- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు మీది నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీవు పడుతున్న ఈ శ్రమ అంతా చివరకు వ్యర్థమైపోతే విచారించనవసరం లేదు. ఎందుచేతనంటే, పూర్వం ఘూర్జర దేశపు రాజు తారాంగుడు ప్రయత్నం ప్రారంభించక పూర్వమే ఓడిపోయాడు. శ్రమ తెలియకుండా నీకా తారాంగుడి కథ చెబుతాను విను," అంటూ ఇలా చెప్పసాగాడు: ఘూర్జరదేశపు రాజుకు ఇద్దరు భార్యలుండేవారు. చాలా కాలం పాటు ఇద్దరికీ సంతు లేకుండా ఉండి, చివరకు చిన్న రాణి ఒక కొడుకును కన్నది. రాజ్యానికి యువరాజంటూ ఏర్పడినందుకు అందరూ సంతోషించారు. ఆ కుర్రవాడికి తారాంగుడని పేరు పెట్టి ఎంతో గారాబంగా పెంచసాగారు.
మరి అయిదేళ్ల అనంతరం పెద్దరాణికి కూడా ఒక కొడుకు పుట్టాడు. వాడికి చంద్రాంగుడని పేరు పెట్టారు. కుమారులిద్దరూ పెరగసాగారు. చంద్రాంగుడు పట్టపురాణి కొడుకు, అందుచేత తండ్రి అనంతరం రాజయే అధికారం వాడికే ఉన్నదని పెద్దరాణి అంతఃపురంలో వాళ్ళ ఉద్దేశం. అందుచేత అక్కడి వాళ్ళంతా చంద్రాంగుణ్ణి "యువరాజా!" అని పిలిచే వాళ్ళు. తారాంగుడు కావటానికి చిన్న రాణి కొడుకే అయినా రాజుగారి పెద్దకొడుకు గనక తండ్రి అనంతరం సింహాసనం మీద కూర్చునే హక్కు తారాంగుడికే ఉన్నదని, చిన్నరాణి అంతఃపురంలో వాళ్ళంతా అతన్ని, "యువరాజా!" అని పిలిచేవాళ్ళు. రాజు మాత్రం తన కొడుకులిద్దరినీ సమ భావంతోనే చూశాడు. వారిలో రాజ్యార్హత ఎవరిదన్న విషయం గురించి ఆయన ఆలోచించను కూడా లేదు. అది సమస్య అయి కూర్చునప్పు డాలోచించుకోవచ్చు లెమ్మనుకున్నాడు. కొంత కాలానికి ఆ సమస్య రానే వచ్చింది. రాజుకు జబ్బు చేసింది. అవసాన కాలంలో ఆయన తన మంత్రిని పిలిచి, "నా కొడుకుల్లో ఎవడు రాజు కావటం న్యాయమో మీరే అలోచించి రాజ్యాభిషేకం చెయ్యండి," అని చెప్పి కన్ను మూశాడు. రాజుగారికి ఉత్తరక్రియలు పూర్తిచేసి మంత్రి పురోహితుడు మొదలైనవారు న్యాయనిర్ణయం చెయ్యటానికి కూర్చున్నారు. వాళ్ళు ఎంతసేపు ఆలోచించినా రాజ్యార్హత ఎవరికి ఎక్కువ ఉన్నదీ తేలలేదు. చిన్నరాణికి మొట్టమొదట కొడుకు పుట్టాడు. తారాంగుడు పుట్టిన నాడే దేశ ప్రజలు తమకు యువరాజు ఏర్పడ్డాడనీ, భవిష్యత్తులో అతనే తమ రాజవుతాడనీ అనుకున్నారు. చంద్రాంగుడు "అన్నా" అని పిలిచేవాడంటూ ఉండగా అతన్ని రాజు చెయ్యటం ఉచితం కూడా కాదు.
