పూర్వకాలమందు ఒక గొల్లపిల్లవాడు ఉండేవాడు. వాడు పొద్దుటల్లా పశువులను మేపి, మధ్యాహ్నం పూట విశ్రాంతి కోసం, వాటిని ఒక రావిచెట్టు నీడకు తోలుకు పోయేవాడు. ఇలా కొంతకాలం జరిగినాక ఒక చిత్రం జరిగింది. ఒకనాడు వాడు రావి చెట్టు కింద కూర్చుని సేద తీర్చుకుంటూ వుండగా "అబ్బాయీ ! నా మొదట్లో నీవు రోజూ పాలు పోసినావంటే నీకు గొప్ప మేలు కలుగుతుంది" అని రావిచెట్టు చెప్పినట్లు వినపడింది. నాటినించీ వాడు తన మందలో పశువుల పాలు పితికి, రావిచెట్టు మొదట్లో పోస్తూవుండేవాడు. అలా వాడు చెట్టు మొదట్లో పాలు పోయగా పోయగా, కొన్నాళ్లకు పటాలుమని నేల బద్దలై ఒక పెద్ద నాగుపాము పడగ ఎత్తుకుని, ఆ బీటలోనించి చరచరమంటూ వచ్చేసరికి, గొల్లపిల్లవాడు హడిలిపోయాడు. "నాయనా ! నీకు వచ్చిన భయమేమీ లేదు, హడిలిపోబోకు, కొందరు దుర్మార్గులు నన్ను నిష్కారణంగా ఈ చెట్టుకింద గొయ్యితీసి పాతి పెట్టారు. అందుచేత చావ సిద్ధమైనాను. ఇంతలో నీ ధర్మమా అని పాలు పోయటం చేత నేను తేరుకున్నాను. మళ్లీ జీవం చేరుకున్నది. ఎన్ని జన్మలు ఎత్తితే మాత్రం నీవంటి ప్రాణదాత బుణం తీర్చుకొనగలనా? అయినా ఏదో ఉడతా భక్తిగా ఒక చిన్న వరం ఇస్తాను," అని నాగుపాము వానిని దగ్గరగా రమ్మన్నది. అతను చేరువకు రాగానే, తలపైన ఊది, "అబ్బాయీ! నా మహిమవల్ల నీ తలవెంట్రుకలు బంగారు వెంట్రుకలుగా మారిపోతాయి. ఇందువల్ల నీకు చక్కటి భార్య దొరుకుతుంది. పైగా, నువ్వు ఏ మాట అంటే ఆ మాట ప్రకారం జరిగి తీరుతుంది. నువ్వు అదృష్టవంతుడివి. వెళ్లు" మని దీవించింది.
ఆ తర్వాత యిలా హెచ్చరించింది : "ఈ వరం పొందిన సంగతి బ్రహ్మ రుద్రుడికి కాదు కదా ప్రియమైన భార్యకు సయితం తెలియనీయకూడదు. అలా జరిగితే ఆ క్షణమందే మహిమ అంతరించి పోతుంది సుమా" అంటూ గొల్లపిల్లవానిని నాగుపాము హెచ్చరించింది. గొల్లపిల్లవాడు సంతోషించి యింటికి వచ్చేశాడు. ఒకనాడు గొల్లపిల్లవాడు నదిలో స్నానం చేసి, తుడుచుకుంటూ వుండగా, తళతళ మెరసిపోతూ పన్నెండు నిలువుల పొడవు గల ఒక బంగారు తలవెంట్రుక ఊడి వచ్చింది. ఉత్సాహం పట్టలేక, అతను ఆ తల వెంట్రుకను ఒక ఆకులో జాగర్తగా పొట్లం కట్టి, నీటిపైన వదలి పెట్టాడు. దిగువ రేవులో స్నానమాడుతున్న ఒక రాజకుమారికి గొల్లపిల్లవాడు వదిలి పెట్టిన ఆకు పొట్లం దొరికింది. ఆత్రం కొద్దీ ఆమె పొట్లం విప్పి చూచేసరికి, అందులో పన్నెండు మూరల బంగారు తలవెంట్రుక తళతళమని మెరుస్తూ కనిపించింది. ఆమె అ తక్షణమే తండ్రి వద్దకు వెళ్లి, "నాన్నగారూ ! నేను ఇలాంటి బంగారు తల వెంట్రుకలు కల మనిషినే పెళ్లి చేసుకుంటాను. లేని పక్షంలో పెళ్లే చేసుకోను" అని తన నిశ్చయాన్ని తెలిపింది. ఈ విడ్డూరం విని, రాజూ రాణీ ఆశ్చర్యపోయారు. బంగారు తలవెంట్రుకలు గల చిన్నవాని కోసం వారు, కోటలో పరివారమంతటినీ పంపించారు. అటువంటి చిన్నవాడు దొరకలేదని చెప్పి వాళ్లందరూ తిరిగివచ్చారు.
