చందమామ కథలు - అక్షయ పాత్ర

 

Telugu Chandamama story of a barber who gets golden beard from a genie but loses everything finally. Best Chandamama telugu stories to read.

అనగనగా మక్కదేశంలో అలీ అనే ఒక మంగలి ఉండేవాడు. నలుగురూ వచ్చేపోయే నడిదారిలో అతను చిన్న క్షవరశాల తెరిచాడు. అయితే అలీ గడ్డం పిల్లిగడ్డం కావటంచేత, క్షవరం కోసం వచ్చిన సాయిబులందరూ, "వీడి మొఖం, వీడు మనకు క్షవరం చేసేదేమిటి? పని చేయడమే చేతనైతే, ముందు తన గడ్డమే బాగుచేసుకుని వుండును" అనుకోని, నిరసనభావంతో మరొకషాపుకి పోయేవాళ్లు. క్రమంగా, అలీ షాపుకి ఒక్కడూ రావటం మానివేశాడు. ఇలా ఉండగా ఒకరోజున, ఒక ముష్టివాడు అలీవద్దకు వచ్చి ఆకలవుతున్నదన్నాడు. అలీ వాడికి కలిగినంతలో భోజనం పెట్టడమే కాకుండా, ఒంటిమీద వేసుకునేందుకు అడగకనే చిన్న తువాలుగుడ్డ కూడా ఇచ్చాడు. ముష్టివాడు సంతోషించి, "అబ్బాయీ, నీకేమి కావాలో కోరుకో" మన్నాడు. అందుకు అలీ "తాతా, తాతా! నా గడ్డం పిల్లిగడ్డం కావటం చేత అందరూ నన్ను చూచి అసహ్యించుకొంటున్నారు. అందువల్ల నా మంగలి వృత్తి మందగించి, బతుకుతెరువుకు ఇబ్బందిగా వుంటున్నది. అందమైన ఒక మూరెడు గడ్డం ప్రసాదించావంటే, కాతాదారులు మళ్లీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది..." అని, మనస్సులో కోరికను వెల్లడించాడు. అప్పుడు ముష్టివాడు తన చింకికోటులో చేయి పెట్టి, ఒక పాత్ర తీసి ఇస్తూ, "అబ్బాయీ! ఈ పాత్ర నీ కోరిక నెరవేరుస్తుంది. నీ కోరిక మాత్రమే గాని ఇతరుల కోరిక నెరవేరదు సుమా" అని చెప్పి అదృశ్యమైపోయాడు. 

తరువాత అలీ ఆ పాత్ర తీసి చూడగా, దానినిండా పగుళ్లు కనపడినై. "ముష్టి వెధవ టక్కరి చేసి, నాకీ పనికిరాని పాత్ర అంటగట్టి పోయాడు" అనుకొంటూ, దానిని అవతల గిరవాటు వేదామనుకొనేవరకు, దాని పైన "కోరిన కోరిక తీర్చే ..చిత్రమైన అక్షయపాత్ర!" అని అక్షరాలూ రాసి వున్నయి. ఈ అక్షరాలు చూడగానే, అలీ మనస్సు మారిపోయింది. "వీడు మామూలు ముష్టివాడు కాదు కాబోలు. మహిమలు తెలిసిన వానిలాగా కనపడుతున్నాడు" అనుకోని, ఆ పాత్రను శుభ్రపరిచి, ఒక చోట జాగ్రత్త పెట్టాడు. ఒకనాడు అందులో నీళ్లుపోయడంతోనే, అవి కుత కుత ఉడికి, పొగలూ ఆవిరీ బయల్దేరి, గది అంతా కమ్మేసింది. అలీకి ఊపిరాడక, బయటకు వెళ్లిపోదామనుకొనేవరకు, ఆ పాత్రలోనుంచి చిత్రమైన మనిషి వచ్చి ప్రత్యక్ష మయ్యాడు. ఆ మనిషికి సింహంతల, పొడుగుపాటి జూలు, చిలుకముక్కు, శరీరమంతా కోతి శరీరం! ఇటువంటి చిత్రమైన మనిషి వచ్చి "నీకేమి కావాలో కోరుకో" మనేసరికి అలీ, "నా గడ్డం పిల్లిగడ్డం కావటం చేత అందరూ నన్ను చూచి అసహ్యించుకొంటున్నారు. అందువల్ల నా మంగలి వృత్తి మందగించి, బతుకుతెరువుకు ఇబ్బందిగా వుంటున్నది. అందమైన ఒక మూరెడు గడ్డం ప్రసాదించావంటే, కాతాదారులు మళ్లీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది..." అని కోరాడు. అంతట చిత్రమైన మనిషి అంతర్థానమైపోయాడు. పొగలూ, ఆవిరీ, పాత్రలోని నీళ్ళూ మాయమైపోయినై.

