చందమామ కథలు - పసి హృదయం

 

Chandamama telugu heart touching story of two enemies who turn friends due to a child. Best Telugu Chandamama stories to read.

పూర్వం ఒకప్పుడు వెనిస్ దేశస్తులకూ, తుర్కీ దేశస్తులకూ మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో పట్టుబడిన శత్రువులను ఆ కాలంలో బానిసలుగా విక్రయించి వేసేవాళ్ళు. ఆ వాడుకనుబట్టి, హామెట్ అనే తుర్కీదేశస్థుడు వెనిషియన్లకు పట్టుబడి, ఫ్రాన్సిస్కో అనే ఒక ధనికుని ఇంటిపక్క బందీగా ఉన్నాడు. ఫ్రాన్సిస్కోకు ఒకేఒక అయిదేళ్ళ కుమారుడు. ఆ పిల్లవాడు అస్తమానమూ హామెట్ వద్దనే మసలుతూ, ఎంతో చేరికగా ఉండేవాడు. అమాయకుడైన ఆ పిల్లవాని ముఖలక్షణాలలో హామెట్ కు దైవాంశ గోచరించింది. ఈ శత్రుదేశంలో హామెట్ కు ఆ పసివాడు ఒక్కడే ప్రాణమిత్రుడైనాడు. హామెట్ ఎల్లప్పుడూ విచారంగా ఉండటం పిల్లవాడు గమనించాడు. ఇది సహించలేక అతను ఒక రోజున తండ్రి వద్దకు వెళ్ళి "నాయనా! మన ఇంటి ఎదుట ఒక తురుష్కుడున్నాడు. అతను యెంత మంచివాడనుకొన్నావు. కాని ఎందుకో ఎప్పుడూ విచారంగా వుంటాడు. అతని విచారం పోగొట్టి, సరదాగా ఉండేటట్టు చేయాలి నువ్వు. చేయకుంటే వీల్లేదు" అంటూ పట్టుబట్టాడు. మొదట ఫ్రాన్సిస్కో ఉదాసీనంగా ఊరుకున్నాడు. కాని, పసివాడు అదే పనిగా బ్రతిమలాడేవరకు, మరునాడు ఫ్రాన్సిస్కో పోయి హామెట్ ను చూచాడు. "ఎన్నాళ్ళనించో మంచివాడు మంచివాడు అని మా పిల్లవాడు చెబుతూ వచ్చిన ఆ హామెట్ నీవేనా?" అని అడిగాడు. "అవును. మూడేళ్ళనించి ఈ జైలులో ఖైదీగా పడివున్న ఆ దురదృష్టపు హామెట్ నేనే! ఈ మూడేళ్ళలోనూ ఈ రాక్షస దేశంలో నా క్షేమం కనుక్కొన్నవాడు ఈ పసివాడు ఒక్కడే. పవిత్రాత్ముడైన ఈ చిట్టివానిని సర్వాంతర్యామి రక్షించుగాక!" అన్నాడు హామెట్. "హామెట్! నేను నీకు చేయగల సహాయముంటే చెప్పు. అందుకే ఇప్పుడు నేను వచ్చింది" అన్నాడు ఫ్రాన్సిస్కో.

