- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
విసుగుచెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీవు పడే ప్రయాస చూడగా శాపగ్రస్తుడివా అనిపిస్తున్నది. అయితే నీవు మామూలు శాపగ్రస్తుల లాగా కాకుండా, మత్స్యరాజ కుమార్తె అయిన ముక్తామయి లాగా శాపాన్ని తెచ్చి పెట్టుకున్న వాడి లాగా కనిపిస్తున్నావు. శ్రమ తెలియకుండా ఆ రాకుమారి ముక్తామయి వృత్తాంతం చెబుతాను విను," అంటూ ఈ విధంగా చెప్పసాగాడు: మత్స్యలోకపు రాజకూతురు ముక్తామయి. ఆమె సాటిలేని సౌందర్యవతి. ఆమె సౌందర్యానికి వివశుడై ఫణీముఖుడనే నాగుడామెను పెళ్లాడ గోరాడు. అయితే అతను బొత్తిగా వికారమైన రూపం గలవాడు కావటం చేత ముక్తామయి అతన్ని చూడటానికే అసహ్యపడింది.
"మా పిల్ల నిన్ను చేసుకోవటం అసంభవం. లేని పోని ఆశలు మాను," అని ముక్తామయి తల్లిదండ్రులు ఫణీముఖుడికి స్పష్టంగా చెప్పేశారు. కాని ఫణీముఖుడి కోరిక తగ్గకపోగా మరింత అయింది. అతను ముక్తామయిని అపహరించుకు పోవటానికి కూడా ప్రయత్నించాడు. ఈ ప్రయత్నం కొనసాగకపోగా, బయటపడి జలచరాల కన్నిటికీ తెలిసిపోయింది. ఆ తరవాత ఫణీముఖుడికి మత్స్యలోక ప్రాణులు శాంతిలేకుండా చేశాయి. ఆ బాధ పడలేక ఫణీముఖుడు చంపా సరోవరం ద్వారా భూమి పైకి వచ్చి చేరి, ఆ సరోవరం పక్కనే ఉన్న ఒక పుట్టలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఫణీముఖుడు మత్స్యలోకాన్ని విడిచి వెళ్ళాక ముక్తామయికి మనస్సు కుదుట పడింది. అప్పటి దాకా ప్రాణాలరచేత బట్టుకుని, ఫణీముఖుడు ఎటునుంచి వచ్చి పడి తనను అపహరించుకు పోతాడో అని భయపడుతూ ఉండిన ముక్తామయి ఇప్పుడు స్వేచ్ఛగా తిరగసాగింది. ఇలా సంచరిస్తూ ఒకనాడామె చంపా సరోవర మార్గాన భూలోకంలోని చంపారణ్యాన్ని చేరుకున్నది. ఆమె అదివరకెన్నడూ భూలోకాన్ని చూసి ఉండలేదు. అందుచేత చంపారణ్య దృశ్యాలామెకు అతి విచిత్రంగానూ, వింత సౌందర్యంతో కూడినవి గానూ కనిపించాయి. ముక్తామయి ఈ వింతలను చూడటంలో నిమగ్నురాలై ఉండగా పుట్టలో ఉన్న ఫణీముఖుడామెను సమీపించి, "నాకోసం వచ్చావా? రా! నన్ను పెళ్ళాడి ఇక్కడే ఉండిపో!" అన్నాడు. ఫణీముఖుణ్ణి చూడగానే ముక్తామయి కెవ్వున అరిచి చంపాసరోవరం లోకి దూక యత్నించింది, కాని ఫణీముఖు డామెను సరోవరాన్ని సమీపించనియ్యలేదు.
