ఒక పల్లెలో ముగ్గురు దొంగలుండేవారు. దగ్గరగా ఉన్న ఒక కొండలోయలో వాళ్లు దాగుకొని, ఆ దారే పోయే బాటసారుల పైన పడి రోజూ దోచుకుంటూ వుండేవాళ్లు. ఒకనాడు వాళ్లా లోయలో పొంచి ఉండగా కొండ నుంచి పరుగెత్తుకొస్తూ ఒక సన్యాసి కనపడ్డాడు. వాళ్లా సన్యాసిని ఏ పెద్దపులో తరుముకొస్తోందనుకున్నారు. తాము దాగుకొని ఉన్న పొదలోంచి బయటకొచ్చి, సన్యాసిని అడ్డగించి "ఎందుకయ్యా ఇలా పారిపోతున్నావ్?" అని అడిగారు. అపుడా సన్యాసి గజగజ వణకుతూ, "ఆ కొండలో ఒక గుహ ఉంది. తపస్సు చేసుకోటానికి వీలుగా ఉంటుందని ఆ గుహలోకి వెడితే నాకు మృత్యుదేవత కనిపించింది. ఇంక ఒక క్షణం నిలబడినా అది నిన్ను చంపేస్తుందని భయమేసి పారిపోతున్నాను, నన్ను ఆపకండి" అన్నాడు. ఆ మాటలు విని వాళ్లు ఆశ్చర్యపడి, "ఏమిటీ, మృత్యుదేవతా? ఇంతకాలము నించి దొంగతనాలు చేస్తున్నాము. దోచుకొంటున్నాము. ఈ కొండపక్కనే ఎంతో మంది బాటసారుల బుర్రలు పగులగొట్టి వాళ్ళ డబ్బూ దస్కం లాక్కొంటూ వున్నాము. మాకెప్పుడూ కనపడలేదే ఆ మృత్యుదేవత? ఏదీ, ఎక్కడుందో వచ్చి చూపించు" అన్నారు. ఆయన రానంటే వినక, వాళ్లు ఆయన్ని బలవంతపెట్టారు. ఇక తప్పదనుకుని నన్యాసి, వాళ్లని గుహలోకి తీసుకువెళ్ళాడు. వాళ్లు గుహలో కొంతదూరం వెళ్లేటప్పటికి ఎదురుగుండా పెద్ధ ధనరాశి ఒకటి కనపడింది. అందులో ఉన్న బంగారం, వెండీ ధగధగ మెరిసిపోతూ కళ్లు మిరుమిట్లు కొలిపినయి. వాటి కాంతికి గుహలో చీకటి లేకుండా పోయి, గ్యాసులైటు పెట్టినట్లుంది. దొంగలు ముగ్గురూ ఆ రాశి చూస్తూ నిలబడిపోయి తమ కళ్లను తామే నమ్మలేకపోయారు!
"ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్న ధనరాశి నిజమయినదేనా? మాయ కాదుకద! మనం కల కనటం లేదుకద! మన జీవితంలో ఎన్నడైనా ఇంత పెద్ద ధనరాశి ఒక్కచోట పోగుపడి వుండటం చూచి ఎరుగుదుమా! ఆహా, ఎంత అదృష్టం! భాగ్యమంటే నిజంగా మనదే భాగ్యం" అని వాళ్లు అలా నిలబడిపోయి చూస్తుంటే సన్యాసి "అన్నలారా, చూశారు కదా ఈ ధనరాశిని ? ఇదే మనుష్యులపాలిటి మృత్యుదేవత! ఇంక ఇక్కడ ఒక్క నిమిషమైనా ఆగకండి. చంపేస్తుంది. నేను పోతున్నాను. మీరుకూడా పారిపొండి" అని చెప్పి అక్కడ నిలబడక తుర్రుమన్నాడు. "ఏది కావలస్తే అది ఇచ్చే యీ ధనలక్ష్మిని 'మృత్యుదేవత' అంటాడేమిటి నన్యాసి?" అని వాళ్లు ఆశర్యపోయారు. "వాడి మాటకేంలే, పిచ్చివాడు!" అనుకుంటూ ఆ సొమ్మును పంచుకుందామని వాళ్లు లెక్కపెట్టడం మొదలెట్టేరు. లెక్క పెట్టడానికి వందా, వెయ్యీనా? లక్షలూ, కోట్లూ, అర్బుదాలూ ఉన్నాయి ఆ రాశిలో! ఎంతసేపు లెక్క పెట్టినా తరగలేదా రాశి. వాళ్లకి చేతులు నొప్పి పుట్టాయి. ఆయాసం వచ్చింది. ఆకలి వేసింది. అప్పుడు వాళ్లలో ఒకడు, నేను పల్లెలోకి వెళ్లి భోజనం చేసి, మీకు భోజనం తెస్తాను, నే వచ్చే దాకా మీరిద్దరూ యీ రాశిని కాపలా కాస్తుండండి. తర్వాత ముగ్గురం పంచుకుందాం" అన్నాడు. ఆ మిగతా ఇద్దరూ "సరే" అని వాణ్ణి పల్లెకు పంపారు.
