అనగనగా ఉఫ్ అని ఒక ఎర్రటి మేక ఉండేది. ఆ మేకకు నాలుగు పిల్లలు పుట్టాయి. నాలుగుపిల్లలలోనూ మూడు తల్లి పోలిక. కడసారిది మాత్రం కారు నలుపు. దీనికి మేమే-మేకపిల్ల అని పేరు. ఆ సంతతిలో మూడు పిల్లలూ తల్లి చెప్పిన మాట విని బుద్ధిగా ఉండేవి. కానీ మేమే-మేకపిల్ల మాత్రం గడుగ్గాయగా తిరుగుతూ, తగని అల్లరి చేస్తూవుండేది. ఒకరోజున మేమే-మేకపిల్ల తల్లి దగ్గిరకు వెళ్లి, "అమ్మా అమ్మా! నాకు ఢిల్లీ సుల్తానుని చూచిరావాలెనని వుంది. మనిద్దరం కలిసి వెళదాము. లే, బయలుదేరు" అన్నది. దానికి తల్లిమేక "పాపా! ఇప్పుడు నాకు చేతినిండా బోలెడంత పని ఉన్నది. అదీ గాక, ఇంత చిన్నవాళ్లేమిటి, ఢిల్లీ వెళ్ళడమేమిటి, సుల్తానుని చూడడమేమిటి? మీరు పెద్దవాళ్ళయిన తరవాత అందరం కలిసి వెళదాములే" అని చెప్పింది. "ఆ? పెద్దయేవరకూ ఎవరు ఆగుతారేమిటి? వస్తే ఇప్పుడు రండి, లేకపోతే పొండి, మీ యిష్టం. ఇదుగో నేను బయలుదేరి పోతున్నాను," అని, మేమే-మేకపిల్ల వీధిలోకి పరుగెత్తింది. అటువంటి అల్లరిపిల్లలతో చేసేది ఏమిటి? "సరే, అనుభవించు, నీ ప్రారబ్ధం. నిన్ను కన్నాను గాని నీ రాతను కనలేదు కదా?" అనుకుని విచారించింది తల్లిమేక. మేమే- మేకపిల్ల పాడుకుంటూ గంతులేస్తూ పోతూవుండగా దారిలో ఒక యేరు అడ్డం వచ్చింది. యేరు మేకమ్మను చూసి, "మేకమ్మా! మేకమ్మా! నాపైన ఎవరో కొమ్మపడేసి పోయినారు. అది నాకు బరువైపోయి నడవలేకుండా వున్నాను. దానిని కాస్త నమిలేసిపో తల్లీ, నీకు పుణ్యం ఉంటుంది," అని బతిమాలింది. "పాపం, రమ్మన్నారు తిమ్మన్న బంతికి, కొమ్మలు తినటమే పని అనుకున్నావా నాకు? ఢిల్లీకి పోవాలి, సుల్తానుని చూడాలి. ఇప్పుడు నాకు తీరికలేదు," అని చెప్పేసి, మేమే-మేకపిల్ల మళ్లీ పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్లిపోయింది.
