విక్రమ బేతాళ కథలు - రాజ్య కాంక్ష

Best Vikram Betal Stories in Telugu. Vikramarka explaining Betal about a king's   ambition for kingdom.

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా స్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీవు శ్రమపడితే పడ్డావుగానీ, శ్రమ ఫలితం చేతికందే సమయానికి దాన్ని జయమల్లుడి లాగ జారవిడిచేవు సుమా! శ్రమ తెలియకుండా ఉండడానికి నీకు జయమల్లుడి కథ చెబుతాను విను," అంటూ ఈ విధంగా చెప్పసాగాడు: ఒకప్పుడు పైఠన దేశంలోని రాజులందరూ సమావేశమై తమలో తాము యుద్ధాలు చేసుకోకూడదని, యుద్ధాల వల్ల అందరికీ నష్టమే కలుగుతున్నదనీ, రాజ్యాలన్నీ సఖ్యంగా ఉన్న పక్షంలో ప్రజల సుఖసౌఖ్యాలు పెంపొంది సుభిక్షం ఏర్పడుతుందనీ నిశ్చయించుకున్నారు. పైఠన దేశంలోని ఒక తరం రాజులీ ఒప్పందాన్ని చిత్తశుద్ధితో పాటించారు. 

అయితే అన్ని దేశాలూ ఇందువల్ల సత్ఫలితాలు పొందలేదు. వీరమల్లుడనే వాడి రాజ్యంలో దుర్మార్గులు విజృంభించారు, అరాచకం పెరిగింది. వీరమల్లుడు మరీ సాధువు కావటం చేతా, వయసు మీరినవాడు కావటం చేతా అరాచకం గురించి ఉదాసీనుడిగా ఉండిపోయాడు. కానీ కొత్తగా రాజ్యానికి వచ్చిన పొరుగు రాజు ఇంద్రదత్తుడనే వాడు తన సరిహద్దు మీద అరాచకం తాండవించడం సహించలేకపోయాడు. తన తండ్రి తరం వాళ్ళు చేసుకున్న ఒప్పందం అంత మంచిది కాదనీ, రాజైనవాడు బలప్రయోగం ద్వారా పాలించకపోతే కోరలు తీసిన పాముకన్నా అసమర్థుడైపోతాడనీ అతని విశ్వాసం. అందుచేత ఇంద్రదత్తుడు వీరమల్లుడి పైన యుద్ధం ప్రకటించి, సైన్యాలతో సహా దండెత్తి వచ్చాడు. ఇంద్రదత్తుడి ఈ ప్రయత్నాన్ని నిలిపించమని వీరమల్లుడు మిగిలిన రాజులకు కబురు చేసాడు.   

వారు ఒకరి రాజకీయ విషయాలలో మరొకరు జోక్యం చేసుకోవడం తమ తండ్రులు చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమని చెప్పి తప్పించుకున్నారు. వీరమల్లుడికి యుద్ధం చేయాలన్న కోరిక గానీ, యుద్ధం చేసే శక్తి గానీ లేదు. అందుచేత ఆతను తన భార్యనూ, చిన్న కొడుకునూ వెంట బెట్టుకుని వింధ్యారణ్యాలలోకి పారిపోయాడు. ఒక్క చుక్క రక్తం చిందకుండా వీరమల్లుడి రాజ్యం ఇంద్రదత్తుడి వశమైంది. అతను కఠినమైన శాసనాలు ప్రయోగించి, దేశంలోని దుష్టశక్తులన్నిటినీ నిర్మూలించి, ప్రజల జీవితాన్ని చక్కబెట్టాడు, ప్రజాక్షేమం చక్కగా సాధించాడు. వింధ్యాటవులలో నివాసం ఏర్పరుచుకున్న వీరమల్లుడు కొంతకాలానికి చనిపోతూ, తన కొడుకైన జయమల్లుణ్ణి పిలిచి, అతనితో తనకు రాజ్యానష్టం ఎలా జరిగినదీ చెప్పి, "నాయనా, నేను ఒక ఒప్పందానికి కట్టుబడి నా శత్రువైన ఇంద్రదత్తుడితో యుద్ధం చెయ్యక, రాజ్యం విడిచి పారిపోయి వచ్చేశాను. కానీ నీకు రాజ్యకాంక్ష ఉన్న పక్షంలో ఇంద్రదత్తుణ్ణి ఓడించి నీ రాజ్యం నువ్వు తీసుకో. మా తరం వాళ్ళం చేసుకున్న ఒప్పందం నీకు వర్తించదు. నువ్విప్పుడు రాజువైనా కావు," అన్నాడు.

