విక్రమ బేతాళ కథలు - అదృష్టహీనుడు

Vikram answers Betal on how a butcher is effected by his own deeds rather than luck. Best Telugu Vikram Betal Stories to read.

విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా స్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీవు ఏ మహాపరాధం చేసిన కారణం చేత ఈ నిశిరాత్రివేళ ఇలా శ్రమిస్తున్నావో నాకు తెలియదు. కానీ ప్రపంచంలో కొందరు అదృష్టహీనులు ఏ తప్పూ చెయ్యకుండానే క్రూరమైన శిక్షలు అనుభవిస్తారు. ఇందుకు తార్కాణంగా సాకేతుడనే వాడి కథ చెబుతాను విను," అంటూ ఈ విధంగా చెప్పసాగాడు: ఉసీనరదేశంలో సాకేతుడనేవాడు కసాయిగా జీవించేవాడు. వాడి వద్ద మేలైన గొర్రెమాంసం దొరికేది. అందుచేత చుట్టుపట్ల చాలా దూరం నుంచి కూడా మనుషులు వచ్చి వాడి వద్ద మాంసం కొనుక్కుపోయే వారు. వాడు గొర్రెల పెంపకంలో కూడా నిపుణుడు కావటం చేత వాడికి మంచి పేరూ, డబ్బూ కూడా లభించాయి.

ఇట్లా ఉండగా ఒకనాడొక ముసలివాడు సాకేతుడి వద్ద మాంసం కొని సరి కొత్త వెండి నాణెం ఇచ్చి వెళ్ళాడు. సాకేతుడా నాణెం చూసి ముచ్చటపడి దాన్ని వేరే ఒక సంచీలో వేశాడు. అది మొదలు ప్రతిరోజూ ఆ ముసలివాడు ఒక కొత్త వెండి నాణెం ఇచ్చి సాకేతుడి వద్ద మాంసం కొనుక్కుపోతూ వచ్చాడు. కొంతకాలం గడిచింది. సాకేతుడి వద్ద ధనికులు ఏటా పందెపు పొట్టేళ్ళను కొనటం అలవాటు. సంక్రాంతి పండుగ ఇంకా కొద్ది మాసాలున్న దనగా సాకేతుడు గ్రామాల వెంట తిరిగి, మంచి పొట్టేళ్ళను ఏరి కొనుక్కొచ్చి, వాటికి తగిన తిండి పెట్టి, పందాలకు తయారు చేసి వాటిని మంచి ధర ఇచ్చిన వారికి అమ్ముతుండే వాడు. ఈసారి అతనికి పొటేళ్ళ బేరం మీద బయలుదేరాలనిపించి, తాను ప్రత్యేకంగా దాచి ఉంచిన నాణాలు ఎంచుదామని సంచీ తీశాడు. అందులో చెయ్యిపెట్టి అతను గుప్పెడు నాణాలు పైకి తీశాడు. కాని అతని గుప్పిట్లోకి వచ్చినవి నాణాలు కావు, చిల్లపెంకులు! కంగారుపడి అతను సంచీని బోర్లించాడు. సంచీ నిండా చిల్లపెంకులే తప్ప ఒక్క వెండి నాణెం లేదు! ముసలివాడు తనను మోసం చేశాడనుకుని ఆగ్రహంతో సాకేతుడు పళ్ళు పటపటా కొరుకుతూ, "వాణ్ణి ఈ సారి కనబడనీకుండా కండ చీల్చేస్తాను!" అంటుంటే, మాంసం కొన వచ్చినవారు, "ఏం జరిగింది? ఎవరు నిన్ను మోసం చేశారు?" అని అడిగారు. ఇంతలో ముసలివాడే మాంసం కొనటానికి వస్తూ కనిపించాడు. సాకేతుడు తన దుకాణం నుంచి బయిటికి దూకి, ముసలివాడికి ఎదురు పెరిగెత్తుకుంటూ వెళ్ళి, వాడి మెడ పట్టుకుని, "దుర్మార్గుడా! వంచకుడా! నన్ను మోసం చేస్తావా?" అని అరిచాడు, అందరినీ కేకవేశాడు.