గూఢచారుల్ని నలుమూలలకూ పంపించారు. వాళ్ళూ తెల్లముఖం వేసుకొని తిరిగివచ్చారు. అది పనికాదని, మహిమగల సాధువులను దేశదేశాలకు పంపారు, వాళ్లూ తిరిగి తిరిగి వచ్చి, లాభం లేదనేశారు. చివరకు ఒక రామచిలుక, "మహారాజా ! బంగారు తలవెంట్రుకలు గల చిన్నవానిని మేము పట్టవలిసిందేగాని మానవులకు శక్యమవుతుందా ? నన్ను పంజరంలోనించి వదిలిపెట్టండి, నిమిషంలో అ చిన్నవానిని పట్టితెస్తాను. నా ప్రజ్ఞ చూద్దురుగాని," అని చెప్పింది. వెంటనే, రామచిలుకను పంజరంలో నించి విడిచిపెట్టి దానికి విందు చేసి ప్రయాణం కట్టారు. అది నదులూ పర్వతాలూ దాటుకుని, అడవుల మధ్యనున్న గొల్లపిల్లవానిని కనిపెట్టింది. అప్పుడది చేసిన చిత్రం ఏమిటనుకున్నారు! ఒక్కొక్క పశువుమీదినించే మెల్లిగా ఎగురుతూ వెళ్లి, ఆదమరపుగా వున్న గొల్లపిల్లవాని చేతిలో పిల్లనగ్రోవి నోట కరచుకొని చెట్టుమీదకి ఎగిరిపోయింది. గొల్లపిల్లవాడు పిల్లనగ్రోవి కోసం చిలుకను వెంబడించి రాసాగాడు. అది అలా చెట్టుమీది నించి చెట్టుకి, చెట్టుమీది నించి చెట్టుకి ఎగిరి పోతూ, రాజకుమారి అంతఃపురంలోనికి దారితీసింది. ఆత్రంతో వున్న గొల్లపిల్లవాడు, తన పశువుల సంగతే మరిచిపోయి, చిలుక వెనుకనే వెళ్లి అంతఃపురంలో ప్రవేశించాడు. తన పని నెరవేరిందనే సంతోషంతో నోటినున్న పిల్లనగ్రోవి రాజకుమారి ఒడిలో పడవేసి, రామచిలుక ఎగిరిపోయింది. గొల్లచిన్నవాడు తన పిల్లనగ్రోవి తనకిమ్మని రాజకుమారిని ఆడిగాడు.
అందుకామె "నన్ను పెళ్లాడుతే ఇస్తాను, లేకపోతే ఇవ్వను" అన్నది. అతనికి ఆశ్చర్యం కలిగింది. "స్వయంవరం లేకుండా, ప్రధానం లేకుండా ఇంత హఠాత్తుగా పెళ్లి యేమిటి!" అని ప్రశ్నించాడు. "స్వయంవరమూ, ప్రధానమూ అన్నీ నదిలో నాకు పొట్లం దొరికిననాడే నిశ్చయమయినయి" అని అంటూ, ఆమె తనకు దొరికిన ఆకుపొట్లం చూపించింది. ఇదంతా తనకు వరమిచ్చిన నాగుపాము మహిమ కదా అని అప్పుడు గొల్లచిన్నవానికి జ్ఞాపకం వచ్చి, అతను పెళ్లికి వప్పుకొన్నాడు. కొద్ది రోజులకే, వారిద్దరికీ అతివైభవంగా వివాహమయింది. ఆ రాజు తన కుమార్తెనే కాకుండా, అర్థరాజ్యం కూడా అతనికి ఇచ్చి ఏలుకోమన్నాడు. గొల్లచిన్నవానికి అదృష్టం పండి హాయిగా కాలక్షేపం చేస్తూ వున్నాడు. కొన్నాళ్లకు తను అడివిలో విడిచిన పశువుల మంద సంగతి గుర్తు వచ్చింది. ఆ మట్టున అతను బయల్దేరి పోబోతూండగా అతని భార్య కూడ వెంట వస్తానన్నది. ఇద్దరూ కలిసి ఆ అడవుల మధ్యకి వెళ్లేసరికి, పశువుల మందలో ఒక్కటీ మిగలకుండా చచ్చి పడివున్నాయి. అయితే నాగుపాము తనకిచ్చిన రెండవ వరం అతనికి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అతను 'నా పశువులు బతకాలి!' అని మనస్సులో కోరుకున్నాడు. వెంటనే పశువులన్నీ తోకలాడిస్తూ, గభాలునలేచి నిలుచున్నాయి. అపరిమితమైన సంతోషముతో వారు పశువుల మందను తమ రాజ్యానికి తీసుకుపోయారు. మాటయందు గురి ఉన్నవాళ్లకూ, మంచితనం కల వాళ్లకూ ఎప్పటికైనా మేలు కలుగుతుంది.
Comments
Post a Comment