దెయ్యాల సహాయం
పంచవటిలో నివసించే మాణిక్యానికి అస్వస్థురాలైన తల్లి తప్ప నా అన్న వారెవ్వరూ లేరు. వారి కుటుంబానికి పూట గడవడం కష్టంగా ఉన్నా మాణిక్యం ధైర్యాన్ని కోల్పోలేదు. మాణిక్యం సన్నగా ఉంటుంది కానీ జబ్బపుష్టికల మనిషి. అందుకని ఆమె గొడ్డలి తీసుకుని దగ్గర్లో ఉన్న అడవికి వెళ్ళి తన శక్తి మేరకు కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో సంసారాన్ని నెట్టుకుని వస్తోంది. ఆమె వెళ్ళే అడవిలో ఒక రావి చెట్టుంది. దాని మీద రెండు దెయ్యాలుంటున్నాయి. బ్రతికినంతకాలమూ చెడ్డ పనులే చేయడం వల్ల చనిపోయాక దెయ్యం రూపాలు తెచ్చుకున్న మనుషులే అవి. దెయ్యాలుగా మారేక వాటికి అద్భుత శక్తులు చాలా వచ్చాయి కానీ దెయ్యపు రూపం వల్ల అవి సుఖపడలేకపోతున్నాయి. దెయ్యపు రూపం నుంచి విముక్తి పొందేదెలాగా అని అవి తర్జన భర్జన పడి చివరికవి ఒకసారి తమ చెట్టు క్రింద కూర్చున్న బైరాగినడిగాయి. పుణ్యాత్ములకు సాయం చెయ్యమని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడాయన. అప్పట్నించీ ఆ రెండు దెయ్యాలూ జన్మవిముక్తి కోసం ఎదురుచూస్తున్నాయి. ఒక రోజున మాణిక్యం వాటికంట పడింది. మాణిక్యం చాలా మంచిదనీ, పుణ్యాత్మురాలనీ తేల్చుకుని ఆమెకు సాయపడాలనుకున్నాయి. ఒక రోజున మాణిక్యం వచ్చేసరికి దెయ్యాలు రెండూ పెద్ద పెద్ద కట్టెల మోపులు రెండు సిద్ధం చేసి ఉంచాయి. మాణిక్యం వచ్చి కట్టెల మోపులు చూసి, తనకంటే ముందే ఎవరో కట్టెలు కొట్టుకున్నారని అనుకుంది. "చాలా పెద్ద మోపులే కట్టారు. అంటే వాళ్ళెవ్వరో నాకంటే బలవంతులు, శక్తివంతులు. నేనిక వారితో పోటీపడలేను. ఇక మీదట కట్టెలు కొట్టటం మాని కొత్త పని చూసుకోవాలి" అనుకుంటూ ఆమె అడివికి రావడమే మానుకుంది.
జరిగిందానికి చాలా విచారించిన దెయ్యాలు మరో విధంగా మాణిక్యానికి సాయపడాలనుకుని ఆమెను వెదుక్కుంటూ వెళ్ళాయి. అప్పుడు మాణిక్యం పంచవటి పొలిమేరల్లో ఉన్న పూల దుకాణంలో పూలమాలలు కట్టే పని చేస్తోంది. అక్కడికి చేరిన దెయ్యాలు మాణిక్యం పక్కనున్న బుట్టను జాజులు, మల్లెలు, కనకాంబరాలు మొదలైన పూలతో నింపేసాయి. ఎన్ని మాలలు కట్టినా బుట్టలోని పూలు తరగడం లేదు. ఇంతలో అటుగా వచ్చిన దుకాణం యజమాని మాణిక్యం కట్టిన మాలలు, బుట్ట నిండుగా ఉన్న పూలు చూసి గుండె బాదుకుని, "నీ వాలకం చూస్తుంటే మనిషిలా లేవు. మాయలు, మంత్రాలు నేర్చిన పిల్ల పిశాచిలా ఉన్నావు" అని ఆమెను వెళ్ళిపొమ్మన్నాడు. మాణిక్యం నీరసపడిపోలేదు. ఆమెకు బొమ్మలు చేయడం వచ్చు. అందుకని కాలవ ఒడ్డుకు వెళ్ళింది. అక్కడ ఒండ్రుమట్టిని సేకరించి ఒకచోట ముద్దగా పోసి బొమ్మలు తయారు చెయ్యడం మొదలుపెట్టింది. ఆమెకు సాయపడడంలో ముచ్చటగా మూడో ప్రయత్నం చేద్దామనుకున్నాయి దెయ్యాలు. అవి జమీందారు ఇంటినుంచి విలువైన రత్నాలహారాన్ని సంగ్రహించి మాణిక్యం ముందున్న ఒండ్రుమట్టిలో పడేశాయి. పనిలో ఉంటే మాణిక్యానికి సమయం తెలియదు. పరిసరాలు తెలియవు. ఆమె రత్నాల హారాన్ని గమనించనే లేదు. ఆ హారం ఆమె తయారుచేసిన ఏనుగు బొమ్మ పొట్టలో ఇరుక్కుని ఉండిపోయింది.
తయారు చేసిన బొమ్మలను ఎండబెట్టి రంగులు వేశాక అవి ఎంతో బాగున్నాయి. జమీందారు ఒక్కడే మొత్తం బొమ్మలన్నింటినీ కొనేశాడు. జమీందారు పిల్లలకు ఏనుగు బొమ్మ బాగా నచ్చింది. వాళ్ళు దానితో ఆడుకుంటూంటే చేయి జారి క్రిందపడి పగిలిపోయిందా బొమ్మ. అప్పుడా బొమ్మలోంచీ రత్నాలహారం బయటపడింది. జమీందారా హారాన్ని చూసి అది తన దివాణంలోనిదేనని గ్రహించాడు. వెంటనే మాణిక్యాన్ని పిలిచి సంజాయిషీ అడిగాడు. మాణిక్యం కళ్ళనీళ్ళ పర్యంతమైంది. ఆమె జమీందారు కాళ్ళమీద పడి తనకేమీ తెలియదని మొరపెట్టుకుంది. కాసేపటికి జమీందారు శాంతించి నిజానిజాలు విచారించారు. మాణిక్యానికి దివాణం దరిదాపుల్లో అడుగుపెట్టే అవకాశం లేదు కాబట్టి ఆ హారాన్ని ఏ కాకో, కోతో ఎత్తుకెళ్ళి మట్టిలో పడేసి ఉండొచ్చునని సరిపెట్టుకున్నాడాయన. అనవసరంగా మాణిక్యాన్ని అనుమానించినందుకు జాలిపడి ఆమె పరిస్థితులు తెలుసుకుని దివాణంలో పనిచేస్తున్న ఓ మంచి యువకుడితో ఆమెకు పెళ్ళి జరిపించాడు. దాంతో మాణిక్యం కష్టాలు తీరిపోయాయి. భర్త మాణిక్యం తల్లినీ ఆదరించాడు. ఇక మాణిక్యానికి తమ అవసరం తీరిపోయిందని తెలిసి దెయ్యాలు రెండూ ఎంతో బాధపడుతూంటే చెట్టు క్రిందకు మళ్ళీ బైరాగి వచ్చాడు. తాము చేయబోయిన ఉపకారాలన్నీ మాణిక్యానికి ఆపదలే తెచ్చిపెట్టడానికి కారణమేమిటని అవి బైరాగినడిగితే, "మీరు స్వార్థబుద్ధితో ఆమెకు సాయపడ్డారు. అందుకే మీ సాయం ఫలించలేదు. నిస్వార్థ బుద్ధితో సాయపడండి. మీ సాయం తప్పక ఫలిస్తుంది" అన్నాడు బైరాగి. దెయ్యాలకు రహస్యం తెలిసింది కానీ ఎంత కాలమైనా ఇంకా వాటికి మోక్షం కలగలేదు.
