అనగనగా కాంచనపురి అనే దేశాన్ని రత్నసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చాలా కాలంవరకు ఆ రాజుకి సంతానం కలగలేదు. ఒకనాడు రాజుకి కలలో ఒక దేవకన్య కనిపించి యిలా చెప్పింది "రాజా! మరో సంవత్సరానికల్లా రాణీకి ఆడ శిశువు కలుగుతుంది. ఆ శిశువుకు 'రోజాసుందరి' అని పేరుపెట్టు. ఆమె నవ్వినప్పుడల్లా నోటివెంట రోజాలు పడతై. ఇక ఆమె రాల్చిన ప్రతి కన్నీటి చుక్కా ఒక ముత్యం అవుతుంది. సంవత్సరం గడువు తీరి ఒక సుముహూర్తాన రాణి ఒక ఆడ శిశువును కన్నది. దేవకన్య చెప్పినట్లుగానే ఆ శిశువు నవ్వినప్పుడల్లా రోజా పువ్వులు రాలేవి. ఏడ్చినప్పుడు కన్నీటి బొట్లు నేలమీద పడటం తోటే అవి ముత్యాలుగా మారిపోయేవి. శిశువుకు రోజాసుందరి అని పేరుపెట్టారు. క్రమంగా రోజులు గడిచి రోజాసుందరికి యుక్తవయస్సు రాగానే ఆమెకి తగిన వరుని కోసం రాజు ఒక చక్కటి ఉపాయం ఆలోచించాడు. "ఏ రాజకుమారుడైతే నా కుమార్తెకు ఒక చక్కటి కథ చెప్పి ఆ కథ వల్ల ఆమెను నవ్వించి, ఏడ్పించగలడో అతనికి నా కుమార్తెను యిచ్చి వివాహం చేస్తాను" అని రాజు చాటింపించాడు. ఈ చాటింపు విని దేశదేశాలనించి ఎంతోమంది రాజకుమారులు వచ్చారు. రాజకుమారులు ఒక్కొక్కరే వచ్చి ఒక్కో కథ చెప్పసాగారు. కాని నవ్వించి ఏడ్పించే కథ చెప్పటం ఎవరివల్లా కాలేదు. చివరకు పాంచాలరాజకుమారుడు ఒక కథ చెప్పటం ప్రారంభించాడు. కథ పూర్తి అయే లోపల రోజాసుందరి చాలసార్లు కన్నీరు కార్చటం, నవ్వటం కూడా జరిగేసరికి రాజు పాంచాల రాజకుమారుడే తన కుమార్తెకు తగిన భర్త అని నిర్ణయించి ఆ మర్నాడే వారిద్దరికీ వైభవంగా వివాహం చేశాడు.
ఒకవారం గడిచిన తర్వాత పాంచాల రాజకుమారుడు, రోజాసుందరిని తీసుకుని తన రాజ్యం తిరిగి చేరుకున్నాడు. పాంచాల రాజు, తన కుమారుడు తగిన భార్యని సంపాదించి తెచ్చుకున్నందుకు చాల సంతోషించాడు. కాని, రాణి మాత్రం సంతోషించలేదు. ఎందువల్లనంటే ఆమె అన్న కుమార్తెను తన కుమారునికి చేసుకోవలెనని మొదటినించీ అనుకుంటూ వున్నది. కాని యిప్పుడు తన కొడుకు రోజాసుందరిని పెళ్ళి చేసుకోవటంతో ఆమె అగ్గి బుగ్గి అయిపోయి, ఎలాగైనా రోజాసుందరిని వెళ్ళగొట్టి ఆమెకి బదులుగా తన అన్న కూతురును రప్పించుకోవాలెనని ఆత్రం కలిగింది. ఆమెకు ఒక ఆలోచన తోచింది. తన అన్న కూతురికీ, రోజాసుందరికీ చాల దగ్గిర పోలిక కూడా వుంది. వాళ్ళిద్దర్నీ ఒకరి ప్రక్కన ఒకరిని నిలబెడితే అందులో ఎవరు రోజాసుందరి అయినదీ కనుక్కోటం చాలా కష్టం. ఇంత దగ్గరి పోలిక వున్న సంగతి గ్రహించి ఆమె ఒక వుపాయం అలోచించి సమయం కోసం వేచి వుంది. ఇలా ఉండగా పాంచాల రాజకుమారుడు ఒక పొరుగురాజ్యం వెళ్ళాడు. ఈ అవకాశం తీసుకుని రాణి తన అన్న కూతురును రప్పించుకుంది. తమ ఆస్థాన వైద్యుడికి గొప్ప బహుమతి యిచ్చి అతని సహాయంతో ఒకరోజు రాత్రి రోజాసుందరికి మత్తుమందు పెట్టి ఆమె రెండు కళ్ళను పీకించింది. తన అన్నకూతురు కళ్ళను కూడా పీకించి వాటికి బదులు రోజాసుందరి కళ్ళు ఆ పిల్లకు పెట్టించింది. ఆ రాత్రికి రాత్రే ఆ వైద్యుడి ద్వారా రోజాసుందరిని ఒక దూర ప్రదేశానికి తీసుకుపోయి వదిలి రమ్మని పంపించివేసింది.
