చందమామ కథలు - బంగారు గొఱ్ఱె

 

Chandamama Telugu Story of a prince who passed a difficult test to defeat evil queens plan. Best Telugu Chandamama Story to read.

అనగనగా ఒకరాజు. ఆ రాజుకి ఇద్దరు భార్యలు. పెద్దామెకు ఒక కూతురు. ఆ అమ్మాయి రూపవతి. ఆమె అందాన్ని గురించి విని, దేశదేశాలనించి రాజకుమారులు ఆమెను పెళ్ళాడవలెనని వచ్చేవారు. అయితే, అసూయగల చిన్న రాణి ఏదో ఒక అడ్డుపుల్ల వేసి, ఒక్క సంబంధమూ కుదరనిచ్చేదికాదు, అందుచేత, రాజకుమారి పెళ్లి నిలిచిపోయింది. ఆ పిల్లను ఇంకా ఏడిపించాలెననే దురుద్దేశంతో చిన్నరాణి మరొక కృత్రిమపు ఆలోచన చేసి, రాజు మనస్సుకి నచ్చేటట్టు చెప్పింది: "మన అమ్మాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నయి, పోతున్నయి. కాని, ఎన్నాళ్లకూ పెళ్లి కావటం కనపడదు. ఒక లాగ చేస్తే బాగుంటుందని నాకు తోస్తున్నది. ఏమిటీ అంటే పాతాళంలో ఒక భవనం కట్టి, మన తోటలోనించి ఆ భవనానికి మెట్లు కట్టించాలి. తోటలో జలకమాడే కోనేరున్నది చూచారా, ఆ కోనేటిలోనే మెట్లు దిగే గుమ్మం ఒకటి అమర్చాలి. గుమ్మం నీటిలోపల మునిగి వుంటుంది కనక, బ్రహ్మ రుద్రుడు కూడా భవనం ఎక్కడ వున్నదీ కనుక్కోలేడు. పోతే, అమ్మాయిని ఆ రహస్యభవనంలో ప్రవేశ పెట్టి, చూడవచ్చే రాజకుమారులందరనూ ఆమెను కనిపెట్టమందాం. మూడు రోజులలో కనిపెట్టగలిగితే పెళ్ళి చేయడం, లేనిపక్షమ౦దు తల కొట్టి గుమ్మానికి కట్టడమున్ను." అది విని రాజు, "సరే నీ ఇష్టపకారం ఏర్పాటు చేయించు" అన్నాడు. త్వరత్వరగా చిన్నరాణీ ఏర్పాటులన్నీ పూర్తి చేయించింది. ఓడిపోయిన రాజ కుమారుల తలలు కొట్టి కట్టడానికి వేరే ఒక మందిరం కూడా కట్టించింది. ఆ ప్రకారం చాటింపు వేయించింది. 

ఆ చాటింపు విన్నప్పటినించీ చాలామంది రాజకుమారులు వచ్చారు. రాజకుమారిని ఒకళ్లూ కనుక్కోలేకపోయారు. వాళ్ల తలకాయలు వరసగా మందిరపు గుమ్మానికి వేలాడకట్టించింది చిన్నరాణీ. ఆ సమీపంలోనే మరివక రాజుకి ముగ్గురు కుమారులు. అందులో పెద్దవాడు ఒకనాడు తండ్రివద్దకు వెళ్లి, "నాయనా! మన పారుగురాజు కుమార్తెను రహస్య మందిరంలో వుంచి, కనుక్కొన్నవాళ్లకు అమెనిచ్చి పెళ్లిచేస్తామని చాటింపు వేశారు. ఆమెను కనుక్కోగలిగితే, పెళ్లి అవుతుంది. పేరూ వస్తుంది. కనుక, పోయి రావటానికి అనుమతి తెలుపవలిసిం" దని కోరాడు. అందుకు తండ్రి "అబ్బాయీ! ఇది చాలా ప్రమాదకరమైన పరీక్ష. ఇందులో నెగ్గి రావటమనేది ఉండనే ఉండదు. ప్రాణానికే మోసం వచ్చిన తరువాత ఇక పెళ్లేమిటి? ఇప్పటికి ఎంతోమంది రాజకుమారులు వచ్చారు. ఓడిపోవటంవల్ల వాళ్ల తలలు, కొట్టి వేలాడదీశారు. అందుచేత, నువు వెళ్లడం నాకు ఎంతమాత్రం ఇష్టంలేదు" అని చెప్పాడు. ఎన్ని విధాల చెప్పినా రాజకుమారుని చెవికి ఎక్కలేదు.  ఏమయినా సరేనని బయలుదేరి వెళ్లాడు. మూడురోజులూ తెగ వెతికినప్పటికీ, రాజకుమారి జాడ కనపడిండి కాదు. గడువు దాటగానే తక్కిన రాజకుమారుల తలలతో పాటు అతని తలకూడా గుమ్మానికి వేలగట్టారు. ఇతను ఎన్నాళ్లకూ ఇంటికి రాకపోవటం చూచి, చనిపోయి వుంటాడని తలిదండ్రులు నిశ్చయించుకొన్నారు. రెండవవాడు కూడా స్వయంవరానికి పోయి వస్తానన్నాడు. తండ్రి వద్దని చెప్పినా వినక, ప్రయాణమై వెళ్లాడు. 

