చందమామ కథలు - మధుకైటభులు

 

Telugu Chandamama story of two demons who offer boon to Lord Vishnu. Best Chandamama telugu stories to read.

ఒకానొకప్పుడు ఒక గొప్ప ప్రళయం వచ్చింది. అంటే మనం ఉండే యీ భూలోకం, తక్కిన లోకాలూ ఒక్క మాటుగా ఉన్నట్టుండి, భగ్గుమని మండిపోయి, నుసి ఐపోయాయన్నమాట. అలా ఒక్క మాటు ఇన్ని లోకాలూ నాశనమైపోతాయా ఎప్పుడైనా? కాని, ఐపోయాయి. ఎలా అంటారేమో. ఒక్కమాటు పెద్ద సుడిగాలి రంయ్ మని వచ్చేసి, లోకాలన్నీ ఒకదాన్నొకటి డీడిక్కి కొట్టేసుకుని ముక్కముక్కలయి పోయాయి మొదట. ఆ తర్వాత పన్నెండుగురు సూర్యులొక్కమాటుగా పొడిచి భగభగమండటం మొదలెట్టేరు. ఆ సూర్య గోళాలలోనించే బయల్దేరిందో ఎక్కణ్ణుంచి బయల్దేరిందో గాని ఒక మంట బయల్దేరి, సుడిగాలికి ముక్కలైపోయి ఉన్న లోకాలన్నీ అంటుకుని పెద్ద భోగిమంట తయారైంది.  ఆ మంటలకు గాలి తోడై, మరి కాస్సేపటికి నుసితప్ప మరేమీ మిగలలేదు. తర్వాత వర్షం ప్రారంభించింది. ఆ వర్షం కూడా ఎన్నడూ కని విని ఎరగని వర్షం! కడవలు దిమ్మరించినట్లు కురిసేసింది! ఏనుగు తొండాలంత లావున ధారకట్టి కురిసింది! దానితో ఎక్కడ చూచినా జలమయమే. కాని ఆ నీరు చూడ్డానికి ఎవరైనా మిగుల్తేగా? దేవతలు, రాక్షసులు, మనుషులు, జంతువులు, వారేమిటి, వీరేమిటి అందరూ నుసిఐపోయి, ఆ నీటిలో కరిగిపోయారు. దేవుడైనటువంటి ఒక్క విష్ణుమూర్తి మిగిలేడు. లోకాలన్నీ నాశనమై పోయినా దేముడికి నాశనం ఉండదు. ఆ మహాసముద్రంలో ఆయనొక్కడూ ఓ మఱ్ఱి ఆకుమీద పడుకుని హాయిగా గుఱ్ఱుపెట్టి నిద్రపోతున్నాడు. ఇంతకాలం ఈ లోకాలన్నింటినీ కనిపెట్టుకుని ఉండడంలో ఒక్క కునుకు కూడా తియ్యలేదాయన. ఇప్పుడే కాస్త విశ్రాంతి తీసుకుందామని నడుం వాల్చాడు. 

నడుం వాల్చాడే గాని అయన అలా ఎంతసేపో పడుకోలేదు. ఈ లోకాలన్నీ చాలా పాతవైపోయి, ఎందుకూ పనికిరాక పోవటం చేత ప్రళయం తెప్పించి వాటిని నాశనం చేశాడు. మెలకువ రావటంతోనే లోకాలన్నీ మళ్లీ ఎలాగా సృష్టించాలి. లేకపోతే ఆయనొక్కడికీ ఆ మహాసముద్రంలో ఏం తోస్తుంది? కాస్సేపయ్యాక లేచి, బ్రహ్మ చేత మళ్లీ లోకాలన్నీ సృష్టి చేయిద్దామని అనుకుని అయన కన్ను మూశాడు. కాని మీకో సందేహం వస్తుందిప్పుడు. మళ్లీ లోకాలన్నీ సృష్టి చెయ్యటానికి బ్రహ్మ ఏడీ? అతడు మాత్రం ఈ ప్రళయంలో నుసి ఐపోలేదా? అని. ఐపోయాడు. పోతేఏం? మళ్లీ పుట్టేడు. ఆ మఱ్ఱి ఆకు పైన నిద్రిస్తోన్న మహావిష్ణువు బొడ్డులోంచి ఓ తామరతూడూ, ఆ తూడు కొసని ఓ పెద్ద తామరపుష్పం పుట్టేయి. ఆ పుష్పంలో బ్రహ్మదేవుడు తొట్టెలో పిల్లాడికి మల్లె ఆడుకుంటూ కూచున్నాడు. అప్పుడెక్కణ్ణుంచి వచ్చారో గాని ఇద్దరు రాక్షసులొచ్చారు. వారిలో మొదటి వాడి పేరు మధువు. రెండోవాడి పేరు కైటభుడు. కమలంలో ఆడుకుంటూన్న పసి బ్రహ్మను చూచేటప్పటికి, వాళ్లకి అతణ్ణి ఏడిపించాలని బుద్దిపుట్టింది. మధువేమో ఆ పిల్లవాని బుగ్గ గిల్లేడు. కైటభుడు తొడ పాయసం పెట్టేడు. వాటితో బ్రహ్మ 'కేరు' మన్నాడు. విష్ణుమూర్తికి మెలకువొచ్చి, కళ్ళు తెరచి చూచేటప్పటికి, ఆ భయంకరాకారులు ఇద్దరూ కనపడ్డారు. విష్ణుమూర్తికి ఆశ్చర్యం వేసింది. "ఈ ప్రళయంలో అందరూ నాశనమైపోయారనుకుంటే వీళ్లెలా మిగిలారు?" అనిపించిందాయనికి. 

