- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీవు పడే శ్రమ అంతా ఒక స్త్రీ కోసం కాదు గద? ఎందుకంటే, స్త్రీల మూలాన ఎంతటి మహనీయులకైనా దుర్భరమైన కష్టాలు వస్తాయి. అందుకు నిదర్శనంగా, కాంచనప్రభ అనే స్త్రీ మూలాన కుండలదేశం ఎలా సర్వనాశనమైనదీ చెబుతాను, శ్రమ తెలియకుండా విను," అంటూ ఈ విధంగా చెప్ప సాగాడు: కుండలదేశాన్ని రత్నకుండలుడనే రాజు పాలించేవాడు. అతను మామూలు రాజు కాదు, రారాజు. పన్నెండు రాజ్యాల పాలకులు అతనికి లోబడి ఉండేవాళ్ళు. రత్నకుండలుడి కున్న బలం అతని వద్ద ఉండే పన్నెండు మంది దండనాయకులు. వారందరూ ఆరితేరిన యోధులు.
రాజు వారిని మంత్రుల కన్న హెచ్చుగా చూసుకునేవాడు. వారు కూడా నిష్కల్మషమైన రాజభక్తి కలవారు; తమ రాజు కోసం ప్రాణాలర్పించటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళు. ఒకనాడు రాజు సభ చేస్తూ ఉండగా ఆస్థానకవికి ఆడపిల్ల పుట్టినట్టు వార్త వచ్చింది. వెంటనే సభికులు ఆస్థానజ్యోతిష్కుణ్ణి ఆమెకు జాతకచక్రం వేసి ఫలితం చెప్పమన్నారు. జ్యోతిష్కుడు మీనమేషాలు గుణించి, "ఈ పిల్ల నిశ్చయంగా జగదేకసుందరి అవుతుంది. కాని ఈమె వల్ల రాజ్యానికి చాలా గొప్ప చేటున్నది. ఈమె అడుగు పెట్టిన చోట మహోపద్రవాలూ తప్పక జరుగుతాయి," అన్నాడు. ఈ మాటలు వింటూనే దండనాధులు కొందరు, "దేశసౌభాగ్యం కోసం మహావీరులు సైతం ప్రాణాలర్పిస్తుండగా ఇంకా కళ్ళు తెరవని పసిగుడ్డు ఒక లెక్కా? ఆమెను వెంటనే చంపించండి," అన్నారు. రత్నకుండలుడు వారిని వారిస్తూ, "పసికందును చంపవద్దు. ఆమెను నిర్జన స్థలంలో ఉంచి పెంచి, యుక్తవయస్కురాలయాక నేను నా భార్యగా చేసుకుంటాను. ఆమె లోకం ముఖం చూడకుండానూ, లోకం ఆమె ముఖం చూడకుండానూ కట్టుదిట్టం చేస్తాను," అన్నాడు. ఆ ప్రకారమే రాజు నిర్జనమైన కొండలోయలో ఒక ఇల్లు కట్టించి, ముగ్గురు స్త్రీల రక్షణలో ఆ చంటిపిల్ల పెరిగేటందుకు ఏర్పాటు చేశాడు. ఆ ఇంటికి చుట్టూ ఉండే కొండల మీద భటులను అహర్నిశలు కాపలా పెట్టాడు. రాజుగారు తప్ప మరెవరూ ఆ ఇంటికి అరకోసు దూరంలోకి రాకుండా చూడటమే వాళ్ళ పని. ఆ పిల్ల శరీరచ్ఛాయ చూసి ఆమెకు కాంచనప్రభ అని రాజే నామకరణం చేశాడు. కాంచనప్రభ అక్కడే పెరిగి పెద్దదై, కాలక్రమాన యుక్తవయస్కురాలయింది.