ముసలివాడు రహస్యంగా, "నోరు మూసుకో ! నా మీద నింద వేశావంటే నిన్ను సర్వనాశనం చెయ్యగలను!" అన్నాడు. సాకేతుడావేశంతో, ముసలివాడి మాటలు లక్ష్య పెట్టక, "నన్ను ఏం చెయ్యగలవు రా, మాయదారి వాడా?" అని మరింత గట్టిగా అరిచాడు. ముసలివాడు గొంతెత్తి అందరికీ వినిపించేలాగా, "నీ రహస్యం నాకు తెలిసిపోయింది. అందరికీ చెప్పక మానుతాననుకుంటున్నావా? .. అయ్యా, చూడండి! ఈ నిర్భాగ్యుడు మనందరినీ మభ్యపెట్టి గొర్రె మాంసమని చెప్పి శవాల మాంసం ఇస్తున్నాడు. ఈ క్షణానే వీడి ఇంట మనిషి శవం ఉన్నది!" అన్నాడు. "అబద్ధం! పచ్చి అబద్ధం! నీ మాట రుజువు చెయ్యి!" అన్నాడు సాకేతుడు. "రుజువు చెయ్యక ఊరుకుంటానా? నీ రహస్యం పది మందికీ తెలియవద్దా? పద, నీ యింటికి నడు!" అంటూ ముసలివాడు, పది మందినీ వెంటబెట్టుకుని సాకేతుడి ఇంటికి బయలుదేరాడు. వాడి ఇంటి వెనుక గదిలో గోడకు చేరబెట్టి ఒక మనిషి కళేబరం ఉన్నది. ముసలివాడు శక్తి గల మాంత్రికుడు. ఆ సంగతి ఎవరికీ తెలియదు. దాన్ని చూడగానే సాకేతుడు కేవలమూ ఆశ్చర్యపోయాడే గాని, మిగిలిన వాళ్ళంతా అగ్రహావేశం చెందారు. అందరూ అతని పైన పడి చావ చితకపొడిచారు. సాకేతుడు స్పృహ తప్పి పడిపోయాక, అతని దుకాణంలో ఉన్న మాంసమంతా మట్టిలో తొక్కేశారు. ఆ దొమ్మిలో సాకేతుడి ప్రాణం పోలేదన్నమాటే గాని, ఎడమ కన్ను కాస్తా పోయింది. 

అతను స్పృహ తెలిసి లేచేటప్పటికి చుట్టుపక్కల ఎవరూ లేరు. అతని కుండిన ఇల్లూ, డబ్బూ, సమస్తమూ పోయింది. ఇక ఆ దేశంలో తాను బతకలేనని తెలుసుకుని సాకేతుడు మరొక దేశం వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టే పని చేసుకుంటూ ఏదో విధంగా కాలక్షేపం చెయ్యసాగాడు. అభ్యాసం అంతగా లేకపోయినా, కులవిద్యే గనక అతను కాస్త మంచి పేరు తెచ్చుకుని, పైకి వస్తుండగా మరొక దుర్ఘటన జరిగింది. ఒకనాడు సాకేతుడు తన దుకాణంలో కూచుని చెప్పులు కుట్టుకుంటూ ఉండగా బాకాలూదిన చప్పుడూ, గుర్రపు డెక్కల చప్పుడూ వినపడింది. అదేమిటో వింత చూద్దామని సాకేతుడు దుకాణం బయటికి వచ్చేసరికి, ఆ దేశపు రాజు సపరివారంగా వేటకు బయలుదేరి అటుగా వస్తూ కనిపించాడు. ఆ రాజు సాకేతుణ్ణి చూస్తూనే కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకుని, "ఆ ఒంటి కంటి వెధవను నూరు కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చెయ్యండి," అని చెప్పి, వేట ప్రయత్నం మానేసి, గుర్రాన్ని తిప్పుకుని తన నగరుకు తిరిగి వెళ్ళిపోయాడు. 

రాజభటులు సాకేతుణ్ణి పట్టుకుని వీపు మీదా కాళ్ళ మీదా కొరడాలతో కొట్టి, "దేశం విడిచి పో! లేకపోతే నీకు మరణ దండన పడుతుంది!" అన్నారు. "ఇంతకూ నేను చేసిన మహాపచారమేమిటి?" అని సాకేతుడు రాజభటులనడిగాడు. "ఒంటి కంటివాడు కనిపించటం మా రాజుగారు పెద్ద దుశ్శకునంగా భావిస్తారు. అందులోనూ ఎడమ కన్ను గుడ్డిదైతే ఆయన అసలే సహించరు!" అని రాజభటులు సాకేతుడికి చెప్పారు. రాజాజ్ఞ ప్రకారం సాకేతుడా దేశం విడిచిపెట్టి మరొక దేశం వెళ్ళి, అక్కడ ఒక మారు మూల ఇల్లు చూసుకుని నివసించసాగాడు. అతను ఇల్లు కదిలి ఎక్కడికీ వెళ్ళేవాడు కాడు, తల ఎత్తి ఎవరినీ చూసేవాడు కాడు. ప్రపంచం మొహం చూడకుండా ఇట్లా కొన్నాళ్ళు గడిపినాక అతనికి ఊపిరాడనట్టయింది. కాస్త పది మంది మధ్యకూ వెళ్ళి, స్వేచ్ఛగా గాలి పీల్చి, ప్రపంచం కేసి ఒకసారి చూడాలన్న తహ తహ అతనిలో పెరగసాగింది. అందుచేత ఒక రాత్రి సాకేతుడు తల మీదుగా ఒక దుప్పటి కప్పుకుని, వీధుల వెంట బయలుదేరాడు. 

