చందమామ కథలు - పిల్లిని చంపిన పాపము

 

Telugu Chandamama story of a miser trader who outwits a poor Brahmin. Best Chandamama Telugu Stories to read.

పూర్వం ఓ గ్రామంలో గురవయ్యశెట్టి అనే కోమటి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ఆ తెలివి అంతా ఉపయోగించి ఎంతో డబ్బు సంపాదించాడు. డబ్బు సంపాదనలో ఎన్నో మోసాలూ, అన్యాయాలూ చేస్తూ ఉండేవాడు. పరులను అన్యాయం, మోసం చేస్తే పాపం వస్తుందని అతనికి తెలుసు. చేసిన పాపాలు పోగొట్టుకోడానికి కొందరు గుడి కట్టించడమో, ఓ చెఱువు తవ్వించడమో, ఓ సత్రము వేయించడమో, ఇలాటి పుణ్యకార్యాలేవో చేస్తూ వుంటారు. కాని "ఇవన్నీ డబ్బు ఖర్చయే పనులే. ఇంత శ్రమపడీ, పాపాలు చేసీ డబ్బు సంపాదించడం ఆఖరుకిలా ఖర్చు పెట్టటానికా?' అనిపించేది గురువయ్యకి. అంచేత అతను ఇలాటి ఖర్చయే పుణ్యకార్యాలేమీ తలపెట్టక, ఊరికే కనపడ్డ దేవుళ్ళకీ, కొండలకీ, పుట్టలకీ, చెట్లకీ దణ్ణాలు పెడుతూండేవాడు. ఆ దణ్ణాలతో తన పాపమంతా పోయిందని అనుకునేవాడు. ఒకనాడు శెట్టి భార్య పాల గిన్నె ఉట్టి మీద పెట్టడం మర్చిపోయింది. ఆవిడ వచ్చేలోపుగా పిల్లి ఒకటి వచ్చి ఆ పాలు తాగడం మొదలెట్టింది. శెట్టి పిల్లిని చూచి కోపంతో, దగ్గరున్న అరవీశెరాయి దాని మీద విసిరేశాడు. ఆ రాయి దానికి ఆయువుపట్టున తగిలి, అది గిలగిల తన్నుకు చచ్చింది! ఏదో కోపంతో రాయి విసిరేశాడే గాని ఆ పిల్లి చస్తుందని గురవయ్య అనుకోలేదు. పిల్లి చచ్చిపోయిందనేసరికి అతడు గజగజ వణికిపోయాడు. ఏమంటే, పిల్లిని చంపిన పాపం కాస్తాకూస్తా కాదు. ఆ పాపం వల్ల మళ్లీ జన్మలో కుష్ఠు రోగం వస్తుందిట! ఇది చాలా చెడ్డ పాపం గనక ఉత్తుత్తి దణ్ణాలతో పోయేది కాదని తోచి, గురవయ్య ఆ ఊరి శాస్త్రులుగారితో ఆలోచించటానికి వెళ్లేడు.

ఎవరి విషయంలో మాట్టాడుతోన్నట్లు గురవయ్య ప్రసంగం మొదలెట్టేడు: "శాస్త్రుల్లుగారూ, పిల్లిని చంపితే పాపం అంటారు. నిజమేనా?" "అందుకు సందేహమేమిటి? పిల్లిని చంపితే బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుంది." అన్నాడు శాస్త్రులు. "ఐతే, ఈ పాపం పోవాలంటే ప్రాయశ్చిత్తమేమిటో?" అని అడిగాడు గురవయ్య. "ప్రాయశ్చిత్తమా? ఆ చచ్చిన పిల్లి ఎంత ఉంటే అంత బరువుకి ఓ బంగారపు పిల్లిని చేయించి, బ్రాహ్మడికి దానం చేస్తే పాపం పోతుంది" అన్నాడు శాస్త్రుల్లు. ఆ మాట వినేసరికి గుండె గుభేల్ మన్నది గురవయ్యకి. "శాస్త్రుల్లుగారూ, ఐతే అందరికీ బంగారపు పిల్లుల్ని చేయించి ఇవ్వగల శక్తి ఉంటుందా? శక్తిలేని వాళ్ల మాటేమిటి మరి?" అని అడిగాడు. "అంత శక్తి లేకపోతే వెండితో చేయించి ఇవ్వవచ్చు" అని ఉపాయం చెప్పాడు శాస్త్రులు. "సరే కానీ వెండి మాత్రం చవగ్గా ఉందా శాస్త్రుల్లుగారూ? మరి మార్గం లేదంటారా?" అని అడిగాడు గురువయ్య. అందుకు శాస్త్రుల్లు "ఎందుకు లేదూ? మన పెద్దలు ఎక్కడికక్కడే తాహతుకు సరిపడేటట్టు చెప్పేరు. వెండి పిల్లికి శక్తిలేని వాళ్లు కంచు పిల్లినో, ఆ శక్తీ లేని వాడు ఇత్తడి పిల్లినో చేయించవచ్చు" అన్నాడు. అక్కడికీ గురవయ్య వదలలేదు. "ఆ శక్తీలేకపోతే?" అన్న ప్రశ్న వేశాడు. "అన్నింటిలోకీ కలిపి స్వల్పమైన దానం స్వయంపాకం" అని తేల్చి చెప్పాడు శాస్త్రుల్లు. స్వయంపాకం అంటే ఒక మనిషికి సరిపోయే బియ్యం, పప్పూ, ఉప్పూ వగైరా సామాగ్రి. అన్నీ కలిపి అర్ధరూపాయకన్న ఎక్కువ ఖర్చవదు. ఈ స్వల్పంతో తాను పిల్లిని చంపినపాపం యావత్తూ పోగొట్టుకోవచ్చునని తెలుసుకున్నప్పుడు గురవయ్య చాలా సంతోషించాడు.