ఆమెకు కలిగిన ప్రపంచ జ్ఞానమంతా ఆమెను పెంచిన ముగ్గురు స్త్రీల ద్వారానే కలిగింది. అందులో ఒకామె ఆమెకు విద్య నేర్పింది, ఎన్నో కథలు చెప్పింది. ఆమె ద్వారానే కాంచనప్రభ పాతకాలపు ప్రేమపురాణాలన్నీ విని, తాను ప్రసిద్ధ సౌందర్యవతులతో పోల్చ దగిన మనిషి అయినట్టు తెలుసుకున్నది. "నేను ఎప్పుడూ ఈ ముసలి రాజునే చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఎక్కడా అందమైన పురుషులు లేరా?" అని కాంచనప్రభ తన గురువునడిగింది. రాజు కాంచనప్రభను త్వరలోనే పెళ్లాడనున్నాడని ఆ స్త్రీకి తెలుసు. అందుచేత ఆమెకు కాంచనప్రభ పైన జాలి కలిగింది. "అందమైన పురుషులు లేకపోవటమేమిటి? రాజుగారు వచ్చే మార్గాన కనుమ వద్ద ఒక వీరయువకుడు కాపలా ఉంటాడు. అతను నవమన్మధుడే! అలాటి వాడు భర్త కావాలని ఏ కన్య అయినా వెయ్యి దేవుళ్ళకు మొక్కుకుంటుంది," అన్నదామె. కాంచనప్రభకు ఒక్కసారి ఒళ్ళు ఝల్లుమన్నది. ఎలాగైనా ఆ వీరయువకుణ్ణి ఒక్కసారి చూడాలని ఆమెలో బలమైన కోరిక కలిగింది. ఒకనాటి సాయంకాలం, రాజు వచ్చే వేళ దాటిపోయాక, ఒక ముతక శాలువ ఒంటినిండా కప్పుకుని కనుమ ద్వారం కేసి బయలుదేరింది. కనుమ ద్వారం వద్ద కాపలా ఉండే యువకుడు సాధారణ సైనికుడు కాదు. అతని పేరు కేదారుడు. అతని అన్నలిద్దరూ రాజుగారి వద్ద దండనాధులే. యోధుడిగా అతనింకా వారి స్థాయి అందుకోలేదు గాని, అవకాశం దొరికితే తన శౌర్యపరాక్రమాలు ప్రదర్శించటానికి సిద్ధంగానే ఉన్నాడు. అతని వయస్సు కూడా చాలా తక్కువ; ఇరవై యేళ్లు.
కేదారుడు మసకవెలుగులో ఎవరో రహస్య మందిరం నుంచి తన కేసి వస్తూ ఉండటం చూసి, అక్కడ ఉండే ముగ్గురు స్త్రీలలో ఒకతె అయి ఉంటుందనుకుని, ఆమెకేం కావాలో తెలుసుకుందామనే ఉద్దేశంతో కనుమ నుంచి బయలుదేరి కాంచనప్రభకు ఎదురు వచ్చాడు. ఇద్దరూ ఒకరికొకరు సమీపంగా వచ్చాక కాంచనప్రభ తాను కప్పుకున్న శాలువ తీసేసి, తన అసాధారణ సౌందర్యం ప్రదర్శిస్తూ నిలబడింది. చాలాసేపు ఇద్దరూ కొయ్యబొమ్మలల్లే నిలబడిపోయారు. చివరకు కేదారుడు, "నాతో వచ్చేస్తావా? మనం పెళ్ళిచేసుకుని ఏ దేశమన్నా పోదాం," అన్నాడు. కాంచనప్రభకు రాజంటే ప్రస్తుతం భయం ఉన్నది. కాని ఆ యువకుడు తన భర్త అయే పక్షంలో తాను దేవుడికి కూడా భయపడవలిసిన అవసరం ఉండదని ఆమెకు ధైర్యం కలిగింది. "ఎక్కడికి రమ్మన్నా వస్తాను, నన్ను నీవెంట తీసుకుపో," అన్నదామె. క్రమంగా చీకటి పడుతున్నది. కేదారుడు కాంచనప్రభను వెంటబెట్టుకుని బాగా పొద్దుపోయి తన అన్నల వద్దకు వెళ్లి తాను తలపెట్టిన సాహసం గురించి వాళ్లకు చెప్పాడు.