అతను కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు వినగానే అతనికి మతిపోయినట్టయింది. ఏ రాజభటులో వెంట తరుముకొస్తున్నట్టుగా అతను కాలి బలం కొద్దీ పరిగెత్తుతూ సందుల వెంటా, గొందుల వెంటా పడిపోయి, ఒక ఇంటి వాకిలి తలుపు తోశాడు. తలుపు తెరుచుకున్నది. లోపల అంధకారపూరితమైన గొంది కనిపించింది. ఒక ఘడియ సేపు ఆ చీకట్లో దాగి ఉండి తరువాత నిమ్మళంగా ఇంటికి చేరుకుందామనుకున్నాడు సాకేతుడు. కాని అతను చీకటిలోకి ప్రవేశించి పక్క గోడను ఒదిగి నిలబడిన మరుక్షణంలో, ఇద్దరు మనుషులు అతని పైన పడి, "దొరికావా, దుర్మార్గుడా? ఎంతకాలం తప్పించుకు తిరుగుదామనుకున్నావు?" అంటూ అతన్ని పట్టి బంధించారు. సాకేతుడు సగం చచ్చి, "బాబూల్లారా, నేను మీకే మపకారం చేశాను? నన్నెందుకిట్లా పట్టుకున్నారు?" అని అడిగాడు. "మూడు రోజుల నుంచీ నువు మా యజమానిని చంపే ప్రయత్నంలో కత్తి పట్టుకుని ఆయనను వెంబడిస్తూ, పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడల్లా తప్పించుకు పారిపోవటం లేదా? అమాయకుడిలా నటించకు," అన్నారా మనుషులు. "మీరెవరో, మీ యజమాని ఎవరో కూడా నాకు తెలియదే?" అన్నాడు సాకేతుడు. "నీ అబద్ధాలు నమ్మటానికి మేమేం వెర్రివాళ్ళ మనుకున్నావా? మా యజమానిని హత్య చెయ్యటానికి కాకపోతే ఈ యింటి సందులోకి వచ్చి ఎందుకు దాక్కున్నావు? నీ దగ్గిర కత్తి లేదూ?" అంటూ ఆ ఇంటి నౌకర్లు సాకేతుణ్ణి వెతకగా అతను తోలు కోసుకునే ఉలి దొరికింది.

దానితో వాళ్ళ అనుమానం రూఢి అయింది. వాళ్ళు సాకేతుణ్ణి న్యాయాధికారి వద్దకు తీసుకుపోయారు. న్యాయాధికారి సాకేతుణ్ణి పరీక్ష చేయించగా అతను అదివరకే కొరడాదెబ్బల శిక్ష పొందినవాడని తెలిసిపోయింది. అందుచేత ఆటే విచారించవలిసిన పని కూడా లేకుండా, "వీడు పాత నేరస్తుడే. నూరు కొరడాదెబ్బలు కొట్టి, దేశబహిష్కారం చెయ్యటమే వీడికి శిక్ష!" అన్నాడు న్యాయాధికారి. బేతాళుడీ కథ చెప్పి, "రాజా, నిర్దోషి అయిన సాకేతుడు నిక్షేపంలాటి తన వృత్తిని పోగొట్టుకుని, ఎక్కడా తల ఎత్తుకు తిరగటానికి లేని స్థితిలో పడి, ప్రపంచానికంతకూ శత్రువై, పనికిమాలినవాడై అకారణంగా ఒక శిక్ష తరువాత మరొక శిక్ష అనుభవించటానికేమిటి కారణం? ఈ నా సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "సాకేతుడికి ఈ కష్టాలు అకారణంగా రాలేదు. అతను బలవద్విరోధం తెచ్చిపెట్టుకున్నాడు. అతను మాంత్రికుడితో విరోధం పెట్టుకున్న క్షణం నుంచీ అతని కష్టాలు ఆరంభమయాయి. చిల్లపెంకులను వెండి నాణాలుగా కనపడేలాగా చేయగల శక్తి ఉన్నవాడిని తెలిసినప్పుడు, మాంత్రికుడు చేసిన మోసానికి ప్రతి క్రియ ఎట్లా చేయాలో అలోచించి ఉండవలిసింది; సాకేతుడు అలా చేయక, తొందరపడి ఆ మాంత్రికుడిపై చెయ్యి చేసుకున్నాడు. ఒకసారి భ్రష్టుడైనవాడికి వికాసం ఉండదు. స్థానబలం లేని సాకేతుడికి ప్రతి చిన్న సంకటము పెద్ద ఆపదగా పరిణమించింది. స్థానబలం ఉన్నవాడైతే అతను శిక్షలు పడి ఉండకపోను," అన్నాడు.  రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.

Comments