ముక్తామయి ఒక వంక భయంతో వణికిపోతూ, ఫణీముఖుడికి చిక్కకుండా పరిగెత్తుతూ, ఆర్తనాదాలు చెయ్యసాగింది. ఈ కేకలను ఆ దేశపు యువరాజు జగంధరుడనే వాడు విని పరిగెత్తుకుంటూ వచ్చి, అతిలోకసుందరి అయిన ముక్తామయినీ, ఆమెను వెంటాడుతున్న ఫణీముఖుణ్ణీ చూశాడు. అతను ఆ ప్రాంతానికి వేట కోసం వచ్చి, వన్యమృగాలకు బదులు ఈ ఇద్దరినీ చూశాడు. ముక్తామయి అతని కేసి పరిగెత్తుకుంటూ వచ్చి, "ఈ దుర్మార్గుడు నన్ను వెంటబడి తరుముతున్నాడు. వీణ్ణి చంపి నన్ను కాపాడండి," అన్నది. అతిసాహసి అయిన జగంధరుడు కత్తి దూసి, ఫణీముఖుడి పై కలియబడి అతని తల పై బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఈ అవకాశం చూసుకుని ముక్తామయి సరోవరంలోకి దూకి, తల పైకి పెట్టి జరిగేదంతా చూస్తున్నది. జగంధరుడు కొట్టిన దెబ్బకు ప్రాణాలు వదులుతూ ఫణీముఖుడు, "నాకు భార్యవు కావటానికి నిరాకరించినది చాలక, పని పెట్టుకుని నేనున్న చోటికి వచ్చి నన్ను రెచ్చగొట్టి, ఈ రాజకుమారుడి చేత నన్ను చంపించావు గనక, ఇతని కారణంగా నువ్వీ లోకంలో అడుగుపెట్టిన మరుక్షణం శిల అయిపోదువుగాక!" అని ముక్తామయిని శపించి చచ్చిపోయాడు. ఈ మాటలను వింటూనే ముక్తామయి సరోవరంలో మునిగి, తిన్నగా తన లోకానికి వెళ్ళిపోయింది. ఈ సంఘటన జగంధరుడు గమనించలేదు. అతను ఫణీముఖుణ్ణి కొట్టిన మరుక్షణం అతనున్న చోటికి అతని పరివారం వాళ్ళు వచ్చారు. అతని కత్తికి రక్తం ఉండటం చూసి, అతను గాయపడ్డాడేమో నని భయపడ్డారు.
"నాకేమీ గాయం తగలలేదు. నా చేత దెబ్బతిన్న నాగుడేమయాడో చూడాలి ముందు," అన్నాడతను. ఫణీముఖు డప్పటికే ప్రాణాలు వదిలాడు. ఆ సంగతి గమనించినాక జగంధరుడు తాను కాపాడిన సుందరి కోసం చుట్టూ కలయ జూశాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. అతను సరోవరాన్ని సమీపించి అందులో చూసేసరికి, లోపలికి దిగిపోతున్న ముక్తామయి మెరుపులాగా క్షణం పాటు కనిపించి అదృశ్యమయింది. రాజకుమారుడు దేని కోసం వెతుకుతున్నాడో పరివారాని కర్థంకాలేదు. వారిలో ఎవరూ ముక్తామయిని చూడలేదు. ఆమెను గురించి జగంధరుడు వారికి చెప్పదలచలేదు. అందుచేత అతను వారి వెంట అక్కడి నుంచి కదిలి వెళ్లవలిసి వచ్చింది. జగంధరుడు ఇంటికి తిరిగి వెళ్ళాడేగాని అతని మనస్సు చంపా సరస్సు వద్దనే ఉన్నది. అతను ముక్తామయి సౌందర్యాన్ని మరచిపోలేక పోయాడు. రెండు మూడు రోజులతనికి రెండు మూడు యుగాలుగా గడిచాయి. ఆమెను చూడకపోతే అతని ప్రాణాలు నిలిచేటట్టు లేవు. అందుచేత అతను ఒకనాడు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయలుదేరి చంపారణ్యానికి వెళ్ళాడు. చంపాసరోవరం దగ్గిర చాలాసేపు తారట్లాడి, నీటిలో నుంచి ముక్తామయి పైకి వస్తుందేమో నని చూశాడు.