వాళ్ళు అతన్ని తప్పు పట్టలేదు. "మీరిద్దరూ పెళ్ళాడాలనుకుంటే ఈ రాజ్యంలో మీ ప్రాణాలు దక్కవు. ఇంకొక రాజ్యంలోనైనా మీకు క్షేమం ఉంటుందని తోచదు. మిమ్మల్ని కాపాడటానికి మేం కూడా వస్తాం. తెల్లవారే లోపుగా మనం రాజ్యపు ఎల్లలు దాటిపోతే మనకు అంతగా ప్రమాదం ఉండదు," అన్నారు కేదారుడి అన్నలు. వారి కష్టాలకు అదే ప్రారంభం. వాళ్ళు దేశదేశాలు తిరిగారు. ఏ రాజు వద్ద కొలువులో చేరినా, ఆ వార్త త్వరలోనే రత్నకుండలుడికి తెలియటమూ, అతను ఆ రాజుకు హెచ్చరిక పంపటమూ, వాళ్లకు ఆ రాజ్యంలో మంచినీరు పుట్టకపోవటమూ జరిగింది. చివరకు వారికి చుట్టుపట్ల ఉండే ఏ దేశంలోనూ నిలువ నీడ దొరక కుండా పోయింది. అందుచేత వారు అరణ్యవాసం చేశారు. ఆకలములూ, వేటాడిన మృగాలూ వారికి ఆహారమయాయి. గుహలలోనూ, చెట్ల మీదా కూడా నివాసాలు చేశారు. ఆ జీవితం దుర్భరమనిపించి, వారు అరణ్యం దాటి దేశాలు కాని దేశాలలో చొరబడి, అక్కడ ఏదో విధంగా జీవయాత్ర గడపాలని చూశారు. అక్కడ వారికి మరొక చిక్కు వచ్చిపడింది. ఆ దేశాలలో బలవంతులు కాంచనప్రభను కాజెయ్యాలని చూశారు.
కొందరు దౌర్జన్యానికి దిగితే, అలాటి వాళ్ళను కేదారుడూ, అతని అన్నలూ ఎదిరించి, చంపటం కూడా జరిగింది. వాళ్ళు హంతకులుగా శిక్ష పొందకుండా తప్పించుకోవటానికి ఇంకా దూర దేశాలకు పోవలసి వచ్చింది. ఇంతలో రత్నకుండలుడు ఆకస్మికంగా ఒక ప్రకటన చేశాడు: కేదారుడూ, అతని అన్నలూ చేసిన ద్రోహాన్ని అయన క్షమించి, వారిని తన దేశంలో ఉండనిస్తానన్నాడు. ఈ మాట మిగిలిన దండనాధులకు ఎంతో ఆనందం కలిగించింది. కేదారుడి అన్నలు తమ నుంచి చీలిపోవటం వాళ్ళకెంతో బాధగా ఉన్నా, ఇంత కాలమూ వారేమీ అనలేని స్థితిలో ఉండిపోయారు. రాజుగారి ఔదార్యం వారిని పరవశులను చేసింది. రాజాజ్ఞ పొంది ముగ్గురు దండనాధులు కేదారుణ్ణి, అతని అన్నలనూ వెతుక్కుంటూ చివరకు ఎలాగయితేనేం వారి ఆచూకీ తెలుసుకుని, "మిమ్మల్ని రాజుగారు క్షమించాడు. వచ్చేయండి," అని చెప్పారు. "వాళ్ళ మాటలు నమ్మవద్దు. ఇందులో ఏదో మోసం ఉన్నది," అని కాంచనప్రభ వారిని హెచ్చరించింది. "మేము వంచకులం కాము. రాజుగారి గూఢచారులమూ కాము. మా మాట నమ్మవచ్చు. మీ ప్రాణాలకు పిసరంత హాని జరిగితే దానికి మా ముగ్గురి ప్రాణాలూ బలి ఇస్తాం," అన్నారు వచ్చిన దండనాధులు. "వాళ్ళు పొరపడుతున్నారు. రాజు దుర్భుద్ధి వాళ్లకు తెలియదు," అన్నది కాంచనప్రభ. ఆమె వైఖరి చూసి కేదారుడి అన్నలకు కోపం వచ్చింది. వాళ్ళు మాటను నమ్మి, మాట కోసం ప్రాణాలిచ్చే వాళ్ళు. "మాకెందుకు పిరికి మందు పోస్తావు?" మేము చావంటే భయపడే వాళ్ళమనుకుంటున్నావల్లే ఉంది. నిందితులుగా చావటం మాకిష్టం లేదు గాని, మా సోదర యోధుల అండ ఉండగా వీర మరణం పొందటానికి మేమెప్పుడూ వెనుతీయం," అన్నారు వాళ్ళు కాంచనప్రభతో.