మరి కొంచెంసేపటికల్లా అతని కోరిక ప్రకారం, పిల్లి గడ్డం పోయి, అందమైన ఒక మూరెడు గెడ్డం మొలిచింది! ఒక్క రాత్రిలో అలీకి అందమైన మూరెడు గెడ్డం మొలిచిందనే వార్త పొక్కడంతోనే, ఊరిలో సాయిబులందరూ అలీ షాపుకు వచ్చి, తమ గడ్డాలుకూడా సరీగా అతని గెడ్డంమోస్తరుగా కత్తిరించి తయారు చేయమంటూ కూర్చున్నారు. దెబ్బతో అలీకి దశ తిరిగి, మంచిరోజులు వచ్చాయి. షాపు పట్టకుండా కాతాదారులు రాసాగారు. వ్యాపారం వృద్ధిపొంది, అలీకి జీవనం చక్కగా జరిగిపోతున్నది. పైగా అతని పేరు కూడా మ్రోగిపోయింది. కొంతకాలమయేసరికి , ఈ రకం గెడ్డంతో ప్రజలకు విసుగెత్తిపోయింది. మళ్లీ అలీ వృత్తి మందగించింది. ఐతేనేం? తన వద్ద 'కోరిక తీర్చే అక్షయపాత్ర' ఉందిగా ఇప్పుడు? మళ్లీ రెండోసారి పాత్రలో నీళ్లు పోసి, చిత్రమైన మనిషిని ప్రత్యక్షం చేసుకొన్నాడు అలీ. ఈసారి, మునుపటి కంటె అందమైనదీ మోకాళ్లవరకూ వేలాడేది వెండి వెంట్రుకలతో మెరిసిపోయేది గెడ్డం కోరుకున్నాడు. ఆ ప్రకారమే జరిగింది. ఈ విడ్డూరం ఊరిలో అల్లుకోగానే ఇంకోసారి సాయిబులందరూ అలీ షాపులో, విరగబడి, "ఇటువంటి కొత్త రకం గెడ్డం మాకూ కావాలి" అంటూ కూర్చున్నారు. ఈసారి అలీ షాపుకి కాతాదారులు తిరిగి రావటమూ, అతని పేరు మోగిపోవటమూ మాత్రమే కాదు. ఈ వార్త సరాసరి ఫాదుషా చెవిని పడింది! "ఓహో, బాగావున్నది. మన రాజ్యంలో వెండి గెడ్డపువాడు ఉన్నాడంటే ఎంత గొప్ప!" అంటూ అలీని గురించి ఫాదుషా మెచ్చుకుంటూ ఉండగా, చాటున వుండి ఫాదుషా కుమార్తె ఆ మాటలు విన్నది.