కందకు లేని దురద
సీతావురంలోని శివయ్యకు భీమయ్య ఒక్కగానొక్క కొడుకు. భీమయ్యకు ఆరుగురు పిల్లలు. శివయ్య భార్య వూర్ణమ్మకు మనుమలు, మనుమరాళ్ళు అంటే పంచ ప్రాణాలు. వాళ్ళనావిడ అపురూపంగా చూసుకునేది. భీమయ్య భార్య ఈశ్వరి ఎంతో మంచిది. అత్తమామలంటే ఆమెకు ఆత్మీయతానురాగాలే కాక భక్తి శ్రద్ధలు కూడా ఉన్నాయి. అందువల్ల శివయ్య ఇల్లు ప్రశాంతతకి మారుపేరులా ఉండేది. ఒకసారి వూర్ణమ్మకు జబ్బు చేసింది. అత్తగారిని మంచం దిగనివ్వకుండా ఎంతో శ్రద్ధగా సపర్యలు చేసింది ఈశ్వరి. ఈ కారణంగా పిల్లల అల్లరి పెరిగింది. తల్లి, బామ్మ కూడా తమను చేరదియ్యడం లేదని వారికి కోపం. ఈశ్వరి వాళ్ళని అదుపు చేయాలని ప్రయత్నించింది. వాళ్ళు లొంగలేదు సరికదా అల్లరి ఎక్కువ చేశారు. ఇక ఓర్చుకోలేక ఈశ్వరి అందరికీ తలో రెండు తగిలించింది. తల్లి కొట్టిందని పిల్ల లేడుస్తుంటే పూర్ణమ్మ సహించలేకపోయింది. ఆవిడ చటుక్కున మంచం దిగి పిల్లలందర్నీ దగ్గరగా ఓదార్చి కోడల్ని కాస్త గట్టిగానే కోప్పడింది. "అసలు మీరిలా గారాబం చెయ్యడం వల్లనే వీళ్ళు నా మాట వినడం లేదు, దయచేసి పిల్లల విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. నా పిల్లల్నెలా పెంచుకోవాలో నాకు తెలును. వాళ్ళను కొట్టుకున్నా, తిట్టుకున్నా అది నా యిష్టం" అంటూ అత్తగారి మీద విసుక్కుని పిల్లల్ని లాక్కుని వెళ్ళింది ఈశ్వరి. పూర్ణమ్మకు మనస్సు చివుక్కుమంది. మంచిదనుకున్న కోడలు మొదటిసారిగా అలా మాట్లాడడాన్నావిడ జీర్ణించుకోలేక భర్త వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి, "నేనేం తప్పు చేయలేదు కదా, కోడలు నన్నెందుకు విసుక్కుంది?" అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.
శివయ్య నవ్వి, "ఇది చాలా చిన్న విషయం. పిల్లలు అల్లరి చేసినప్పుడు దండించడం మంచిది. కోడలు మంచిపనే చేసింది. అప్పుడు నువ్వు పిల్లల్ని సమర్థిస్తే పిల్లలేమనుకుంటారు? వాళ్ళ అమ్మదే తప్పనుకుంటారు. వాళ్ళమ్మ మంచిది కాదనుకుంటారు. అయినా కోడలు చెప్పిన ఇంకో మాట కూడా నిజం. వాళ్ళు ఆమె పిల్లలు, తల్లికంటే ఎక్కువగా నువ్వు వాళ్ళని ప్రేమించలేవు కదా! కందకులేని దురద కత్తి పీటకెందుకూ అన్న సామెత ఉండనే ఉంది. తన పిల్లల్ని కొట్టుకుందుకామెకు బాధ లేకపోతే మధ్య నీకెందుకు?" అన్నాడు. "పోనీ తప్పు నాదే అనుకోండి. కోడలు నన్ను కూడా విసుక్కోవాలా? పెద్ద దాన్ని కదా. నామీద కాస్త గౌరవముంచి నెమ్మదిగా చెప్పొచ్చు కదా!" అని వాపోయింది వూర్ణమ్మ. "అది నిజమే! కానీ ఇంటి విషయం చూడు. నీకు అనారోగ్యం చేయడంతో ఇంటెడు చాకిరీ కోడలి మీద పడిపోయింది. నన్ను చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి. నీకు అదనంగా సేవలు చేయాలి. ఆ పైన ఇంటెడు చాకిరీ. అందువల్ల కోడలికి విసుగొచ్చి ఉండాలి కానీ ఆమెకు, నువ్వంటే గౌరవం లేదా? కాసేపయ్యాక చూడు. తనే వచ్చి నిన్ను క్షమించమంటుంది" అన్నాడు శివయ్య. "అనేవన్నీ అనేశాక క్షమించమంటే క్షమిస్తారేమిటీ? నేను క్షమించను" అంది పూర్ణమ్మ. అంతలో ఈశ్వరి అలావచ్చి, "ఈ రోజు నాకేమైందో తెలియదత్తయ్యా! నోటికొచ్చినట్లు మాట్లాడేను. మీరు క్షమించాననే దాకా పచ్చి మంచినీళ్ళు ముట్టను" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అప్పుడు పూర్ణమ్మ అన్నీ మరచిపోయి కోడల్ని దగ్గరగా తీసుకుని, "ఇందులో నిన్ను క్షమించడానికేముందీ! తప్పు నాదే. నువ్వు పిల్లల్ని దండిస్తున్నప్పుడు నేను కలగజేసుకోకూడదు కదా మరి" అంటూ ఆప్యాయంగా కళ్ళ నీళ్ళు తుడిచింది.
అన్యాయ ఫలం
భూస్వామి భూషయ్యకు కర్కోటకుడని పేరు. తన పొలంలో కష్టపడి పనిచేసే రైతులకాయన సరైన ప్రతిఫలాన్నివ్వడు. అదేమని అడిగితే పనిలోంచి తొలగించి కొత్తవారిని చేర్చుకుంటాడు. పూట గడవనివాళ్ళు విధిలేక ఆయనవద్ద పని చేస్తుంటారు. అంతే కాదు, భూషయ్య పనిలోంచి తప్పించిన వారిని వేరెవ్వరూ పనిలో పెట్టుకుందుకు వీల్లేదు. అయన తుంటరి అని తెలుసు కాబట్టి ఊళ్ళో వాళ్ళెవరికీ ఆయన్నెదిరించే ధైర్యం లేదు. కొన్నాళ్ళకు భూషయ్యకేదో జబ్బు చేసింది. వైద్యుడు వచ్చి అన్ని పరీక్షలూ చేసి, "అయ్యా! మీరు బాగా లావు చేశారు. కొంతకాలం పాటు బాగా శరీర శ్రమ చేయాలి. ఒళ్ళు తగ్గేదాకా జొన్న రొట్టెలు తప్ప ఇంకేమీ తినరాదు. నా మాట పాటించకపోతే ఎంతో కాలం బ్రతకరు. పాటిస్తే మరిన్ని సంవత్సరాలు బ్రతుకుతారు." అని చెప్పి కొన్ని మందులిచ్చి వెళ్ళాడు. ఆ రోజు నుంచీ భూషయ్య వళ్ళంతా చెమటలు పట్టేదాకా పెరట్లో పరుగులు పెట్టేవాడు. జొన్న రొట్టెలు మాత్రమే తినేవాడు. అయితే ఊరికే పరుగులు పెట్టడం ఆయనకు విసుగ్గానూ, అలసటగానూ ఉండేది. జొన్న రొట్టెలు ఏ మాత్రమూ సహించేవి కాదు. భార్య సుమతి దగ్గర అయన ఈ విషయమై గోల పెట్టాడు. "మీరు చెప్పింది నిజమే! ఇలా పెరట్లో పరుగులు పెట్టడం వల్ల మీకు అలసట వస్తుంది. మనకు బోలెడు పొలాలున్నాయి. అక్కడ పని చేయండి. మీకు వళ్ళూ తగ్గుతుంది. విసుగూ ఉండదు." అంది సుమతి. "ఇంత బ్రతుకూ బ్రతికి పనివాళ్ళతో కలిసి పని చేయడమా? నాకెంత అవమానం!" అన్నాడు భూషయ్య ఉక్రోషంగా. "మీ పొలం పనులు ఇతరులు చేయగా లేనిది మీరు చేస్తే అవమానమెందుకవుతుందీ?" అంది సుమతి.