పల్లెకు పోతూ దారిలో వాడు ఇలా అనుకున్నాడు : "వీళ్లిద్దరూ ఎంత మూర్ఖులు, తమకి నిజంగా నేను అన్నం మోసుకురావటానికే వెడుతున్నాననుకున్నారు! అంతేకాని ఈ ధనమంతా నేనొక్కణ్ణే దక్కించుకోటానికో మాంచి ఉపాయం ఆలోచించుకుని వెడుతున్నానని యీ తెలివితక్కువ నాగమ్మలకి తెలీదు ! తెలివి లేకున్నా డబ్బులో వంతు మాత్రం కావాలట! మూడువంతులు వేస్తారట! నా కొక్కవంతుట! చూద్దాం! ఒక్క నాణమైనా వీళ్ళకి దక్కనివ్వక అంతా నేనే పుచ్చుకుంటాను." అని అనుకుని, తన ప్రయత్నం సఫలమై ఆ సొమ్మ౦తా తనకు చిక్కాక దానితో తానేమేమి చేయాలో ఆలోచించుకుంటూ పల్లెకు పోయాడు. వాడు గుహ వదలివెళ్లిన తర్వాత మిగతా ఇద్దరిలో ఒకడు రెండోవాడితో, "ఒరే అబ్బీ, చూశావా వీడి తెలివి? తను తిరిగి వచ్చే దాకా మనం కాపలా కాయాలట! తాను వచ్చి మనతో ఈ సొమ్ము పంచుకొంటాడట! మంది ఎక్కువైతే మజ్జిగ పల్చబడిపోతుందన్న సంగతి నీకు తెలిసిందే కదా? మనం వీడికి వాటా ఇవ్వకూడదు" అన్నాడు. ఆ మాట విని రెండోవాడు, "ఇవ్వకూడదనే నేనూ అనుకుంటున్నాను. కాని వీణ్ణి వదిలించుకోడం ఎలాగ?" అని అడిగేడు. "దానికేముంది? వాడు తిరిగి వచ్చే వేళకి మనమిద్దరం గుహ ద్వారం దగ్గర దాక్కుని ఉండి, వాడు లోవల అడుగుపెట్టడం తడువుగా మన దుడ్డుకఱ్ఱలతో మోది చంపేస్తే సరి శని విరగడైపోతుంది" అని సలహా చెప్పాడు. అందుకు రెండోవాడు ఒప్పుకున్నాడు. వాళ్లిద్దరూ తమ బడితెలతో గుహ ద్వారం దగ్గర కాచుకు కూచున్నారు. కొంతసేపటికి, పల్లెకు వెళ్లినవాడు భోజన పదార్థాలతో తిరిగి వచ్చాడు. వాడు గుహలో అడగు పెట్టీ పెట్టడంతోనే అక్కడ పొంచి ఉన్న మిగతా ఇద్దరూ తమ దుడ్డు కఱ్ఱలతో వాడి తల పగలగొట్టి చంపేశారు.
ఇలాగ వాడా ధనరాశికి బలి అయాక వాళ్ళిద్దరూ, తమ వంటి మీద పడ్డ రక్తాన్ని కడుక్కుని, వాడు తెచ్చిన భక్ష్యాలను గుహలోకి తీసుకుపోయి, ఆ ధనరాశి కేసి చూస్తో, "ఈ డబ్బంతా మనదేకదా" అని లొట్టలు వేసుకొంటూ, ఆ భక్ష్యాలు తిన్నారు. తిని ఇన్ని నీళ్లు తాగేరు. వెంటనే వాళ్లకి వికారం వచ్చి, కడుపులో చెయ్యి పెట్టి కలిపినట్లుగా బాధ పెట్టింది. మరి కాస్సేపటికి ఆ బాధ ఎక్కువై తాము తిన్న అన్నంలో విషం ఉందన్న సంగతి వాళ్లకి బోధపడింది. అప్పుడు వాళ్ళలో ఒకడు రెండోవాడితో, "చూశావుట్రా అబ్బీ, ఈ దుర్మార్గుడు ఎంత ద్రోహం, చేశాడో ? మనకిద్దరికీ ఇలాగ విషం పెట్టి చంపేసి, ఈ డబ్బంతా తనే దక్కించుకుందాం అనుకున్నాడు" అని తిట్టడం మొదలెట్టేడు. రెండోవాడు, "ఒరేయ్, వాణ్ణి అనటం ఎందుకు? మనమేం తక్కువ చేశాం? లింగాన్ని మింగేవాడొకడైతే, గుడిని మింగేవాడొకడన్నట్లు, మనం వాడికంటే ఎక్కువ. ద్రోహాన్నే చేశాం! అంతవరకూ అన్నదమ్ముల లాగ కలసి మెలసి తిరిగిన మనకి, ఈరోజున ఈ ధనరాశి కనపడి, మనలో దుర్బుద్ధి పుట్టించి ఒకళ్ళ చేత ఒకళ్లని నాశనం చేయించింది. ఆ సన్యాసి దీన్ని మృత్యుదేవతని చెప్పి పారిపోతే మనం ఆయన్ని పిచ్చివాడని గేలిచేశాం! ఆయన చెప్పినదెంత నిజమో చూడు!" అన్నాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? మరి కాస్సేపటికే ఆ విషం వల్ల బాధ ఎక్కువైపోయి ఇద్ధరూ ఆ ధనరాశి ముందర గిలగిల తన్నుకు చచ్చిపోయారు.
Comments
Post a Comment