చందమామ కథలు - రాక్షసి పెద్దమ్మ

 

Telugu Chandamama fairy tale of a young girl who escaped form clutches of an evil witch. Best Chandamama Telugu Stories to read.

అనగనగా ఒక ముసలివానికి దీప అనే ఒక కూతురు. అతనికి భార్య లేకపోవటం చేత కూతురే ఇల్లు చక్కపెట్టుతూ వుండేది. కొంతకాలానికి, ముసలివానికి బుద్ధి పుట్టి మళ్లీ పెళ్లి చేసుకొన్నాడు. సవతితల్లి రాగానే ఇల్లంతా తారుమారయి, దీపకు స్వేచ్ఛ తగ్గిపోయింది. ముసలివానికి ఇప్పుడు పెళ్లాం ఎంతచెబితే అంత. అందుచేత పిల్లమీద మగనితో నేరాలు చెప్పేది. తిండివేళకు, మిగిలిపోయిన ఎంగిలి రొట్టె ముక్కలు రాల్చి, "ఎక్కడికయినా పోయి మింగు" మని కసిరేది. దీప ఏమి చేయగలదు? పెరట్లో మూలని వుండే చిన్ని పాకలోకి పోయి, కంటికి కడివెడు నీళ్లుగా ఏడిచేది. ఇలా వుండగా ఒకనాడు పాకలో కన్నంలోనించి కిచకిచలాడుతూ ఒక చుంచు నేస్తం వచ్చి కనపడింది. అది వెనుక కాళ్లపైన ఎదురుగా కూర్చునేసరికి, జాలిగుండెగల దీప, తన రొట్టె చిదిపి ఒక ముక్క దానికి పడవేసింది. చుంచు అది తినేసి మళ్లీ మళ్లీ ఆమెవేపు చూడటం మొదలుపెట్టింది. అది చూచినప్పుడెల్లా ముక్కలు పడవేస్తూ ఉండేసరికి దీపకు రొట్టె మిగలకుండా పోయింది. అప్పుడు చుంచు, "దీపా! కొంచెమైనా రొట్టె నీకు అట్టేపెట్టకుండా పాపం, నేను తినివేశాను. అయితే ఏమిలే. నీకు పనికివచ్చే మాట ఒకటి చెబుతా, విను! కొత్తగా వచ్చిన నీ మారుతల్లి ఎవరనుకొన్నావో! మనిషిరూపంతో కనపడే రాక్షసి. ఆమె బాబాయాగా అనే బ్రహ్మరాక్షసికి చెల్లెలు. పని పెట్టుకుని నీ మారుతల్లి తన అక్కవద్దకు నిన్ను పంపుతుంది. అప్పుడు వచ్చి నన్ను పిలిస్తే, నీకు గండం దాటే ఉపాయం చెబుతా" అని సలహా ఇచ్చింది.  