అయితే చంద్రాంగుడి తల్లి పట్టపురాణి. పట్టపురాణికి కొడుకుంటూండగా, సింహాసనం మీద కూర్చునే అధికారం లేని చిన్న రాణి కొడుకును తెచ్చి రాజును చెయ్యటం కూడా అంత భావ్యం కాదు. అలాటి నిర్ణయం రాజుగారు స్వయంగా చేసి ఉంటే లోకం సమ్మతించేదేమో, కానీ యిప్పుడు మంత్రి పురోహితులు అలాటి నిర్ణయం చెయ్యకూడదు. పోనీ ఇద్దరు రాణులూ రాజీపడి ఒక నిర్ణయానికి వస్తారేమో అనుకుంటే, తన కొడుకే రాజు కావాలని ఇద్దరూ మంచి పట్టుదలతో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఏ నిర్ణయమూ చెయ్యలేక మంత్రి, రాజ్యాన్ని రెండుగా చీల్చి, రెండు భాగాలకూ ఇద్దరు రాజకుమారులనూ అభిషేకింతామని సూచించాడు. అయితే ఇందుకు చంద్రాంగుడు సుతరామూ ఒప్పుకోలేదు. ఒక బలమైన రాజ్యాన్ని రెండు బలహీనమైన రాజ్యాలుగా చీల్చటం రాజనీతి కాదు. అందువల్ల దేశం యొక్క ఐక్యత దెబ్బ తింటుంది. కాల క్రమాన స్పర్థలూ, శత్రుభావమూ, యుద్ధాలూ మొదలైనవి ఏర్పడతాయి. చివరకు తారాంగుడికే రాజ్యాభిషేకం నిశ్చయమయింది. చంద్రాంగుడు ఆ మహోత్సవపు హడావుడిలో ఎవరితోనూ చెప్పకుండా దేశం విడిచి వెళ్ళిపోయాడు.
చంద్రాంగుడు తన శౌర్య ప్రతాపాలలో ఎంతో విశ్వాసం గలవాడు; వాటి సహాయంతోనే తానొక రాజ్యం గెలుచుకుందామని అతని ఉద్దేశం. తన కొడుక్కు రాజ్యప్రాప్తి లేకుండా పోయిందన్న దిగులుకు, ఆ కొడుకు కూడా కూడా కళ్ళ ఎదుట లేకుండా ఎటో వెళ్లిపోయాడన్న దిగులు తోడై, చంద్రాంగుడి తల్లి మంచం పట్టి కొన్నాళ్ళకు మరణించింది. చంద్రాంగుడు సాధారణ క్షత్రియవీరుడి దుస్తులు ధరించి, గుర్రం మీద కొన్ని రోజులు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసి, కంకణమనే చిన్న రాజ్యాన్ని చేరుకున్నాడు. అతను రాజవీధిన వెళుతుండగా ఆ దేశపు రాజుకూతురు విద్యుల్లత ఏనుగు మీద దేవాలయానికి పోతూ అతనికి ఎదురయింది. ఆమె పేరుకు తగ్గట్టే అతిలోక సౌందర్యవతిగా కనిపించింది. ఆమెను చూడగానే చంద్రాంగుడి కళ్లు జిగేలుమన్నాయి. కంకణరాజుకు విద్యుల్లత ఒక్కతే కుమార్తె. ఆమెను పెళ్లాడేవాడు కంకణ దేశానికి రాజుకూడా అవుతాడు. అందుచేత ఆమె తండ్రి ఆమెను ఒక గొప్ప వీరుడి కిచ్చి పెళ్ళిచెయ్యాలని తలపెట్టాడు. ఆయన వద్ద అన్నిరకాల యుద్ధవిద్యల్లోనూ ఆరితేరిన జెట్టీలున్నారు. త్వరలోనే విద్యుల్లతకు స్వయంవరం ఏర్పాటు కానున్నది. స్వయంవరానికి వచ్చే వారిలో ఎవరు అన్ని యుద్ధ విద్యలలోనూ రాజుగారి జెట్టీలతో నెగ్గితే వారికి విద్యుల్లత నిచ్చి పెళ్లి చేస్తారు. చంద్రాంగుడీ వార్త విని తన కోరికలు రెండూ ఒక్కసారిగానే సిద్ధింపజేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఏదైనా ఒక రాజ్యం సంపాదించుకునే ఉద్దేశంతో అతను ఇంటి నుంచి బయలుదేరాడు.
