పూర్వం ఒకప్పుడు చాలా అందమయిన పిల్ల ఒకర్తె ఉండేది. ఆమెకు వడుకుపనీ, నేతపనీ బాగా చేతనవును. నిజానికి, ఆమె వడికినట్లూ నేసినట్లూ మరెవ్వళ్లూ వడకలేరు, నేయలేరు. ఆ అమ్మాయి మగ్గం దగ్గర కూర్చుని నేస్తూవుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది. అందుకనే అనేక దేశాలనుంచి పెద్దపెద్దలెందరో ఆమె పనితనాన్ని చూడవస్తారు. నేసిన బట్టలపయిన ఆమె రంగురంగులతో వేసే పువ్వులు ఎంతో అద్భుతంగా కూడా వుంటాయి. అవి నిజమయిన పువ్వులే అనుకొని ఒక్కొక్కప్పుడు సీతాకోక చిలుకలూ అవ్వీ వచ్చి వాలుతూవుంటాయి కూడాను. సామాన్యంగా జరిగే పని ఏమిటీ అంటే ఆ పిల్ల పని ప్రారంభించి, ఏదో ఒక వస్త్రం నేయడం పూర్తిచేసిందనుకుందాం. ఈ సంగతి ఏ మహారాణికో తెలిసి, తక్షణమే కోరినంత ధనమిచ్చి కొనేసుకుంటుంది. ఆ పిల్ల తయారుచేసిన వస్త్రాలను కొనటానికి అంత పోటీ. ఈ విధంగా ఆ అమ్మాయి చాలా ధనం సంపాయించింది. సంపాయించడం బాగానే వుంది. కాని, ఆ పిల్లకు ధనం ఎక్కువగా పోగుపడేసరికి, తగని గర్వం పట్టుకుంది. ఒకనాడు ఆ పిల్ల పనితనాన్ని చూడవచ్చిన ఒక ఇల్లాలు అన్నది కదా: "అమ్మాయీ! నువు నేసిన బట్ట పాము కూసంలాగా ఎంత నాజూకుగా వున్నదమ్మా! ఇంత నేర్పుకలగడానికి కేవలము ఆ సరస్వతీదేవే స్వయంగా నీకు ఈ విద్యను నేర్పివుండాలి!" అని. ఇలా మెచ్చుకొన్నందుకు మరొకళ్లయితే సంతోషించివుందురు. కాని, గర్వించిన ఆ పిల్ల సంతోషించకపోగా, అడ్డుగా తల ఊపి, "వెళ్లవమ్మా, బాగా చెప్పావులే, అసలు ఆ సరస్వతీదేవికి వచ్చునా, నాకు నేర్పటానికి? అయినా, నాకేమిటి, ఎవళ్ళో విద్య నేర్పడమేమిటి? నేనే వందమందికి నేర్పుతా" అంటూ బడాయిగా మాటాడింది.
ఈ మాటలు వింటున్న ఆ పిల్ల తండ్రి "అమ్మాయీ! అలాగ మాటలాడటం పొరపాటూ, అవివేకమున్ను. ఈ సంగతి సరస్వతీదేవికి తెలిసిందంటే నీకు తగినట్టు బుద్ధిచెప్పి, శిక్షించుతుందిసుమా!" అని ఆమెను మందలించాడు. గర్వించిన ఆ పిల్ల అప్పటికీ ఊరుకోక, "అలా అంటారేమిటి నాన్నగారూ! ఆ సరస్వతీదేవి ఇక్కడకు వచ్చినట్టయితే, ఎవరిపనితనము ఎటువంటిదో తెలిసిపోను. నేను నేసినంత నాజూకుగా ఆమె నేయగలదేమో, రమ్మనండి చూదాం" అంటూ ఆమె తండ్రిమాటను కూడా ధిక్కరించింది. సరిగా అదే సమయంలో ఒక ముసిలిది అక్కడకు వచ్చి, "అమ్మాయీ! నువు చాలా పనితనము నేర్చిన పిల్లవే కావచ్చు. అయినప్పటికీ, ప్రపంచానికి విద్యలు నేర్పే సరస్వతీదేవిని నిందించటం తగదు. ఇప్పుడయినా పొరపాటుకి పశ్చాత్తాపపడినావంటే ఆమె నిన్ను క్షమిస్తుంది," అని మందలించింది. ఈ మాటలు వినేసరికి ఆ గర్వించిన పిల్లకు ఉడుకెత్తి, "వెళ్ళవమ్మా ముసిలీ, నువ్వూ ఒక పెద్దమనిషిలాగ చెప్పవచ్చావు. నేతసంగతి నీకేం తెలుసు? తెలియని విషయంలో వేలెట్టడమేమిటి? రమ్మను, మీ సరస్వతీదేవిని. పరీక్ష పెట్టిస్తే సరి, ఎవరి పనితనమెటువంటిదో చూద్దువుగాని" అని ముసిలిదానిని కసిరికొట్టింది. వెంటనే ముసిలిదాని వేషం మార్చివేసి, సరస్వతీదేవి నిజరూపంలో ప్రత్యక్షమై ఎదుట నిలబడింది!