భూషయ్య పొలానికి వెళ్ళి పనులు చేయబోయాడు. ఆ పనులు చాలా కష్టమని గ్రహించేక పొలం వెళ్ళడం మాని, "నేనిక అలాంటి పనులు చేయబోను. నాకు కష్టమనిపించే పనికి పని వాళ్ళందరూ ఎక్కువ డబ్బడుగుతారు. నా ఆరోగ్యం పాడైతే కానీ పనివాళ్ళ జీతాలు మాత్రం పెంచాను" అని భార్యకు చెప్పాడు. "న్యాయంగా ఎవరికివ్వాల్సినది వాళ్ళకివ్వాలి. లేకుంటే మన డబ్బు అన్యాయ ఫలమవుతుంది. మీరెంత సంపాదించి ఏం లాభం, కోరుకున్నవన్నీ తినలేకపోయాక?" అంది సుమతి భర్తకి నచ్చజెపుతూ. "మనుషుల్ని శిక్షించడానికి రక్షించడానికి భగవంతుడనే వాడున్నాడుగా. ఆయనే పనివాళ్ళ విషయం చూసుకుంటాడు. నేను కూడా నా ఆరోగ్యానికి ఆయన్నే ప్రార్థించుకుంటాను. నా పద్ధతులు మాత్రం మార్చుకోను" అన్నాడు భూషయ్య. అప్పుడు సుమతికి ఉక్రోషం వచ్చి, "ఇతరుల కన్యాయం చేస్తూ పెంచిన వళ్ళు పిశాచాలు పీక్కు తినడానికి తప్ప ఇంకెందుకూ పనికిరాదని మా నాన్న అనేవాడు. మీరు మీ పద్ధతులు మార్చుకోండి" అంది. భూషయ్య ఏదో అనేలోగా దబ్బున వారి ముందు రెండు పిశాచాలు దూకి, "చాలాకాలంగా మేమీ ఇంటి నాశ్రయించుకుని ఉన్నాం. పిశాచాల్లో గౌరవంగా బ్రతుకుతున్నాం. ఏ ఇంట్లో మనిషి పోయినా, ఆ శవాన్ని చితి మీద ఉంచేక ఎవరికీ తెలియకుండా పీక్కు తినడం పిశాచాల రివాజు. కానీ భూషయ్య వళ్ళు అన్యాయ ఫలం. అది మేము పీక్కు తింటామని ఎవరనుకున్నా మాకు అవమానం. అందుకే ఈ క్షణమే ఈ ఇల్లు విడిచిపెడుతున్నాం" అని మాయమయ్యాయి. శ్రమ జీవుల్ని దోపిడీ చేసేవాడి శరీరాన్ని పిశాచాలు కూడా ఏవగించుకుంటాయని భూషయ్యకప్పుడర్థమైంది.
చెడ్డవాడి గొప్పతనం
ఒకానొకప్పుడు వసుదేవపురంలో గోపాలయ్య అనే మధ్యతరగతి పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు లేక లేక పుట్టిన కొడుకు గోవిందయ్య. చిన్నతనం నుంచీ వాడిది దుడుకుతనం. ఎంత చెప్పినా వినకుండా చెడ్డపనులు చేసేవాడు. వయసు పెరిగిన కొద్దీ మారకపోతాడా అని గోపాలయ్య ఆశపడ్డాడు కానీ ఇరవై ఏళ్ళొచ్చినా వాడి చెడ్డ బుద్ధులు పోలేదు. కొడుకునెలా మార్చాలా అని గోపాలయ్య సతమతమవుతున్న సమయంలో ఒక రోజున వాళ్ళింటికి అయన గురువు ఆనందుడు వచ్చాడు. గోపాలయ్య గురువుకు నమస్కరించి తన కొడుకు గురించి చెప్పుకుని బాధపడ్డాడు. "నీ కొడుకునోసారి పిలు" అన్నాడు ఆనందుడు. గోపాలయ్య పిలవగా గోవిందుడక్కడకు వచ్చాడు. ఆనందుడు వాడివంక కొద్ది క్షణాలు తీక్షణంగా చూసి, "గోపాలయ్యా! నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. నీ కొడుకు చెడ్డపనులు చేస్తూంటే దిగులెందుకు? మంచి కంటే చెడు చేయడమే కష్టం. కష్టమైనది చేసేవాడు జీవితంలో ఎప్పటికైనా బాగుపడతాడు" అన్నాడు. దీనికి గోవిందయ్య సంతోషించి తండ్రి వంక నిరసనగా చూసి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
" మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. మీరే ఇలాగంటే ఇంక వాడు బాగుపడే అవకాశం లేనేలేదు" అని వాపోయాడు గోపాలయ్య. ఆనందుడు కోపంగా గోపాలుడి వంక చూసి "అయితే నువ్వు నా మాటల్నే శంకిస్తున్నావన్న మాట!" అన్నాడు. "లేకపోతే తమబోటి పెద్దలనాల్సిన మాటలేనా ఇవి? మంచి అనిపించుకోవడం కష్టం కానీ చెడు అనిపించుకునేందుకు క్షణం కూడా పట్టదని మీకు తెలియదా?" అన్నాడు గోపాలయ్య. "మాట్లాడుకునేందుకైతే నీ అభిప్రాయం నీది. నా అభిప్రాయం నాది. ఋజువు చేయాలనుకుంటే నువ్వీ విషయంలో నాకూ, నీ కొడుక్కూ కూడా నిదర్శనాలు చూపించాలి" అన్నాడు ఆనందుడు. గోపాలయ్య వెంటనే వెళ్ళి కొడుకుని పిలిచాడు. విషయం చెప్పాడు. ఆనందుడు తనతో ఏకీభవిస్తున్నాడని తెలియగానే గోవిందయ్యకు ఉత్సాహం వచ్చింది. ఈ దెబ్బతో తండ్రి చేత మాటలు పడే బాధ శాశ్వతంగా వదిలిపోతుందన్న ఆశతో వాడు తండ్రిననుసరించడానికి అంగీకరించాడు. ముగ్గురూ కలిసి మోతుబరి రామయ్య ఇంటికి వెళ్ళారు. రామయ్య తన అనుభవాన్ని వాళ్ళకి చెప్పాడు. రామయ్య మెత్తగా ఉంటూ వీలైనంతలో అందరికీ సాయపడుతుండేవాడు. అలా పది సంవత్సరాలు గడిచేసరికి ఆయనకు కాస్త మంచిపేరు వచ్చింది. కానీ ఒక రోజున ఆయనకు చాకలి మీద కోపం వచ్చింది.
వాడు వేసిన బట్టలనీ తేలేదు. అదేమని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. కాసేపు నిగ్రహించుకున్నా వాడి ప్రవర్తన ఎంతకీ మారకపోవడంతో అయన చెయ్యెత్తి వాణ్ణి కొట్టబోయాడు. అంతే ఆయనకు చెడ్డ పేరు వచ్చేసింది. ఊళ్ళోని శ్రమజీవులందరూ ఆయన్ను దుర్మార్గుడనడం మొదలుపెట్టారు. "నేను కోపగించుకోకుండా నెమ్మదిగా మాట్లాడి ఉంటే చాకలి బుద్ధిగా ఉండేవాడేమో! నేనేమో మోతుబరిని, వాడు బట్టలుతికేవాడన్న భావం నాలో ఉండిపోయింది. అందుకే ఆ రోజలా ప్రవర్తించాను. ఆ చెడ్డ పేరుని పోగొట్టుకునేందుకు మరిన్ని సంవత్సరాలు శ్రమించవలసి వచ్చింది. అందుకే మంచివాడనిపించుకుందుకు సంవత్సరాలు పట్టవచ్చు. కానీ చెడ్డ వాడనిపించుకునేందుకు క్షణం కూడా పట్టదు" అన్నాడు రామయ్య. తర్వాత గోపాలయ్య అలాంటివాళ్ళు మరో ముగ్గురి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అందరూ రామయ్య చెప్పిన లాంటి కథలే చెప్పారు. "ఇప్పుడేమంటారు?" అన్నాడు గోపాలయ్య. "ఇంకా నీ మాటలు ఋజువు కాలేదు. నువ్వు మంచిపనులు చేస్తూ, మంచివాళ్ళమనిపించుకునేందుకు తాపత్రయ పడుతున్న వాళ్ళ దగ్గరకు మమ్మల్ని తీసుకుని వెళ్ళావు. నేను మరో తరహా మనుషుల్ని కూడా చూడాలనుకుంటున్నాను. ఈ ఊళ్ళో జులాయి వెధవగా పేరు బడ్డ ఒక మనిషి పేరు చెప్పు" అన్నాడు ఆనందుడు.