తండ్రి కన్ను మూశాక జయమల్లుడు తన తండ్రి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించడానికే నిశ్చయించుకున్నాడు. అతనిలో రాజ్యకాంక్ష ఉన్నది, పైగా ఆటవికుల మధ్య తిరిగి, భయంకరమైన మృగాలను సయితం ఒంటరిగా వేటాడడంలో లాఘవం సంపాదించాడు; అసాధారణమైన జవసత్వాలూ, ధైర్యసాహసాలూ అలవరచుకున్నాడు. అయితే తన రాజ్యం తనకు తిరిగి రావాలంటే అందుకుగానూ దీర్ఘ ప్రయత్నం అవసరమవుతుందని జయమల్లుడికి తెలుసు. తనకు జవసత్వాలూ, ధైర్యసాహసాలూ, గురీ, పరిగెత్తే శక్తీ మొదలైనవి ఉన్నాయి గాని యోధుడికవసరమైన అస్త్ర విద్య రాదు. వేటలోనూ, కొట్లాటలోనూ జయమల్లుణ్ణి మించగలవాడుండడు. కాని యుద్ధం దారి వేరు. అందుకు అస్త్ర విద్యా నైపుణ్యం కావాలి. రాజ్యం కొరకు పోరాడే వాడికి సేన కూడా కావాలి. ఇదంతా సమకూర్చుకోవటానికి చాలా కాలం శ్రమపడాలి.

అందుచేత జయమల్లుడు తన తల్లితో సహా పైఠనదేశానికి తిరిగి వచ్చి ఒక చిన్న రాజ్యంలో ప్రవేశించి అక్కడ అస్త్ర విద్య అభ్యసించాడు. తరువాత అతను మరొక రాజ్యానికి వెళ్లి అక్కడి రాజు వద్ద ఒక సైనికుడిగా చేరి త్వరలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. కొంత కాలానికి అతని తల్లి కూడా చనిపోయింది. అప్పుడతను తనకు రాజ్యప్రాప్తి కలిగే మార్గాలను గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఇంద్రదత్తుణ్ణి యుద్ధంలో ఎదిరించి ఓడించి, తన తండ్రి రాజ్యాన్ని తాను తిరిగి పొందటం అసంభవం. అందుకవసరమైన సేనా, డబ్బూ తాను సంపాదించలేడు. ఇక మిగిలినది ఒకటే మార్గం, యుక్తి మార్గం. శక్తి వల్ల సాధించలేనిది యుక్తి వల్ల సాధ్యమవుతుంది. కనుక జయమల్లుడు పేరు మార్చుకుని ఇంద్రదత్తుడి కొలువులో చేరి, అవకాశం కోసం వేచి ఉండి ఇంద్రదత్తుణ్ణి తెగటార్చి, తాను ఫలానా అని ప్రకటించుకుంటే తనను సేనలూ, ప్రజలూ తమ న్యాయమైన రాజుగా ఆమోదిస్తారనుకున్నాడు. తాను కష్టపడి సేనను పోగుచేసే అవసరం తప్పిపోతుంది. యుద్ధం అవసరం ఉండదు గనక, తమ తండ్రుల కాలం నాటి ఒప్పందానికి భంగమూ రాదు.

