చందమామ కథలు - మేక డెక్క

 

Telugu Chandamama Story of a boy who turned goat rescues her sister from an evil queen. Best Chandamama telugu stories to read.

పూర్వకాలమందు పద్మ అని ఒక అమ్మాయి ఉండేది. పద్మకు చిన్ని తమ్ముడు ఒకడున్నాడు. చిన్నతనంలోనే వారికి తలిదండ్రులు పోవటం చేత వారు దిక్కులేని పక్షులైనారు. అందుచేత ఏ దేశమైనా పోయి హాయిగా బతుకుదామనే ఆలోచనతో వారు భూలోకమంతా చుట్టిరావటానికి బయలుదేరారు. దారిలో చిన్నితమ్ముడికి దాహమయి, మంచినీళ్ల కోసం ఏడిచాడు. "తమ్ముడూ! కొంచెం దూరంలో బావి కనపడుతుంది. అక్కడ తాగుదుగాని, ఏడవకు" అంటూ వానిని పద్మ ఊరడించింది. ఇంతలో అతనికి ఒక గుఱ్ఱపు డెక్క ఆనవాలు, అందులో నీళ్లూ కనబడినయి. "అక్కా, అక్కా! ఇందులో వుండే నీళ్లు తాగి, దాహం తీర్చుకొంటాను" అన్నాడు. "వద్దు తమ్ముడూ, అవి తాగావంటే గుఱ్ఱపు పిల్లగా మారిపోతావు" అని చెప్పి, తాగకుండా ఆపుచేసింది. మరికొంచెం దూరం పోయేవరకు చిన్ని తమ్మునికి ఆవుడెక్క ఆనవాలు, అందులో నీళ్లూ కనబడినయి. "ఇవయినా తాగుతా" నని అక్కతో చెప్పేవరకు ఆమె ఇప్పుడు కూడా ఆ నీళ్ళు తాగకుండా ఆపుచేసింది. ఇంకా కొంచెం దూరం పోయేసరికి, మేకడెక్క ఆనవాలు, అందులో నీళ్లు అగపడినయి. ఇంక దాహానికి ఆగలేక, చిన్ని తమ్ముడు ఈ సారి అక్కతో చెప్పకుండానే ఆ మేకడెక్కలాగ వుండే గోతిలో నీళ్లు తాగివేశాడు. ఆ నీళ్లు నోటికి తగలగానే చిన్ని తమ్ముడు మేకపిల్ల అయిపోయి, మొండితోక ఆడించుకొంటూ గెంతులేయడం మొదలెట్టాడు. పద్మ తన చిన్ని తమ్ముడి కోసం తెగవెతికింది. ఇంతలో తన చుట్టూ తిరుగులాడుతూ, తనను ప్రేమతో నాకటానికి వచ్చిన చిన్నారి మేకపిల్లను చూసింది.

అప్పుడే, ఆ సమీపంలో వున్నా మేకడెక్క ఆనావలూ, అందులో నీళ్లుకూడా కనబడినై. ఇవన్నీ చూసి, జరిగిన ప్రమాదం గ్రహించింది. చేసేదేముంది? వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడనే కూర్చుంది. ఆమె పక్కనే చిన్నారి మేక పిల్ల కూడా వంచిన మెడతో విచారంగా నించున్నది. కొంతసేపటికి ఒక రాజు ఆ దారిని వచ్చి ఏడుస్తూ వున్న పద్మని పలకరించాడు. ఆమె తన సంగతి, మేకపిల్లగా మారిపోయిన తన చిన్ని తమ్ముని సంగతీ ఆయనతో చెప్పింది. అప్పుడు రాజు "నీకు వచ్చిన భయం లేదు. నన్ను పెళ్ళాడి నాతో ఉండిపోవలిసింది. నీ కోరికలన్నీ నెరవేరుస్తాను. నీ చిన్ని తమ్ముణ్ణి జాగర్తగా కాపాడే భారం నాది" అంటూ ధైర్యం చెప్పాడు. చిన్నారి మేకపిల్లను వెంటబెట్టుకొని పద్మ ఆ రాజుతో వెళ్లిపోయింది. ఆయన పద్మను తన రాణిగా చేసుకొని, ఎంతో అభిమానంగా చూచుకొంటూ వున్నాడు. ఇలా ఉండగా, పద్మ వచ్చి హాయిగా ఉంటున్న సంగతి ఒంటికంటి రాకాసికి ఎలాగో తెలిసింది. ఎవళ్ళయిన సుఖంగా ఉన్నారంటే వాళ్లని నాశనం చేయటమే ఈ రాకాసి పని. ఒక రోజున రాజు ప్రియమైన తన పద్మకి అపురూపమయిన వస్తువు తీసుకువద్దామనే ఉద్దేశంతో రాజ్యం దాటి వెళ్లాడు. ఆ సమయంలో రాకాసి పద్మ వద్దకు పెద్దమనిషి లాగ వచ్చి "కడుపు మండిపోతున్నది తల్లీ! కాస్త కబళం పెట్టించండి" అని బతిమాలింది. జాలిగుండెగల పద్మ అలాగే అని చెప్పి భోజనం పెట్టించింది. కూర్చున్నట్టే కూర్చుని రాకాసి, పద్మ ఉపయోగించే మంచినీళ్ల పాత్రలో ఆమె చూడకుండా మందు కలిపింది.

