విక్రమ బేతాళ కథలు - తనకు మాలిన ధర్మం

Vikram explains Betal on why a king donated everything he had and if it is justified. Best Vikram Betal Telugu stories to read.

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీ పట్టుదల నిజంగా అసాధారణమైనది. కానీ, నీవు తనకుమాలినధర్మం తలపెట్టావేమో నని నా భయం. అలా చేసిన పక్షంలో వినీతమతి లాగే నీవు కూడా సమస్తమూ పోగొట్టుకోగలవు. శ్రమ తెలియకుండా నీకు వినీతమతి కథ చెబుతాను విను," అంటూ ఇలా చెప్పసాగాడు: ఒకప్పుడు అహిచ్ఛత్రపురాన్ని ఏలే ఉదయతుంగుడనే రాజు వద్ద కమలమిత్రుడనే ప్రతీహారి ఉండేవాడు. వినీతమతి ఆ కమలమిత్రుడి కొడుకు. అతను సకల సద్గుణ సంపన్నుడు. ఒకనాటి రాత్రి అతను పండువెన్నెలలో మేడ పైన పడుకుని ఉండగా, వెన్నెల కాంతిలో అమిత అందంగా కనిపిస్తున్న చెట్లలోకి వెళ్ళి వనవిహారం చెయ్యాలని బుద్దిపుట్టింది.

వెంటనే అతను తన విల్లు తీసుకుని వనంలో ప్రవేశించి నడవసాగాడు. అతనలా కొంత దూరం వెళ్లే సరికి ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఒక కన్య కనిపించింది. "ఎవరమ్మాయీ నీవు? ఎందుకిలా దుఃఖిస్తున్నావు?" అని వినీతమతి అడిగాడు. "అయ్యా, నేను గంధమాలి అనే నాగేంద్రుడి కుమార్తెను. నా పేరు విజయవతి. కాలజిహ్వుడనే యక్షుడు నా తండ్రిని యుద్ధంలో ఓడించి తనకు బానిసగా ఉంచుకున్నాడు. అది సహించలేక నేను గౌరిని పూజించి ప్రత్యక్షం చేసుకున్నాను. ఆ దేవి నాకొక దివ్యమైన కత్తినీ, ఒక తెల్లని గుర్రాన్నీ ప్రసాదించి, వీటిని నీకివ్వమనీ, వాటి సహాయంతో నీవు కాలజిహ్వుణ్ణి జయించి, నా తండ్రిని విడిపిస్తావనీ, ఆ కత్తి సహాయంతోనే నీవు శత్రువులను జయించి రాజు వవుతావనీ అన్నది. ఈ సమయంలో నీవు వనం ప్రవేశించటం చూసి నిన్ను ఆకర్షించటానికే నేను గట్టిగా ఏడ్చాను. నీవు నాకీ సహాయం చేసిపెట్టగలవా?" అన్నదామె. వినీతమతి సరేనన్నాడు. విజయవతి ఎటో వెళ్ళి, మరుక్షణమే ఒక తెల్లని గుర్రాన్నీ, అపజయం లేని కత్తినీ తీసుకుని వచ్చింది. వినీతమతి కత్తి తీసుకుని, గుర్రం పైన ఎక్కి, విజయవతిని కూడా ఎక్కించుకుని, యక్షుడుంటున్న మానససరోవరానికి బయలుదేరాడు. ఆ గుర్రం రెప్పపాటులో వారిని మానససరోవరానికి చేర్చింది. యక్షులు చక్రవాకపక్షుల రూపం ధరించి ఆ సరస్సులో విహరిస్తున్నారు. విజయవతి తండ్రి అయిన గంధమాలి వారికి ఊడిగం చేస్తున్నాడు. వినీతమతి కత్తి దూసి యక్షుల పైన పడ్డాడు.

