ఒకానొక ఊరిలో ఒక పేద దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉండేవారు. తండ్రి కూలీనాలీ చేసుకునేవాడు. ఇల్లాలు ధాన్యం దంపులకు పోయి చారెడు గింజలు చేతపట్టుకవచ్చేది. కుర్రవాడు అడవులలో ఉడుములను వేటాడి తెచ్చి వూళ్లో అమ్ముకునేవాడు. ఆడపిల్ల ఇంట్లోనే వుండి, ముగ్గురు తెచ్చినవీ పొదుపు చేసిపెట్టేది. కుటుంబం అందరిలోనూ ఆడపిల్ల తెలివయినదీ, చురుకయినదీ, ఉపాయమెరిగినదిన్నీ. ఒకనాడు ఆమె తండ్రివద్దకు వెళ్లి "నాన్నగారూ! ఇలా మనం ఎన్నాళ్లు కష్టపడినప్పటికీ కడుపు నిండటం లేదాయె. శెట్టిదగ్గిర ఒక వంద రూపాయలు అప్పు తెచ్చి, వ్యాపారం చేయండి. దేవుడి దయవల్ల మనకు కలిసివస్తే, నిమిషంలో అప్పు తీర్చి పారేయవచ్చు," అని సలహా చెప్పింది. అందుకు అతను "తల్లీ! నువు చెప్పిన మాట బాగానే వుంది. కాని, ఋణం చేసినట్టయితే దానిని తీర్చే మార్గం ఏది? శెట్టి సామాన్యుడు కాడు. మంచిమాటలు చెబుతూనే వుంటాడు. గడువు దాటిందంటే అనరాని మాటలు అని, రచ్చకు లాగుతాడు. ఆ కర్కోటకుడితో మనం బాధలు పడలేము. అయినా, అప్పు చేసుకొని పప్పూకూడు తినడం ఏమంత మంచిది?" అన్నాడు. ఈ మాటలకు ఆ అమ్మాయి "నాయనా, మీరేమీ భయపడవద్దు. నెల వాయిదాకు ఒక వంద రూపాయలు శెట్టివద్ద తీసుకువచ్చి, ఆ సొమ్ముతో పట్నం పోయి సరకు పట్టుకురండి. ఈలోపల ఏమి జరిగినా, నేను చూసుకొంటా" నని ధైర్యం చెప్పింది. సరే, ఇంత ధైర్యంగా పిల్ల ఎందుకు చెబుతున్నదో, అదీ చూదాం అనుకొని, అతను శెట్టిదగ్గర నూరు రూపాయలు బదులు తెచ్చి, సరకు బేరం చేయటానికాని పట్నం వెళ్లాడు. కాని, అనుకొన్న గడువు లోపల అతను తిరిగి రాలేకపోయాడు.
సరిగా ముప్పయి రోజులూ పూర్తి అయేసరికి, ప్రొద్దున్నే శెట్టి వాళ్ళ ఇంటికి చక్కావచ్చాడు. శెట్టి వచ్చే సమయానికి పిల్ల ఒక్కర్తే ఇంట్లో వున్నది. "మీ నాయన ఏడి?" అని శెట్టి అడిగాడు. "ఊరుకి వెళ్లాడు" అని పిల్ల చెప్పింది. "ఎప్పుడు వస్తాడు?" అని శెట్టి అడిగాడు. "వస్తే రాడు, రాకుంటే వస్తాడు" అని పిల్ల నిదానంగా జవాబిచ్చింది. ఈ జవాబు వినేవరకు, శెట్టికి మంట ఎత్తుకువచ్చింది. "సరి, మీ అమ్మ ఏది?" అని కోపంగా అడిగాడు. "మా అమ్మ గడ్లఇంటికి వడ్లు దంచటానికి పోయింది" అని ఆ పిల్ల నిలకడగా చెప్పింది. ఈ మాటలు శెట్టికి అసలే అర్థంకాక, ఆమె తనను వేళాకోళం చేసున్నదనుకొన్నాడు. "సరే, మీ అన్న ఏమయినాడు?" అని శెట్టి కోపంగా అరిచాడు. అందుకు పిల్ల నవ్వుతూ "మా అన్న కాళ్లు లేని గుర్రం ఎక్కి, వెంట్రుకలు లేని ప్రాణిని వేటాడటానికి వెళ్ళాడండి" అన్నది. శెట్టికి ఈ మారు కోపం ఆగలేదు. ఈ పేదవాళ్లకు ఇంత పొగరా? అని అనుకొంటూ వెంటనే వెళ్లి రాజుగారితో ఫిర్యాదు చేశాడు. రాజుగారు ఆ పిల్లను పిలిపించి విచారణ చేశారు. అందుకు ఆ అమ్మాయి "మహాప్రభూ! నేను చెప్పిన మాటలలో ఒక్కటీ తప్పు లేదండీ. శెట్టిగారికి నా మాటలు అర్థమయినయ్యో లేదో" అన్నది.
"మరైతే, నీవు చెప్పిన జవాబులకి అర్థమేమిటో విప్పి చెప్పు" అన్నారు రాజుగారు. అప్పుడు ఆ పిల్ల "మహారాజా! మా నాయన వెళ్లే వూరికీ, మన వూరికీ మధ్యని ఏరున్నది. అది కొండవాగు కనుక చినుకు పడటంతోనే నిండి పారుతుంది. ఒకవేళ మానాయన బయలుదేరే సమయానికి వాన వస్తే ఏరు అడ్డుకొంటుంది. కనుక ఏరు 'వస్తే రాడు, రాకుంటే వస్తాడు' అని శెట్టిగారి మొదటి ప్రశ్నకు జవాబిచ్చాను" అని చెప్పింది. తరువాత 'గడ్లయిల్లేమిటి? వడ్లు దంచడమేమిటి?' అని రాజుగారు అడిగారు. దానికి "గడ్లవారనే ఇంటిపేరుతో ధనవంతులున్నారండి. అక్కడికి మా అమ్మ వడ్లు దంచటానికి వెళ్లింది అని చెప్పాను. ఈ మాట అర్థం చేసుకోలేకపోయారు శెట్టిగారు" అన్నది. ఆ పిమ్మట రాజుగారు, "కాళ్లులేనిగుర్రం వుంటుందా, ఏమిటామాట?" అని అడిగారు. అందుకు ఆ పిల్ల " 'మీ అన్న ఏడీ?' అని శెట్టిగారు అడిగారు. మా అన్న చిన్నప్పటినించీ, చెప్పులు తొడుగుకొని అడవిలోకి ఉడుములవేటకు పోతాడు. కాళ్లులేని గుర్రము అంటే చెప్పులు. ఉడుముకి వెంట్రుకలుండవుకదండి! కనుక వెంట్రుకలులేని ప్రాణిని వేటాడటానికి వెళ్లాడన్నాను," అని చెప్పింది. పిల్ల తెలివితేటలకూ యుక్తికీ రాజుగారు మెచ్చుకొని, శెట్టికి నూరురూపాయలు జరిమానా విధించి, ఆ సొమ్ము పిల్లకు బహుమానం చేశారు. రాజుగారి ఎదటనే ఆ నూరురూపాయలూ ఆమె శెట్టికి జమకట్టి, బాకీ లేదనిపించుకొన్నది. మరునాడే, పట్నం పోయిన తండ్రి సరుకులతో ఇంటికి వచ్చి, తన కూతురు చేసిన యుక్తి తెలుసుకొని సంతోషించాడు.
Comments
Post a Comment