"ఎవడో ఎందుకూ, మావాడే ఉన్నాడు. కానీ వీడు మన కూడా ఏడిశాడు కాబట్టి ఇంకోడి పేరు చెబుతాను. వాడి పేరు చంద్రయ్య!" అన్నాడు గోపాలయ్య. అప్పుడానందుడు మళ్ళీ రామయ్య ఇంటికి దారితీసి అక్కడ రామయ్యను చంద్రయ్య గురించి అభిప్రాయం చెప్పమన్నాడు. "వాడాండీ వాడుట్టి దగుల్బాజీ. వాడి ముఖం చూస్తేనే పంచమహాపాతకాలూనూ" అన్నాడు రామయ్య. "ఈ అభిప్రాయం మీదా, ఊరందరిదీనా?" అనడిగాడు ఆనందుడు. "ఇది ఊరందరి అభిప్రాయమూనూ! కావాలంటే మీరే అడిగి తెలుసుకోండి!" అన్నాడు రామయ్య. "అది సరే, ఊరంతా తన గురించి ఇలా అనుకుంటున్నారని వాడికి తెలుసా?" అన్నాడు ఆనందుడు. "తెలియకపోవడానికి ఎవరైనా చాటుగా అంటేగా, అందరూ వాణ్ణి మొహం మీదే తిడతారు" అన్నాడు రామయ్య. అప్పుడు ఆనందుడు మిగతా ఇద్దర్నీ వెంటబెట్టుకుని ఇందాకా వెళ్ళిన ఇతర వ్యక్తుల వద్దకు మళ్ళీ వెళ్లి చంద్రయ్య గురించి అడిగాడు. వాళ్ళ అభిప్రాయాలూ రామయ్య వాటితో సరిపోయాయి. "ఇప్పుడు మనం చంద్రయ్య వద్దకు వెడదాం!" అన్నాడు ఆనందుడు. ముగ్గురూ చంద్రయ్య ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో చంద్రయ్య తన దొడ్డి గోడ ఎక్కి పొరుగింటి జామచెట్టు కాయలు కోస్తున్నాడు. తన కోసం వచ్చిన వారిని చూస్తూనే వాడు గోడదూకి "నాతో మీకేం పని?" అని చిరాగ్గా అడిగాడు. ఆనందుడు చంద్రయ్యతో, "ఊరందరూ నిన్ను నానా మాటలూ అని ఆడిపోసుకుంటున్నారు. నీకా విషయం తెలుసా?" అన్నాడు. "ఏ దరిద్రుడో పిచ్చివాగుడు వాగితే నేనెందుకు లెక్కచేయాలి? అలాంటివి నేను పట్టించుకోను" అన్నాడు చంద్రయ్య.
"అది పిచ్చివాగుడెందుకవుతుంది? ఉదాహరణకిప్పుడు నువ్వు పొరుగింటి జామకాయలు కోస్తున్నావు. అందుకు పొరుగింటాయన నిన్ను తిడితే న్యాయమే కదా!" అన్నాడు ఆనందుడు. "నాకు నచ్చిన పని నేను చేశా. వాడి జామకాయతో నా కడుపు నిండేక వాడెన్ని అంటే మాత్రం నాకెందుకు! అది పిచ్చి వాగుడుకిందే జమకట్టి ఊరుకుంటాను. పెరట్లో జామకాయలు కోసినందుకు న్యాయస్థానానికెవరూ వెళ్ళరు కదా! కాబట్టి ఇది అన్యాయమనీ నాకు అనిపించదు" అన్నాడు చంద్రయ్య. గోవిందయ్య వాడి వంక ఆరాధనా పూర్వకంగా చూశాడు. ముగ్గురూ అక్కణ్ణించి బయటపడ్డాక దారిలో వారికో ముష్టి వాడెదురై బిచ్చమడిగాడు. ఆనందుడు వాడితో "దున్నపోతులాగున్నావు. కాళ్ళూ చేతులూ సక్రమంగా ఉన్నాయి. ఇలా అందర్నీ అడుక్కుని రోజులు గడపకపోతే నాలుగిళ్ళలో వళ్ళు వంచి పనిచేసుకోవచ్చుగా సోమరి పీనుగు కానా!" అని తిట్టాడు. ముష్టివాడి కళ్ళెర్రబడ్డాయి, "అయ్యా! నా మానాన నేను అడుక్కుతింటున్నాను తప్ప తుంటరి పనులేం చేయడం లేదు. ఇష్టమైతే బిచ్చం వేయండి, లేదా ఊరుకోండి. అంతే కానీ నేను మాట పడను" అన్నాడు. ఆనందుడు ముష్టివాడికి క్షమార్పణలు చెప్పుకుని పంపేశాడు. తర్వాత గోపాలయ్యతో "నేను చెప్పిన మాటలు ఋజువు చేశాను. నువ్వోడిపోయావని ఒప్పుకుంటావా?" అన్నాడు. గోపాలయ్య ఏదో అనబోతుండగా గోవిందయ్య ఆనందుడి కాళ్ళ మీద పడి, "నాకు బుద్ధి వచ్చింది. చెడ్డపనులు చెయ్యను" అన్నాడు.
కరాళుడింతవరకే కథను చెప్పి, "ఓ సవిత్వుక మహారాజా! ఆనందుడు చెడ్డవాడే గొప్పవాడని ఎలా ఋజువుచేశాడో నాకర్థం కాలేదు. ఒకవేళ చెడ్డవాడే గొప్పవాడని అయన ఋజువు చేసి ఉంటే గోవిందయ్య అందుకు సంతోషించాల్సింది పోయి చెడ్డ పనులు మానేస్తానని అన్నాడు. ఇదంతా నాకు గజిబిజిగా ఉంది. తెలిసి కూడా నా సందేహాలకు సమాధానమివ్వకపోయావో ఈ క్షణం నుంచీ నీవు నాకు బానిసవు" అన్నాడు. దీనికి సవిత్వుకుడిలా బదులిచ్చాడు. "అడుక్కుతినే వాడికి కూడా మానాభిమానాలున్నాయి. వాడు మాటపడడు సరికదా తను చెడ్డ పనులు చేయడం లేదని గర్వంగా చెప్పుకున్నాడు. అంటే చెడ్డవాడు బిచ్చగాడి కంటే అధముడని తేలిపోయింది కదా! అదలాగుంచితే ఎంతో కష్టపడి సాధించుకున్న మంచి పేరు కూడా ఒక్క చెడ్డ పనితో పోతుంది. అయినా చెడ్డవాడు చెడ్డపని చేస్తాడు. చెడ్డవాళ్ళను ఊరంతా మొహం మీదే దుమ్మెత్తిపోస్తారు. ఒక్క మాటను కూడా సహించలేని మంచివాడి కంటే ఎన్ని నీచపు తిట్లు తిట్టినా సహించగల చెడ్డవాడి ఓర్పు చాలా గొప్పది. మనిషికి మానాభిమానాలు విడిచిపెట్టడం ఎంతో కష్టం. చెడ్డవాడది సులభంగా విడిచి పెట్టేయగల్గుతున్నాడు. ఈ విధంగా మంచివాడికంటే చెడ్డవాడే గొప్పవాడని ఋజువు చేశాడు ఆనందుడు. చెడ్డవాడి గొప్పతనం స్వరూపం తెలిసేక ఇంగితమున్నవాడెవడూ అలాంటి గొప్పతనాన్ని కోరుకోడు. అందుకే గోవిందయ్యలో మార్పు వచ్చింది. ఈ విషయం తెలిస్తే బహుశా చంద్రయ్యలోనూ మార్పు వచ్చి ఉండేది." అది సరియైన సమాధానం కావడంతో సవిత్వుకుడికెదురుగా ఉన్న కన్యపై కరాళుడి ప్రభావం నశించి ఆ యువతి సింహంగా మారి గర్జిస్తూ అడివిలోనికి పరుగుతీసింది.