"నాన్నగారూ! మరైతే, నేను వెండిగెడ్డపు వాడిని పెళ్లాడుతాను" అన్నది. గొప్పకోసం ఫాదుషా, "అమ్మాయీ! నీకేమిటి, వెండి గడ్డపువాడు భర్తయేమిటి? బంగారు గెడ్డాపువాడిని తెప్పించి నీకు పెళ్లి చేస్తా, చూచుకో" అని బడాయికొట్టాడు. కోటలో పనివాడు ఈ సంభాషణ అంతా మోసుకుపోయి, అలీకి చెప్పేసాడు. పట్టరాని ఉత్సాహంతో, అలీ చిత్రమైన మనిషిని రప్పించి, కోరికను తెలియబరిచాడు. ఈసారి అతనికి ధగ ధగ మెరిసే బంగారుగెడ్డం మడమలవరకూ వేలాడుతూ, ఒక కొత్త రూపం వచ్చేసింది. మరునాడు అలీ ముస్తాబై, కోటకు చేరేసరికి, అందరూ అతనిని వింతగా చూచారు. అలీ వచ్చిన సంగతి ఫాదుషాకు తెలియగానే, తన వాగ్దానం ప్రకారం అతనికి కూతురునిచ్చి పెళ్ళిచేయక తప్పింది కాదు. ఇలా ఉండగా, ఒకరోజున ఫాదుషా అలీని పిలిచి, "ఏమోయి అలీ! బంగారు గెడ్డంపైన నాకు సరదా పుట్టింది. రేపు ఉదయంలోగా, నీ గడ్డం మోస్తరు గెడ్డం నాకు వచ్చేటట్టు చేయాలి. లేకపోతే, నీ పని ఏం జరుగుతుందో ఆలోచించుకో!" అని ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు. వెంటనే అలీ తన పాత్రలో నీళ్లుపోసి, చిత్రమైన మనిషిని రప్పించి ఫాదుషా, కోరిక తెలియజెప్పాడు. అందుకు చిత్రమైన మనిషి "ఇది నీ కోరిక కాదు. నేను నెరవేర్చను" అంటూ అదృశ్యమైపోయాడు. ఇక ఎలాగా ఫాదుషా తన తలకొట్టించి కోట గుమ్మానికి వేలాడదీయిస్తాడని అలీకి భయం పట్టుకొన్నది. ఆ కంగారులో అలీ, తన అక్షయపాత్రను స్నానపు గదిలో దాచి, మళ్లీ తీసుకోవటం మరచిపోయాడు.

అంతలో రాజకుమారి స్నానపు గదిలోకి వచ్చి చూడగా, పగిలిన పాత్ర అమె కంటికి కనపడింది. దానిని చూచి చీదరించుకొని, అమె కిటికిలో నుంచి విసరి వేసింది. సరీగా అదే సమయంలో, విరక్తి చెందిన అలీ ఆ దారిని వస్తూ, తన మహిమగల పాత్ర కింద పడబోవటం చూశాడు. ఆత్రంతో వరుగెత్తుకుపోయ్యి, ఆది ఎలా ఐనా పడిపోకుండా పట్టుకోవాలని ప్రయత్నించాడు. అలీ ఎంత యత్నించినప్పటికీ, ఆ పాత్ర తప్పిపోయి, అలీ కాళ్ల దగ్గరనే పడి, ఎన్ని పగుళ్లున్నయో అన్ని ముక్కలైంది. ఆ ముక్కలలో నించి పొగలూ, ఆవిరీ బయల్దేరి, ఆ ప్రదేశమంతా కమ్మేసింది. అందులోనించి చిత్రమయిన మనిషి ఆఖరుసారి ప్రత్యక్షమై, మరెన్నడూ కనపడనని చెప్పి అంతర్థానమైపోయాడు ! అక్షయపాత్ర తన అధీనంలో నించి పోగానే, అలీ గడ్డం తడిమి చూచుకొనే వరకు, మళ్లీ తన పిల్లిగెడ్డమే తయారైకూచుంది. నిమిషమైనా అక్కడ నిలవకుండా, అలీ కాలి కొద్దీ పరుగుచ్చుకొన్నాడు. పోయి పోయి, ఇన్నాళ్ల నించీ ఖాళీగా వున్న తన క్షవరశాలకి చేరుకొన్నాడు. గబ గబ తలుపులు తెరచి, ఒంటి మీద ఉన్న రాజదుస్తులు ఒక మూల పడవేసి కూర్చున్నాడు. చాలా కాలానికి మళ్లీ కంటబడిన అలీని చూచి సంతోషించి సాయిబులందరూ పలకరించారు. ఎప్పటిలాగా అతని వృత్తి సాగిపోతూనే వుంది. అయితే, తన ఆజ్ఞ నెరవేర్చని అలీని తల తీయించి కోట గుమ్మానికి కట్టించాలని ఫాదుషా ఇప్పటికీ పంతం పట్టే వున్నాడు. అయినా, ఆ షాపు పక్క నించి వస్తూ పోతూ వున్నప్పటికీ, ఆ పిల్లి గెడ్డపు అలీ తన అల్లుడే అన్న సంగతి కని పెట్టనేలేకపోయాడు!


Comments