చందమామ కథలు - కాకమ్మ జామీను

 

Chandamama Telugu Story of Crow, Owl and Cuckoo on dishonesty. Best Telugu Chandamama Stories to read.

పూర్వకాలంలో గుడ్లగూబ యిప్పటి మోస్తరుగా వెలుగు చూచి భయపడేది కాదు. అదీ తక్కిన పక్షులన్నిటితో పాటు పగటిపూట ఆహారంకోసం తిరిగి, రాత్రి వచ్చి గూడు చేరుకొనేది. అయితే, ఈనాడు అది పగలల్లా దాగుకొని, దొంగలాగ రాత్రి పూట యెందుకు సంచారం చేస్తుందీ అని అడుగుతారేమో? గుడ్లగూబ ఇలా చేయడానికి చాలా చిత్రమైన కథ ఒకటి వున్నది. చెబుతా వినండి: ఒకనాడు మామూలుగా గుడ్లగూబ, పగటిపూట ఆహారాన్ని వెదుకుకొంటూ అడవులవెంట బయలుదేరింది. అది ఒక చెట్టు కొమ్మ పైన కూర్చుని వుండగా, వేటగాడొకడు విల్లు ఎక్కుపెట్టి దానిని కొట్టాడు. కాస్తంతలో గురితప్పిపోవటంచేత, గుడ్లగూబ కొనప్రాణాలతో ఒక తుప్పలో పడి చిక్కుకున్నది. వేటకాడు వెతికి వెతికి విసిగిపోయి, గూబ కనపడకపోవటంచేత తనదారిని తను పోయాడు. తుప్పలో చిక్కుకొన్న గుడ్లగూబ బాధ చేత లేవలేక, అక్కడనే దీనంగా అరుస్తూ వుంది. ఈ అరుపు విన్న కాకమ్మ, గూబను చూచి జాలిపడింది. "కష్టాలు ఎవరికయినా వస్తాయి, ఇటువంటప్పుడు సాయపడితేనే నిజమైన సాయం" అనుకుని, దానిని తమ యింటి వైద్యుడయిన కోకిల వద్దకు తీసుకువెళ్లి, వారి ఆసుపత్రిలో చేర్పించింది. గుడ్లగూబ పీనాసి అనే సంగతి కోకిలకు ఇదివరకే తెలుసు. పీనాసిగా ఉండేవాళ్ళు సమయం చిక్కినప్పుడు దగాచేయటానికయినా జంకరు. ఇటువంటి వాళ్లను కోకిల రోజూ ఎంతో మందిని చూస్తూ వున్నాడు. 

అందుచేత ఇప్పుడు, తనకు స్నేహితురాలైన కాకమ్మ, వైద్యం కోసం గుడ్లగూబను తీసుకురాగానే "కాకమ్మా! నువు జాలి గుండె కలదానివి. నల్లనివన్నీ నీళ్లూ, తెల్లని వన్నీ పాలే అనుకుంటున్నావు కాని, లోకంలో ఎవరి నైజం ఎటువంటిదో తెలుసుకోలేవు. గూబసంగతి నీకు తెలియదు కాని, నేను బాగా ఎరుగుదును. దాని పైన జాలిపడటం కాని, దానిని చేరదీయటంగాని మంచిది కాదు, తరువాత నీ యిష్టం" అని కోకిల వైద్యుడు సలహా యిచ్చాడు. కాని, ఏమైనాసరే కాకమ్మకు మాత్రం, మాట తిరగటం యిష్టం లేకపోయింది. "అయ్యా, వైద్యుడుగారూ! తెలిసో తెలియకో నేను బాగుచేయిస్తానని చెప్పి దానిని రమ్మన్నాను, మధ్యలో విడిచిపెట్టడం ధర్మం కాదు. గూబవల్ల యే కష్టంవచ్చినా, నష్టం వచ్చినా నాదే బాధ్యత. మీరు సంశయించక దాని ఒళ్ళు నయంచేయండి" అని కాకమ్మ కోరింది. కాకమ్మ మాట నమ్మకం మీద కోకిల గూబకు చికిత్స ప్రారంభించాడు. దేవుడి దయవల్లా, వైద్యుడి చేతి చలవవల్లా గుడ్లగూబకు త్వరలోనే వళ్లునిమ్మళించింది. వైద్యుడుగారు యింక కట్నం అడుగుతారనే సమయానికి గూబకు దుర్బుద్ధి పుట్టి, ఎవరికీ తెలియకుండా రాత్రికిరాత్రి అడవులలోకి పారిపోయింది. తెల్లవారేసరికి ఏముందీ? గూబ పడుకునే మంచం ఖాళీ! వైద్యుడుగారు కాకమ్మకు కబురుచేశారు. గూబ చేసిన మోసం తెలియగానే కాకమ్మ తెల్లబోయింది. "వైద్యుడుగారు ముందుగానే చెప్పారు, వారి మాట వినకపోతినే" అని విచారించింది. "అబ్బా! పైకి మంచిగానే కనబడుతూ, లోకంలో ఇంత ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారా?" అని అమాయకురాలు కాకమ్మ ఆశ్చర్యపోయింది. 

"వైద్యుడుగారూ! అయిందేదో అయింది. ఈ విధంగా మీకు శ్రమ కలిగించినందుకు చాలా నొచ్చుకొంటున్నాను. గూబకు వైద్యం చేసినందుకు యెంతఅయిందో చెప్పండి. ఆ సొమ్ము నేనే ఇచ్చుకొంటాను" అన్నది. అప్పుడు కోకిల ఈ సంగతులన్నీ తన భార్యతో అలోచించి వచ్చి, "కాకమ్మా! ఉపకారానికి పొతే అపకారం ఎదురయింది కాని, యిందులో పాపం, నువ్వు తిన్నదీ తాగినదీ ఏమైనా ఉన్నది గనకనా? ఎవళ్లనుపడితే వాళ్లను నమ్మేస్తావు. నువు వెర్రిబాగులదానివని తెలిసే నేను ముందుగా చెప్పాను కూడాను. సరేలే. ముందయినా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు మాట తిరిగిపోలేక కదా, గూబ చెల్లించవలసిన సొమ్ము నీవే యిచ్చుకుంటా నంటున్నావు. ఇంతకాలమై మనం స్నేహంగా ఉంటూ, వస్తున్నది కదా అని డబ్బు గుంజుకోవటానికి నేను ఒప్పను. అయితే ఒక్క విషయం, గూబ చేసిన ద్రోహం ప్రపంచం ఉన్నంతకాలమూ ప్రజలు చెప్పుకోవాలి. అందుకని నేనూ, నా భార్య ఒక యేర్పాటు ఆలోచించాము. ఆమె తన గ్రుడ్లను నీగూటిలో పెడుతుంది. నీవు వాటిని పొదిగి పిల్లలను చేయాలి. ఈ వింత ఏమిటీ? అని లోకులు తెలుసుకోబోయినప్పుడల్లా, నీకూ నాకూ కూడా గూబ చేసిన ద్రోహం జ్ఞాపకం వచ్చి, కథగా చెప్పుకుంటారు" అని కోకిల చెప్పేసరికి, కాకమ్మ సంతోషంతో ఈ ఏర్పాటుకు వప్పుకొంది. నాటినించీ నేటివరకూ పగటిపూట తల ఎత్తుకు తిరగాలంటే గుడ్లగూబకు భయమే. పొరబాటున అది దారి తప్పి బయటపడిందో, కసి పూనిన కాకమ్మ దానిని పొడిచి పొడిచి తరుముతుంది.

Comments