ఆ ఆస్థాన వైద్యుడు రోజాసుందరిని గుడ్డిదాన్ని చేసి, ఆమెను ఒక పాడు పడిన బావిలో పడేసి వచ్చాడు. ఈ పనిని యింత ధైర్యంతో నెరవేర్చి తనకు సహాయ పడినందుకు రాణి ఆస్థాన వైద్యుడికి మరిన్ని బహుమతులిచ్చి ఈ విషయం బైటికి పొక్కకుండా కట్టుదిట్టం చేసి నిశ్చింతగా వున్నది. ఇంతలో పాంచాల రాజకుమారుడు తిరిగి వచ్చాడు. అతను ఎక్కడ అనుమానపడతాడోనని, రాణి అన్న కూతురు అతను యింట్లో అడుగు పెడుతూ ఉండగానే ఎదురు వెళ్ళి అతని కాళ్ళపైన పడి "యిన్నాళ్ళు నన్ను వదిలివుంటారా? ఇక్కడ నన్ను వదిలేసి మీదారిన మీరు పోతే నాకు ఏమీ తోచలేదు" అంటూ లేని ఏడుపు తెప్పించుకుంది. ఆమె అలా ఏడవగానే ఆ కన్నీటిచుక్కలు ముత్యాలుగా మారినై కనుక రాజకుమారుడు తన ఎదుటవున్నది తన రోజాసుందరే అని నమ్మి ఆమెను ఎంతో ఓదార్చాడు. కాని రాజకుమారుడు అదివరకులాగా ఈమెను నవ్వించలేక పోతున్నాడు. అంతకు ముందు ఏమాత్రం నవ్వు వచ్చే సంగతి విన్న పక పక నవ్వే తన భార్య యిప్పుడు ఎంతో నవ్వు తెప్పించే సంగతులు చెప్పినా నవ్వటం లేదు. ఆమె కళ్ళు రోజాసుందరివి కాజేసి పెట్టుకున్నవి కనుక కన్నీరు రాల్చగలిగి ముత్యాలుగా మార్చగలిగింది. కాని ఆమె నవ్వితే రోజాలు రాలుతయ్యా. రాలవని ఆమెకూ తెలుసు. అందువల్లనే ఆమె ఎంత నవ్వు వచ్చినా బలవంతాన ఆపుకునేది. ఇది యిలా ఉండగా అక్కడ రోజాసుందరి పడివున్న బావి ప్రక్కగా ఒక పల్లెవాడు పోతూ బావిలోంచి వస్తున్నా మూలుగు విని రోజాసుందరిని బైటికి తీసి తన యింటికి తీసుకుపోయాడు. రోజాసుందరికి తెలివి వచ్చిన తర్వాత "ఎవరమ్మా నువ్వు? ఇంత అందమైన నిన్ను దేవుడు యిలా గుడ్డిదాన్ని చేశాడేమిటి? పాపం దారి తెలియక బావిలో పడ్డావనుకుంటాను. నీవెవరో చెప్పు. నా చేతనైన సహాయం చేస్తాను" అన్నాడు.
