆ పెనానికి ఏ మహత్తూ ఉన్నట్టు చెప్పలేదు. పెనం తెచ్చి తీరాలని పట్టుబడితే, వారుణద్వీపాన్ని వెతుక్కుంటూ అప్పుడే బయలుదేరవచ్చు. ఇలా అనుకుని సాలంకులు తారాద్వీపానికి తిరిగివచ్చి, యక్షదత్తుడికి తాము తెచ్చిన వెలగకాయలూ, తోలుసంచీ, నిప్పులు కక్కే ఈటే, కుక్కపిల్లా ఇచ్చి, "యక్షదత్తా, నీ పరిహారం చెల్లినట్టేనా?" అని అడిగారు. "ఇంకా వారుణద్వీపం నుంచి మీరు పెనం తెచ్చి ఇవ్వవలిసి ఉంది," అన్నాడు యక్షదత్తుడు. సాలంకులు మరొకసారి జలతారను అరువు తీసుకుని తూర్పు సముద్రంకేసి బయలుదేరారు. యక్షదత్తుడు తాను పరిహారంగా పుచ్చుకున్న వాటినన్నిటినీ తారాద్వీప రాజుకు సమర్పిస్తూ, "మహారాజా, దస్యులీసారికి  మన చేతిలో ఓడారే గాని, మన పైకి మరింత పెద్ద సేనతో ఎప్పుడు వచ్చి పడినా పడవచ్చు. అప్పుడు వారిని జయించటానికి ఈ వస్తువులన్నీ మనకు అవసరం. అందుచేత వీటిని మీ అధీనంలో జాగ్రత్తగా ఉంచండి," అన్నాడు. సాలంకులు సువర్ణద్వీపంలో కొంతకాలం ఉండి, అక్కడి వాళ్ళ వద్ద సముద్రం అడుగున దీర్ఘకాలం ఉండే విద్య నేర్చుకున్నారు.

వారు అనేక మాసాల పాటు తూర్పు సముద్రం అంతా గాలించి, చివరకు వారుణద్వీపం కనిపెట్టారు. వారుణద్వీపం నూరు నిలువుల లోతునే ఉన్నది గాని, దాని చుట్టూ ఉండే సముద్రం అనేక వేల నిలువుల లోతున్నది. ఆ ద్వీపం మీద భయంకరమైన జలరాక్షసులుంటున్నారు. సాలంకులు రాత్రి వేళ ఆ ద్వీపం మీదికి దిగి ఒక జలరాక్షసి ఇంట ప్రవేశించి, ఎలాగైతేనేం ఒక పెనం పట్టుకున్నారు. వారు దానితో బయటకి వస్తుండగా ఇద్దరు జల రాక్షసులు వారిని తరిమి పట్టుకుని, తమ వాడి గోళ్ళతో కండలు పీకసాగారు. ఇద్దరు సాలంకులు ఆ రాక్షసులకు వశులైపోయి ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండగా మూడోవాడు కత్తితో పోరాడి, ఇద్దరు రాక్షసులనూ చంపి, తన తమ్ముల నిద్దరినీ చెరొక చంకనా వేసుకుని, నీటి పైన ఉన్న జలతారలో చేర్చాడు. ముగ్గురూ బాగానే గాయపడ్డారు. కానీ పెద్దవాడి కన్న మిగిలిన ఇద్దరూ మరింత తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి కొస ప్రాణంతో ఉన్నారు. తన యజమాని మనసు తెలుసుకుని నడవగల జలతార అతి వేగంగా బయలుదేరి, తారాద్వీపం చేరుకుని, నీటి ఒడ్డున ఆగక, తిన్నగా రాజభవనం ప్రవేశించింది. సాలంకులలో పెద్దవాడు తాను తెచ్చిన పెనాన్ని యక్షదత్తుడికి అందిస్తూ, "నీ రుణం తీరింది. మేం ప్రాణాలు విడుస్తున్నాం," అని పడిపోయాడు. మిగిలిన ఇద్దరూ అదివరకే ప్రాణం పోయినట్టుగా పడిఉన్నారు. యక్షదత్తుడు వెంటనే తోలుసంచీ తెప్పించి సాలంకుల గాయాలన్నిటినీ దానితో తుడిపించాడు. కొద్దిసేపటి కల్లా వాళ్ళు కోలుకుని, బతికి బయటపడ్డారు.

బేతాళుడీ కథ చెప్పి, "రాజా, నాకొక్క సందేహం. యక్షదత్తుడు తన తండ్రిని హత్య చేసిన సాలంకులు చావాలనే కదా పరిహారం కోరాడు? ముఖ్యంగా జలరాక్షసుల నుంచి పెనం కోరటం అందుకే గదా? అలాటప్పుడు అతను వారి నెందుకు బతకనిచ్చాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "యక్షదత్తుడు సాలంకుల చావు కోరినట్టు ఎక్కడా కనబడదు. అతను కోరి ఉంటే తారాద్వీప రాజు వారిని శిరచ్ఛేదం చేసి ఉండును. ఎందుకంటే తారాద్వీపానికి యక్షదత్తుడు చేసిన సేవ అపారమైనది. అతను తన పరిహారం కోరటంలో కూడా తారాద్వీపానికి ముందుముందు దస్యుల భయం రాకుండా ఉండటమే ఆశయంగా పెట్టుకున్నాడు. సాలంకులను జలరాక్షసుల పైకి పంపటంలో అతనికి దురుద్దేశం ఉన్నట్టు కనపడే మాట నిజమే గాని, అందులో కూడా అతను మేలే ఆలోచించాడు. జలరాక్షసుల వాతపడి కూడా ప్రాణాలతో తిరిగి వచ్చిన సాహసవంతులు తారాద్వీపంలో ఉన్నారని తెలిస్తే దస్యులు తారాద్వీపం మీదికి మరొకసారి రావటానికే భయపడతారు. సాలంకుల సాటిలేని పరాక్రమం అదివరకే ప్రచారమయింది. కనుకనే రాక్షస ద్వీపవాసులు కూడా వారితో తగాదా పెట్టుకోలేదు. తమ మధ్య సాలంకుల వంటి ప్రతాపశాలులున్నారంటే తారాద్వీప యువకులు ధైర్యసాహసాలు తెచ్చుకుంటారు. అందుచేత యక్షదత్తుడు మొదటి నుంచి చివరదాకా తారాద్వీపం యొక్క శ్రేయస్సునే కోరాడని చెప్పాలి," అన్నాడు. రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. 

Comments