కంకణ రాజధాని ప్రవేశిస్తూనే అతను విద్యుల్లతను చూసి, ఆమెను పెళ్లాడని జన్మ నిరర్థకమనుకున్నాడు. స్వయంవరం నాడు తాను రాజుగారి జెట్టీలతో పోరాడి గెలిచినట్టయితే కోరిన భార్యా, రాజ్యమూ కూడా లభిస్తాయి. కంకణరాజ్యం చిన్నదే అయినా, దాన్ని చేతిలో ఉంచుకుని తాను తన శక్తితో పరిసర రాజ్యాలను గెలుచుకోవచ్చు ననుకున్నాడు చంద్రాంగుడు. అతనొక పేదరాసి పెద్దమ్మ ఇంట బస ఏర్పాటు చేసుకుని విద్యుల్లత స్వయంవరం కోసం ఎదురుచూడసాగాడు. కొద్ది రోజులకు స్వయంవరం రోజు రానే వచ్చింది. విద్యుల్లతను వరించి వచ్చిన రాజకుమారులకు ప్రత్యేకమైన బసలు ఏర్పాటై ఉన్నాయి. చంద్రాంగుడు కూడా అక్కడికి వెళ్ళాడు. తాను ఫలానా దేశపు రాజకుమారుణ్ణని చెప్పక, ఒక సుక్షత్రియకుమారుణ్ణని మాత్రమే చెప్పాడు. విద్యుల్లతను పెళ్లాడ గోరే వాళ్ళు రాజుగారి జెట్టీలను మల్లయుద్ధంలోనూ, గదా యుద్ధంలోనూ, విలువిద్యలోనూ, చివరకు కత్తి యుద్ధంలోనూ ఓడించాలి. జయాపజయాలు నిర్ణయించటానికి కొన్ని నియమాలున్నాయి.
వచ్చిన వారిలో ముప్పాతికమంది రాజుగారి మల్లుల చేతిలోనే ఓడిపోయి పరాభవం పొందారు. మల్లులను జయించిన వారిలో ఎక్కువమంది గదాయుద్ధంలో ఓడిపోయారు. చంద్రాంగుడు సామాన్య క్షత్రియుణ్ణని చెప్పుకోవటం చేత మిగిలిన రాజకుమారులందరూ పరీక్షలలో ఓడినాకగాని అతని వంతు రాలేదు. అతను గెలుస్తాడని రాజుగారు కలలో కూడా అనుకోలేదు. కాని ఒక్క గడియకాలంలో అతను నాలుగు రకాల యుద్ధవిద్యలలోనూ రాజుగారి జెట్టీలను ఓడించాడు. మల్లయుద్ధంలో చేతులు కలిపిన మరుక్షణమే రాజుగారి మల్లుడు మట్టికరిచాడు. అలాగే రాజుగారి జెట్టీచేతిలో నుంచి గద క్షణంలో ఎగిరిపోయింది. చంద్రాంగుడు తన మొదటి బాణం తోనే రాజుగారి విలుకాడి విల్లు విరిచాడు. రాజుగారి ఖడ్గయోధుడి కత్తి చంద్రాంగుడి కత్తికి తగులుతూనే రెండు ముక్కలయింది. ఈ విధమైన యుద్ధపరీక్ష చూసి అందరూ కొయ్యబారిపోయి చూస్తుండగా విద్యుల్లత వరమాల చేతబట్టుకుని చంద్రాంగుణ్ణి సమీపించింది. సరిగా ఆ క్షణంలో వాయువేగంతో రథం మీద తారాంగుడు వచ్చాడు. అతను కూడా స్వయంవరానికే వచ్చాడు. అయితే చంద్రాంగుడి తల్లి మరణం మూలంగా అతను అనుకున్నవేళకు బయలుదేరలేక, ఆమె దహనసంస్కారం అయాక బయలుదేరి, కొంచెం ఆలస్యంగా చేరాడు. ఆ వచ్చిన వాడు ఘూర్జర రాజనీ, అతను కూడా తన కుమార్తెను పెళ్లాడాలనే వచ్చాడనీ తెలిసేసరికి కంకణరాజుకు పెద్ద పెట్టున ఏడవాలనిపించింది. తాను ఏర్పాటు చేసిన కొద్దిపాటి పరీక్షలో ఎంతేసి రాజులూ ఓడిపోగా ఎవడో అనామకుడు గెలిచినందుకే ఆయన లోలోపల కుళ్లిపోతున్నాడు. అలాటి పరిస్థితిలో ఘూర్జరరాజంతటివాడు తనకు అల్లుడయే అదృష్టం ఒక్క ఘడియలో తప్పిపోయిందని తెలిసి అతడు ఎంతో ఆవేదన పొందాడు.