అక్కడ ఆ పిల్ల పనితనాన్ని చూడవచ్చిన వాళ్ళందరూ, "అయ్యో, ఎంత పని జరిగింది! ఆ పిల్ల మంచి పనికత్తెయేను. అయితే ఎందుకు? తగని గర్వం. ఆమెకు బుద్ధి చెప్పటానికే సరస్వతీదేవి స్వయంగా వచ్చేసింది. ఆ పిల్లను పాపం, దేవి ఏమి చేసిపోతుందో?" అని గడగడలాడిపోతున్నారు. ఇంతపని జరిగినా ఆ పిల్లకు కొంచెము కూడా గర్వం తగ్గలేదు. "ఓహో, నీవేనా సరస్వతీదేవివి! సరే, సంతోషమే. కాని, నాతో సమంగా వడకడం, నేయడం నీకు చేతనవునా?" అని అడిగింది. ఆ ప్రశ్నకు జవాబుగా, "ఓసి పిచ్చిపిల్లా, ఇక్కడ రెండు మగ్గాలు ఉన్నాయి కదా! చెరివక మగ్గంమీదా నీవొకటీ నేనొకటీ వస్త్రాలు నేద్దాం" అన్నది సరస్వతీదేవి. అలానే ఇద్దరూ నేత ప్రారంభించారు. కొంతసేపటికి ఇద్దరూ చెరివక వస్త్రమూ నేశారు. రెండు వస్త్రాలూ చక్కగానే ఉన్నాయి. దేవి నేసిన వస్త్రంపయిన ఆమె కొన్ని అందమైన బొమ్మలు వేసింది. దేవిని ధిక్కరించిన గర్వపోతులు ఎలా శిక్ష పొందుతారో, ఆ బొమ్మలు చూస్తే తెలుస్తుంది. ఈ బొమ్మలు చూచి అయినా ఆ పిల్ల పశ్చాత్తాపంచెంది, బుద్ధి తెచ్చుకుంటుందేమోనని ఆమె వుద్దేశం.
ఆ పిల్ల కూడా తాను నేసిన వస్త్రం పయిన కొన్ని బొమ్మలు వేసింది. ఆ బొమ్మలు సరస్వతీదేవి తన స్నేహితులతో పోట్లాడుతున్నట్లు కోపపు ముఖాలతో అసహ్యంగా ఉన్నాయి. ఆ పిల్ల పనితనానికి దేవి సంతోషించింది కాని, వస్త్రం మీది బొమ్మలు చూడగానే ఆమెకు ఒళ్లు మండింది. "అమ్మాయీ! నువు నాకంటె చాలా చక్కగా నేశావు. సంతోషమే. పనితనములో నువ్వే నాకంటె గొప్పదానివి. ఇంత పనితనము నీకు చేతిలో ఉన్నందుకు, తగిన వినయం కూడా ఉన్నట్టయితే రాణించి వుందువు. కాని నీకు తగని గర్వం బలిసిపోయింది. అందుచేత నిన్ను శిక్షించక తప్పదు. ప్రపంచంలో కల్లా వడుకుటలోనూ నేతపనిలోనూ నిన్ను మించినవాళ్లు లేరనే పేరు శాశ్వతంగా ఉండిపోయేటట్టు నిన్ను దీవిస్తున్నాను. అయితే, నీ గర్వానికి ప్రాయశ్చిత్తంగా నువు ఎల్లప్పుడూ ఈ పనిలోనే ఉండిపోతావు. మరేపనీ నీకు చేతకాదు. ఇదే శిక్ష!" అని సరస్వతీదేవి ఆ పిల్లను శపించింది. ఇలా శపించుతూ, దేవి ఆ పిల్ల నేసిన వస్త్రాన్ని తుండుతుండుగా చించివేసింది. దేవి పెట్టిన శాపానికి ఫలితంగా గర్వించిన ఆ పిల్లకు తలవెంట్రుకలు రాలిపోయినై. ఆమె చక్కటి శరీరమంతా తగ్గిపోయి, బొటనవేలి గోరంత చిన్నదయిపోయింది. క్రమంగా ఆమెకు, ఒక సాలెపురుగు రూపం వచ్చింది! ఇక చేసేదేముంది? ఆ అమ్మాయి సిగ్గు చేత రెండు గోడలు కలిసిన మూలకుపోయి, నాటినించీ నేటివరకూ నాజూకైన దారాలతో అలా గూళ్లు అల్లుకొంటూవుంది!
Comments
Post a Comment