ఇతను కూడా పరీక్షలో నెగ్గలేకపోయేసరికి, తల కొట్టి గుమ్మానికి కట్టారు. కొన్నాళ్లు చూచి, కడసారివాడు కూడా బయలుదేరాడు. కొడుకులిద్దరూ చనిపోవటం వల్ల విచారంతో తండ్రి పోవద్దని మరీమరీ చెప్పాడు, కాని చిన్నవాడు ఆ మాటను చెవిని పెట్టక ప్రయాణమయినాడు. చిన్నవాడు చాలా తెలివయినవాడూ, యుక్తిపరుడున్ను. దారిలో ఒక పట్నం చేరుకొని, అక్కడ పేరుపడిన ఒక బంగారు పనివానివద్దకు వెళ్లాడు. వాని చేతికి రెండు సంచీల బంగారం ఇచ్చి, దానితో తను పట్టేటంత ఆకృతిలో ఒక అందమయిన గొర్రె విగ్రహం చేయమని చెప్పాడు. మరునాటి ఉదయానికల్లా, బంగారు గొర్రె తయారైంది. అది చూచి చిన్నవాడు సంతోషించి, "వోయి పనివాడా! విగ్రహం చాలా బాగా వున్నది. దీనిని రాజుగారి వద్దకు తీసుకుపోయి, 'ఇది రాజకుమారికి బహుమానంగా తెచ్చానండి' అని చెప్పు" అని పనివానితో చెప్పి, ఎవళ్ళూ చూడకుండా తను ఆ విగ్రహంలో దాగాడు. అద్భుతమయిన ఈ విగ్రహాన్ని చూచి రాజుగారు చాలా మెచ్చుకొని, పనివానికి పదివేల వరహాలు ఇచ్చారు. రాజాజ్ఞ ప్రకారం, ఆ గొర్రెను తక్షణమే రాజకుమారి వుండే రహస్య మందిరానికి తీసుకుపోయి ఒక పెద్ద మేజా పయిన పెట్టారు. ఈ అపురూప విగ్రహాన్ని చూచి ఆమె చాలా ఆనందించింది. విగ్రహానికి గల కన్నులలోనించి చిన్నవాడు రాజకుమారిని చూచిచూచి, ఆమె సౌందర్యానికి అతను మురిసిపోతున్నాడు. రాజకుమారి కోసం రోజూ భోజన సామగ్రి తెచ్చి, ఒక బల్లమీద అమర్చే వారు. విగ్రహంలో ఉన్న చిన్నవాడు ఆకలికి తాళలేక,  అర్థరాత్రి వేళ బయటకువచ్చి రాజకుమారి వదిలిన పదార్థాలన్నీ తినివేసి, మళ్లీ ఎప్పటిలాగా విగ్రహంలో దూరిపోయేవాడు. 