కాని అంత నిస్పృహలోనూ ఆయనకొక దురాలోచన మెరుపులాగా తలలోకి వచ్చింది. "మహారాజా, దయ చెయ్యండి. దయ చెయ్యండి. పరీక్షలింకా పూర్తికాలేదు. ఈ యువకుడిప్పుడే నా జెట్టీలను జయించాడు, తమరీ యువకుణ్ణి ఓడించినట్టయితే మీకే వరమాల లభిస్తుంది," అన్నాడు కంకణరాజు. తనకు అల్లుడు కాబోయేవాడు ఘూర్జరరాజు చేతిలో చస్తే బాగుండునని కంకణరాజు కోరిక. తారాంగుడు ఒర నుంచి కత్తి దూసి చంద్రాంగుణ్ణి సమీపించాడు. అతను చంద్రాంగుణ్ణి గుర్తించలేదు, కాని చంద్రాంగుడు తన అన్నను గుర్తించి, తల వంచుకుని, తన చేతిలో కత్తి జారవిడిచాడు. విద్యుల్లత తన చేతిలోని వరామాలను చంద్రాంగుడి మెడలో వేసి, అతను కిందజార్చిన కత్తి తీసుకుని, "ఈయన నలుగురితో పోరాడి అలిసి ఉన్నారు. ఆ చేసే యుద్ధం నాతో చెయ్యండి," అన్నది. చంద్రాంగుడు నిర్ఘాంతపోయి, తల ఎత్తి విద్యుల్లతనూ, తారాంగుణ్ణీ చూశాడు. ఈ సారి తారాంగుడు చంద్రాంగుణ్ణి బాగా గుర్తించాడు. అతను తన కత్తిని తిరిగి ఒరలో పెట్టేసి, తన రథం ఎక్కి ఎవరితోనూ ఏమీ అనకుండానే వెళ్ళిపోయాడు. విద్యుల్లత వరామాలను చంద్రాంగుడి మెడలో వేసింది గనక వారిద్దరికీ వివాహం చెయ్యక తప్పలేదు. తన కల్లుడైన వాడు సాక్షాత్తూ ఘూర్జరరాజు యొక్క పట్టపుదేవి గర్భవాసాన పుట్టినవాడే నని తెలిశాక కంకణరాజు దుఃఖమంతా పోయింది. తారాంగుడు తన రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రి మొదలైన వారితో, "నాకీ రాజ్యం అవసరం లేదు. నా తమ్ముడు కంకణ దేశంలో ఉన్నాడు. అతనికే ఈ రాజ్యం కూడా ఇచ్చెయ్యండి," అన్నాడు.
ఈ విధంగా చంద్రాంగుడు ఘూర్జర దేశానికీ, కంకణ దేశానికీ కూడా రాజయ్యాడు. తారాంగుడు దేశాలుపట్టి పోయాడు. అతని జాడ ఎవరికీ తెలియదు. బేతాళుడీ కథ చెప్పి, "రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. విద్యుల్లత ఘూర్జరరాణి అయే అవకాశాన్ని కూడా జార విడిచి తారాంగుడి కెదురుగా ఎందుకు కత్తి పట్టింది? వరమాల ఒక అనామకుడి మెడలో ఎందుకు వేసింది? విద్యుల్లతతో తారాంగుడు కత్తియుద్ధం చెయ్య నిరాకరించటం అర్థం చేసుకోవచ్చు, కాని తన తమ్ముణ్ణి జయించి ఆమెను సంపాదించటానికి మరొక విధంగా ఎందుకు యత్నించలేదు? పై పెచ్చు అతను తనకున్న రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "విద్యుల్లత నియమాలంటే గౌరవం గలది. తండ్రి నీచంగా తన నియమాన్ని తానే ఉల్లంఘించాలని చూశాడు. ఆమె దాన్ని పడగొట్టింది. ఇక తారాంగుడు దురభిమానం గల అశక్తుడు. ఘూర్జర రాజ్యాన్ని రెండుగా చీలుస్తామన్నప్పుడు కూడా చంద్రాంగుడు అభ్యంతరం చెప్పాడే గాని తారాంగుడు అభ్యంతరం చెప్పలేదు. తాను కోరిన కన్యను తాను జయించలేకపోవటమే గాక, ఆమె ప్రతిఘటనను కూడా ఎదుర్కున్నాడు. ఈ అవమానం లోకానికంతకూ తెలుస్తుందని అతను రాజ్యాన్ని కూడా వదిలి పారిపోయాడు," అన్నాడు. రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.
Comments
Post a Comment