మరి కొంతదూరం వెళ్లేసరికి, ఒక మండుతున్న మంట కనపడి, "మేకమ్మా మేకమ్మా! నేను ఆరిపోబోతున్నాను. అల్లదిగో నీ కాలిదగ్గర ఒక పుల్ల ఉన్నది. అది కాస్త ఇలా పడవేసిపో తల్లీ, నీకు పుణ్యముంటుంది." అని బతిమాలింది. ఏరుకు చెప్పినట్టుగానే మంటకు కూడా చెప్పివేసి మేకపిల్ల పరుగెత్తిపోయింది. మరికొంచెం దూరం పోయేసరికి, ఒక చెట్టుకింద గాలి కనపడింది. "మేకమ్మా మేకమ్మా! ఈ చెట్టుకి ఎవళ్లో ముళ్లకంచె కట్టారు. అది నా వీపుకి గుచ్చుకుంటున్నది. దాన్ని కాస్త లాగిపారెయ్యి తల్లీ, నీకు పుణ్యముంటుంది," అని బతిమాలాడింది గాలి. నీళ్లకూ, మంటకూ చెప్పినట్టుగానే గాలికి కూడా చెప్పేసి మేకపిల్ల పరుగెత్తిపోయింది. వెళ్లి వెళ్లి మేమే-మేకపిల్ల చివరకు ఢిల్లీ సుల్తాను కోట చేరుకున్నది. ఆ దారిని పోతూవున్న మనిషిని పిలిచి, "సుల్తాను ఎక్కడ వున్నాడు? నేను చూడాలి" అని అడిగింది. అతను సుల్తానుగారి వంటల సాయిబు. "రా, రా, నీకు సుల్తాను కావాలా? నేను చూపిస్తాను రా" అంటూ పకపక నవ్వి మేమే-మేకపిల్లను వంటింటిలోకి లాగుకొని పోయాడు. అతను పొయ్యి రాజవేసి, పెద్దాడేగిశా నీళ్ళూ పెట్టి, అందులో మేకపిల్లని ఉంచి, డేగిశా మూసిపోయాడు. పాపం మేమే-మేకపిల్లకు భయం పట్టుకుంది. నీళ్లవైపు చూసి, "నీళ్లూ నీళ్లూ! మీరు కాగబోకండి. మీరు కాగారంటే నేను ఉడికి చచ్చిపోతాను," అని బతిమాలింది.
"మాకు కష్టం వచ్చినప్పుడు ఆర్చినావా తీర్చినావా? మేము కాగేది కాగేదే," అని నీళ్లు బుడ బుడ కాగడం మొదలెట్టినయి. అప్పుడు మేకపిల్ల నిప్పువంక చూసి, "నిప్పా, నిప్పా! నువు రాజుకోవద్దు. నువు మండినావంటే నేను ఒళ్లు కాలి చచ్చిపోతాను," అని బతిమలాడింది. నిప్పు కూడా నీళ్ళలాగానే చెప్పి, మండసాగింది. చివరకు మేకపిల్ల గాలితో, "గాలీ, గాలీ! నువు వీచవద్దు. నీవు వీచితే నిప్పు మండుతుంది. నిప్పుమండితే నీళ్లు కాగుతై. నీళ్లు కాగితే నేను వళ్లు కాలి చచ్చిపోతాను. నా మీద దయతలచావా?" అని బతిమాలింది. గాలికి మేకపిల్లమీద జాలి కలిగింది. "ఇందాక దారిలో నేను నిన్ను సహాయం చెయ్యమని అడిగితే, 'అబ్బో, నాకు పని వుంది' అని చెప్పి పరిగెత్తుకు పోయావ్. ఇప్పుడు నీకే నా సహాయం కావలసొచ్చింది. చూశావా పాపా! ఏ వేళకు ఎవళ్ల అవసరం వస్తుందో! అందుచేత ప్రపంచంలో ఎవళ్ళతోనూ విరోధం పెట్టుకోకూడదు. ఇప్పుడైనా యింక బుద్ధి తెచ్చుకుని, వీలైనప్పుడల్లా ఒకళ్ళకు ఉపకారం చేయటం నేర్చుకో. మిడిసిపడి ఎవళ్లమాటా నిర్లక్ష్యం చేయకు," అని అనేక విధాల బోధ చేసి గాలి వీచటం మానివేసింది. గాలి కదలకుండా వుండేసరికి మంట ఆరిపోయింది. మంట ఆరిపోయేసరికి నీళ్లు చల్లబడిపోయినయి. ఇంతలో వంటలసాయిబు వచ్చి మళ్లీ డేగిశా కిందకి దింపి, నీళ్లు ఎంత వెచ్చబడినయ్యో అని మూతతీసి చూడబోయాడు. మూత తీసీతియడంతోనే మేమే-మేకపిల్ల గభీమని డేగిశాలోనించి దూకి తుర్రుమని ఇంటికి పారిపోయింది. జరిగినదంతా తల్లితో చెప్పింది. పాపకు గండం తప్పినందుకూ, గాలి దేవుడి బోధవల్ల పెంకితనం అణిగి, బుద్ధి వచ్చినందుకూ తల్లి చాలా సంతోషించింది.
Comments
Post a Comment