"జీవితానికంతటికీ అమూల్యమైన స్వాతంత్య్రాన్ని పోగొట్టుకొని, శత్రుదేశంలో ఖైదీగా మగ్గిపోతూవున్న ఈ దురదృష్టవంతునికి సంతోషం ఎక్కడినించి వస్తుంది? నా స్థితి తలుచుకుని నాలో నేను కుమిలిపోవటం చూచి నీకు ఆశ్చర్యమవుతున్నదా?" అని ఎదురుప్రశ్న వేశాడు హామెట్. ఇప్పటికీ ఎంతోమంది మా వెనిషియన్లను మీ టర్కీ దేశంలో బంధించారుకదటయ్యా?" అని అడిగాడు ఫ్రాన్సిస్కో. "నా దేశస్థులు చేసిన కౄరకృత్యాలకు నేనా బాధ్యుణ్ణి? అయితే, నీ దేశస్థులు చేసిన దుర్మార్గాలన్నిటికీ నీవే బాధ్యుడివంటాను. నిజం చెప్పాలంటే, నా మట్టుకి నేను, తోడి మానవుణ్ణి బానిసగా చేసికోవటానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. మీ దేశస్థులను కొల్లగొట్టి నేను ధనవంతుణ్ణి కావాలని ఎన్నడూ కుతూహలపడలేదు." అని బదులు చెప్పాడు హామెట్. ఇలా చెబుతూ ఉండగానే, అప్రయత్నంగా అతని కన్నుల వెంబడి బాష్పధారలు రాలినై. వినయపూర్వకంగా ఒక్కసారి తలవంచి, "దేముడు దయామయుడు, ఆయన ఆజ్ఞను మానవుడు శిరసావహించవలిసిందే!" అన్నాడు నెమ్మదిగా. ఇప్పటి హామెట్ ముఖలక్షణాలు చూచి, ఫ్రాన్సిస్కో మనసు కరిగిపోయింది. "హామెట్! ఒక చిన్న పని చేశావంటే నీవు విడుదల అయే మార్గం చెబుతాను. ఈ వూరిలో నా శత్రువు ఒకడున్నాడు. నీవు అతనిని ఎలాగైనా చంపావంటే నిన్ను విడుదల చేస్తాను," అన్నాడు ఫ్రాన్సిస్కో.

ఆ మాటలకు హామెట్ ఉద్రేకపూరితుడై, నిలువెత్తులేచి, "ఓయి నీచుడా! నీ వెనీస్ పట్టణమంతా ధారపోసిన, నేను హంతకుడిని కాజాలను. మా జాతికంతటికీ స్వాతంత్య్రం సమకూర్చినా అటువంటి పనిచేస్తాననుకోకు, ఫో!" అన్నాడు. అందుకు ఫ్రాన్సిస్కో, హామెట్ చేయిపట్టుకుని, "ఈ క్షణం నించి మనం మునుపటికంటే ఎక్కువ పరిచయమూ, ఎక్కువ సంబంధమూ కలిగివుందాము. హామెట్! నీకు ఉన్నట్టే నాకు కూడా హృదయం ఉన్నదనీ, నీకు వలెనే నాకూనూ దయా దాక్షిణ్యమూ ఉన్నవనీ తెలుసుకో. నా కొడుకు మీది ప్రేమవల్లనే నాకు మొదట నీపైన అభిమానం కలిగింది. నిన్ను చూచినప్పటినుంచీ, ఏ విధంగా నీకు సహాయపడగలనా అనే సంకల్పం కలిగింది. నిన్ను చూచిన తరువాత, నిన్ను విడుదల చేయించాలని నిశ్చయించుకొన్నాను. ఈ నిశ్చయంతో, నీ స్వభావం తెలుసుకోవటానికి నిన్ను పరీక్షకు పెట్టినందుకు మన్నించు. పరీక్షకు నిలిచినందువల్ల, నీపైన నాకు ఉండిన గౌరవం హెచ్చయింది. ఇంతటినించీ నీవు విముక్తుడవైనావు. నీ అపరాధపుసొమ్ము నేను నీ యజమానికి చెల్లించివేశాను. ఇందుకు నీవు చేయతగిన ప్రత్యుపకారం ఒక్కటే. ఈ స్నేహితుణ్ణి మరువకు" అన్నాడు. ఈ మహోపకారానికి హామెట్ ఎంతగానో ఉప్పొంగిపోయాడు. టర్కీదేశానికి పోయే ఒక ఓడపైన అతనిని ఎక్కించి మరికొంత ధనం కూడా యిచ్చి పంపాడు ఫ్రాన్సిస్కో. తన విడుదలకు కారకుడైన ఆ చిట్టివానిని కౌగలించుకుని, హామెట్ చిన్న పిల్లవానికంటె ఎక్కువగా ఏడవజొచ్చాడు. వానిని అనేకవిధాల దీవించి, విడువలేక విడువలేక, విడనాడిపోయాడు. 