అందరూ స్వదేశానికి తిరిగి వచ్చారు. కాంచనప్రభ అన్నదే నిజమయింది. కేదారుడూ, అతని అన్నలూ ఒంటరిగా ఉండేటందుకు రాజు యుక్తి పన్నాడు. వాళ్ళు తిరిగి వచ్చే సమయానికి ఆయన తన దండనాధులకు విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో పాల్గొనటానికి అందరూ వెళ్లి ఉన్న సమయంలో తుచ్చులైన ఆయుధ భటులు వచ్చి, కేదారుడూ అతని అన్నలూ, కాంచనప్రభా ఉన్న ఇంటి పైన పడ్డారు. వారిలో చాలా మందిని ఆ అన్నదమ్ములు చంపేసి, మిగిలిన వారిని పారదోలారు. ఇది జరిగిన కొద్ది సేపటికి రాజుగారి వద్ద నుంచి ఒక అధికారి వచ్చి, "మీ పైన దుండగులెవరో చెయ్యచేసుకో బోయారట. రాజుగారు చాలా నొచ్చుకున్నారు; మీకు క్షమాపణ చెప్పుకుంటారట, మిమ్మల్ని బయలుదేరి రమ్మన్నారు," అని చెప్పాడు. ఆ అధికారి మాటలు నమ్మి అన్నదమ్ములు ముగ్గురూ ఇంటి బయటికి వచ్చారు. వెంటనే రాజభటులు వారిని పట్టుకుని బంధించి, ఒంటరిగా ఉన్న రాజు వద్దకు తీసుకుపోయారు. "వీళ్ళ ముగ్గురినీ శిరచ్ఛేదం చెయ్యండి," అన్నాడు రాజు. ఎవరికీ తెలియకుండా మరణదండన జరిగిపోయింది. ఈ వార్త తెలియగానే దండనాయకులలో సగం మంది వధ్యభూమికి వెళ్లి శవాలను చూశారు. వారితో బాటు వెళ్లిన కాంచనప్రభ కేదారుడి శవాన్ని చూస్తూనే గుండె పగిలి చనిపోయింది. రాజు చేసిన పని చాలా నీచమైనదని కొందరు దండనాయకులు తిరుగుబాటు చేశారు.
రాజు ఏమి చేసినా అందులో దోషం ఉండదనీ కొందరు, వంచనకు విరుగుడు వంచనే అనీ మరి కొందరు దండనాయకులు వాదించారు. వారు రెండు కక్షలుగా చీలారు. వారితో బాటు సేనలూ చీలాయి. వారి మధ్య భయంకరమైన అంతర్యుద్ధం జరిగి సర్వనాశనం అయింది. ఆ అంతర్యుద్ధంలో రాజు కూడా ఆహుతి అయాడు. బేతాళుడీ కథ చెప్పి, "రాజా, ఈ సర్వనాశనానికి కారకులెవరు? ఈ మహాపాపంలో ఎవరెవరికి ఎంతెంత వంతున్నది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "తప్పు పూర్తిగా రాజుది. కాంచనప్రభ పుట్టినప్పుడే జ్యోతిష్కుడిలా జరుగుతుందని చెప్పాడు. రాజు అందులో విశ్వాసం ఉంచాడు. కాని దేశానికి అరిష్టం జరుగుతుందన్న విషయం దండనాయకులను బాధించింది గాని, రాజును బాధించలేదు. కనుకనే వారా పిల్లను అప్పుడే చంపమంటే అడ్డుపడ్డాడు. పై పెచ్చు ఆ జ్యోతిష్కుడి మాటల మీది నమ్మకంతోనే ఒక అపూర్వ సుందరిని తన భార్యగా చేసుకో గోరాడు. ఆమె తనకు దక్కకుండా పోయాక, ఆమెకూ, ఆమెను కాపాడే వాళ్లకూ పరిసర దేశాల్లో నిలవ నీడ లేకుండా చూశాడు. వాళ్ళు తన సామంతుల దేశాలను కూడా దాటిపోయాక అతి నీచమైన ఉపాయంతో వారిని రప్పించి, శిక్ష పేరిట వారిని హత్య చేశాడు. సర్వనాశనం జరగకుండా ఉండటానికి రాజు ఒక్క పని అయినా చేశాడని చెప్పటానికి అవకాశం లేదు. అందుచేత పాపమంతా అతనిదే," అన్నాడు. రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.
Comments
Post a Comment