పంచరంగుల పంజరం
లక్ష్మీనాథుడు ధనవంతుడు. సుధామయి అతడి భార్య. వారికి అఖిలుడొక్కడే సంతానం. ఒక రోజు ఒక జ్యోతిష్కుడు అఖిలుడి జాతకాన్ని పరిశీలించి, వాడికి ఎనిమిదో ఏట ఒక మాంత్రికుడికి బందీ అయ్యే ప్రమాదముందని హెచ్చరించాడు. అఖిలుడికి ఎనిమిదో ఏడు రావడానికి అప్పటికి ఇక మూడు నెలలు మాత్రమే సమయముంది. లక్ష్మీనాథుడు తన కొడుక్కి రానున్న ప్రమాదాన్ని ఎలాగైనా సరే అరికట్టాలనుకున్నాడు. తమ భవనం చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ నిర్మించాడు. ద్వారం వద్ద అపరిచిత వ్యక్తులు లోపలికి రాకుండా గట్టి కాపలా ఏర్పాటు చేశాడు. ఒక గురువు ప్రతిరోజూ వచ్చి వాడికి చదువు చెప్పి వెళ్ళేవాడు. అయన వాడికి ఆసక్తికరంగా ఉండే మంచి మంచి కథలు చెప్పేవాడు. ఆ కథల్లో పక్షులు, జంతువులు మనుష్య భాషలో మాట్లాడినట్లు అద్భుతమైన కల్పన ఉండేది. ఆ కల్పన అఖిలుణ్ణి బాగా ఆకట్టుకుంది. అలాంటి పక్షులూ, జంతువులతో తాను కూడా మాట్లాడాలన్న కోరిక వాడిలో కలిగింది. అఖిలుడికి శివుడనే స్నేహితుడున్నాడు. వాడు అప్పుడప్పుడూ ఆడుకోవడానికి వచ్చేవాడు. శివుడికి తెలివితేటలున్నాయి. కానీ అప్పుడప్పుడూ అతి తెలివి ప్రదర్శిస్తుంటాడు. అన్నీ తెలిసినట్లు డాంబికం కూడా ఉంది. రోజు వారిరువురూ ఎన్నో కథలు చెప్పుకుంటూంటారు. ఒక రోజున అఖిలుడు, "శివా! మాట్లాడే జంతువులు, పక్షులు ఎక్కడ ఉంటాయి?" అని అడిగాడు. "నువ్వింకా వాటిని చూడలేదా? నేనెప్పుడో చూశాను. మాట్లాడాను కూడా" అని డాంబికాలు పలికి అఖిలుణ్ణి మేడ మీదికి తీసుకెళ్లి దూరంగా ఉన్న కొండల్ని చూపించి, "ఆ కొండల వెనుక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో మాట్లాడే పక్షులూ, జంతువులూ ఉన్నాయి" అన్నాడు.
అఖిలుడికి తనూ అక్కడికి వెళ్ళాలన్న కోరిక కలిగింది. అయితే తను బయటికి వెళ్ళడానికి వీల్లేదన్న విషయం గుర్తుకు వచ్చి బాధగా, "ఆ జ్యోతిష్కుడు చెప్పింది నిజమౌతుందో లేదో తెలియదు. కానీ ఆ మాంత్రికుడితో పోటీపడి వాడి కన్నా ముందుగా నా తల్లిదండ్రులే నన్ను బంధించారు. ఈ చెరసాల జీవితం కన్నా చావే నయమనిపిస్తుంది. నేను ఇచ్చటి నుంచి బయటపడే ఉపాయం నువ్వే ఆలోచించాలి" అన్నాడు శివుడితో. వాడు ఒక్క క్షణం అలోచించి ఉత్సాహంగా చిటికె వేస్తూ ఒక ఉపాయం చెప్పాడు. ఆ ప్రకారం వారిరువురూ దుస్తులు మార్చుకున్నారు. దగ్గరగా చూస్తే తప్ప ఎవరో పోల్చుకోలేని విధంగా వేషాలు మార్చుకున్నారు. అఖిలుడు శివుడి వేషంతో కాపలా వాళ్ళను మోసం చేసి బయటపడ్డాడు. శివుడు అఖిలుడి వేషంలో ఆ భవనంలో చిక్కుకుపోయాడు. వారు చేసిన అతి తెలివి పనుల వల్ల ఇరువురూ కష్టాల పాలౌతామని ఆ క్షణంలో ఇద్దరూ ఆలోచించలేదు. సరిగ్గా ఆ రోజే అఖిలుడికి ఎనిమిదో ఏడు వచ్చింది. అఖిలుడు దూరంగా ఉన్న కొండలు దాటి వెళ్ళాడు. అక్కడ శివుడు చెప్పినట్లు పెద్ద అడవి లేదు. ఉన్న చిన్న అడివిలో మాట్లాడే జంతువులమాటటుంచి మామూలు జంతువులు కూడా లేవు. తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చున్న అఖిలుడి దగ్గరకు నాగదండుడనే మాంత్రికుడు వచ్చాడు. వాడు పొడవాటి పీచు గెడ్డం, పెద్ద కనుబొమ్మలు, రొయ్య మీసాలు, నుదుటిన విభూది రేఖలు, మెడలో గచ్చకాయల మాల, పొడవాటి నల్లని దుస్తులు, ఒక చేతిలో సర్పంలా మెలికలు తిరిగిన దండం, మరో చేతిలో చిన్న కొయ్యపెట్టె వగైరాలతో చూడ్డానికి విచిత్రాకారంలో ఉన్నాడు. నాగదండుడు అఖిలుడి చెంతకు వచ్చి "అబ్బాయీ, ఏమిటి వెతుకుతున్నావు? ఈ అడవికి ఒంటరిగా ఎందుకు వచ్చావు? నిన్ను చూస్తుంటే ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చినట్టున్నావు. అవునా?" అని అడిగాడు. అఖిలుడు వాడికి తన కథంతా చెప్పి, "నిన్ను చూస్తూంటే మామయ్యా అని పిలవాలనిపిస్తోంది. మామయ్యా! నాకు మాట్లాడే పక్షులు, జంతువులు ఎక్కడుంటాయో చూపిస్తావా?" అన్నాడు.
"అవి వేరే ఎక్కడో లేవు" అంటూ తన వద్దనున్న కొయ్య పెట్టె చూపించి, "ఈ పెట్టెలోనే ఉన్నాయి. ఇందులో మాట్లాడే పక్షులు, జంతువులే కాదు. పంచరంగుల స్వర్గం కూడా ఉంది. నీలాంటి బాలల కోసం నా మంత్రశక్తులన్నీ ఉపయోగించి నేనే ఈ స్వర్గాన్ని సృష్టించాను. నువ్వూ చూస్తావా?" అన్నాడు నాగదండుడు. మాట్లాడే పక్షులు, జంతువులు అనేటప్పటికీ అఖిలుడిలో ఉత్సాహం వేసింది, "చూస్తాను మామయ్యా!" అన్నాడు. నాగదండుడు తన వద్దనున్న కొయ్య పెట్టె క్రింద ఉంచి మొలలో దాచుకున్న తాళం చెవిని పెట్టెకున్న రంధ్రంలో ఉంచి తిప్పి, మంత్రదండంతో కొయ్య పెట్టె మీద మూడుసార్లు తాటించాడు. అప్పుడు కొయ్య పెట్టె క్రమేపీ పెరిగి పెద్దదయింది. పెట్టెకున్న రంధ్రం కూడా పెరిగి పెద్దదై మనుష్యులు వెళ్ళగలిగే ద్వారంగా మారింది. నాగదండుడు, అఖిలుడు లోనికి వెళ్ళారు. లోపల అఖిలుడికి కనిపించిన దృశ్యాలు అంతులేని ఆశ్చర్యాన్ని, ఆనందాన్నీ కలిగించాయి. అక్కడ నిజంగా మరో స్వర్గమే ఉంది. ఎక్కడ చూచినా రకరకాల ఫల వృక్షాలు. పొదల్నీ, లతల్నీ ఆక్రమించిన రంగు రంగుల పుష్పాలు, వాటి పరిమళాలు, పుష్పాల మకరందాన్ని గ్రోలటానికి పోటీపడుతూ ఎగురుతున్న తుమ్మెదలు, సీతాకోకచిలుకలు. చిలుకలు కిలకిలా రావాలతో మధురంగా పలికే ఎన్నో రకాల పక్షుల గుంపులు. గునగున నడుస్తున్న పాల నురుగు లాంటి తెల్లని కుందేళ్ళు, పురి విప్పి నాట్యమాడే నెమళ్ళు, చెంగున దూకే లేడికూనలు, మరెన్నో రకాల జంతువులు, జలపాతాలు, ఆకాశంలో ఏడు రంగుల ఇంద్రధనుస్సు వగైరాలతో అక్కడ ఎంతో మనోహరంగా ఉంది. అక్కడ ఎంతో మంది బాలలున్నారు. అందరూ పక్షులు జంతువులతో ఆడుకుంటున్నారు. వాటితో మాట్లాడుతున్నారు. అఖిలుడు కూడా వాళ్ళతో కలిసిపోయాడు. ఇంతలో ఉన్నట్టుండి సింహగర్జన వినిపించగా అఖిలుడు భయంతో వణికిపోయాడు. చూస్తే సింహం వాడి ప్రక్కనే ఉంది. సింహం అఖిలుడితో, "భయపడకు, నేను మీ లోకంలోని సింహం లాగా క్రూరమైన దాన్ని కాదు. అసలిక్కడ క్రూరత్వమన్నదే లేదు. నీవు నాతో ఎంచక్కా ఆడుకోవచ్చు" అంది.
