చందమామ కథలు - వింత పావుకోళ్ళు

 

Telugu Chandamama story of a young man working in shoe shop who saves the princess and becomes king. Best Telugu Chandamama stories to read.

పూర్వకాలమందు నాగన్న అనే చెప్పులు కుట్టేవాడు ఒకడు ఉండేవాడు. వాడు పుట్టుపేద, కాని న్యాయవంతుడు. మంచి పనివాడు. నాగన్న చేతితో ఒక చెప్పులజత కుట్టి ఇచ్చినా, అతను ఒక జోడు మరమ్మత్తు చేసి ఇచ్చినా, అది ఏళ్ళతరబడి చెక్కుచెదరకుండా ఉండేది. అయితే, ఇంత నాణ్యంగా జోళ్ళు తయారుచేయటం వల్ల అతనికి మంచి పేరు వచ్చింది కాని, జీవనానికి మాత్రం లోపం కలిగింది. ఏమీ అంటే, ఒకసారి నాగన్న వద్ద కొన్న జోడు తరతరాలు మన్నుతూ వుండటం చేత, మళ్ళీ ఎవళ్ళూ కొనవలసిన అవసరం లేకపోయేది. అతను తయారుచేసిన జోళ్ళు అమ్ముడుపోక నిలవ ఉండిపోవటం వల్ల వ్యాపారం జరిగేది కాదు. కనుక, చేతిలో డబ్బు ఆడక, అతనికి జీవనం గడువడం కష్టమైపోయింది. 'ఏమిటిదారి దేముడా!' అని ఒకనాడు నాగన్న విచారిస్తూ ఉండగా, అతని కొట్టులోకి ఒక పొట్టి మనిషి మరమ్మత్తు కోసమని ఒకజోడు పట్టుకవచ్చాడు. ఎవ్వడైనా కొట్టులోకి వస్తాడా, ఒక కానీ డబ్బు దొరుకుతుందా అని ఆత్రంతో కనిపెట్టుకొని వున్న నాగన్న నిమిషంలో ఆ జోడు చక్కగా బాగుచేసి ఇచ్చాడు. పొట్టివాడు చాలా సంతోషించి, పావుకోళ్ల ఆకారంగా వున్న ఒక చెప్పులజత నాగన్నకు బహుమతి చేసి, "కోటి రూపాయలు యిచ్చినా నువ్వు వీటిని మాత్రం ఎవళ్ళకూ అమ్మవద్దు సుమా!" అని హెచ్చరించి తనదారిన వెళ్ళిపోయాడు. అతని సలహా ప్రకారం నాగన్న ఆ పావుకోళ్ళను కిటికీలో అందరకూ కనపడేటట్టు చక్కగా అమర్చాడు. అలా అమర్చిన క్షణము నుంచీ నాగన్న కొట్టుకి జనం పట్టకుండా వచ్చి జోళ్ళు కొనుక్కుపోతూ వచ్చారు. 


ఇదంతా ఆ పావుకోళ్ల మహిమే కదా అని గ్రహించి, నాగన్న చాలా సంతోషించాడు. ఇప్పుడు నాగన్నకు పుష్కలంగా వ్యాపారం జరిగి, జీవనం సుఖంగా సాగిపోతూ వున్నది. క్రమంగా నాగన్న వ్యాపారం బాగా పెరిగింది. తన ఒక్కడివల్లా కాక, అతను తనకింద మరి ముగ్గురు పనివాళ్లను పెట్టుకోవలసివచ్చింది. జీవితంలో ఇంత మార్పు వచ్చినా నాగన్న, తనకు ఇంత అదృష్టం తెచ్చిన ఆ  పావుకోళ్ళను మాత్రం అమ్మక వాటిని దేవుణ్ణి కొలిచినట్టు కొలుస్తూ, ప్రాణప్రదంగా చూచుకొంటూ ఉండేవాడు. ఇలా ఉండగా, ఒక రోజున రాజుగారూ వారి కుమార్తె కలిసి గుర్రపుసారటులో నాగన్న కొట్టు ముందరగా వెడుతూ ఉండగా రాజకుమారి ఆ పావుకోళ్ళను చూసి అవి కావాలని కోరింది. రాజు సారటు దిగివచ్చి "ఒరే అబ్బీ, ఆ పావుకోళ్ల జత యిలా యివ్వు" అన్నాడు. "ప్రభూ! ఇవి అమ్మేవి కావు. కావాలంటే సరీగా ఇటువంటివే మరొక జత తయారుచేసి ఒక్క గంటలో ఏలినవారికి సమర్పించుకుంటాను" అని అన్నాడు నాగన్న. కాని, రాజకుమార్తె అవే కావాలని పట్టుపట్టింది. చివరకు ఎలా అయితేనేమి, ఇష్టం లేక పోయినా, వేయి వరహాలకు నాగన్న ఆ పావుకోళ్ళను అమ్మివేయవలసి వచ్చింది. నాగన్నకు ఈయటానికాని రాజు తన సంచిలో చేయిపెట్టి సొమ్ము తీయబోతూ వుండేటంతలో అప్పటికప్పుడే పావుకోళ్ళలో కాళ్ళు దూర్చిన రాజకుమారి కెవ్వుమని ఒక పెద్ద కేక పెట్టింది. అదేమిటా అని అందరూ అటువేపు చూచేవరకు, ఆ పావుకోళ్ళు వాయువేగంతో రాజకుమారిని ఎక్కడికో తీసుకపోతున్నై.  