ఇలా ఉండగా ఒకనాడు, ముసలివాడు ఊరికి వెళ్లడం చూసి, అతని భార్య దీపను పిలిచింది. "అడివిలో పెద్ద కోటలో మీ పెద్దమ్మ ఉన్నది, ఆమెను అడిగి సూదీ దారం ఇమ్మన్నానని తీసుకురా" అని అంటూ, పోయి రావటానికి ఆనవాళ్లు చెప్పింది. దీప వెళ్లేవరకూ ఆమె గుమ్మంలోనే నిలబడి వుండటంచేత, చుంచు నేస్తాన్ని కలుసుకుని ఈ సంగతి చెప్పటానికి దీపకు సావకాశం లేకపోయింది. చాలా దూరం నడిచి, దీప ఒక పడిపోయిన చెట్టు చేరుకొనేసరికి, కిచకిచలాడుతూ చుంచునేస్తాం ఎదురువచ్చి "దీపా, నీకు వచ్చిన భయం లేదు. దారిలో దొరికిన వస్తువు ఏదయినా సరే, మంచిదని తోస్తే, తీసి జాగర్త పెట్టు, నీకు మేలు కలుగుతుంది" అని చెప్పి మాయమైంది. ముందుగా దీపకు ఒక కొత్త జేబు రుమాలు దొరికింది. దానిని ఆమె చేత పుచ్చుకొన్నది. తరువాత ఒక సీసాతో చమురు, కొన్ని మాంసపు ముక్కలు, ఒక నీలిరంగు రిబ్బను, మంచి రొట్టెముక్క ఇవన్నీ వరుసగా కనపడినాయి. వీటన్నింటిని జాగర్తగా తీసి, ఆమె దగ్గిర పెట్టుకుంది. చివరకు దీప, అడివిలో పెద్దమ్మ ఉండే కోట చేరుకుంది. ఆ అందలానికి ఎత్తయిన కంచె, కంచెకు పెద్ద ద్వారాలు ఉన్నాయి. దీప తలుపులు తోసేసరికి అవి "కుయ్యో, మొర్రో" మని చప్పుడు చేశాయి. వెంటనే దీప తనవద్ద ఉన్న సీసా తీసి, అందులో చమురు బందులలోకి వొంచింది. ఇంకా కొంచెం లోపలకు వెళ్లేసరికి, ఏడుస్తూవున్న దాసీది కనపడింది. దీప ఆమెను ఓదార్చి, కనీళ్లు తుడుచుకోటానికి తనవద్ద ఉన్న జేబురుమాలు ఇచ్చింది. 

పనిమనిషికి దగ్గరలోనే బక్కచిక్కిన ఒక పెద్ద కుక్క ఉన్నది. అది తిండిలేక ఉసూరుమని ఉండటం కనిపెట్టి, దీప రొట్టెముక్క దానికి విసరగా, అది గబుక్కున అందుకుని తినేసి, సంతోషంతో తోక ఆడించింది. దీప వచ్చిన సంగతి తెలుసుకుని, గదిలో మగ్గం నేస్తూవున్న బాబాయాగా నవ్వుతూ దీపను పిలిచింది. ఆమె తను వచ్చిన పని చెప్పగా "ఇదుగో ఈ మగ్గం నేస్తూవుండు. నేను వెళ్లి నీకు సూదీ దారం తెచ్చిపెడతాను" అన్నది. పనిమనిషిని పిలిచి యాగా, "ఇవాళ మా అమ్మాయి వచ్చింది. చప్పున నీళ్లు కాచి ఆమెకు తలంటి పోసెయ్యి" అని తొందరపెట్టింది. యాగా చెప్పిన ప్రకారం దీప మగ్గం నేస్తూనేవుంది. ఆమెకు గదిలో ఒక పొంచి వున్న నల్లపిల్లి కనిపించి "నాకు మూడు రోజుల నుంచి తిండి లేదు. కడుపు మాడి పోతున్నది," అనగానే దయగల దీప తన దగ్గర ఉన్న మాంసపు ముక్కలు తక్షణమే దానికి పడవేసింది. నల్లపిల్లి సంతోషించి "అమ్మాయీ! నువ్విక్కడ అట్టేసేపు ఉన్నావంటే ప్రాణానికి మోసం వస్తుంది. తప్పించుకుపోయే ఉపాయం చెబుతా, విను: మీ పెద్దమ్మ ఇప్పుడు నీళ్లగదిలో ఉన్నది. నీకు బదులు నేను మగ్గం నేస్తూవుంటాను. నువు పారిపో. ఆమె నిన్ను వెంట తరుముకొస్తే ఈ చేతిరుమాలు తీసి విసురు. ఆ తరువాతకూడా ఇంకా తరుముకువస్తే ఈ పువ్వు తీసి విసురు. నీకు మేలు కలుగుతుంది," అని చెప్పి ఒక జేబు రుమాలు, పువ్వు యిచ్చిపంపింది. ఆ ప్రకారమే దీప వచ్చిన దోవనే మళ్లీ పారిపోవటం మొదలుపెట్టింది. కావాలి కాస్తున్న కుక్క యిది కనిపెట్టి ఆమెమీదికి ఉరికింది గాని తీరా మనిషిని చూచాక, "ఓహో ఈమె నాకు రొట్టెముక్క ఇచ్చిన పిల్లలాగుంది. చాలా దయగలది" అని అనుకొని, ఏమీ అనకుండా ముడుచుకు పడుకుంది. 