అఖిలుడికి భయం పోయింది. వాడు చాలాసేపు దానితో ఆడుకున్నాడు. కాసేపటికి అఖిలుడికి ఇల్లు గుర్తుకు వచ్చింది. ఆ వెంటనే తల్లిదండ్రులూ, తన కోసం తన భవనంలో బందీ అయిపోయిన శివుడూ గుర్తుకు వచ్చారు. వాడు నాగదండుడి వద్దకు వెళ్ళి, "మామయ్యా! నా కోసం నా తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. నా వేషంలో శివుడు అక్కడ చిక్కుకుపోయాడు. ఇక నేను ఇంటికి వెళతాను. దారిచూపించు" అన్నాడు. "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవద్దు. నా మాట విను. ఇక్కడికి రావడం నీలాంటి అదృష్టవంతులకు మాత్రమే సాధ్యమౌతుంది. ఇక్కడికి రావడం అంటే మనిషి బొందెతోనే స్వర్గానికి వచ్చినట్లు. మీ ఇంటికి వెడితే నీకు కష్టాలు తప్పవు" అని బుజ్జగించాడు నాగదండుడు అఖిలుణ్ణి. అఖిలుడు అందుకు ఒప్పుకోక, "నేను వెళ్ళకపోతే శివుడికి చెప్పలేనన్ని కష్టాలు. నేను లేకపోతే నా తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారు. నేను వెళ్ళక తప్పదు, మామయ్యా!" అన్నాడు. ఎవరు ఏమయిపోతే నాకేం? నాకు కావలిసింది నీలాంటి బాలల సుఖ సంతోషాలే! నీకు ఇక్కడ ఎంతో సంతోషంగా ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉండిపోక తప్పదు. నేను వద్దంటే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళలేవు. నువ్వేకాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. తాళం చెవి ఉన్నవారు మాత్రమే ఇచ్చటి నుంచి వెళ్ళగలరు. అది నా వద్ద ఉంది కాబట్టి నేను మాత్రమే వెళ్ళగలను, వస్తా" అంటూ వెళ్ళిపోయాడు నాగదండుడు. వాడు వెళ్ళిపోగానే ద్వారం మూసుకునిపోయింది. అఖిలుడు అచ్చట చిక్కుకుపోయాడు. అంతేకాదు. ద్వారం మూత పడగానే వాడు స్మృతులన్నీ మరచిపోయి అక్కడున్న బాలలతో కలిసిపోయాడు. నాగదండుడి సృష్టి బాహ్యంలో చిన్న కొయ్య పెట్టెగా మారిపోయింది. నాగదండుడు పూర్వాశ్రమంలో ఔదంబరుడనే ధనవంతుడు. వాడికి చిన్న పిల్లలంటే మహా ఇష్టం. దురదృష్టం కొద్దీ వాడికి సంతానం లేదు. అందుకని చుట్టుప్రక్కల ఇండ్లలోని పిల్లలందర్నీ ఇంటికి పిలిచేవాడు. వారు కోరినన్ని తినుబండారాలూ, ఆట వస్తువులూ కొనియిచ్చేవాడు. వారందర్నీ ఎంతో ప్రేమగా చూసుకొనేవాడు.
దాంతో పిల్లలంతా చదువులు మానేశారు. చివరికి తమ స్వంత ఇళ్ళకు కూడా వెళ్ళడం మానేసి ఔదంబరుణ్ణే అంటిపెట్టుకొని ఉండేవారు. ఔదంబరుడు తమ పిల్లలకి మిత్రుడు కాదు, శత్రువని త్వరలోనే గ్రహించిన వారంతా ఆగ్రహించి తమ పిల్లల్ని వాడి చెంతకు వెళ్ళనివ్వకుండా కట్టడి చేశారు. తన వద్దకు ఎవరూ పిల్లలు రాకపోవడంతో ఔదంబరుడు పిచ్చివాడైపోయాడు. ఒక రాత్రి కొంతమంది పిల్లల్ని రహస్యంగా పిలిచి వారిని తన వెంట తీసుకొని మానవమాత్రుడు రాలేని ఒక పర్వత ప్రాంతానికి తీసుకుని పోయాడు. అక్కడ సరైన సదుపాయాలు లేక పిల్లలంతా మరణించారు. వారి మరణం ఔదంబరుణ్ణి కృంగదీసింది. తన వద్దకు వచ్చే పిల్లలకు ఆకలి దప్పులు లేకుండా చేయాలంటే తనకు మంత్రశక్తులు అత్యంత ఆవశ్యకమని గుర్తించి శూలదండుడనే మాంత్రికుడి వద్ద శిష్యుడిగా చేరి మంత్రం విద్యలు నేర్చుకొని నాగదండుడిగా పేరు మార్చుకున్నాడు. మరికొంత సాధనతో మరికొన్ని శక్తులు వశపరుచుకొని బాలల కోసం ఇలలో ఒక స్వర్గాన్ని సృష్టించాడు. అంత పెద్ద సృష్టినీ చిన్న కొయ్య పెట్టెలో నిక్షిప్తం చేయగలిగాడు. మంచి మాటలతో ఆకట్టుకొని ఎంతో మంది పిల్లల్ని ఆ పంచరంగుల పంజరంలో బంధించాడు. నిజానికి నాగదండుడు చెడ్డవాడు కాదు. మంచివాడే! కానీ వాడి ప్రేమ ఎంతోమంది తల్లిదండ్రులకి శాపమైంది. ఎంతోమంది తమ పిల్లల్ని పోగొట్టుకొని దుఃఖ సాగరంలో మునిగియున్నారు. అఖిలుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో శివుడి బండారం సులభంగా బయట పడిపోయింది. అయితే వాడు ఎన్ని విధాలుగా దండించినా అఖిలుడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పకుండా, "అఖిలుడు కనిపించకుండా పోవడానికి కారణం నేనే. నా తెలివితేటలు ఉపయోగించి అఖిలుణ్ణి తిరిగి తీసుకుని వస్తాను. నాకు అనుమతివ్వండి" అన్నాడు. చివరికి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని వాడికి స్వేచ్ఛనిచ్చాడు లక్ష్మీనాథుడు. తిన్నగా కొండల వెనకనున్న చిట్టడివిలోకి వెళ్ళాడు. అక్కడ వాడికి నాగదండుడు పరిచయమయ్యాడు.