అప్పుడు కాలజిహ్వుడు తన పక్షి రూపం విడిచిపెట్టి, భయంకరాకారంతో వినీతమతి పైన కలియబడ్డాడు. కానీ వినీతమతి ఆ యక్షుడి జుట్టు పట్టుకుని తల నరకబోయేసరికి అతను దీనంగా ఏడుస్తూ ప్రాణ భిక్ష వేడాడు. గంధమాలికి దాస్యం తప్పింది. అతను తన కుమార్తెను వినీతమతికి ఇచ్చి తన ఇంటికి వెళ్ళిపోయాడు. వినీతమతి ఖడ్గ అశ్వాలతో బాటు కన్యను కూడా సంపాదించుకుని ఇంటికి తిరిగి వచ్చి ఆమెను పెళ్లాడాడు. అతని తండ్రి అయిన కమలమిత్రుడు, రాజైన ఉదయతుంగుడూ కూడా చాలా సంతోషించారు. ఉదయతుంగుడికి ఉదయవతి అనే కుమార్తె ఉన్నది. ఆమె అన్ని విద్యలలోనూ ఉత్తీర్ణురాలు. ఆమెను వాదంలో ఓడించిన క్షత్రియుడికి గాని, బ్రాహ్మణుడికి గాని తన కుమార్తె నిచ్చి పెళ్ళి చేస్తానని రాజు ప్రకటించి ఉన్నాడు. ఉదయవతిని వాదంలో ఓడించి ఆమెను పెళ్ళాడమని వినీతమతిని అతని తండ్రి పురికొల్పాడు. ఆమెతో ఎందరో వాదించి ఓడిపోయారు. అయినప్పటికీ ఆడదాన్ని వాదంలో ఓడించటమనేది వినీతమతికి కొంచెం అన్యాయమనిపించింది, కానీ తండ్రి మాట కాదనలేక సరేనన్నాడు.

వెంటనే కమలమిత్రుడు రాజుగారి వద్దకు వెళ్ళి, "మహారాజా, నా కొడుకు మన అమ్మాయిగారితో వాదన చేస్తానంటున్నాడు. రేపు వాదన ఏర్పాటు చెయ్యండి," అన్నాడు. రాజు సరే నన్నాడు. మర్నాడు విద్వత్సభ ఏర్పాటయింది. వినీతమతి రాజకుమార్తె చేసిన ప్రతి సిద్ధాంతాన్నీ ఖండించాడు. చివరకామె ఏమీ చెప్పలేకపోయింది. సదస్యులు వినీతమతిని తెగ మెచ్చుకున్నారు. ఉదయవతి ఓడిపోయి భర్తను సంపాదించుకున్నది. ఉదయతుంగుడు వినీతమతికి తన కుమార్తె నిచ్చి వైభవంగా పెళ్ళి చేసాడు. కొంత కాలం గడిచింది. ఉదయతుంగుడు వృద్ధుడై రాచకార్యాలు నిర్వహించలేని స్థితిలో పడ్డాడు. ఆయనకు కొడుకులు లేక పోవటం చేత అల్లుడికి పట్టం గట్టి, ముక్తి కోసం గంగా తీరానికి వెళ్ళిపోయాడు. వినీతమతి రాజ్యం ఏలుతూ తన ఇద్దరు భార్యల తోనూ సుఖంగా ఉన్నాడు. ఇంతలో ఒకనాడు ఇందుకలశుడనే రాజకుమారుడు ఉత్తర దేశం నుంచి వినీతమతిని చూడవచ్చాడు. వినీతమతి అతనికి యథోచితంగా అతిథి మర్యాదలు జరిపి, అతను వచ్చిన పని ఏమిటని అడిగాడు. "దేవా, నీవు కల్పవృక్షం లాటి వాడివనీ, ఎవరేది అడిగినా తప్పక ఇస్తావనీ విన్నాను. నేను నా తండ్రి దైన రాజ్యాన్ని ఏలుకుంటుండగా నా తమ్ముడు కనకకలశుడు పెద్ద బలంతో నా పైకి వచ్చి, నన్ను నా రాజ్యం నుంచి వెళ్లగొట్టి, నా రాజ్యాన్ని అపహరించి అనుభవిస్తున్నాడు. నీ వద్ద ఉండే అశ్వమూ, ఖడ్గమూ నాకిచ్చినట్టయితే వాటి సహాయంతో నా తమ్ముణ్ణి ఓడించి నా రాజ్యాన్ని నేను తిరిగి పొందగలను," అన్నాడు ఇందుకలశుడు. 