ఆమె గుమ్మంవద్దకు వచ్చేసరికి, తమకు చమురుపోసిన దీపను గుర్తించి, తలుపులు చప్పుడు చేయక దారిచ్చాయి. గుమ్మం దాటగానే కళ్లుపొడిచే ముళ్ళచెట్టున్నది. దీప తన దగ్గర ఉన్న నీలిరిబ్బను తీసి దానికి కట్టింది. ఆ రక్కసి చెట్టుకి ఎంతో అందం వచ్చేసరికి, అది పొంగిపోయి దీపను కళ్ళుపొడవకుండా వదిలేసింది. ఇక ఏమీ ఆటంకం లేకపోగా దీప లేడిపిల్లలాగ పరుగుచ్చుకొన్నది. ఇంతలో యాగా గదిలోకి వచ్చి చూచింది, దీప కనపడలేదు. మగ్గం దగ్గిర కూచున్న నల్లపిల్లిపైన మండిపడి "భడవా! పిల్లకు గుడ్లు పెరికివేయకుండా ఎందుకు ఊరుకొన్నావు?" అని అడిగింది. "ఇన్నేళ్ళనించీ పనిచేస్తున్నా ఎండిపోయిన ఎముకముక్కలు తప్ప మరేమన్నా పడవేసిన పాపాన పోయావా? ఆ అమ్మాయి చూడు, ఎంత మంచిదో. అడగకుండానే మంచి మాంసం ముక్కలు పెట్టింది" అంటూ నల్లపిల్లి చెప్పింది. ఈ మాట వినగానే బాబాయాగా నల్లపిల్లిని నాలుగుకాళ్ళూ పట్టుకొని విసిరి పారవేసి గుమ్మం దగ్గరకు వెళ్లింది. "గుమ్మమా, గుమ్మమా ఆ పిల్ల పారిపోతూవుంటే ఎందుకు చప్పుడు చేశావు కావు?" అని అడిగింది. ఆమె అడిగిందానికి గుమ్మం అన్నది కదా: "ఇన్నాళ్ళనించీ నీ చాకిరీ చేస్తూ వుంటే, ఒక్క నీటిబొట్టు అయినా వేసి గొంతు తడిపావా? ఆ అమ్మాయి చూడు, ఎంత దయకలదో. అడగకుండానే మాకు చక్కా నూనె పోసింది.." అని. తరవాత "పెద్దకుక్కా పెద్దకుక్కా! ఆ పిల్లపైన ఉరికి ముక్కలు చేయకుండా ఎందుకు ఊరుకొన్నావు?" అని యాగా కుక్కను అడిగింది. 