"నన్ను పట్టుకోండి! పట్టుకోండి!!" అంటూ ఆమె గోలపెడుతున్నది. రాజకుమారి గుమ్మం దాటింది, వీధులు దాటింది. ఎక్కడికో వెళ్ళిపోతుంది. చేసేదేమున్నది? రాజూ, రాజు వెంబడి నాగన్నా, అతనివెంట పనివాళ్ళు ముగ్గురూ గబగబలాడుతూ పరుగులెత్తారు. రాజుగారి సారటువాడు గుర్రాలను దౌడుతీయించి, రాజకుమారిని పట్టుకోవాలని యత్నించాడు. ఇంతమంది రోజుకొంటూ, రొప్పుకుంటూ పరుగులెత్తినా రాజకుమారిని పట్టుకోలేకపోయారు. చూస్తూ ఉండగానే, ఆమె అదృశ్యమై, మరి కనబడలేదు. రాజకుమారిని వెతికి తీసుకరమ్మని రాజు దేశదేశాలు నౌకరులను పంపించాడు. కాని, వెళ్లినవాళ్ళందరూ లాభంలేకపోయిందంటూ వెనక్కు తిరిగి వచ్చేసారు. అప్పుడు రాజు, తన కుమార్తె ఎక్కడున్నదో కనుగొన్నవాళ్ళకి తన రాజ్యంలో అర్ధ రాజ్యం ఇచ్చివేస్తానని చాటింపు వేయించాడు. ఈ చాటింపు వినికూడా ఒకళ్ళూ ముందుకు రాలేకపోయారు. 

కాని నాగన్న వద్దనున్న పనివాళ్లలో తిన్నడనేవాడొకడు ధైర్యంగా రాజు వద్దకు వెళ్ళి "రాజకుమారిని నేను తీసుకురాగాలను" అని నిబ్బరంగా చెప్పి బయల్దేరాడు.  తిన్నడు పోయిపోయి ఒక మహారణ్యం చేరుకునే వేళకు చంద్రోదయమైంది. అక్కడ ముగ్గురు యక్షులు నేలకు వంగి ఒక చిన్న కుక్కను దీక్షగా చూస్తూ వున్నారు. ఆ కుక్క చూపులకు చిన్నదే కాని, దానిని వారు ఎంతగా పట్టి లాగినా, భూమినుండి ఊడిరావటంలేదు. ఇంతలో తిన్నడు అక్కడికి చేరుకున్నాడు. అతనిని చూడగానే వాళ్లకు ప్రాణాలు లేచివచ్చినై. తమకు సాయపడుమని వారు అతనిని బతిమలాడారు. అప్పుడు తిన్నడు కుక్కను చూచి, దాని కాలికి గాయంతగిలిన సంగతి గ్రహించాడు. వెంటనే తన ధోవతి చించి, ఆ పీలికతో కుక్కకాలికి కట్టుకట్టేసరికి, అది తోక ఆడించుకుంటూ లేచి, కృతజ్ఞతతో తిన్నడిని నాకటం ప్రారంభించింది. ఇది చూచి యక్షులు ఆశ్చర్యపోయారు. తిన్నడు గొప్ప మంత్రగాడై ఉంటాడని యక్షులు నిశ్చయించి, అతనిని కుక్కనూ కూడా తమ రాజు వద్దకు తీసుకపోయారు. జ్ఞాని, వృద్ధుడు, దయామయుడు అయిన యక్షరాజు తిన్నడిని అనేకవిధాల సత్కరించాడు. తిన్నడు తను వచ్చిన పని ఫలానా అని దాపరికం లేకుండా చెప్పేవరకు, 'అబ్బాయీ! నీకు జయమవుతుంది' అని ధైర్యం చెప్పి, యక్షరాజు తన పరివారంలో ఒకరిని అతనివెంట సాయం పంపడానికి వాగ్దానం చేశాడు. 