వినీతమతి సంకోచించకుండా వెంటనే ఇందుకలశుడికి తన గుర్రాన్నీ, ఖడ్గాన్నీ ఇచ్చేశాడు. ఇందుకలశుడు వాటి సహాయంతో కనకకలశుణ్ణి జయించి, తన రాజ్యాన్ని తాను తిరిగి గెలుచుకున్నాడు. అన్న చేతిలో ఓడిపోయిన కనకకలశుడు ఏడుస్తూ, అహిచ్ఛత్రపురానికి వచ్చి, వినీతమతి భవనానికెదురుగా చితి పేర్చుకుని, అందులో పడి కాలిపోవటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు వినీతమతి కనుకకలశుడి వద్దకు వెళ్ళి, "నాయనా, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటావు? నీకు కావలిసింది రాజ్యమే గద? నా రాజ్యం తీసుకో, నాకైనా సంతానం లేదు. నీవే నా కొడుకువనుకుంటాను," అని, ఆ కనుకకలశుడికి రాజ్యాభిషేకం చేసి, తన ఇద్దరు భార్యలనూ వెంటబెట్టుకుని వనవాసం వెళ్ళిపోయాడు. బేతాళుడీ కథ చెప్పి, "రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. వినీతమతి ప్రవర్తనకు అర్థమేమిటి? తాను రాజై ఉండి, రాజ్యరక్షణకు ఎంతో సహాయపడే కత్తినీ, గుర్రాన్నీ ముక్కూ ముఖమూ తెలియని ఇందుకలశుడుకి ఎందుకు ఇచ్చాడు? సాటి రాజును ఆదుకుందామని ఇచ్చాడే అనుకుందాం. అలా అయితే ఇందుకలశుడి చేతిలో ఓడిపోయిన కనకకలశుడి పైన సానుభూతి చూపి, తన రాజ్యమే అతనికివ్వటంలో అర్థమేమిటి? అన్నను జయించి రాజ్యం గెలుచుకున్న కనకకలశుడు అన్న చేతిలో ఓడిపోయినప్పుడు ఓటమి ఒప్పుకోక, వినీతమతి కెదురుగా వచ్చి చితి పేర్చుకుని చావబోవటంలో అతని ఉద్దేశమేమిటి? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు. 

దానికి విక్రమార్కుడు, "వినీతమతి ప్రవర్తనకు పూర్తిగా అర్థం ఉన్నది. అతనిలో రాజ్యకాంక్ష ఏనాడూ లేదు. ఏ ఉద్దేశంతో విజయవతి అతనికి ఖడ్గాశ్వాలనిచ్చిందో, ఆ ఉద్దేశం నెరవేర్చటానికి మాత్రమే వాటిని ఉపయోగించాడు. రాజుకు వేరే సంతానం లేదనీ, రాజకుమార్తెను తాను వాదంలో తేలికగా ఓడించగలననీ తెలిసి కూడా అతను తండ్రి ప్రేరేపించే దాకా రాజకుమార్తెతో వాదానికి పూనుకోలేదు. ఒకసారి రాజైనాక కూడా అతను తన ఖడ్గాశ్వాలతో ఇతర రాజ్యాలను జయించటానికి ఎలాటి యత్నమూ చేయలేదు. వీటన్నిటిని బట్టీ వినీతమతికి ఏ కోశానా రాజ్యకాంక్ష లేదని స్పష్టమవుతుంది. అటువంటి సందర్భంలో ఇందుకలశుడు ఖడ్గాశ్వాలనడిగితే ఇచ్చేశాడు. అన్నకు ఓడిపోయిన కనకకలశుడు తన ఓటమికి వినీతమతి కారకుడనుకోవడంలో తప్పేమీ లేదు. వినీతమతి తనను ఓడించి రాజ్యం కాజేస్తే కనకకలశుడు బాధపడేవాడు కాదు. దుర్బలుడైన తన అన్న మరొకరి సహాయంతో తనను గెలవటం కనకకలశుడు సహించలేకపోయాడు. తన కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్న కనకకలశుడి రాజ్యకాంక్ష తీర్చటానికి వినీతమతి తన రాజ్యాన్నే అతనికిచ్చాడు," అన్నాడు. రాజుకీ విధంగా మౌన భంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.

Comments