ఈ చిత్రమేమిటా అని ఆమె ఆలోచించి, చివరకు ఒక రాత్రి మేలుకొని వుండేసరికి దొంగ దొరికిపోయాడు. చిన్నవాడిని చూడగానే రాజకుమారి, అతని అందానికి అబ్బురపడిపోయింది. అతనిని తప్ప మరెవ్వరినీ పెళ్లాడనని నిశ్చయించుకొన్నది. అయితే ఈ కోరిక నెరవేరడం ఎలాగ? ఉపాయశాలి అయిన చిన్నవాడు ఒక పన్నాగం పన్నాడు. ఆతను చెప్పిన ప్రకారం, రాజకుమారి గొర్రెకాలు ఒకటి విరగగొట్టి, ఆ విగ్రహాన్ని మరమ్మత్తుకు పంపమని తండ్రికి కబురుపెట్టింది. విగ్రహాన్ని తీసుకుపోయేటప్పుడు చిన్నవాడు దానిలోపల దూరి బయటకు వచ్చేశాడు. ఈసారి బంగారు పనివానితో 'విగ్రహానికి కాలు మరమ్మత్తు చేసి, ఖాళీగా పంపివేయి' అని చెప్పాడు. ఇప్పుడు రహస్య మందిరానికి దారి తెలుసుకొన్న చిన్న వాడు రాజుగారి దర్శనం చేసి 'మీ అమ్మాయిని పెళ్లాడవచ్చాను' అని చెప్పాడు. 'చిన్నవాడా! మీ అన్నలు ఇద్దరూ వద్దంటే వినక నిష్కారణంగా చనిపోయారు. ఈ పరీక్ష ప్రమాదమైనది. వద్దు నాయనా' అని అనేక విధాల బోధించాడు. కాని చిన్నవాడు లొంగలేదు. ఏమీ ఎరగనట్టు పచారుచేస్తూ, చిన్నవాడు తోటలోకి వెళ్లాడు. చిన్నరాణీ నీడలాగ అతనివెంట ఉంటూనే వుంది. చిన్నవాడు కొలను వద్దకు వెళ్లాడు. ఆ నీరు తోడించివేయమన్నాడు. రాణీ అతనిని ఆటంకపరుపబోయింది. కాని వీలుకాలేదు. నీరు తీసివేశారు. 

"ద్వారం తెరువు" మన్నాడు చిన్నవాడు. రాణీ తెరవక తప్పిందికాదు. ఇద్దరూ మెట్లు దిగారు. ఇక రహస్య మందిరం ప్రవేశిస్తారనగా, "అబ్బాయీ ఇక్కడేవుండు. అయిదు నిమిషాలలో వచ్చి నిన్ను తీసుకువెళతా"నని చెప్పి రాణీ లోపలకుపోయింది. రాణీ మళ్లీ ఒక యుక్తి పన్నింది. రాజకుమారికీ తక్కిన చెలికత్తెలకూ తేడా తెలియకుండా అందరిదేతా ఒకే మోస్తరు దుస్తులు వేయించింది. చిన్నవానివద్దకు వచ్చి, "అబ్బాయీ! ఇందులో రాజకుమారి ఎవరో తెలుసుకోగలిగితే, ఆమెను నీకిచ్చి పెళ్లిచేస్తాము, లేకుంటే తలకొట్టి గుమ్మానికి కడతాము" అన్నది. ఇదివరకు పరిచయమున్నది గనుక, రాజకుమారి ఫలానా అని అతనికి తెలియనే తెలుసు. అయినా చిన్నరాణికి జవాబు చెప్పటానికి ఆమె యుక్తికి మించిన యుక్తి చేశాడు. తన వద్ద వున్న బంగారపు తునకలు నేలమీద విసిరాడు. చెలికత్తెలందరూ వాటిని ఏరుకోబోయారు. రాజకుమారి మాత్రం వాటికోసం ఆశపడక అలా నిలుచుకునే వున్నది. చిన్నవాడు రాజకుమారి చేయి పట్టుకున్నాడు. ఇదంతా కనిపెట్టి చూస్తున్న రాజు చిన్నవానికీ రాజకుమారికీ పూలదండలు వేసి, దీవించాడు. చిన్నవాడి తలిదండ్రులను కూడా రప్పించి, అతి వైభవంగా కూతురికి వివాహం చేశాడు. రాక్షసి బుద్ధులు గల చిన్నరాణీ ఇప్పటి వరకూ మందిరానికి తొంభైతొమ్మిది తలలు కట్టింది. చిన్నవాని తలకాయ కొట్టించి తన సరదా తీర్చుకుందా మనుకున్నది. కానయితే, రాణి దుర్మార్గాన్ని గమనిస్తున్న రాజు, ఆమె తలనే నరికించి ద్వారానికి కట్టించి, నూరు పుర్రెల దండను పూర్తి చేదామనుకున్నాడు. కాని రాజకుమారుడు వినలేదు. ఆమెను, రక్షించమన్నాడు.


Comments