యక్షరాజు వాగ్దానం ప్రకారం, మరునాడు ఉదయానే ఒక యక్షుడు వచ్చి తిన్నడి ఎదుట నిలబడ్డాడు. చిన్నికుక్క కూడా బిలబిలమంటూ తిన్నడిని నాకాజొచ్చింది.  వారు బయల్దేరి, యక్షుని సలహా ప్రకారం, రాజకుమారి ఎక్కడ వున్నదో తెలుసుకోవటానికని ముందు ఒక మంత్రకత్తె వద్దకు వెళ్ళారు. మంత్రకత్తె శాస్త్రాలు తిరగవేసి, "అబ్బాయీ! ఇక్కడికి సమీపంలో ఉత్తరదిశను ఒక చిట్టడవి ఉన్నది. ఆ చిట్టడవి అడ్డు తగలటం చేత మీ రాజకుమారి అక్కడ చిక్కుకొని ముందుకు పోలేక నిలిచిపోయింది. అయితే ఆమెను మీరు ఆ చిక్కు నుంచి దాటించారంటే మాత్రం మళ్ళీ ఆ పావుకోళ్ళు ఆమెను ఎత్తుకుపోతయి, జాగ్రత్త!" అన్నది. "అట్లైతే అమ్మా! మేము రాజకుమారిని తిరుగా తీసుకరాగాల ఉపాయమేమిటి?" అని వేడుకొనేవరకు, ఆమె ముందుగా ఒక పసరు తెచ్చి కుక్కకాలికి రాయగానే, దాని గాయం మానిపోయి అది ఎప్పటివలె నడిచింది. తరువాత మంత్రకత్తె మంత్రాలు పఠించి, రాట్నంలోనించి ఒక నూలుపోగు తీసి ఇచ్చి, దానిని ఉపయోగించవలసిన విధానం చెప్పింది. తిన్నడూ, యక్షుడూ పోయిపోయి చిట్టడవి కనుక్కొని, అక్కడ తుప్పలకు తగులుకుని నిలిచిపోయిన రాజకుమారిని చూచారు. ఆమెను చూడగానే చిన్ని కుక్క పరుగెత్తిపోయి రాజకుమారిని నాకటం ప్రారంభించింది. తన కుక్క ఇన్నాళ్ళకు మళ్ళీ కంటపడినందుకు మురిసిపోయి, రాజకుమారి దానిని ముద్దులాడజొచ్చింది. ఆ సమయంలో అదనుచూచి, తిన్నడు, తాను పట్టుకువచ్చిన నూలుపోగు రాజకుమారి పాదాలకు అడ్డుగా పావుకోళ్ళకు తగిలేటట్టు పడవేసి, మంత్రకత్తె ఉపదేశించిన మంత్రాలను ఉచ్చరించాడు.

తక్షణమే ఆ పావుకోళ్ళు రాజకుమారి పాదాలనుండి ఊడి ఇవతలకు వచ్చి, మరి కనపడకుండా పోయినై. ఇంతకాలానికి ఆ పావుకోళ్ళ బాధ తనకు తప్పింది కదా అని రాజకుమారి సంతోషించి, తిన్నడి ధైర్యసాహసాలకూ, కార్యదీక్షకూ ఎంతో మెచ్చుకొన్నది. అతనినే తన భర్తగా చేసికొనవలెనని కూడా తన మనస్సులో నిశ్చయించుకొంది. అప్పుడు అందరూ కలసి కోటకు వెళ్ళేవరకు, మళ్ళీ తన కూతురు కంటబడినందుకు రాజు అపరిమితానందభరితుడై, తిన్నడిని అనేక విధాల కొనియాడాడు. తరువాత రాజకుమారి తన సంకల్పాన్ని తండ్రికి తెలిపేవరకూ, ఇంతా చేసి చెప్పులుకుట్టేవాడికిచ్చి పెళ్ళి చేస్తే లోక విడ్డూరంగా ఉంటుందని చెప్పి, రాజుకి ఈ ఏర్పాటు ఇష్టంలేకపోయింది. ఈ సంబంధం ఎలాగైనా తప్పించాలని చూచి, "అమ్మాయీ! వీడు వట్టి బికారీవాడు ఇటువంటివాడిని పెళ్లాడితే లోకం నవ్వి పోతుంది" అని కూతురుకి నచ్చజెప్పజూచాడు. అక్కడనే వున్న తిన్నడు "రాజా! నీవు చేసిన వాగ్దానం అప్పుడే మరిచావా? మీ అమ్మాయిని నేను కష్టపడి తీసుక వచ్చాను కదా? నీ అర్ధరాజ్యానికి నేను అర్హుణ్ణి కదా? నన్ను బికారీవాడంటావేమిటి?" అని నిర్భయంగా అడిగాడు. రాజు, తన తొందరపాటుకు పశ్చాత్తాపపడి మన్నించుమని తిన్నడిని వేడుకొన్నాడు. తరువాత అతి వైభవంగా రాజకుమారికీ తిన్నడికీ వివాహం జరిగింది. ఆ వివాహానికి యక్షరాజు, మంత్రకత్తే వచ్చి దంపతులను ఆశీర్వదించారు. పుట్టు పేద ఐన తిన్నడు ఇప్పుడు రాజకుమారినే కాకుండా రాజ్యలక్ష్మిని కూడ చేపట్టి హాయిగా ఉంటున్నాడు.

Comments