తలవని తలంపుగా అతనికి సరోవర తీరాన ఒక మణి దొరికింది. అది ఫణీముఖుడి తల నుంచి రాలి పడిన మణి. జగంధరు డామణిని తీసుకోగానే అతనికి జలభయం ఏ మాత్రం కూడా లేకుండా పోయింది. అతను ఒక్కసారిగా చంపా సరోవరంలోకి దూకాడు. అతనికి నీరు దారి ఇస్తున్నట్టనిపించింది. ఏమాత్రమూ బాధ గాని, శ్రమగాని లేకుండా అతను మత్స్య లోకాన్ని చేరుకున్నాడు. ఈలోపుగా ముక్తామయికి కూడా జగంధరుడికి కలిగిన స్థితే కలిగింది. ఆమె తనను కాపాడిన జగంధరుణ్ణి ఆ క్షణం నుంచీ ప్రేమించింది. ఫణీముఖుడు శపించకపోతే ఆమె తన తల్లిదండ్రులనూ, తన లోకాన్నీ విడిచిపెట్టి జగంధరుడి వెంట వెళ్ళి ఉండి, అతనికి భార్య అయేదే. కాని ఇప్పుడు ఆమెకు తన ప్రియుణ్ణి చూసే మార్గం ఏదీ లేదు. తాను భూమి మీద అడుగుపెట్టటానికి లేదు. జగంధరుడు తన లోకానికి రాలేడు. అందుచేత ఆమె ఎవరితోనూ ఏమీ చెప్పక, తన భగ్న ప్రేమను తన హృదయంలోనే దాచుకుని బాధపడసాగింది.
ఈ స్థితిలో ఉన్న ముక్తామయికి ఎవరో మానవుడు తమ లోకానికి వచ్చినట్టు తెలిసింది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి జగంధరుణ్ణి చూసి, తన నోములన్నీ పండినట్టుగా సంతోషించి, అతనికి స్వాగతం చెప్పి తమ ఇంటికి తీసుకు వచ్చింది. వారిద్దరూ తమ ప్రేమను ఒకరి కొకరు వ్యక్తం చేసుకున్న మీదట ముక్తామయి తల్లిదండ్రులు వారి వివాహానికి సంతోషంగా ఒప్పుకున్నారు. అతని వెంట తమ కుమార్తె భూలోకానికి వెళ్ళటానికి కూడా వారు సమ్మతించారు. కాని ముక్తామయి తాను భూలోకానికి ఏ పరిస్థితిలోనూ వెళ్ళనని స్పష్టంగా చెప్పేసింది. "నీ కన్న ప్రియమైనది నాకు భూలోకంలో ఏమీలేదు. నేనిక్కడే ఉండి పోతాను," అన్నాడు జగంధరుడు. ఈ మాటకు ముక్తామయి తల్లిదండ్రులు మరింత సంతోషించారు. జగంధరుడు మత్స్యలోకంలో అయిదు సంవత్సరాలపాటు అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించాడు. అతనికి ఒక కొడుకూ, కూతురూ కూడా కలిగారు. అంత కాలానికి జగంధరుడికి తన దేశం వెళ్ళి తన వాళ్ళు ఎలా ఉన్నారో కూడా చూడాలన్న కోరిక కలిగింది. అతను తన భార్యతో చెప్పి, మణి సహాయంతో చంపాసరస్సు మార్గాన భూలోకానికి చేరుకొని ఇంటికి వచ్చేశాడు. అప్పటికి అతని ఇంటి వద్ద క్లిష్టపరిస్థితి ఏర్పడి ఉన్నది. జగంధరుడు కనిపించకుండా పోయాక అతని కోసం ఎంతగానో వెతికారు. అతను ఎటు వెళ్ళినదీ, ఏమైనదీ చెప్పేవారు ఒక్కరూ లేకపోయారు. అదిమొదలు జగంధరుడి తండ్రికి తీరని మనోవ్యాధి ఏర్పడి కాలక్రమాన ఆయన మంచం పట్టాడు.
ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయన వ్యాధి తిరుగుముఖం కాలేదు. ఆయన సంగతి ఇవాళో, రేపో అన్నట్టున్నది. ఆయన పోతే సింహాసనానికి వారసుడు కూడా లేడు. అటువంటి స్థితిలో జగంధరుడు తిరిగి వచ్చాడు. కొడుకును చూడగానే రాజుగారికి కొత్త ప్రాణం వచ్చినట్టయింది. జగంధరుడి కథ అంతా విన్నాక రాజు, అయిందేదో అయిందనీ, జగంధరుడు తగిన మానవ స్త్రీని పెళ్ళాడి రాజ్యాభిషేకం చేసుకుని రాజ్యపాలన సాగిస్తే ముసలితనంలో తనకు మనశ్శాంతి ఉంటుందనీ అన్నాడు. "ఈ జన్మకు ముక్తామయి ఒకతే నాకు భార్య. నేనింకొకతెను పెళ్ళాడను," అని జగంధరుడు తండ్రికి చెప్పాడు. "అయితే ఆమెనే తీసుకువచ్చి సుఖంగా రాజ్యం చేసుకో," అన్నాడు పెద్ద రాజు. భూలోకానికి రావటం తన కిష్టంలేదని ముక్తామయి ఏనాడో చెప్పింది. అయినా పరిస్థితులనుబట్టి ఆమె తన అభిప్రాయం మార్చుకుంటుందని జగంధరుడు నమ్మాడు. అతను మత్స్యలోకానికి తిరిగి వచ్చి తన భార్యకు సంగతంతా చెప్పి, తన వెంట రమ్మని ఆమెను ప్రార్థించాడు. ముక్తామయి అంతా విని, "పోనీ, మీ తండ్రిగారు కోరినట్టు మీరొక రాజకుమార్తెను పెళ్ళాడి ఆమెతో కాపరం చేస్తూ రాజ్యం చూసుకోండి," అన్నది. "అది నాకు సాధ్యం కాని పని. నేను నిన్ను తప్ప మరొకతెను ప్రేమించలేను. పెళ్ళాడలేను. భూలోకంలో అడుగుపెట్టనని నీకెందుకు పట్టుదల?" అని అడిగాడు జగంధరుడు. ముక్తామయి తల్లిదండ్రులు కూడా అతని మాటనే బలపరిచారు. "సరే పదండి," అని ముక్తామయి జగంధరుడి వెంట భూలోకానికి బయలుదేరింది.
ఆమె చంపాసరస్సు నుంచి ఒడ్డున కాలు పెడుతూనే, ఫణీముఖుడి శాపం తగిలి శిలగా మారిపోయింది. బేతాళుడీ కథ చెప్పి, "రాజా నాకొక సందేహం. ముక్తామయి తెలిసి తెలిసి శాపానికి తనను తాను ఎందుకు గురి చేసుకున్నది? తన శాపం గురించి మాట మాత్రం చెబితే జగంధరుడు తనకీ దుస్థితి కలగనివ్వడు కదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "ముక్తామయి ప్రవర్తనకు రెండు కారణాలున్నాయి. ఆమె జగంధరుడి ప్రేమను అతి పవిత్రంగా భావించింది. అతను మరొకతెను పెళ్ళాడటానికి నిరాకరించటాన్ని బట్టే ఆ ప్రేమ ఎంతటిదో రుజువయింది. అలాటప్పుడు ఆమె తన శాపం గురించి చెప్పిన పక్షంలో జగంధరుడు తన రాజ్యాన్నీ, కర్తవ్యాన్నీ విడిచి మత్స్యలోకంలోనే ఉండిపోతాడు. కాని అందువల్ల అతని ప్రేమ కొంత దెబ్బ తింటుంది. ప్రేమ కోసం తన కర్తవ్యాన్ని తోసిపుచ్చానన్న భావం అతన్ని తప్పక బాధిస్తుంది. అతను తన ధర్మం నెరవేర్చటానికి ఆ ప్రేమ అడ్డం రాకుండా చూడాలంటే తాను శాపానికి గురికావటం కన్న మరొక మార్గం లేదు. ఇది ఒక కారణం. మరొక కారణమేమంటే, ముక్తామయి అయిదేళ్లపాటు తన భర్త ప్రేమను చవిచూచింది. దాని ఫలితంగా ఇద్దరు పిల్లలను కూడా కన్నది. ఇంక వెయ్యేళ్ళు జగంధరుడితో కాపరం చేసినా ఆమె కొత్తగా పొందే అనుభూతి ఏమీ ఉండదు. అందుచేత కూడా ఆమె శాపగ్రస్తురాలు కావటానికి సిద్ధపడింది," అన్నాడు. రాజు కీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.
Comments
Post a Comment