ఈ విధంగా ఆలోచించుకుని జయమల్లుడు తన తండ్రి రాజ్యంలో ప్రవేశించి ఇంద్రదత్తుడి సేవలో చేరాడు. జయమల్లుడు స్ఫురద్రూపి. అతను తనకు గల సమస్త శక్తులనూ ప్రదర్శించి చూపాడు. ఇంద్రదత్తుడా కుర్రవాణ్ణి చూసి చాలా ముచ్చటపడ్డాడు; అతన్ని తన అంగరక్షకుల్లో ఒకణ్ణిగా పెట్టుకున్నాడు. జయమల్లుడు దేశంలోని పరిస్థితిని శ్రద్ధగా పరిశీలించాడు. ఇంద్రదత్తుడు పరిపాలనలో కఠినుడే అయినా, స్వభావం చేత క్రూరుడుకాడు. అయన కొలువులో ఆయన కోసం ప్రాణాలర్పించటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళెందరో ఉన్నారు. అయన పేరు చెబితే దుర్మార్గులకు సింహస్వప్నం. ప్రజలకు ఎలాంటి ఈతి భయాలూ లేవు. తన తండ్రి పరిపాలిస్తూ ఉండిన కాలంలో ప్రజలు అనేక రకాల భయాలకు లోనైనట్టు విని జయమల్లుడు చాలా బాధపడ్డాడు. ఇంద్రదత్తుడు తరచు వేటకు వెళ్లే వాడు. వేటలో జయమల్లుడు అసాధారణ శక్తులు ఇంద్రదత్తుడికి మరింత కొట్టవచ్చినట్టు కనబడ్డాయి. ఘాతుక మృగాలను కూడా జయమల్లుడు మూరెడు కర్ర తప్ప మరో ఆయుధం లేకుండా ఎదుర్కోవడం ఇంద్రదత్తుడు కళ్లారా చూసి విభ్రాంతుడయ్యాడు. భయమూ, దిగ్భ్రమా జయమల్లుడిలో మచ్చుకైనా లేవు. అది చూసిన తరువాత ఇంద్రదత్తుడు జయమల్లుడు వెంట లేకుండా బయలుదేరి ఎరుగడు. ఒకసారి ఇంద్రదత్తుడు వేటకు బయలుదేరాడు. వేట తమకంలో రాజు తన పరివారాన్ని వెనక పడనిచ్చి చాలా దూరం వెళ్ళిపోయాడు. చివరికాయన వెనక్కు తిరిగి చూసేసరికి జయమల్లుడొక్కడే తనను వెన్నంటి వస్తూ ఉండటం రాజుకు కనిపించింది.

ఇంద్రదత్తుడు ఒక చెట్టు నీడన గుర్రాన్ని దిగి అక్కడ కాస్సేపు విశ్రమించి బడలిక తీర్చుకుందామనుకున్నాడు. కానీ తల కింద ఎత్తులేదు. ఆయన ఉద్దేశం గ్రహించి జయమల్లుడు తన తొడపైన రాజును తల పెట్టుకుని పడుకోనిచ్చాడు. పడుకున్న మరుక్షణమే రాజుకు మంచి నిద్ర పట్టింది. తన శత్రువును హతమార్చటానికి జయమల్లుడికి మంచి అవకాశం దొరికింది. తన మొలనున్న బాకు తీసి రాజు గుండెల్లో పొడిచెయ్యటానికి ఒక్క క్షణం పట్టదు. అలా చేద్దామన్న కోరిక కూడా అతనిలో చాలా తీవ్రంగానే కలిగింది. అయినా జయమల్లుడు దాన్ని అణిచిపెట్టాడు. అంతలోనే ఇంద్రదత్తుడు, "పట్టుకోండి! పట్టుకోండి!" అంటూ కంగారుగా నిద్ర నుంచి లేచి కూర్చున్నాడు. ఆయన జయమల్లుణ్ణి చూసి కొంత శాంతించి, "నీవేనా? నాకొక పీడ కల వచ్చింది. నేను ఇలాగే వీరమల్లుడి కొడుకు తొడపైన తల పెట్టుకుని పడుకున్నానట. వాడు నన్ను చూసి గుడ్లురుముతూ, నా తండ్రి రాజ్యం కాజేస్తావా అంటూ తన బాకు ఎత్తి నన్ను గుండెల్లో పొడవబోయాడుట. నేను అదిరిపడి వెర్రిగా కేకలు పెట్టాను. ఇంతలో మెలకువ వచ్చింది," అన్నాడు. 