"ఎంతకాలం నీ కొలువు చేసినా, చాలీ చాలని మాడురొట్టె ముక్కలేకదా పడ వేయటం. ఆ పిల్ల చూడు. అడక్కుండానే పాపం, ఎంత మంచి రొట్టె ఇచ్చిందో!" అని పెద్ద కుక్క అన్నది. "రక్కసి చెట్టా! రక్కసి చెట్టా! ఆ పిల్ల కళ్లు పొడవకుండా ఎందుకు వదిలేశావు?" అని చెట్టుని అడిగింది. "ఇన్నిఏళ్లుగా నీకు సేవచేస్తున్నప్పటికీ ఒక్క నూలుపోగయినా కట్టిన పాపాన పోయావా? ఆ పిల్ల ఎంత మంచిదో చూడు, అడక్కుండానే నాకు చక్కటి రిబ్బను కట్టింది" అని రక్కసి చెట్టు జవాబు చెప్పింది. చివరకు దాసీదానివద్దకు వచ్చి, "ఓసీ పాపిష్ఠీ! నువు చప్పున నీళ్ళు కాచకపోవటానికి కారణమేమిటి? నీ ఆలస్యం వల్ల కదా ఆ పిల్ల పారిపోయింది?" అని గర్జించి గోలచేసింది. "నీకు ఎంతకాలం నౌకరీ చేస్తే యేం లాభం! ఎప్పుడూ చివాట్లు వేయటమే తప్ప జానెడు గుడ్డముక్క పడవేసి ఎరుగుదువా? జాలిగుండె గల ఆ అమ్మాయి చూడు, అడక్కుండానే ఎంత అందమయిన రుమాలు బహుమతి యిచ్చిందో!" అని పనిమనిషి అన్నది. ఈ అదును చూసుకొని దీప గబగబా పరుగెత్తిపోతూనేవుంది. నల్లపిల్లి చెప్పినట్టుగా ఆమె ఒక్కసారి నేలకు చెవి ఆనించి వినేసరికి, బాబాయాగా పరిగెత్తి వస్తున్న చప్పుడు వినపడింది. 

ధ్వనివెంబడే యాగా ఎగేసుకునివచ్చింది. అప్పుడు దీప జేబురుమాలు తీసి నేలమీద విసరగా, అది ఒక పెద్ద ఏరుగామారి, దీపకూ యాగాకూ మధ్యని అడ్డుగా ప్రవహించింది. ఆ పెద్ద ఏరు దాటలేక, యాగా దేముడా అంటూ ఇంటికి పోయి, తన పశువుల మందను తోలుకువచ్చి, ఒక్క చుక్కయినా మిగలకుండా ఏటిలో నీళ్లు పశువులను తాగివేయమన్నది. బాబా చెప్పిన ప్రకారం పశువులు ఏటిలో నీళ్ళన్నీ తాగివేశాయి. ఏరు ఎండిపోగానే, యాగా మళ్లీ దీపను వెంబడించింది. దీప తన తలలో పువ్వుతీసి కిందికి విసిరేసరికి, అక్కడ ఒక పెద్ద అరణ్యం తయారయింది. ఆ అరణ్యంలో ప్రవేశించటానికి బాబాయాగా వంటి బ్రహ్మరాక్షసికే శక్యంకాలేదు. అందుచేత కాళ్లు ఈడ్చుకొంటూ యాగా కొంప చేరుకుంది. ఇదే సందు చూచుకొని, దీప అడవులు దాటి ఇంటికి మళ్లింది. కాని ఇంటిలోపలికి వెళ్లాలంటే ఆమెకు జంకు కలిగింది. అప్పుడు ఆమె తనకు అలవాటయిన పాకలోకి పోయేసరికి చుంచునేస్తం నవ్వుతూ వచ్చి "దీపా! నేను చెప్పినట్టుగా నువు అన్నీ బాగానే చేసుకువచ్చావు. మీ నాయన ఇప్పుడింట్లోనే వున్నాడు. ఇప్పటి వరకూ జరిగిన సంగతులన్నీ భయపడక ఆయనతో చెప్పు" అని సలహా ఇచ్చింది. జరిగిన కథ అంతా దీప తన తండ్రితో పూసగుచ్చినట్టు చెప్పేసరికి, ఆయన రెండో భార్యను మెత్తగా తన్ని తరిమివేశాడు. చేసేది లేక ఆమె తన అసలు రాక్షసి రూపంతో అడవులుపట్టి పోయింది. ఇక యిప్పుడు పూర్వంలాగా ఆ యింట్లో దీపయే పెత్తనం చేస్తూ, తండ్రీ కూతురూ కులాసాగా కాలక్షేపం చేస్తూవున్నారు.

Comments