కాని, రోజాసుందరి తన నిజమైన సంగతి చెప్పక "నన్ను కొంతకాలంపాటు నీ యింట్లో వుంచుకుంటే నాకదే పదివేలు. ఇంతకంటే నాకు ఏ సహాయమూ అక్కర్లేదు" అన్నది. పల్లెవాడు సరేనని ఆమెను తన వద్దనే ఉంచుకుని కాపాడుతున్నాడు. ఒక రోజున పాంచాల రాజకుమారుడు అడవిలో వేటాడుతూ ఒక లేడిని బాణంతో కొట్టాడు. లేడి వెంటనే చనిపోయింది. ఇక్కడ లేడి ఎప్పుడైతే చనిపోయిందో పల్లెవాడింట్లో వున్న రోజాసుందరి కూడా హఠాత్తుగా చనిపోయింది. పల్లెవాడు చాలా విచారించి, ఆమెను సమాధి చేసాడు. రాజకుమారుడు ఆ లేడిని తీసుకుపోయి వండించి తనూ తన భార్య తిన్నారు. ఈ లేడి మాంసం తిన్న మరో సంవత్సరానికల్లా పాంచాల రాజకుమారుని భార్య ఒక చక్కని ఆడ శిశువును కన్నది. ఆ బిడ్డ కూడా రోజాసుందరి లాగానే నవ్వినప్పుడు రోజాలు రాలుస్తూ, ఏడ్చినప్పుడల్లా ముత్యాలు కురిపించటం చూచేసరికి అతనికి అదివరకు తన భార్య పైన వున్న అనుమానం కాస్తా తొలిగిపోయింది. కాని ఒకరోజు రాత్రి అతనికి కలలో దేవకన్యలు కనిపించి యిలా చెప్పారు. "ఓ రాజా! ఇప్పుడు నీవు ఎవరినైతే నీ భార్య అనుకుంటున్నావో ఆమె నీ నిజమైన రోజాసుందరి కాదు. నీవు ఆ రోజున అడవిలో లేడిని ఎప్పుడైతే చంపావో అప్పుడే నీ రోజాసుందరి చనిపోయి యిక్కడికి పది ఆమడ దూరాన ఒక చోట సమాధి చేయబడింది. ఇప్పుడు ఆ సమాధిపైన ఒక చక్కని రోజాచెట్టు మొలిచింది. దాని కొమ్మలకు రోజాలతో పాటు ముత్యాలు కూడా వుంటై. ఆ సమాధికి ఆగ్నేయ మూలగా కొంతదూరం పొతే ఒక సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సులోని నీరు, నీకు పుట్టిన ఈ కుమార్తె చేత ఆ చెట్టు మీద చల్లించావంటే నీ రోజాసుందరి మళ్ళీ బతికి వస్తుంది. కాని ఆమె బ్రతికినా గుడ్డిదిగానే వుంటుంది. ఆమెకి మళ్ళీ చూపు కలిగించాలంటే యిప్పుడు నీ భార్యకి వున్న కళ్ళు పీకించి ఆమెకి అమర్పించు. ఇలా చేశావంటే నీ నిజమైన రోజాసుందరి నీకు తిరిగి లభిస్తుంది."
తెల్లవారింది. రాజకుమారుడు తనకు దేవకన్య కలలో కనిపించి చెప్పినది నిజమో అబద్ధమో తేల్చుకుందామని తన కుమార్తెను తీసుకుని బయలుదేరాడు. చివరకు సమాధి చేరుకునేసరికి అక్కడ దేవకన్యలు చెప్పినట్టుగా రోజా చెట్టు, దాని కొమ్మలకు ముత్యాలూ కనిపించినై. తర్వాత సరస్సు వెతుక్కుంటూ పోయి అందులో నీళ్ళు తన కుమార్తె చేత దోసిటతో పట్టించి తిరిగి చెట్టువద్దకు వచ్చి దాని మీద చెల్లించాడు. నీళ్ళు చెట్టుమీద పడటంతోటే సమాధి మాయమై దానిస్థానే రోజాసుందరి చెక్కుచెదరకుండా నిలబడింది. అతను చాల సంతోషించి ఆమెని తీసుకుని తన భవనానికి వచ్చాడు. వెంటనే తనను అప్పటివరకూ మోసం చేస్తూ వచ్చిన ఆ తల్లినీ భార్యనీ పిలిపించాడు. ఆస్థాన వైద్యుణ్ణి కూడా రప్పించి రోజాసుందరికి తిరిగి ఆమె కళ్ళు ఏర్పాటుచేయించాడు. అంతేగాక తల్లికీ, ఆమెకు సహాయపడిన ఆ ఆస్థానవైద్యుడికీ యావజ్జీవ ఖైదు విధించాడు. నాటి నించీ పాంచాల రాజకుమారుడు రోజాసుందరితోనూ, తమ చిన్న రోజాకుమారితోనూ హాయిగా ఉంటున్నాడు.
Comments
Post a Comment