చందమామ కథలు - లొట్టిపిట్ట పొట్టిమెడ

 

Telugu Chandamama Story of a camel complaining about its short neck to god. Best Chandamama Telugu stories to read.

మనం వుంటున్న ఈ ప్రపంచాన్ని దేముడు సృష్టిచేసినప్పుడు, జంతువులలోనూ, పక్షులలోనూ కొన్నింటికి అసంతృప్తి కలిగింది. కొంగ మెడ మొదట చిన్నదిగా ఉండటం, పొడుగు మెడ కావాలని అది కోరుకునే వరకు దానిని బ్రహ్మ మరమత్తు చేయటం లాంటివి జరిగాయి. అలానే లొట్టిపిట్టకు (ఒంటెకు)  మొదట్లో దేముడు పొడుగుకాళ్ళూ పొట్టిమెడా పెట్టాడు. అందుచేత అది మేత మేయడానికి, నీళ్ళు తాగటానికి చాలా కష్టతపడుతుండేది. అట్టేకాలం ఈ అవస్థ పడలేక లొట్టిపిట్ట ఒక గుహలో పడుకొని, కళ్లు మూసుకొని, ఘోరమైన తపస్సు ప్రారంభించింది. చివరకు ఒకరోజున దేముడు ప్రత్యక్షమై "ఓ లొట్టిపిట్టా నీ తపస్సుకు మెచ్చాను. ఏం కావాలో కోరుకో" అనే వరకు, అది దేమునికి సాష్టాంగ పడి 'దేవాదిదేవా! నాకు ఏమి కావాలో నీకు తెలియదా? అయినా కోరుకోమన్నావు గనుక మనసు విప్పి కోరుకుంటున్నాను. నా శరీరంలో అవయవాలన్నీ చక్కగా అమర్చావు. కానీ, కాలికి తగిన పొడవు మెడకు లేకపోవటం వల్ల చాలా చిక్కుగా వుంటున్నది. అందుచేత పొడవైన కంఠం అనుగ్రహించి పుణ్యం కట్టుకోవలిసింది' అని కోరింది. "సరే, నీ కంఠం ఒక యోజనం పొడవు విస్తరించుగాక!" అంటూ దీవించి, బ్రహ్మ అంతర్థానమైనాడు. బ్రహ్మ వరం యివ్వగానే గుహలో పడుకొని వున్న ఆ లొట్టిపిట్ట మెడ యోజనం దూరంలో ఉండే ఒక మహారణ్యం వరకు పెరిగిపోయి అక్కడ ఆగింది. ఇప్పుడు లొట్టిపిట్ట గుహలోనించే మెడ చాచి, యోజనం దూరంలో చుట్టుపక్కల ఉండే రకరకాల చెట్లపళ్ళూ, మహానదులలో ప్రవహించే తియ్యటి నీరూ ఆరగించి హాయిగా ఉంటూ వుంది. 

అది తన తిండి తిని, తన గొడవ చూచుకొంటూ వుంటే బాగానే వుండిపోను. కాని, బ్రహ్మ ఇచ్చిన వరంవల్ల క్రమంగా లొట్టిపిట్టకు గర్వం ఎక్కువైపోయి, దుండగాలు చేయనారంభించింది. సింహం నిద్రపోతూ వుంటే దాని జూలు పట్టుకొని ఊపటం, ఆడపులి తన పిల్లలకు పాలిస్తూవుంటే పులిపిల్లలను నోటితో కరిచి ఎక్కడికో విసిరివేయడం ఇలా ఆ ప్రదేశమంతా గగ్గోలు పరచి చిందరవందర చేసివేసేది. అప్పుడు జంతువులన్నీ బ్రహ్మ వద్దకు పోయి మొరపెట్టుకోగా, 'అలాగా! దాని పని నేను సరిచేస్తా, మీరు వెళ్ళండి' అని చెప్పి బ్రహ్మ మరునాడు బ్రహ్మాండమైన వర్షం కురిపించాడు. లొట్టిపిట్ట శరీరం గుహలో ఉందిగా? దాని మెడ యోజనం దూరాన అరణ్యంలో ఉన్నదాయె. ఆ ఘోర వర్షంలో మెడ కూడదీసుకోటానికి వ్యవధిలేక, దానిని ఒక దట్టమైన తుప్పలో దూర్చి కిక్కురుమనకుండా పడుకుంది. ఆ దారిన వస్తున్న నక్క ఒకటి దాన్ని చూచి ఏదో చచ్చిన జంతువనుకొని, లొట్టిపిట్ట మెడ కటుక్కున కొరికివేసింది. అప్పుడు వేలాడిపోతూవున్న మెడతో లొట్టిపిట్ట బ్రహ్మ వద్దకు పోయి 'దేవా! బుద్ధి వచ్చింది, గర్వం అణిగింది' అని మొరపెట్టుకునే వరకు, బ్రహ్మ జాలిదలచి, నక్క కొరికినంత మేరకు దాని కంఠం తీసి మెడను మళ్లీ జాగర్తగా కుట్టి పంపించాడు. అప్పటినించీ లొట్టిపిట్ట మెడ అట్టే పొడుగు కాకుండా, పొట్టీ కాకుండా ఈనాడు మనం చూస్తూ వున్న ఆకృతిలో అమరింది. ఎవరిని ఏ విధంగా చూడాలో సర్వజ్ఞుడైన ఆ సృష్టికర్తకే తెలుసు. కనక 'అది కావాలి ఇది కావాలి' అని మనకు మనం కోరుకోడంలో అర్థం లేదు.


Comments