హామెట్ తన దేశానికి వెళ్ళిపోయిన ఆరు నెలలకు, ఒకనాటి తెల్లవారుజామున ఆకస్మికంగా ఫ్రాన్సిస్కో ఇల్లు అంటుకొన్నది. అప్పుడు అందరూ గాఢనిద్రలో వున్నారు. తీరా, జనానికి మెలకువ వచ్చేటప్పటికి ఇల్లంతా అంటుకుని, ఆ మంటలలోకి చొరటానికి ఏ మాత్రం సాధ్యం కాలేదు. ఈ స్థితిలో ఫ్రాన్సిస్కో చిన్నికుమారుడు ఇంటిలోపల ఉండిపోయినట్టు తెలియవచ్చింది. ఆ తండ్రి దుఃఖం ఇటువంటిదని చెప్పటానికి ఎవరి తరం? కొడుకును రక్షించుకోవటానికని మంటలలోకి ఉరుకబోయాడు. కాని, అందరూ కలిపి ఫ్రాన్సిస్కో ను ఆపుజేశారు. అతను, "నా చిట్టివాడిని రక్షించండి, పుత్రభిక్ష పెట్టండి. నా ఆస్తి అంతా బహుమతిగా తీసుకోండి!" అంటూ గగ్గోలు పెట్టాడు. డబ్బుకి ఆశపడి, పిల్లవాడిని రక్షించటానికి చాలామంది ప్రయతించారు. కాని, లాభంలేకపోయింది. ఇంతలో ఒక మనిషి, పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మంటలో చొరబడ్డాడు. వెంటనే పొగలు మేఘమండలానికంటా కమ్మేయడం చేత, అతను ఆ మంటలోపడి చచ్చిపోయివుంటాడని నిశ్చయించారు. కాని మరుక్షణమందే, ఒక వ్యక్తి ఆ మంటలలోనించి, పొగలలోనించి, ఒక బిడ్డను చంకనెత్తుకు రావటం చూచి జనమంతా జేజేలు కొట్టారు. క్షేమంగా బయటకు వచ్చిన ఆ బిడ్డ ఫ్రాన్సిస్కో కొడుకేనని తెలిసి వారు ఉప్పొంగిపోయారు. ఇక ఆ తండ్రి సంతోషం చెప్పాలా! తన చిట్టివాడిని రక్షించి తీసుకువచ్చిన ఆ పుణ్యాత్ముడు ఎవరా అని ఫ్రాన్సిస్కో నిదానించి చూచాడు. 