ఆ నీళ్లు తాగేసరికి పద్మకు హఠాత్తుగా జబ్బుచేసి, భర్త తిరిగి వచ్చేలోగా నీరసించిపోయింది. మరునాడు రాకాసి ఒక మందులదాని రూపంతో వచ్చి, పద్మను చూచి జాలిపడినట్టు నటించి, తను ఇచ్చే మందు రాచుకుని ఏటిలో స్నానం చేసినట్లైతే మామూలు రూపం వచ్చేస్తుంది అని చెప్పింది. అమాయకురాలయిన పద్మ ఆ ప్రకారమే మరునాడు ఏటికి వెళ్లేవరకు దుర్మార్గురాలైన రాకాసి, పద్మ బట్టలను తను చేతపుచ్చుకొని, ఆమెను దిగి స్నానం చేయుమన్నది. పద్మ స్నానం చేస్తూ వుండగా రాకాసి, పద్మ మెడకు ఒక పెద్ద రాతిబండను వేలాడవేసి ఆమెను ఏటి అడుక్కి దింపివేసింది. రాకాసి చర్యలన్నీ పద్మ వెంటనున్న మేకపిల్ల గమనిస్తూనే వుంది. రాకాసిచేతిలో పద్మ బట్టలు చిక్కుకొనిపోయినై. పోతే, పద్మ ఏటి అడుక్కి పోనే పోయింది. కనుక, ఈ అదను చూచుకొని రాకాసి, ఆ దుస్తులు తను వేసుకుని, తన మంత్రశక్తివల్ల సరిగా పద్మలాగానే తయారయి కోటలో ప్రవేశించి మామూలుగా రాణీలాగనే మసలుతూవుంది. సాయంకాలానికి రాజు ఇంటికి వచ్చి తన భార్య ఎప్పటివలె సరదాగా ఉండటం చూసి, సంతోషించాడు. చిన్నారి మేకపిల్ల మాత్రం రోజూ ఉదయాన, సాయంత్రము ఏటి ఒడ్డుకు పోయి, "బా!బా!!.." అని విచారంగా అరుస్తూ ఉండేది. మేకపిల్ల అలా ఏటి ఒడ్డుకి వెళుతూ వుండటం రాకాసి కనిపెట్టి, తన గుట్టు బయలుపడుతుందేమోనని భయపడింది. అందుకని ఎలా అయినా దీనిని చంపివేస్తే, పీడ వదులుతుందనుకొని, వంటవానిని పిలిచి మేకపిల్లను వండేసెయ్యమని ఆజ్ఞాపించింది. 

ఈ మాట విని, రాజు "ఈ మేకపిల్ల నీ ప్రియమైన తమ్ముడు కదా! తమ్ముడిని చంపమంటావేమిటి" అని ఆశ్చర్యంతో అడిగాడు. అందుకు సరిగా బదులు చెప్పలేక రాకాసి "తమ్ముడేమిటి, గిమ్ముడేమిటి? నాకు అలా బుద్ధి పుట్టింది. అందుచేత వాడిని వండుకు తినేయవలిసిందే" అన్నది. ఈ మాటలు వినగానే చిన్నారి మేకపిల్ల ఏటి ఒడ్డుకు పరుగెత్తిపోయి, "అక్కా! పద్మా!! నను చంపెదరట, నను వండెదరట కత్తులు నూరిరి, కోలలు కాల్చిరి" అంటూ చెప్పుకొని ఏడ్చింది. అప్పుడు ఏటి అడుగునించి పద్మ జాలిగా తన చరిత్ర చెప్పింది. రాణీ ఆజ్ఞప్రకారం మేకపిల్లను పట్టటానికి వచ్చిన నౌకరుకు ఏటి అడుగునుంచి వచ్చిన మాటలన్నీ స్పష్టంగా వినపడేవరకు, వాడుపోయి రాజుగారితో చెప్పాడు. రాజు స్వయంగా ఏటి ఒడ్డుకువచ్చాడు. మేకపిల్ల మళ్లీ ఏడిచింది. ఏటి అడుగునించి పద్మ మళ్లీ జవాబు చెప్పింది. ఆ మాట తన పద్మదేనని కంఠస్వరాన్నిబట్టి వెంటనే రాజు గుర్తించాడు. తక్షణమే జాలరివాళ్లను పిలిపించి పట్టువలలు వేసి ఏటిలో వెతకమన్నారు. కొంతసేపటికి పద్మ ఆ వలలో చిక్కుకొన్నది. తెలివి రాగానే పద్మ చిన్నారి మేకపిల్లను దగ్గిరకు తీసుకుని కౌగిలించుకున్నది. ఆమె తాకిన వెంటనే నీటి మహిమ వల్ల మేకపిల్లకు తన చిన్ని తమ్ముని రూపం వచ్చేసింది. రాజు ఇంటికి చేరుకొని నిజానిజాలు తెలుసుకొన్నాడు. రాణీరూపంలో వున్న ఒంటికంటిరాకాసిని విరిచికట్టించి ముక్కముక్కలుగా కోయించి, ఉప్పుపాతర వేయించారు. అప్పటినించీ, పద్మా, తమ్ముడూ హాయిగా వుంటున్నారు.


Comments