అఖిలుణ్ణి బంధించిన మాంత్రికుడు వాడే అయివుంటాడని గ్రహించిన శివుడు వాడితో చాలా జాగ్రత్తగా వ్యవహరించసాగాడు. నాగదండుడు శివుణ్ణి కూడా బాలల స్వరంలోకి తీసుకెళ్ళాడు. శివుడు నాగదండుడు తాళం చెవిని భద్రంగా దాచుకోవడం పసిగట్టి ఆ తాళం చెవిలో ఏదో విశేషం ఉండే ఉంటుందనుకుని హస్తలాఘవంతో దానిని తస్కరించి తన వద్ద దాచుకున్నాడు. అక్కడి విశేషాలు చూస్తున్నట్లు నటిస్తూ మాంత్రికుడికి దూరంగా వెళ్ళి అఖిలుడి కోసం వెతికాడు. వాడి ప్రయత్నం ఫలించి తొందరగానే అఖిలుడు కనబడ్డాడు. అఖిలుడు మాత్రం గత స్మృతులు మరచిపోయినందువల్ల శివుణ్ణి గుర్తించలేకపోయాడు. అయినా శివుడు కలత చెందలేదు. ఎలాగైనా అఖిలుడితో పాటు అక్కడి బాలలందర్నీ ఆ పంచ రంగుల పంజరం నుంచి తప్పించాలనుకున్నాడు. కొండచిలువ పాకుతోందంటూ అక్కడున్న పిల్లలందరికీ చెప్పి వారందరినీ ఒకరి వెనుక ఒకరిని నిలబెట్టి తను వెనుకనుండి తోస్తూ వాళ్ళూ ఒకరినొకరు ముందుకు తోసుకునేలా చేసి ద్వారం దాటేశాడు. వారంతా బయటకి రాగానే ద్వారం మూసుకుని పోయింది. నాగదండుడు అందులో చిక్కుకుని పోయాడు. పిల్లలందరికీ గత స్మృతులు గుర్తుకువచ్చి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లిపోయారు. వారి వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషించి శివుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అఖిలుడి తండ్రి లక్ష్మీనాథుడు తమ కుమారుడికి మాంత్రికుడి గండం తప్పించినందుకు అభినందించి శివుడికి చక్కని బహుమతి ఇచ్చాడు. తమ కుమారుడికి స్వేచ్ఛ లేకుండా చేసినందువల్లే వాడు మాంత్రికుడి వలలో చిక్కుకుపోయాడని లక్షీనాథుడు, సుధామయి గుర్తించారు. ఆ తర్వాత మరెన్నడూ వాడి స్వేచ్ఛకు అడ్డురాలేదు వారు.
పాప భారం
ఒకానొకప్పుడు గంధర్వ లోకంలో దేవనందిని అనే అమ్మాయి ఉండేది. ఆమె భూలోక సౌందర్యం గురించి గొప్పగా విని అందులో నిజానిజాలు తెలుసుకోవాలని భూలోకానికి దిగి వచ్చింది. అదృశ్య రూపంలో సంచరిస్తూ ఆమె కోసల రాజ్యంలోని ఒక ప్రాచీనాలయాన్ని చూసింది. భూలోక శిల్పులు ఎంతటి ప్రవీణులో అని ఆమె ఆశ్చర్యపడుతున్న సమయంలో ఆమె ఓ యువకుణ్ణి చూసింది. ఆ యువకుడు ఏ విధమైన అంగవైకల్యమూ లేక ఎంతో ధృడంగా ఉన్నాడు. అయితే వాడు ఆలయంలోకి వచ్చే భక్తుల ముందు చేయి చాచి యాచన చేసుకునేందుకు ఏ మాత్రమూ సిగ్గు పడడంలేదు. ఆ యువకుడి మీద దేవనందినికి ఏహ్యభావం కలిగి అంతగా జన సంచారం లేని చోటకు వెళ్ళింది. అక్కడ భైరవుడనే గజదొంగ మాటు వేసి ఉన్నాడు. అటుగా వచ్చిన భక్తుడొకణ్ణి ఆపి కత్తితో బెదిరించి అతడి చేతికున్న బంగారు కడియాన్ని దోచుకున్నాడు. ఆ దృశ్యం చూసిన దేవనందిని పరుల సొత్తు దోచుకునే దొంగకంటే మానాభిమానాలు విడిచిన యాచకుడే నయమనుకుంది. అంతలో భైరవుడు కోసం కాపుగాచిన రక్షకభటులు అటుగా వచ్చి వాడిని పట్టుకున్నారు. అప్పుడు భైరవుడు, "నన్ను రాజుకు పట్టివ్వడం వల్ల మీకేమి ఒరుగుతుంది? నన్ను విడిచిపెడితే మీకు కొంత డబ్బిస్తాను" అన్నాడు. అదృశ్యరూపాన ఉన్న దేవనందిని రక్షకభటులేం చేస్తారోనని ఆసక్తిగా తిలకించసాగింది. రక్షకభటులు తమలో తాము గుసగుసలాడుకున్నారు. తర్వాత భైరవుడిచ్చిన డబ్బు తీసుకుని వాడిని యధేచ్చగా విడిచిపెట్టేశారు. అది చూసిన దేవనందినికి జీవన భృతికి తప్పుదారి నెంచుకున్న యాచకుడు దొంగలకంటే, అవినీతిని అణచడానికి జీవనభృతి తీసుకుంటూ అవినీతికి అవినీతితో సాయపడే రక్షకభటులింకా పరమ నీచులనిపించారు.
భూలోకంలో ప్రకృతికున్న సౌందర్యం మానవులకు లేనందుకు నొచ్చుకుంటూ ఆమె గంధర్వ లోకానికి తిరుగు ప్రయాణమైంది. దారిలో ఆమెకు శాంతివనం ఎదురైంది. అందులో తపమాచరిస్తున్న ధర్మధీరుడు అనే ఋషి ఆమెకు కనిపించాడు. దేవనందిని ఋషిని సమీపించింది. ఋషి కన్నులు తెరవగానే, "మహర్షీ! ఒక సందేహం నన్ను వేధిస్తూంటే ఆగలేక మీ వద్దకు వచ్చాను. నేను మీ లోకంలో కష్టపడి పనిచేయగలిగీ యాచనతో పొట్ట పోసుకుంటున్న ఒక సోమరినీ, అన్యాయంగా పరుల సొమ్ము దోచుకుంటున్న ఒక దొంగనూ, దొంగను పట్టి కూడా దొంగ సొమ్ము కోసం వాడిని విడిచిపెట్టిన అధర్మపరులైన రక్షకభటుల్నీ చూశాను. వారందరూ పాపులే కదా ఈ పాప భారాన్ని భూదేవి ఎలా భరించగల్గుతున్నది?" అనడిగింది. అందుకు ధర్మధీరుడు చిరునవ్వు నవ్వి దేవనందినికి అక్కడికి కాస్త దూరంలో అడివిలో కట్టెలు కొట్టుకుంటున్న ఓ మనిషిని చూసి, "అతడి దినచర్యను పరిశీలించు. నీ అనుమానం తీరుతుంది" అన్నాడు. కట్టెలు కొట్టేవాడు పగలంతా అడివిలో శ్రమించాడు. కొట్టిన కట్టెల్ని మోపుగా కట్టి ఊళ్ళోకి తీసుకొనిపోయి అమ్మాడు. వచ్చిన డబ్బులతో రొట్టెలు కొన్నాడు. తనకోసం, భార్య కోసం ఒక రొట్టె, పిల్లల కోసం ఒక రొట్టె ఉంచి మిగిలిన రొట్టెలను ఏ ఆధారమూ లేక ఒక చెట్టు కింద నివాసముంటున్న వృద్ధులకు పంచిపెట్టాడు. దేవనందిని ఇదంతా చూసి ఎంతో సంతోషించి, "ఇంతటి పుణ్యాతుముణ్ణి మోస్తున్న సంతోషంలో భూదేవి ఎంతటి పాప భారాన్నైనా మరచిపోగలదు." అనుకుని అక్కణ్ణించి ఆకాశ మార్గాన్ననుసరించి గంధర్వలోకానికి తృప్తిగా తిరిగి వెళ్ళింది.