కాని, బూడిదలోనూ బొగ్గుమసిలోనూ కప్పడిపోయిన ఆ మనిషి ఎవరో ఆనవాలు దొరకలేదు. "మహానుభావా! ఇదుగో ఇప్పటికి ఇది తీసుకో. రేపటిరోజున నా ఆస్తంతా నీకు వ్రాసి ఇస్తాను" అంటూ, బంగారు నాణాలుగల ఒక సంచీ ఈయబోయాడు ఫ్రాన్సిస్కో. "నాకా? బహుమానమా? వద్దయ్యా వద్దు. నాకు నీ బహుమతి అక్కరలేదు." అంటూ నిరాకరించాడు ఆ వ్యక్తి. ఆ గొంతుక లోగడ ఎరిగివున్నదేనని తోచి, ఫ్రాన్సిస్కో పరికించిచూచాడు. చూస్తూనే, "అరె! నీవా! హామెట్ వా!!" అంటూ అతనిని కౌగిలించుకున్నాడు. ఆరు నెలల క్రిందట, తను విడుదల చేసి పంపిన హామెట్ తిరిగి బందీగా తన దేశం రావటం చూచి ఫ్రాన్సిస్కో ఎంతో ఆశ్చర్యపోయి, "మళ్లీ ఎలా వచ్చావు హామెట్?" అని ఎంతో ఆత్రంతో అడిగాడు. "అదంతా దేవుని కృప" అని ముక్తసరిగా జవాబు చెప్పాడు హామెట్. "అవునులే, నీవు మళ్లీ ఎలా వచ్చావో చెప్పు హామెట్?" అని వేగిరపాటుతో మళ్లీ అడిగాడు ఫ్రాన్సిస్కో. "నీవు దయతో నన్ను విముక్తుని చేసి, సాగనంపావు. నేను నా అదృష్టానికి సంతోషిస్తూ నా దేశం చేరుకునే సరికే మీ వెనిషియన్లు నా తండ్రిని బందీగా చేసి, బానిసగా తీసుకొని ఓడ ఎక్కించారు. అప్పుడు నేను, నా తండ్రిని బంధించిన వాని వద్దకు ఉరుకులు వేసికొంటూపోయి, 'అయ్యా! నా తండ్రి వృద్ధుడైపోయాడు. ఆయనను బాధిస్తే మీకు కలిసివచ్చే దేమున్నది? నేను నా తండ్రికంటె ధృఢకాయుణ్ణి. మీకు సేవ చేయటానికి శక్తికలవాడను. కనుక, ఆయనను వదిలిపెట్టి, బదులుగా నన్ను పట్టుకుపోండి' అని చెప్పి, నీవు నాకు కానుకగా యిచ్చిన డబ్బు వాళ్ళకి యిచ్చి, 'దీనిని నా తండ్రిని వదిలినందుకుగాను అపరాధ రుసుముగా తీసుకోండి' అని పరిపరివిధాల వేడుకొనేటప్పటికి, ఆయన దయతలిచి, నా తండ్రిని వదిలి నన్ను బానిసగా తీసుకొన్నాడు."

"మా తండ్రి ప్రయాణం చేయవలసిన ఆ ఓడమీదనే నేను బయల్దేరి, మళ్లీ ఈ పట్టణం చేరుకున్నాను. ఈసారి నేనెంతో ఇష్టపడి మీ దేశానికి బానిసగా వచ్చాను. కాని, మనస్సులో ఏ మాత్రమూ బాధపడలేదు. పరమేశ్వరుడు ఇదీ ఒక మంచికే చేసివుంటాడని నమ్మి కాలక్షేపం చేస్తూ ఉండగా, నా ఊహ నిజమేనని తేలింది. నేను మళ్లీ బందీగా ఉండటంచేతనే హామెట్ కృతఘ్నుడు కాడని నీకు రుజువయింది. అంతకంటె ముఖ్యంగా, నేను నిమిత్తమాత్రుడనై పసివాడి ప్రాణాలు నిలిపి, నీకు సౌఖ్యం చేకూర్చగలిగాను," అంటూ తన కథ వినిపించాడు హామెట్. చిత్రమైన ఈ చరిత్ర విన్నప్పటినించీ వారుభయుల మధ్యా ప్రేమాభిమానాలు ఎక్కువగా అల్లుకుపోయినై. "హామెట్! నా ఆస్తి అంతా నువు తీసుకో. నువ్వింక నాతో ఇక్కడనే ఉండిపో!" అని ఎన్నో విధాల బతిమలాడాడు, ఫ్రాన్సిస్కో. కాని, అతనికి మనస్కరించలేదు.  మహాత్యాగి ఐన హామెట్ ఋణం తీర్చుకొనటానికి గత్యంతరం కనపడక, ఫ్రాన్సిస్కో చివరకు, చేయగలిగినంత ఉపకారం చేయటానికి నిశ్చయించుకున్నాడు. ఈసారి మళ్లీ హామెట్ ను విడిపించటమే గాక, వెనిస్ కు బానిసలుగా తీసుకురాబడే తుర్కీ దేశస్థులను విడిపించటం కోసమే తన యావదాస్తినీ వినియోగిస్తున్నానని ప్రకటన చేశాడు. తరువాత, హామెట్ పసివాడిని విడవలేక విడవలేక ఎలాగో మనస్సు కుదుటపరచుకుని తిరిగి తన దేశం వెళ్ళిపోయాడు.


Comments