రాజు పెట్టిన కేకలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్న పరివారానికి వినిపించాయి. వాళ్ళు కేకలు వినిపించిన దిక్కుగా పరిగెత్తుకుంటూ రాసాగారు. "మహారాజా, మీకు వచ్చిన కల బొత్తిగా అబద్ధం కాదు. నేను వీరమల్లుడి కొడుకునే. మిమ్మల్ని చంపాలన్న కోరిక నాలో తల ఎత్తిన మాట కూడా నిజమే. దాన్ని అతి కష్టంమీద అణిచిపెట్టుకున్నాను," అన్నాడు జయమల్లుడు. ఇంద్రదత్తుడీ మాటలు విని నిర్ఘాంతపోయి, "ఎందుకు నన్ను చంపావు కావు?" అని అడిగాడు. జయమల్లుడా ప్రశ్నకు సమాధానం చెప్పక, "ఇలాంటి పరిస్థితి మరొకసారైనా కలగవచ్చు. అందుచేత నన్ను అంగరక్షకుడుగా పెట్టుకోవటం మీకు క్షేమం కాదు. నాకు సెలవిప్పించండి," అన్నాడు. దానికి ఇంద్రదత్తుడేమీ సమాధానం చెప్పక, తన పరివారం సమీపానికి రాగానే "ఇతన్ని బంధించండి!" అన్నాడు. ఒక్క బాకు మాత్రమే ఉండి కూడా జయమల్లుడు తనను చుట్టు ముట్టిన భటులతో హోరాహోరీ పోరాడి, అందరినీ గాయపరిచి, తాను కూడా గాయపడి, చివరికు వారికి చిక్కిపోయాడు. ఇంద్రదత్తుడతణ్ణి రాజధానికి పట్టుకుపోయి, అతని గాయాలకు చికిత్స చేయించి, కొద్ది రోజుల అనంతరం అతన్ని వీరమల్లుడి పూర్వపు రాజ్యానికి రాజుగా, తానే స్వయంగా అభిషేకించి తన పూర్వ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. 

భేతాళుడీ కథ చెప్పి, "రాజా, నాకు రెండు సందేహాలు. జయమల్లుడు ఇంద్రదత్తుణ్ణి చంపకపోవటానికి కారణమేమిటి? భయమా? రాజభక్తా? లేక తమ తండ్రుల నాటి ఒప్పందం మీద గౌరవమా? ఇంద్రదత్తుడు వీరమల్లుడి రాజ్యాన్ని జయమల్లుడికెందుకు తిరిగి ఇచ్చాడు? అతని వల్ల తనకు ప్రమాదం ఉన్నదని భయమా? లేక తనను చంపకుండా వదిలిపెట్టినందుకు అతడిపైన కృతజ్ఞతా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "ఇంద్రదత్తుడు ప్రజారంజకుడూ, ప్రజల హితం గోరి రాజ్యం చేసేవాడూ కానట్టయితే జయమల్లుడతన్ని నిశ్చయంగా చంపి ఉండేవాడు. తన తండ్రి ప్రజారంజకంగా పరిపాలించలేదు. అటువంటి పరిస్థితిలో తాను ఇంద్రదత్తుణ్ణి చంపటం వల్ల ప్రజలు తనను చూసి హర్షించరు, తన పక్షం కారు. అందుకే అతను రాజును చంపలేదు. జయమల్లు లాంటి శౌర్యపరాక్రమాలూ, ఆత్మ నిగ్రహమూ కలవాడు పరిపాలనలో సమర్థుడవుతాడు. అతని పరిపాలనలో అరాజకం తల ఎత్తదు. ఆ ధైర్యంతోనే ఇంద్రదత్తుడతనికి తండ్రి రాజ్యం ఇచ్చేసాడు," అన్నాడు. రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.

Comments