చెకుముకి
వీరయ్య, సూరయ్య, సత్తియ్య అనాథ యువకులు. ఒకేసారి ముగ్గురికీ అప్పటివరకూ బతికిన బతుకుపై రోత పుట్టింది. స్వతంత్రంగా జీవించాలన్న కాంక్షతో తమ ఊళ్ళు విడిచిపెట్టి ఒక అడవిలో ఒక పెద్ద రావి చెట్టు కింద విచిత్రంగా కలుసుకున్నారు. తమ బానిస జీవితాన్ని తల్చుకుని కొద్దిక్షణాలు బాధపడ్డారు. తాము ఆశించిన స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించమని దైవాన్ని ప్రార్థించారు. ఆ సమయంలో ఆ రావిచెట్టు మీద నివసించే చెకుముకి అనే పిశాచం వారల సంభాషణ ఆలకించి కిందికి దూకింది. "నన్ను చూసి భయపడకండి. మీ కోరిక విన్నాను. మీకు సాయపడతాను." అని చెప్పింది. ముందుగా ఆ ముగ్గురూ పిశాచిని చూసి వణికిపోయారు. తదుపరి దాని మాట తీరుకి ధైర్యం కలిగి తమ కోరిక ఈడేరుతుందని ఆశపడ్డారు. పిశాచికి ప్రణామం చేశారు. "మీ కోరికలు చెప్పండి?" అని అడిగింది పిశాచం. "నాకు అందమైన భార్య, పదెకరాల మాగాణి, ఒక ఇల్లు కావాలి" అన్నాడు వీరయ్య. "నాకు పెద్ద భవనం, చేపల చెరువు, చిన్న కోళ్ళ దొడ్డి, అప్సరస వంటి అర్థాంగిని ప్రసాదించు" అని సూరయ్య కోరాడు. "నాకు చిన్న ఇల్లు, అణకువ గల భార్య, కొద్దిగా పొలం చాలు" అన్నాడు సత్తియ్య. చెకుముకి ముగ్గురి కోరికలూ శ్రద్ధగా విని, "మీరడిగింది పొందుతారు. తర్వాత నా కోరిక మీరు తీర్చాలి" అని షరతు పెట్టింది. వీరయ్య, సూరయ్య, సత్తియ్య ముక్త కంఠంతో అంగీకరించారు. అప్పటికి తన కోరిక చెప్పక, "మీరు కోరుకున్న జీవితాల్లో స్థిరపడ్డాక వచ్చి అడుగుతాను. అప్పుడు మాట తప్పకండి" అంది చెకుముకి. ముగ్గురూ తలలూపారు. మరుక్షణం చెకుముకి ఆ ముగ్గురినీ వెంటబెట్టుకుని బయలు దేరింది.
రెండు క్రోసుల దూరం నడిచాక దారి పక్క పంట పొలం, పెద్ద గృహం కనిపించాయి. ఒక అందమైన యువతి కూడా అక్కడ ఉంది. ఆమె వీరయ్యకి నచ్చింది. వెంటనే చెకుముకి ఆ ఇద్దరికీ గాంధర్వ వివాహం జరిపించి సూరయ్య సత్తియ్యలతో ముందుకి సాగిపోయింది. మరో మూడు క్రోసులు నడిచివెళ్ళాక దారిపక్క ఒక పెద్ద భవనం, చేపల చెరువు, కోళ్ళ దొడ్డితో బాటు ఒక చక్కని చుక్క కంట పడింది. ఆ యువతి సూరయ్యకి నచ్చింది. చెకుముకి సూరయ్యను కూడా ఒక ఇంటివాణ్ణి చేసి సత్తియ్యతో కలిసి ముందుకు వెళ్ళిపోయింది. కొంతదూరం వెళ్ళాక ఒక చెరువు పక్క కొంత పొలం, ఒక చిన్న తాటాకు ఇల్లు ఒక పేద పడుచు కనపడ్డారు వాళ్ళకి. సత్తియ్య ఆమెను ఇష్టపడితే, "ఆ పిల్ల అందగత్తె కాదు. ఇల్లా తాటాకులది పొలమా ఎంతో లేదు. రాబడి చాలక జీవితంలో సుఖసంతోషాలుండవు. ఇంకా ముందుకు వెడదాం" అంది చెకుముకి. సత్తియ్య ఒప్పుకోలేదు. చెకుముకి అతడి ఇష్టానుసారం ఆ యువతితో పెళ్ళి జరిపించి వెనుదిరిగి వెళ్ళిపోయింది. కాలం ఆగదు. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. ఒకరోజు చెకుముకి వీరయ్య ఇంటికి వెళ్ళింది. వీరయ్య దంపతులు అతిథి మర్యాదలు చేశారు. పిశాచం ఆనందించి, "ఇప్పుడు నా కోరిక తీర్చాలి" అని తన షరతును గుర్తు చేసింది. వీరయ్య పిశాచాన్ని కోరిక ఏమిటో చెప్పమన్నాడు. "నా వీపు మీద పెద్ద వ్రణం ఉంది. దానికి మందు లేదు. నా ఉపకారం పొందిన మానవుడు తన ఇంటికి స్వహస్తాలతో నిప్పు పెట్టి బూడిద చేసి నా వ్రణం పై అద్దిన వెంటనే వ్రణం మాయమౌతుంది. తక్షణం నీ ఇంటిని తగులబెట్టి మాట నిలబెట్టుకో" అంది చెకుముకి. వీరయ్య ముందు నిర్ఘాంతపోయాడు. తర్వాత తెప్పరిల్లి తనింటిని చేజేతులా కాల్చుకోవడానికి మనసొప్పదనీ, అలాంటి పనికెవరూ ఒప్పరనీ చెకుముకితో అన్నాడు. చెకుముకి మాత్రం తన పట్టు విడువక మాట నిలబెట్టుకోమంది. అప్పుడు వీరయ్య చెకుముకిని తూలనాడి కసిరి పొమ్మన్నాడు. చెకుముకి వెళ్ళిపోతూంటే మాత్రం సాగనంపడానికి ఇంట్లోంచి బైటకు వచ్చాడు భార్యతో సహా.
చెకుముకి బైటకి వచ్చి నడిచి కొద్ది దూరం వెళ్ళి వెనుదిరిగి చూసింది. మరుక్షణం వీరయ్య ఇల్లు, పంట పండిన పొలం సమస్తం కాలి బూడిదైపోయాయి. అది చూసి వీరయ్య, భార్య అదే పనిగా ఏడుస్తుంటే పిశాచం నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత చెకుముకి సూరయ్య దగ్గరకు వెళ్ళి తన కోరిక చెప్పింది. సూరయ్య కూడా వీరయ్య లాగే ప్రవర్తించి సర్వ నాశనమైపోయాడు. అక్కడ నుండి చెకుముకి సత్తియ్య ఇంటికి వెళ్ళింది. సత్తియ్య దంపతులు పిశాచానికి అతిథి మర్యాదలు బాగా చేశారు. పిశాచం అడక్కుండానే సత్తియ్య, "నేను నీ కోరిక తీర్చవలసి ఉంది. అదేమిటో చెబితే ఇప్పుడే తీర్చగలను" అంటూ పాత విషయం గుర్తుచేశాడు. పిశాచం తన కోర్కెను చెప్పింది. వెనువెంటనే వీరయ్య దంపతులు చెకుముకితో సహా బైటకు వచ్చారు. ఇంటి చూరుకి నిప్పు అంటించారు. క్షణాల్లో తాటాకుల కొంప కాలి బూడిదైంది. ఆ బూడిద కోసం ముందుకు వెళ్లిన సత్తియ్య ఆశ్చర్యపడ్డాడు. బూడిద కుప్ప మటుమాయమైంది. అక్కడ పెద్ద భవనం వెలసింది. కొందరు దాసీలు హారతి పళ్లెంతో ముఖ ద్వార బంధం వద్ద సత్తియ్య దంపతుల ఆగమానార్థం వేచి ఉన్నారు. సత్తియ్యకిదేమీ అర్థం గాక చెకుముకి వైపు చూశాడు. అదే క్షణంలో పిశాచం రూపు విడిచిన చెకుముకి సత్తియ్యకి ప్రణామం గావించి, "ఆర్యా! నేనొక గంధర్వుడను. ముని శాపంతో పిశాచాన్నయ్యాను. చేసిన ఉపకారం మరువని, ఆడిన మాట తప్పని వ్యక్తి వల్ల నాకు శాప విమోచనం లభిస్తుందని నన్ను శపించిన ముని చెప్పాడు. ఈనాటికి నీ వల్ల నిజరూపం పొందాను" అంటూ అదృశ్యమయ్యాడు.
Comments
Post a Comment