చందమామ కథలు - స్వర్గంలో ఒక చిత్రం

 

Chandamama telugu story on even a how a small unintentional good act can result in heaven. Best Telugu Chandamama stories to read.

పూర్వకాలమందు పర్షియా దేశంలో జొరోస్టర్ అనే మతబోధకుడు ఉండేవాడు. ఆయన ప్రేమమూర్తి. ఆయనకు ప్రపంచమంతటా శిష్యులున్నారు. జొరోస్టర్, తోడి మానవులందే గాక, నోరులేని మూగ జంతువులయందుకూడా ఎంతో దయగా ఉండేవాడు. ఆయన అలా ఉండటమే కాదు. శిష్యులందరకూ "ప్రపంచంలో ప్రతి ప్రాణినీ పరమదయాళువు అయిన ఆ పరమాత్ముడే సృష్టించాడు. కనుక, ముఖ్యంగా నోరులేని జీవాలను అతి ఆదరంతో చూచుకోవటం మానవుని విధి" అని బోధనా చేసేవాడు. కరుణానిధి అయిన ఇటువంటి జొరోస్టర్ కు ఒకనాడు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దేవకన్య వచ్చి, ఆయనను స్వర్గంలోకీ నరకంలోకి తీసుకుపోయి, అక్కడి వింతలన్నీ చూపించింది. జొరోస్టరూ దేవకన్యా కలసి ముందుగా నరకలోకం చూడబోయారు. అక్కడ ఎన్నెన్నో పాపాలు చేసిన దుర్మార్గులు రకరకాల శిక్షలను అనుభవిస్తున్నారు. వారు పడుతున్న యాతనలు చూడటం కష్టమనిపించింది జొరోస్టర్ కు. అందరనూ చూచుకుంటూ, వారు చివరకు ఒక వ్యక్తి వద్దకు వచ్చారు. ఆ మనిషికి కాలు లేదు. ఇతనిని గుర్తుంచుకొనమని దేవకన్య జొరోస్టర్ తో అన్నది. తరువాత వారు బయల్దేరి స్వర్గలోకం చేరుకొన్నారు. ఇక్కడకు ఎంతెంతో పుణ్యకార్యాలు చేసినవారంతా వచ్చి, కోరిన సౌఖ్యాలు అనుభవించి, ఆనందిస్తూ వున్నారు. ప్రశాంతమైన వీరి జీవిత విధానం చూచి జొరోస్టర్ కూడా ఆనందించాడు. 

ఈ సుఖ జీవులు అనుభవించే రకరకాల సౌఖ్యాలు అన్నీ చూడటం పూర్తి అయిన తరువాత, చివరకు వారు ఒక విశాలమైన హాలులోకి వచ్చారు. ఆ హాలులో ఒక నవరత్నఖచితమైన దివ్య సింహాసనం, దాని మీద ఒక కాలు జొరోస్టర్ కంటబడేసరికి "ఇటువంటి సింహాసనం మీద ఎవరో ప్రభువులూ, చక్రవర్తులూ కూర్చుని దర్బారు చేస్తారు గాని, ఇదేమి చిత్రం! మానవుని కాలు ఒక్కటి మాత్రమే దీనిపైనా ఉండటమేమిటి! పైగా దేముణ్ణి కొల్చినట్టుగా ఇక్కడి ప్రజలందరూ వచ్చి ఆ కాలిని గౌరవించిపోవడమేమిటి?" అని జొరోస్టర్ ఆశ్చర్యంతో దేవకన్యను అడిగాడు. ఇందుకు బదులుగా దేవకన్య ఆ కాలిని గురించిన చిత్రం ఈ విధంగా చెప్పనారంభించింది. "ఓయీ మహానుభావా! చాలా కాలం క్రితం ఒకప్పుడు ఒక దేశాన్ని పాలిస్తూ ఒకానొక రాజు ఉండేవాడు. ఆ రాజుకు, ప్రాణంతో ఉన్న మనుష్యులను, జంతువులను హింసించడం ఒక వినోదంగా ఉండేది. ఈ విధంగా ప్రాణకోటి నంతటినీ హింసించే వరకు, మనుష్యులకూ జంతువులకూ కూడా ఆ రాజంటే పరమ అసహ్యం కలిగింది. ఆయన కౄరంగా ఉండటం చేత, రాజు పేరు చెబితే, ఎప్పుడు ఎవరిని ఏమిచేసిపోతాడోనని అందరకూ హడలుగా వుండేది. అంతులేని ఇటువంటి క్రౌర్యం వల్ల ఆ రాజ్యం క్రమంగా నాశనం కాజొచ్చింది."

"కానైతే ఇంతటి కౄరుడైనా ఆ రాజు జీవితంలో ఒకే ఒక్క మంచి కార్యం చేశాడు. అది యేమిటీ అంటే ఒక రోజున ఆయన యెడారిలోనించి పోతూవుండగా, ఒక ఒంటె కనబడింది. దానిని ఒక రాటకు కట్టివేశారు. దాని మేత అల్లంత దూరాన తొట్టెలో ఉండటంచేత, పాపం, అది తిందామంటే ఆహారం నోటికి అందడం లేదు. ఆ తొట్టె అందుకుందామని ఆ ఒంటె ఎన్నో విధాల ప్రయత్నించింది, కాని దాని ప్రయత్నాలు ఫలించలేదు. ఒంటె పడుతూవున్న అవస్థ చూసి రాజు పకపక నవ్వసాగాడు. ఏ కళనున్నాడో గాని, ఆయన వినోదంగా, ఆ తొట్టెను కాలితో ఒక్క తన్ను తన్ని తిరిగి తన దారిన తానూ వెళ్లిపోయాడు. నిజానికి ఆ ఒంటెకు ఉపకారం చేదామనే వుద్దేశం రాజుకు ఏ కోశానా లేదు. అయినా, దాని అదృష్టం కొద్దీ, ఆ తన్నుతో తొట్టె ఒంటె చేరువకు పోయి, దాని నోటికి ఆహారం సరీగా అందింది. ఇప్పుడు అనేక దుర్మార్గాలు చేయటం వల్ల పాపాత్ముడైన ఆ రాజు కళేబరం నరకలోకానికి పోయి, పాపాలకు తగిన యాతనలు అనుభవిస్తున్నది. పోతే తెలిసి తాకినా, తెలియక తాకినా నిప్పు కాలుతుందన్నట్టుగా, రాజు కాలు కొద్దిపాటి పుణ్యమే చేసుకొనటంవల్ల, పుణ్యం చేసికొన్న ఆ కాలు స్వర్గలోకంలో సింహాసనం అలంకరించి, అందరిచేతా గౌరవింపబడుతున్నది" అని చెప్పింది. దేవకన్య ఈ కథ చెప్పి ముగించగానే జొరోస్టర్ కు మెలకువ వచ్చింది. అప్పటినించీ, పుణ్యపాపాలను గురించిన ఈ చిత్రకథ ఆయన శిష్యులందరకూ చెప్పి, "మూగ జీవాలయందుకూడా దయకలిగి ఉండండి. పుణ్యం వస్తుంది" అంటూ బోధించసాగాడు.  


Comments