ఆయనకే గాదు, మీకూ అనిపిస్తుంది. దేవతలూ, రాక్షసులూ, మనుష్యులూ, అందరూ నశించిపోయారనుకున్నాంగా మరి? అందరూ నశించి, వీళ్ళిద్దరూ మాత్రం మిగిలేరు అంటే, వీళ్ళు ఎవరో చాలా ఉపద్రులన్నమాట! "ప్రళయం కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోయింది గనక, మీ సామర్థ్యానికీ, ప్రజ్ఞకీ మెచ్చుకున్నాను. అందుచేత ఏదైనా వరం కోరుకోండి" అన్నాడు విష్ణుమూర్తి. ఆ మాటలు వినేటప్పటికీ వాళ్లిద్దరూ పకపకా నవ్వుతూ "ఏమిటీ? నువ్వా మాకు వరాలివ్వటం" అన్నారు. "ఏం? అలా అంటున్నారు?" అని అడిగాడు విష్ణువు. "అలా అనడమేమిటి? ప్రళయానికి ప్రళయాలమైన మాకా ఒకడు వరాలివ్వటం? ఇంకా నిద్రమత్తుతో ఉండి మాట్లాడుతున్నావు గనక, అది ప్రథమ తప్పిదంకింద భావించి నిన్ను వదిలేశాం." అన్నారు వాళ్ళు. ఆ మాటలు వినేటప్పటికి విష్ణుమూర్తే తెల్లపోయాడు. ఏమనాలో తోచక ఆలోచిస్తూంటే, మధువు "కైటభా, ఇతగాడికి మన సంగతి తెలీదు గనక ఇలా మాట్లాడేడు. మన గొప్పతనం కాస్తంత మచ్చు చూపించాలి" అన్నాడు. కైటభుడు, "మనకి వరాలిస్తానని వాగేడు గనక మనం ఒకళ్లకి వరాలిచ్చే బాపతే గాని ఒకళ్లవద్దనుంచి పుచ్చుకునే బాపతు కాదని వీడికి తెలియచేసేస్తే సరి" అన్నాడు. "శభాష్!" అన్నాడు మధువు. "మహా ప్రజ్ఞావంతులం" అనే గర్వం చేత కళ్లు మూసుకుపోయి, బుద్ధి మందగించి, తామేం చేస్తున్నది కూడా తెలుసుకోకుండా ఆ మధుకైటభులిద్దరూ గర్వంగా విష్ణుమూర్తికేసి తిరిగి, "కోరుకో నీకేం వరం కావాలో, మేమేయిస్తాం!" అన్నారు. 

విష్ణుమూర్తి అలోచించి "వీళ్లని ఉపేక్ష చేస్తే కొంప మునుగుతుంది వీళ్లపని పడదాం" అని నిశ్చయించుకొని వినయం కనపరుస్తో, "మహాత్ములారా, మీరు చాలా ఉదారపురుషులు! మీ దర్శనం వల్ల నా జన్మ పావనమైంది. ధన్యుణ్ణి! మీలాంటివారు వచ్చి, 'వరం కోరుకో' అంటే 'వద్దు' అంటానా? అనుగ్రహించండి" అన్నాడు. "ఊ, కోరుకో, సందేహిస్తావేమిటి?" అన్నారు వాళ్ళు. "అబ్బే, సందేహమెందుకు? మీలాంటివారు ఆడి తప్పుతారుగనకనా? కోరుకుంటున్నా వినండి. మీ ఇద్దరూ కూడా ఇప్పుడు నా చేతిలో చచ్చిపోవాలి!" అన్నాడు విష్ణుమూర్తి. ఆ మాట వినేటప్పటికి మధుకైటభులకి తెలిసొచ్చింది. నవ్వులన్నీ పోయి ఒకళ్ల మొహం ఒకళ్ళు చూచుకోవడం మొదలెట్టేరు. ఐతేయేం? ఒక్క క్షణమే అలా ఉన్నారు. 'ఏ వరమైనా ఇస్తాం' అన్నారుగా? ఆడి తప్పరు. వాళ్లు దుర్మార్గులైన రాక్షసులే అయినా వాళ్లలో ఆ నిజాయితీ ఉంది. "విష్ణుమూర్తీ, నీ తెలివితేటలకి మెచ్చుకున్నాం. పుచ్చేసుకో మా ప్రాణాలు!"  అని సిద్ధపడ్డారు. సిద్ధపడడమేకాదు; వాళ్లు మరోమాట కూడా చెప్పేరు. "మాకు నీరు ఉన్నచోట చావులేదు. ఇప్పుడెక్కడ చూసినా నీటిమయం. మరి మమ్మల్ని చంపే ఉపాయం నువ్వే ఆలోచించుకో" అన్నారు. విష్ణుమూర్తికి, వాళ్లని చంపే ఉపాయం ఆలోచించటం ఓ లెక్క? "ఎంతసేపు?" అంటూ అయన తన రెండు తొడలూ పెంచేసి, ఆ తొడలమీద చెరొక రాక్షసుణ్ణీ పడుకోబెట్టి, తన సుదర్శన చక్రంతో వాళ్ల కంఠాలు తరిగేశాడు.


Comments