అప్పుడు శాస్త్రుల్లుతో ఆ పాపం చేసింది తానే అని వెల్లడించి, "ఇంటికి వెళ్లి స్వయంపాకం పంపిస్తాను. నా పాపం పోగొట్టండి?" అని కోరేడు. శాస్త్రుల్లు నిర్ఘాంతపోయాడు. "ఇతను బంగారపు పిల్లిబొమ్మ చేయించి దానం ఇవ్వగలిగినంత ధనవంతుడు. స్వయంపాక దానంతో దాటేస్తున్నాడే!" అనుకున్నాడు. మళ్ళీ అలోచించి "పోనీ, ఈ మాత్రం ఇచ్చే దాత ఎవడు? ఎక్కడికక్కడే." అని సిద్ధపడ్డాడు శాస్త్రుల్లు. గురవయ్య ఇంటివైపు మళ్ళేసరికి అతని మనసు మళ్ళీ వెనకదీసింది. అర్ధ మణుగు చింతపండు అమ్మితే గాని అర్ధరూపాయి రాదు. అలాంటిసొమ్ము ఖర్చు చేసి ఈ బ్రాహ్మడికి దానం ఇవ్వడమా?" అనిపించింది. ఈ ఖర్చుకూడా లేకుండా పాపం పోగొట్టుకోడానికి ఆలోచించాడు. మళ్ళీ శాస్త్రుల్లు దగ్గిరికివచ్చి, "ఏం బాబూ, నేను స్వయంపాకం మీకు ఇచ్చుకుంటే, నా పాపం నిజంగా పోతుందంటారా?" అని అడిగాడు. అందుకు శాస్త్రుల్లు "ఎందుకు పోదు? నీ పాపం నాకు వస్తుంది. ఆ పాపమా, నేను జపం చేసి పోగొట్టుకుంటానులే" అన్నాడు. ఇదివిని గురవయ్య "అటయితేసరే. నేనిలా పని మీద వెడుతున్నాను. స్వయంపాకం తర్వాత పంపుతాను. మీరు జపం వెంటనే ఆరంభించండి." అని తనదారిన బయలుదేరాడు. మరోగంట పోయాక గురవయ్య మళ్ళీ వచ్చి "బాబూ, ఏం చేస్తున్నారు?" అన్నాడు. "జపం చేస్తున్నాను" అన్నాడు శాస్త్రుల్లు.

"నేను ఇస్తానన్న స్వయంపాకంవల్ల మీకు వచ్చిన నా పాపం పోవటానికేనా బాబూ ఈ జపం?" అని అడిగాడు గురవయ్య. "ఔను" అన్నాడు శాస్త్రుల్లు. శెట్టి, సంతోషంతో "ఐతే పిల్లిని చంపిన పాపం తమకు వచ్చిందన్నమాటేనా!" అన్నాడు. గురవయ్య ఇలా ఎందుకు అడుగుతున్నాడో బ్రాహ్మడికి తెలిసింది కాదు. శెట్టి చేసిన పాపం తనకు రాలేదంటే స్వయంపాకం ఎక్కడ పోతుందో అన్న భయంకొద్దీ "వచ్చింది" అని నోటారా అన్నాడు శాస్త్రుల్లు. "మరైతే వస్తాను. సెలవు" అంటూ గురవయ్య వెళ్లిపోబోయాడు. "మరి నా స్వయంపాకం ఏదీ?" అన్నాడు శాస్త్రుల్లు. "స్వయంపాకమా బాబూ? లాభాలు గూబల్లో కొచ్చాయి. మరొకప్పుడు ఇచ్చుకుంటా" అన్నాడు గురవయ్య. "అదేమిటోయ్, అలాగంటావ్, ఇస్తానని మొదటిచెప్పి?" అన్నాడు శాస్త్రుల్లు. "ఇస్తానన్న మాట నిజమే బాబూ. కానీ ఇవ్వలేను. ఏం చెయ్యను మరి? పిల్లిని చంపిన పాపం తమది. స్వయంపాకం ఇస్తానని ఎగ్గొట్టిన పాపం నాది." అంటూ గురవయ్య వెళ్లిపోయాడు. "పిల్లిని చంపిన పాపం చాలా ఎక్కువది. స్వయంపాకం ఇవ్వని పాపం చిన్నది. ఇది దేవునికో దణ్ణం పెడితే పోతుంది." అనుకుని, గురవయ్య దారిలో గుడి కనిపిస్తే, ఆగి చెప్పుల జోడులోంచి కాళ్లు తీసి, దేవునికో దణ్ణం పెట్టి, లెంపలు వాయించుకుని, కానీ ఖర్చులేకుండా పాపమంతా పోయిందని సంతోషిస్తో యింటికి వెళ్ళిపోయాడు. సంతోషించి వెళ్లేడేకాని పిల్లిని చంపిన పాపం ఎలాగా పోలేదు సరికదా, బ్రాహ్మణ్ణి ఆశపెట్టి స్వయంపాకం ఇవ్వకుండా పోయినందుకు ఆ పాపం కూడా వచ్చి చుట్టుకుందన్న సంగతి తెలుసుకోలేక పోయాడు.


Comments